Home News గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు

గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు

0
SHARE

గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ 44వ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. యునెస్కో తాజా ప్రకటన అనంతరం గుజరాత్ లోని ప్రపంచ వారసత్వ స్థలాల సంఖ్య మూడుకు పెరిగింది. పావ్ గఢ్ సమీపంలోని చంపానీర్, చారిత్రక అహ్మదాబాద్ నగరం ఇప్పటివరకు ప్రపంచ వారసత్వ స్థలాలుగా యునెస్కో జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు ధోలావీరా నగరం కూడా వీటి సరసన చేరింది. ‘‘బ్రేకింగ్! ధోలావీరా: భారత్‌లో ఉన్న హరప్పా నాగరికత నాటి సిటీని ప్రపంచ వారసత్వ ప్రాంతాల లిస్ట్‌లో చేర్చాం. కంగ్రాట్స్” అంటూ మంగళవారం యునెస్కో తన అధికారిక ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసింది.

హరప్పా నాగరికతకు సాక్ష్యం ధోలావీరా

ధోలావీరా గుజరాత్ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలో ఉంది. హరప్పా నాగరికతకు సాక్ష్యం ఈ నగరం. భారత్‌లో క్రీస్తు పూర్వం దాదాపు 3 వేల ఏండ్ల క్రితమే ఎంతో అద్భుతమైన నాగరికత, నగరాలు ఉండేవనేందుకు ధోలావీరాలోని శిథిలాలు సాక్ష్యంగా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2 వేల 650 నుంచి 2 వేల 550 వరకు హరప్పా నాగరికత ఇక్కడ నడిచిందని చెబుతుంటారు. వరుస కరవు కాటకాల వల్ల క్రీస్తు పూర్వం 1900 సంవత్సరం నుంచి 1850 మధ్య పూర్తిగా ఎడారి ప్రాంతంగా మారిపోయిందని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు. నాటి చరిత్రకు సంబంధించిన శిధిలాలను 1967–68 మధ్య ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పట్లో డైరెక్టర్ జనరల్‌గా ఉన్న జేపీ జోషి తొలిసారి గుర్తించారు. హరప్పా నాగరికతలో ధోలావీరా ఐదో అతి పెద్ద నగరం. 1990 నుంచి ఆర్కియాలజీ వాళ్లు ఇక్కడ తవ్వకాలు జరిపారు.

Source : Nationalist Hub, VSK Andhra