Home News చైనా అధ్యక్షుడి నియంతృత్వం, భారతీయ కమ్యూనిస్ట్ ల మౌనం

చైనా అధ్యక్షుడి నియంతృత్వం, భారతీయ కమ్యూనిస్ట్ ల మౌనం

0
SHARE

ఇప్పుడు చైనాకు ‘చక్రవర్తి’ జిన్‌పింగ్. జీవిత కాలమంతా ఆయన చైనా అధ్యక్షుడిగా కొనసాగుతారు. చైనా రాజ్యాంగంలో ఈమేరకు సవరణ చేశారు. దానికి నేషనల్ పీపల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)గా పిలిచే ఆ దేశ పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది.

1976లో మావో మరణించేవరకు ఈ రకమైన అధికారాన్ని అనుభవించారు. తాజాగా జిన్‌పింగ్ ఆ హోదాను ఆలింగనం చేసుకున్నారు. మావో ఏక ఛత్రాధిపత్యం కొనసాగిన కాలంలో ‘సాంస్కృతిక విప్లవం’ పేరిట కోట్లాది మంది ప్రజల హననం జరిగింది, అనేక వికృత చేష్టలు చోటుచేసుకున్నాయి. అనాగరిక పద్ధతులు అదుపు తప్పాయి. భవిష్యత్‌లో ఈ పరిస్థితి పునరావృతం గాకుండా ఉండేందుకు చైనాలో సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు డెంగ్ జియావోపింగ్… అధ్యక్షుడు రెండు దఫాలు అంటే పదేళ్ళకన్నా ఎక్కువ కాలం పదవిలో ఉండరాదన్న నియమం 1982లో తీసుకొచ్చారు. మొన్నటి వరకు సజావుగానే జరిగింది. కానీ ఇప్పుడు తూట్లు పొడిచారు. దాంతో జిన్‌పింగ్ తన జీవితకాలం ‘‘చైనా చక్రవర్తి’’గా కొనసాగనున్నారు. కాలపరిమితి లేని పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాతోపాటు మిలటరీ కమిషన్ అధినేతగా ఆయన కొనసాగుతున్నారు. చిత్రమేమిటంటే ఉపాధ్యక్షుడి పదవీ కాలంపై ఉన్న పరిమితిని సైతం తొలగించారు. ‘చక్రవర్తి’కి సన్నిహితుడిగా ఉన్న వాంగ్‌క్విషాన్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు.

21వ శతాబ్దంలో ఇలాంటి గుత్త్ధాపత్యం, ఏక వ్యక్తి పాలన ఆమోదనీయం కాదు. ఈ విషయాన్ని చైనా సోషల్ మీడియా వ్యతిరేకిస్తోంది. ఆ పోస్టులను అధికారులు తొలగిస్తున్నారు. నియంతృత్వం ఇప్పుడక్కడ నగ్నంగా నాట్యమాడుతోంది. వర్తమాన సమాజానికి శోభ నివ్వని పరిస్థితులకు చైనా ప్రాణం పోస్తోంది. మావో ఆలోచనల్ని డెంగ్ జియావోపింగ్ భావాల్ని, ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్ అభిప్రాయాలను చైనా రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటిని ఎవరు విమర్శించినా శిక్షార్హులు. ‘వన్ బెల్ట్ వన్ రోడ్’… అన్న జిన్‌పింగ్ అభిప్రాయం ప్రపంచాన్ని అలజడికి గురిచేస్తోంది.

చైనా రాజ్యాంగం కాని, వ్యాపారం- వాణిజ్యం గాని, ఇతర దేశాలను లొంగదీసుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలు కాని కమ్యూనిస్టు మూల సూత్రాలకు ఏమాత్రం అనుగుణంగా లేవు. పక్కా పెట్టుబడిదారి వైఖరినే అవి చాటుతున్నాయి. తాజా పరిణామాలవల్ల చైనా పొరుగు దేశాల్లో ఆందోళన సహజంగానే వ్యక్తమవుతోంది. భారత్‌లోనూ కలవరం కనిపిస్తోంది. డొక్లాం వివాదం, అరుణాచల్‌ప్రదేశ్‌లోకి చైనా బలగాలు చొచ్చుకు రావడం, పాకిస్తాన్‌ను అన్నివిధాలా ఆదుకోవడం, భారత భూభాగంనుంచి పాక్ కారిడార్ నిర్మాణం కలవరానికి కారణం. అంతేగాక శ్రీలంక, మాల్దీవుల జలాల్లో సైనిక స్థావరాలను చైనా సిద్ధం చేస్తోంది. ఆ దేశాల్లో తన పలుకుబడిని పెంచుకుంటోంది. నేపాల్‌లో సైతం తన పెత్తనాన్ని కొనసాగిస్తోంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలోకూడా పట్టుబిగుస్తోంది. జిన్‌పింగ్ అధ్యక్ష పదవి చేపట్టాకే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. చైనాను సైనికంగా, ఆర్థికంగా సూపర్‌పవర్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పలుకుబడిని పెంచుకుంటున్నారు. భారతదేశం చుట్టూ సైనిక వలయాన్ని సిద్ధంచేయడానికి చైనా పడరాని పాట్లు పడుతోంది. సముద్ర జలాల్లో, భూ భాగాల్లో బలగాలను దింపి చక్రబంధనం చేసేందుకు ఉవ్విళ్ళూరుతోంది. చాలా కాలంగా చైనా టిబెట్‌ను ఓ ఆట ఆడుకుంటున్న సంగతి తెలిసిందే! దలైలామా దశాబ్దాలుగా ప్రవాస జీవితం కొనసాగిస్తున్నారు.

1950 సంవత్సరంలో చైనా టిబెట్ దురాక్రమణ అనంతరం భారత భూభాగంలోని అక్సాయ్‌చిన్ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసి)ను దాటి రోడ్డు నిర్మించడంతో ఇరు దేశాలమధ్య మిత్రత్వం చెడింది. అదే సమయంలో టిబెట్‌లో దమనకాండను పెంచింది. చైనాలో టిబెట్ అంతర్భాగమంటూ పెద్దఎత్తున సైన్యం ప్రవేశించడంతో లక్షలాది మంది టిబెటన్లు చెల్లాచెదురయ్యారు. చాలామంది భారత్‌కు వచ్చారు. సరిహద్దులో భారత సైన్యాల పికెట్ల ఏర్పాటును సహించని చైనా 1962 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభించింది. అప్పటి ప్రధాని నెహ్రూ శాంతి వచనాలు, పంచశీల సూత్రాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. సోషలిస్టు దేశంగా చెప్పుకునే చైనా తన దురాక్రమణ బుద్ధిని చాటుకుంది. ఆ యుద్ధం వేలాది మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది. ఎంతో ఆర్థిక నష్టానికి కారణమైంది. ఎన్నో ఉద్రిక్తతలకు దారితీసింది. నెహ్రూ ఉదార స్వభావాన్ని చైనా సొమ్ముచేసుకుందన్న వాదన ఆరోజుల్లో బలంగా వినిపించింది.

జీవిత కాలమంతా చైనా అధ్యక్షుడిగా కొనసాగిన మావో హయాంలో ప్రారంభమైన ఈ ఘర్షణ వాతావరణం తాజాగా ఏ హోదాలో, అంతే నియంతృత్వ అధికారాలతో గద్దెమీదున్న జిన్‌పింగ్ ఆ ఘర్షణలకు మరింత ఆజ్యం పోస్తున్నారు. అప్పుడు అక్సాస్‌చిన్ ప్రాంతం సమస్య ఉద్రిక్తతలను ఎగదోస్తే ఇప్పుడు డొక్లాం ఉద్రిక్తతలను పెంపొందిస్తోంది. గత 60 ఏళ్ళ సమస్యల పరిష్కారానికి చైనా సిద్ధంగా లేదు. పైగా ఆ సమస్యల ఆధారంగా పెత్తనం చలాయించడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక దేశాలను పావులుగా మలుచుకుంటోంది. మావో నిరంకుశ లక్షణాలన్నింటినీ జిన్‌పింగ్ పుణికి పుచ్చుకున్నారు.

ఈ నిరంకుశ విధానాన్ని, వెనుకబాటు ఆలోచనల్ని చైనా అసమ్మతి వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొందరు జర్నలిస్టులు సైతం తప్పుపడుతున్నారు. కాని బహిరంగంగా ఆ విమర్శలు వ్యక్తం కావడం లేదు. కారణం గతంలో తీయాన్మన్ స్క్వేర్ వద్ద అసమ్మతివాదులపై నుంచి పాలకులు సైనిక ట్యాంకులను నడిపించి వేలాది మంది విద్యార్థులను, యువకులను పొట్టన పెట్టుకున్నారు. ఆ భయంతో ప్రజాస్వామ్యాన్ని, హక్కులను అసమ్మతివాదులు ప్రస్తావించకుండా బిక్కుబిక్కుమంటున్నారు. సోషల్ మీడియాపై పాలకులు నియంత్రణ విధించారు. విదేశీ పత్రికా ప్రతినిధుల కథనాలపై, ఛానళ్ళపై ఆంక్షలు విధించారు. వారిని వేధిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ రకమైన అధికారాలున్న జిన్‌పింగ్‌ను విమర్శించి చావును కొనితెచ్చుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ప్రస్తుతం చైనాలో ఈ రకమైన నియంత పాలన కొనసాగుతోంది. ఏక వ్యక్తి పాలనను మేధావులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ వ్యతిరేకత అధికార పీఠం దాకా చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 21వ శతాబ్దపు నియంత జిన్‌పింగ్ అని వ్యాఖ్యలు చైనాలో చక్కర్లు కొడుతున్నాయి.

చైనాలో ప్రజాస్వామిక ప్రక్రియకు ప్రాణంపోయాలని ప్రొఫెసర్ లియూ ఓ చార్టర్‌ను రూపొందించారు. ప్రజల హక్కుల నాయకునిగా ఆయన ఎదిగారు. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అలాంటి దార్శనికుడిని సైతం కటకటాల పాల్జేయగా సరైన వైద్యం అందక కొద్దికాలం క్రితమే ఆయన కన్ను మూసిన సంగతి తెలిసిందే! ఇదీ అక్కడి నిరంకుశ పద్ధతి.

ఇదంతా చైనా సుస్థిర ఆర్థిక వ్యవస్థకోసమేనని జిన్‌పింగ్ మద్దతుదారులు చెబుతున్నప్పటికీ ఒక వ్యక్తివద్ద అధికార కేంద్రీకరణ ఉండటం సరైన పద్ధతి కాదని హాంకాంగ్‌కు చెందిన అనేకమంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. అలాగే డెంగ్‌జియావోపింగ్ ఆలోచనలకిది పూర్తిగా వ్యతిరేకమంటున్నారు. అసమ్మతిని, మానవ హక్కులను మరింతగా అణిచివేయడం, ‘వన్‌బెల్ట్ వన్ రోడ్డు’ ప్రణాళికతో ఆక్రమణలు ఇంకా పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వర్తమాన సమాజంలో ఈ పోకడలు ఏరకంగానూ ఆహ్వానించదగ్గవి కావు. అయినా ఖాతరుచేయకుండా నియంతృత్వ ధోరణి చైనాలో రాజ్యమేలుతోంది! ఆధునిక చైనా చక్రవర్తిగా జిన్‌పింగ్ వెలుగుతున్నారు. విప్లవమంటే విశృంఖలత్వమేనా?!

– వుప్పల నరసింహం 9985781799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here