Home Telugu Articles మేం మేల్కొన్న హిందువులం సుమా!

మేం మేల్కొన్న హిందువులం సుమా!

0
SHARE

– ‌డాక్టర్‌ ‌బి. సారంగపాణి 

హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయ డానికి క్రైస్తవులు, ముస్లిములు, కమ్యూనిస్టులు ఒక్కొక్కసారి విడివిడిగానూ, పెక్కుమార్లు మూకుమ్మడిగానూ శతాబ్దాలుగా అనేక ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో వారు హిందూ జీవనవిధానం పైన, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, ఆరాధనా పద్ధతులు, వస్త్రధారణ, వేషధారణ, పండుగలు, సామాజిక ఉత్సవాలు వంటి వాటన్నిటి పైనా యథాశక్తి దుష్ప్రచారానికి పూనుకున్నారు. బహిరంగంగానే ఎన్నోసార్లు అవాకులు చవాకులు పేలారు, పేలుతూనే ఉన్నారు. అసత్యాలను ప్రచారం చేశారు. చరిత్రను వక్రీకరించారు. ‘భారతదేశం ఎప్పుడూ పరాధీనదేశమే. భారతీయు లందరూ పరాధీనులే. భారతీయులు ఎలాంటి ఆవిష్కరణలూ చెయ్యలేదు. భారతీయులు అనాగరికులు. అభివృద్ధి, నాగరికత అంతా పశ్చిమ దేశాలలోనే ఉంది. వారందరూ మనకన్నా మిన్నయైన వారు. నాగరికులు. మేధావులు.’ అని మనమే నమ్మేటట్లుగా మన బుద్ధికి చెదలు పట్టించారు. తరతరాలుగా అవే అబద్ధాలను చదువుకునేటట్లుగా చేసి భావదాస్యంలోకి నెట్టారు.

భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం కనుగొన్న తర్వాత నుండే ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పటి నుండే హిందూదేశాన్ని కబళించాలనే కుట్రకు పాశ్చాత్య క్రైస్తవ దేశాలు తెరతీశాయి. పోర్చుగీసు వారు గోవాను తమ అధీనం లోకి తెచ్చుకున్న తర్వాత అక్కడ అంతులేని నరమేధం సృష్టించారు. వేలాది మందిని మత విచారణల పేరుతో సజీవ దహనం చేశారు. ఆంగ్లేయుల వలస పాలనా కాలంలో దేశాన్ని క్రైస్తవీకరణ చేయటానికి రెండు వందల సంవత్సరాల పాటు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. బ్రిటిష్‌ ‌చరిత్రకారులు, పాలకులు హిందూధర్మాన్ని, హిందువులను, హిందూదేశాన్ని కించపరుస్తూ అభూత కల్పనలతో రచనలు చేశారు. వలస పాలకులు, ఆంగ్ల మిషనరీల మతమార్పిడి కార్యకలాపాలకు మద్దతును ఇచ్చారు. ఒక క్రైస్తవ సన్యాసిని ప్రచారాన్ని అడ్డుకున్నందుకు జరిగిన ప్రతీకార చర్యే జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దురంతమన్న సంగతి చాలామందికి తెలియక పోవచ్చును కూడా.

ఆంగ్లేయులు తమ అణచివేతను, దోపిడీని సమర్థించుకోవడానికి జాతిపరంగానూ, సంస్కృతి పరంగానూ అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు. అమెరికన్‌, ఇం‌గ్లండ్‌ ‌పత్రికలలో వ్యాసాలు రాశారు. వాటి నిండా అతిశయోక్తులు, అబద్ధాలు, అసత్యాలు ఉండేవి. వాటి ఆధారంగా భారతదేశ చరిత్రను నిర్మాణం చేయించారు వలస పాలకులు.

పేద దేశమైతే వాణిజ్య సంబంధాలకై పాశ్చాత్య దేశాల ఆరాటమెందుకు?

హిందువులు మొరటువారని, నాగరికత తెలియని వారని, విగ్రహాలను, పాములను పూజించే వారని,  సోమరులని, దేశద్రిమ్మరులని, మూఢనమ్మ కాలతో బతికేవారనే అవాకులూ చవాకులు రాశారు. హిందువులు నిజంగా చేతకానివారైతే, అకర్మణ వాదులైతే అంత సంపద ఎలా సృష్టించ గలిగారు? ఎందుకు పాశ్చ్యాత్య క్రైస్తవ దేశాలు శతాబ్దాల పాటు భారతదేశాన్ని కబళించాలని అనేక కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడ్డాయి? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనేందుకు కొలంబస్‌ ఎం‌దుకు బయల్దేరాడు? ఒక పేద దేశంతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవడానికి పాశ్చ్యాత్య క్రైస్తవ దేశాలు పోటీకి దిగి దశాబ్దాల పాటు ఎందుకు ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకున్నాయి?

భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిన తర్వాత కూడా దేశంపట్ల వారి వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదు. భారత్‌లో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని పెద్దదిగా చేసి అంతర్జాతీయంగా దేశాన్ని అప్రతిష్ట పాలుచేయడానికి నిర్విరామంగా కృషిచేస్తూనే ఉన్నారు.

వలస పాలకులను వామపక్ష మేధావులు అనుసరిస్తున్నారు. శతాబ్దాల తరబడి హిందువులపై జరిగిన అత్యాచారాలను వారు కప్పిపుచ్చారు. హిందువులపై జరిగిన కనీవినీ ఎరుగని నరమేథం గురించి వారెన్నడూ మాట్లాడలేదు. ఈనాటికీ హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను వారెన్నడూ ఖండించలేదు. హైందవ సమాజంలోని లోపాలను పదే పదే ఎత్తి చూపి కువిమర్శలకు పాల్పడే వీరు ఇతర మత సమూహాల, సమాజాల లోటుపాట్ల గురించి చర్చించటానికి సైతం భయపడుతూ వుంటారు. భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి వలస పాలకుల కంటే ఈ కుహనా మేధావులే ఎక్కువ ద్రోహం  చేస్తున్నారు. అందులో భాగమే Dismantling Global Hindutva అనే సదస్సు (సెప్టెంబరు 10-12). అయితే మనదేశం లోనూ, అమెరికాలోనూ హిందూ సంస్థలు అందుకు దీటుగా నిర్వాహకుల దురుద్దేశాలను ప్రపంచానికి తెలియజేయగలిగాయి.

ఇంతకూ  ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మాన్ని వ్యాప్తిచెయ్యాలన్న ఎజెండా హిందువులకు ఉందా? ప్రపంచంలో రెండే దేశాలు హిందువులకు ఉన్నాయి.  ఒకటి నేపాల్‌, ‌రెండవది మనది. మిగతా దేశాలలో హిందువులు ఉండవచ్చు. హిందూ సంస్కృతి, ధర్మం వ్యాప్తి చెంది ఉండవచ్చు. ప్రపంచాన్ని మొత్తం హైందవమయం చేయాలన్న ఎజెండా హిందువులకు ఎన్నడూ లేదు. అందుకు కావలసిన ఆర్థికవనరులు లేవు. దేశంలో హిందూధర్మం అబ్రహామిక్మతాల నుంచి తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న క్రైస్తవమత వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. స్వదేశంలోనే స్వధర్మాన్ని కాపాడు కోలేని పరిస్థితులలో ఉన్న హిందువులు ప్రపంచాన్ని హైందవీకరణ ఎలా చేయగలరు? చాలా హాస్యాస్పద మైన ఆలోచన. లేని అజెండాను హిందువులపై రుద్ది, హిందూదేశం మీద, హిందూధర్మం మీద విషం కక్కటమే ఆ సదస్సు నిర్వాహకుల లక్ష్యం.

ఇదంతా ఎందుకు?

అంతేకాదు అమెరికా మీద జిహాదీల దాడి జరిగి ఈ సెప్టెంబర్‌కు రెండు దశాబ్దాలు అవుతుంది. అఫ్ఘ్ఘానిస్తాన్‌ ‌ను తాలిబన్‌ ‌జిహాదీలు ఆక్రమించారు. ఈ అంశంపై నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఈ సదస్సును నిర్వహించదలచుకున్నారా? పాశ్చ్యాత్య క్రైస్తవదేశాలకు, ఇస్లామిక్‌ ‌దేశాలకు మధ్య కొన్ని శతాబ్దాల పాటు పవిత్ర యుద్ధాలు, అంటే క్రూసేడులు జరిగాయి. క్రైస్తవం, ఇస్లాంలు రెండూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనే ఎజెండా కలిగినవే. మొదటిది ప్రలోభాలతో, రెండవది బలప్రయోగంతో విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు అబ్రహామిక్‌ ‌మతాల మధ్య పోటీ, వైరం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. హిందువులకు అసలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న ఆకాంక్షే లేదు.

కానీ అబ్రహామిక్‌ ‌మతాలకు మాత్రం హిందువుల పట్ల ఒక ఉమ్మడి అజెండా ఉంది. ఎలాగైనా ఈ దేశం నుంచి హైందవాన్ని పారద్రోలాలని అవి నిర్విరామంగా పనిచేస్తున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందాన హైందవానికి బద్ధ శత్రువులైన అబ్రహామిక్‌ ‌మత పెద్దలు చేతులు కలిపారు. హిందూ వ్యతిరేక సదస్సులకు, పత్రికా ప్రసార సాధనాలకు, రాజకీయ నాయకులకు వారు ఉమ్మడిగా అన్ని రకాల సహాయ సహకారాలూ అందిస్తున్నారు. వారు వామపక్ష మేధావులను చేరదీశారు. ప్రత్యక్షంగా విమర్శించడం, కించ పరచడం కంటే నాస్తికులైన వామపక్ష మేధావుల ద్వారా హిందూ వ్యతిరేక ప్రచారం చేయించటం మెరుగైన వ్యూహంగా వారికి తోచింది.

ఏకైక దైవ మతాలు తమ మార్గమే సరియైనదని విశ్వసించి, ఇతరులపై తమ నమ్మకాలను రుద్దుతాయి. అందుకు భిన్నంగా హిందూ ధర్మం ఆధ్యాత్మిక స్వేచ్ఛను, సత్యాన్వేషణను ప్రోత్సహిస్తుంది. అందువల్ల హిందువులకు ఒక కేంద్రీకృత మత వ్యవస్థ లేదు. క్రైస్తవంలో పోపు, ఇస్లాంలో ఖలీఫాల వలె మత విషయాలలో సర్వాధికారాలు గల మత పెద్ద ఎవరూ లేరు. కానీ ఆ లోటును రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌భర్తీ చేస్తుందని హిందూ వ్యతిరేకుల గట్టి నమ్మకం. దేశవ్యాప్తంగా పని చేస్తున్న ఏకైక హిందూ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. ‌త్వరలోనే శత జయంతిని జరుపుకోబోతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను బలహీనపరచడం ద్వారా హిందూ ధర్మాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలన్నది వారి ఉద్దేశం.

ఆ ఉద్దేశాన్ని వారేమీ దాచుకోలేదు కూడా. ఆ సదస్సు వివరణపత్రంలో కాషాయధ్వజం కింద ధ్వజప్రణామం చేస్తున్న స్వయంసేవకులను పెకిలించివేస్తున్నట్లుగా కూడా చూపించారు. కానీ వామపక్ష మేధావుల కల ఎన్నటికీ నెరవేరదు. ఇప్పుడు హిందువులు మేల్కొని ఉన్నారు. ఇప్పటి హిందువులు వలసపాలన కాలంనాటి అమాయక హిందువులు కాదు. అన్ని రంగాలలోనూ ఎంతో ముందంజలో ఉన్నారు. తమ తప్పుడు రాతలతో హిందువులను వారు ఇకపై మోసగించలేరు. ఖండాంతరాలలో విస్తరించిన హిందువులు ధర్మాన్ని కాపాడుకోవడానికి ధర్మంపై దాడి జరిగినప్పుడు పెద్దపెట్టున ఏకోన్ముఖులై ఖండిస్తున్నారు. ఏకపక్ష, పక్షపాత విమర్శలను తిప్పికొడుతున్నారు. వలసవాదులు, అబ్రహా మిక్మతాలు, వామపక్షాల అపవిత్ర కలయికను ఎండగడుతున్నారు.

హిందూ సమాజం జాగృతమై ఉంది, ఖబడ్దార్‌!

‌హిందూ సమాజం జడంగా లేదు. నిరంతరంగా ప్రగతిశీలంగా ఉంది. మహిళలపై ఆంక్షలు లేవు. ‘నిమ్న కులాలు’ అని ఒకప్పుడు పిలిచిన వారి చేతుల్లోనే ఇప్పుడు రాజ్యాధికారం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులలో దళిత, గిరిజనులకు చెందిన వారే అధికం. కులాంతర వివాహాలు సైతం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాటిని సమాజం ఆమోదిస్తున్నది కూడా. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు కులాంతర వివాహం చేసుకున్నవారు కనబడుతున్నారు. అన్ని కులాల కంటే అణగారిన వర్గాలలోనే స్వాతంత్రం వచ్చాక విద్య, ఉద్యోగ, ఆర్థిక సాధికారత విస్తరించింది. దేశం, సమాజం గర్వపడే అంశాలివి.

వలస కాలపు చరిత్రకారులు రుద్దిన అబద్ధాలు, అసత్యాలు పట్టుకొని ఆ దృక్కోణంలోంచే చూస్తూ హిందూ సమాజం అచేతనావస్థలో ఉందని, అసమాన తలను ప్రోత్సహిస్తోందని, అవి కొనసాగుతున్నాయని, మహిళలపై, అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు జరుగుతున్నాయని చేసే ప్రచారమంతా బూటకమే. గోరంతలు కొండంతలు చేసి, పదే పదే చెప్పి, రాసి హిందూ సంస్థలను తాలిబన్లతోనూ, క్రూసేడర్లతోనూ పోల్చే ప్రయత్నం అసమంజసం. దురుద్దేశాలతో కూడినది.

ఈ సవాలును స్వీకరించడానికి, తాత్వికంగానూ, ధార్మికంగాను ఎదుర్కోవడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. తన బలహీనతలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు ఏమాత్రం వెనుకాడని హిందూ సమాజం ఈ దేశద్రోహులకు దీటైన సమాధానం చెప్పగలదు. ఇప్పటికైనా కుయుక్తులు మాని తమ హిందూ వ్యతిరేకతను మానుకోకపోతే విదేశీ ముస్లిములకు, ఆంగ్లేయులకు పట్టిన గతే ఈ వామపక్ష మేధావులకూ పడుతుంది. 1893 సెప్టెంబర్‌ 11‌న చికాగోలో స్వామి వివేకానంద పూరించిన హిందూ శంఖారావం ఇంకా హిందువుల చెవుల్లో మార్మ్రోగుతూనే ఉంది. ఖబడ్దార్‌.

జాగృతి సౌజ‌న్యంతో…