Home News ఒక్క అడుగు పరిశుభ్రత వైపు…‘గౌరవ గృహాల దానం’ (దాన్‌ టాయిలెట్‌)

ఒక్క అడుగు పరిశుభ్రత వైపు…‘గౌరవ గృహాల దానం’ (దాన్‌ టాయిలెట్‌)

0
SHARE

దేవాలయాలు ఆత్మశుద్ధికి ప్రతీకలు. సమాజాన్ని ఓ దేవాలయంగా భావిస్తే ఆ సమాజ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుని బాధ్యత. ఆ బాధ్యత నుంచి పుట్టిందే ‘స్వచ్ఛభారత్‌ అభియాన్‌’.

మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది అక్టోబరు 2, 2014న ‘స్వచ్ఛభారత్‌ అభియాన్‌’ను ప్రారంభించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు భాగస్వాములయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. నేడు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, సంఘసేవకులు, సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవు తున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జనలకు ముగింపు పలకడం, పరిసరాల పరిశుభ్రత, పచ్చ దనం వంటి అంశాలకు స్వచ్ఛభారత్‌ అభియాన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.

స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోంది. బహిరంగ మల విసర్జనను ప్రజలు బహిష్కరించేలా ప్రోత్సహిస్తోంది. మహిళలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు సహకరిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్రమోది ప్రసంగిస్తూ మరుగుదొడ్లకు ‘గౌరవ గృహాలు’గా పేరుపెట్టారు. స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు సూచకంగా ఈ పేరును పెట్టినట్లు ప్రధాని తెలిపారు. అయితే గౌరవ గృహాల నిర్మాణాల కోసం రూపొంచిన ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. దీంతో దిగువ మధ్యతరగతివారు గౌరవ గృహాల నిర్మాణాల కొరకు స్వచ్ఛభారత్‌ నిధులను పొందలేక ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా గ్రామాల్లో బహిరంగ విసర్జనకు వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితే అస్సాం రాష్ట్రంలోని జోర్హట్‌ జిల్లాలో తలెత్తింది. అక్కడ చాలామంది దిగువ మధ్యతరగతి వారు కావడంతో వారికి గౌరవ గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. అటువంటి వారికి గౌరవ గృహాలను అందుబాటులోకి తీసుకురావాలని ఓ ఐఏఎస్‌ అధికారి సంకల్పించారు. తన ఆలోచనలకు పదునుపెట్టారు. ‘గౌరవ గృహాల దానం’ (దాన్‌ టాయిలెట్‌) పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందిచారు.

ఆ అధికారి ఎవరో కాదు అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ వీరేంద్ర మిట్టల్‌. ఇతని సొంత రాష్ట్రం రాజస్థాన్‌. 2007వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. 2016లో జోర్హట్‌ జిల్లా పాలనా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే జోర్హట్‌లో వీరేంద్ర గుర్తించిన ప్రధాన సమస్య ఏమిటంటే జిల్లాలోని చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో అప్పటికీ బహిరంగ విసర్జనకు వెళ్తున్నారు. దాంతో ఆయన ఆ జిల్లా ప్రజలు గౌరవ గృహాలను నిర్మించుకోకపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా జనగణనను పరిశీలించారు. 2012-13 జనాభా లెక్కలను పరిశీలించి అసలు విషయాన్ని గుర్తించారు. అక్కడ చాలా మంది గ్రామీణులు స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద గౌరవ గృహాల నిధులకు అనర్హులు. ఆర్థిక స్థోమత సహకరించకనే వారు గౌరవ గృహాలను నిర్మించుకోలేకపోతున్నారు. సమస్యకు మూల కారణం లభించినప్పటికీ లక్షలాది మందికి సొంత ఖర్చులతో గౌరవ గృహాలను నిర్మించి ఇవ్వడం సాధ్యపడని విషయం. దీంతో ఆలోచనల్లో నిమగ్నమయ్యారు వీరేంద్ర. ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టిన పరిష్కారమే ఈ ‘గౌరవ గృహాల దానం’ కార్యక్రమం. అనుకున్న వెంటనే కార్యక్రమాన్ని అమలుపరిచేందుకు ప్రణాళికలను రూపొందించు కున్నారు. వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు. అందుకు తగిన కార్యక్రమాలను నిర్వహించారు.

గ్రామీణ ప్రజలకు గౌరవ గృహాల అవసరంపై అవగాహన కల్పించడం ప్రధానాంశంగా మిట్టల్‌ భావించారు. పల్లెపల్లెకు తిరిగి ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో ప్రజల నుంచి సమ్మతిని పొందడం సాధ్యపడలేదు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకెళ్లారు. ప్రజలకు గౌరవ గృహాల వల్ల కలిగే ప్రయోజనాలను మరింత విపులంగా వివరించడం ప్రారంభించారు. వారికి చేరువయ్యేందుకు ఇంటింటికి ప్రచారం చేశారు. అలా నెమ్మదిగా ప్రజల్లో గౌరవ గృహాల పట్ల ఒక అభిప్రాయాన్ని కలగజేయగలిగారు. దేహశుద్ధితో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో అవసరమనే నినాదాన్ని గ్రామగ్రామాన చాటి చెప్పారు వీరేంద్ర.

జిల్లాలోని ఓ వితంతువుకు ఆయనే తొలిసారి గౌరవ గృహాన్ని దానం చేశారు. అక్కడి నుంచి గౌరవ గృహాల దానం కార్యక్రమానికి బీజం పడింది. వీరేంద్ర సహ అధికారులు, జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆయన నుంచి స్ఫూర్తిని పొందారు. అర్హులను గుర్తించి వారికి గౌరవ గృహాలను సొంత ఖర్చులతో నిర్మించి ఇవ్వడం ప్రారంభించారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా, మండల స్థాయి అధికారుల్లో చైతన్యం కలిగి తమ వంతు సహకారం అందజేయడం ప్రారంభించారు. కేవలం వారు మాత్రమే దానం చేయకుండా తమ కుటుంబ సభ్యులు, పరిచయస్తులతో కూడా దానాలు చేయించారు. అలా తొలి దశలో 250కి పైగా గౌరవ గృహాలను పేదలకు అందుబాటులోకి తీసుకురాగలి గారు వీరేంద్ర. అలా జిల్లాలోని అన్ని గ్రామాలకు ఈ కార్యక్రమం విస్తరించింది. ప్రజల నోళ్ళలో ఆడింది. గౌరవ గృహాల దానానికి ఔత్సాహికులు కూడా ముందుకు రావడం ప్రారంభించారు. దీంతో వీరేంద్ర చాలా సంతోషపడ్డారు. తన సంకల్పాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళేందుకు వడివడిగా అడుగులు వేయడం ప్రారంభించారు. విధి నిర్వహణలో భాగంగానే కాకుండా తన ఖాళీ సమయాన్ని కూడా ఈ కార్యక్రమానికి కేటాయించడం ఆరంభించారు. అనతి కాలంలో జిల్లాలోని వివిధ వర్గాల ప్రజల నుంచి ఆదరణను చూరగొన్నారు వీరేంద్ర.

ఎన్‌జిఒలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, సేవా తత్పరత కలిగిన వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గ్రామాలలో అర్హులైన అందరికీ గౌరవ గృహాలు నిర్మించి ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. తమ వంతు సహాయ సహకారాలు అందించాయి. పుట్టిన రోజుల సందర్భంగా, శుభకార్యాల సందర్భంగా కూడా గౌరవ గృహాలను దానం చేసే పద్ధతి క్రమేపి అభివృద్ధి చెందింది. దీంతో తక్కువ కాలంలోనే చాలామంది తమ నివాసాల్లో గౌరవ గృహాలను నిర్మించుకున్నారు. తన కృషికి ఫలితం రెట్టింపు అవుతుండడం పట్ల వీరేంద్ర ఆనందం రెండింతలైంది. అక్కడితో ఆయన ఆగలేదు. గౌరవ గృహాల నిర్మాణానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ఆ నిధికి విరాళాలను సేకరించేందుకు నడుం బిగించారు. విరాళాల సేకరణలో ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ మంది స్పందించారు. తమకు తోచినంత విరాళాన్ని ఇవ్వడం ప్రారంభించారు. అలా ఆ విరాళాల ద్వారా వీలైనన్ని ప్రాంతాల్లో గౌరవ గృహాల నిర్మాణం ప్రారంభించారు. ఎంతో మంది లబ్ధిపొందారు, ఇంకా పొందుతున్నారు.

ఈ కార్యక్రమం గురించి వీరేంద్ర మాట్లాడుతూ ‘ఐఏఎస్‌, ఐపిఎస్‌ అనేవి చాలా మంది యువతీ, యువకులకు ఒక ¬దా మాత్రమే. నాకు మాత్రం సేవ చేసేందుకు ఓ ఉత్తమ మార్గం. సమాజ సేవకు శక్తి మేరకు కృషి చేయడానికి ఒక సదవకాశం. పాలనలో భాగంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయవచ్చు. పౌరులకు మేలు చేయవచ్చు. నేను 2016లో జోర్హట్‌ జిల్లా బాధ్యతలు చేపట్టాను. అక్టోబరు 2న స్వచ్ఛభారత్‌ మిషన్‌ను జిల్లాలో ప్రవేశపెట్టాను. బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మించాలని కంకణం కట్టుకున్నాను. అక్టోబరు 2, 2019 మహాత్మా గాంధీ 150వ జయంతి లోపు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి గౌరవ గృహం ఉండేలా చూడటమే నా లక్ష్యం’ అన్నారు.

గౌరవ గృహ దానం కార్యక్రమంలో భాగంగా లబ్ధి పొందిన జన్మోని బోరా మాట్లాడుతూ ‘గతంలో నీటి కోసం మైళ్ళ కొద్ది దూరం వెళ్ళేవాళ్ళం. రాత్రి వేళల్లో మరింత ఇబ్బందిగా ఉండేది. ఒక వేళ బహిర్భూమికి వెళ్ళాల్సి వస్తే తెల్లవారుజామున, రాత్రివేళల్లో ఇంటి వెనుక అటవీ ప్రాంతానికి వెళ్లేవాళ్లం. చాలా అవమానంగా అనిపించేది. దాతల సహకారంతో గౌరవ గృహం నిర్మించుకున్న తరువాత ఆ సమస్య తలెత్తలేదు. అత్యవసర సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండడం లేదు. ఇందుకు సహకరించిన అధికారి వీరేంద్రకు ధన్యవాదాలు. కొందరి కష్టార్జితం తమ లాంటి పేదల జీవితాలలో మార్పును తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు.

జోర్హట్‌ జిల్లావాసి అయిన అమిర్‌ హజారిక ఐఏఎస్‌ అధికారి వీరేంద్ర మిట్టల్‌ కృషిని ప్రశంసిస్తూ ‘ఏ అధికారి ఇంతలా చొరవ తీసుకోలేదు. జిల్లా ప్రజల కోసం నిరంతరం తపన పడే గుణం వీరేంద్ర సొంతం. అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందిన అధికారిగా వీరేంద్ర గుర్తింపుపొందారు. ప్రజల మనసులను గెలుచుకొని వారి హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరచుకున్నారు’ అన్నారు.

స్వచ్ఛభారత్‌ అభియాన్‌ను సాకారం చేసేందుకు ప్రజల్లో పరిశుభ్రత పట్ల ఈ యువ అధికారి చేస్తున్న కృషి ఎనలేనిది. ప్రతిఒక్కరిని స్వచ్ఛభారత్‌లో భాగస్వాములను చేసుకుంటూ ముందుకువెళ్తున్న తీరు ఆచరణీయమైనది. ఎటువంటి లాభాన్ని ఆశించకుండా ప్రజల్లో పరస్పర సహకార ధోరణి పెంపొందిస్తున్న ఆయన తీరు ఆదరణీయం. అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా తాను ప్రజా సేవకుడనే భావనతో వీరేంద్ర పనిచేస్తున్న తీరు అభినందనీయం. ఇలాగే ప్రతిఒక్క అధికారి పనిచేస్తే స్వచ్ఛభారత్‌తో పాటు ‘శ్రేష్ఠ్‌ భారత్‌’ త్వరలోనే సాకారమవుతుందని జోర్హట్‌ వాసులు అభిప్రాయపడుతున్నారు.

– విజేత

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here