Home News ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కుంటున్న పి.ఎఫ్‌.ఐ సంస్థకు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ గల సంబంధాలపై అనుమానాలు

ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కుంటున్న పి.ఎఫ్‌.ఐ సంస్థకు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ గల సంబంధాలపై అనుమానాలు

0
SHARE

హమీద్‌ అన్సారీ..పదేళ్ళపాటు భారత ఉపరాష్ట్రపతి బాధ్యతను నిర్వర్తించిన పెద్దాయన.

ఆగస్టు 2017లో తన పదవీ కాలం పూర్తయిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ముస్లింలకు భారతదేశంలో భద్రత లేదంటూ ఆక్రోశం వెళ్ళగక్కారు. దేశంలోని ఒక అత్యున్నత హోదాలో ఉన్న ఆయన ఇలా బాధ్యత మరచి మాట్లాడటం అందరినీ విస్మయపరచింది.

తాజాగా సెప్టెంబర్‌ 23, 2017న కేరళలోని కోజికోడ్‌లో నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌.డబ్ల్యు.ఎఫ్‌.) ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో అన్సారీ పాల్గొనడం వివాదాస్పదమయ్యింది. ఈ ఎన్‌.డబ్ల్యు.ఎఫ్‌. అనే సంస్థ ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పి.ఎఫ్‌.ఐ.)’ కి మహిళా అనుబంధ సంస్థ.

పి.ఎఫ్‌.ఐ. ప్రముఖ ముస్లిం సంస్థ. ఇది కేరళలోని నారత్‌ జిల్లాలో ఒక ఉగ్రవాద శిబిరాన్ని నడుపుతోంది. ఏప్రిల్‌ 23, 2013న పోలీసులు దాడిచేసి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న 21 మందిని అరెస్టు చేసారు. పెద్ద సంఖ్యలో మారణాయుధాలను, బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు పెద్ద సంఖ్యలో దిష్టి బొమ్మలను కూడా ఆ శిబిరంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులు పేల్చడంలో శిక్షణనిచ్చేటప్పుడు వీటిని ఉపయోగిస్తారు. ఈ శిబిరంలో పట్టుబడిన వారికి ఇండియన్‌ ముజాహిదీన్‌తో పాటు వివిధ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధా లున్నాయి. కొచ్చిలో 2005 లో ఒక బస్సును దగ్ధం చేసిన సంఘటనలోను, 2006 లో కోజికోడ్‌లో జరిగిన రెండు బాంబు పేలుళ్ళలోను ఈ శిబిరం నిర్వహిస్తున్నవారి పాత్ర ఉంది. కేరళలో జరిగిన అతి కిరాతకమైన నేరాలలో ఈ 21 మంది పాత్ర ఉందని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌.ఐ.ఎ.) 2016 లో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పి.ఎఫ్‌.ఐ.) కి అత్యంత హింసాత్మకమైన చరిత్ర ఉంది. ఈ సంస్థకి స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) తో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొడుతూ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు సిమిని 2001లో నిషేధించారు. సిమి సంస్థకు జాతీయ కార్యదర్శిగా పనిచేసిన అబ్దుల్‌ రహమాన్‌ ప్రస్తుతం పి.ఎఫ్‌.ఐ.కి కేరళ రాష్ట్ర కార్యదర్శి.

పలు మత విద్వేష కార్యకలాపాలలో, ఉగ్రవాద కార్యకలాపాలలో పి.ఎఫ్‌.ఐ.కి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిలో కొన్ని.

  1. ప్రశాంత్‌ పూజారి, డి.ఎస్‌. కుట్టప్ప, మంజునాథ్‌, సారనాథ్‌ మదివుల మొదలైన హిందూ ప్రముఖుల హత్యలలో పి.ఎఫ్‌.ఐ. హస్తం ఉంది.
  2. హిందువులపై విషం కక్కే డా.జాకిర్‌ నాయక్‌కు మద్దతుగా జులై 2016లో జార్ఖండ్‌ రాష్ట్రంలో సాహెబ్‌ గంజ్‌ పట్టణంలో వందకు పైగా పి.ఎఫ్‌.ఐ. కార్యకర్తలు బహిరంగ ప్రదర్శనలు జరిపారు. పాట్నాలో కూడా జాకిర్‌ నాయక్‌కు మద్దతుగా పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేస్తూ వీళ్ళు ప్రదర్శనలు జరిపారు.
  3. 2012లో అసోం ఘర్షణల తరువాత ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకంగా పి.ఎఫ్‌.ఐ. పెద్ద ఎత్తున ఎస్‌.ఎం.ఎస్‌. ప్రచారం చేసింది.
  4. కేరళలోని పల్లికున్నూర్‌ గ్రామానికి చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) కార్యకర్తను 2012లో పి.ఎఫ్‌.ఐ. హతమార్చింది.
  5. కేరళలోని ఎర్నాకులానికి చెందిన టి.జె. జోసెఫ్‌ అనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రశ్నపత్రాన్ని ముందుగా లీక్‌ చెయ్యలేదని అతని కుడి అరచేతిని నరికేసిన ఘటనతో సంబంధం ఉన్న 13 మంది పి.ఎఫ్‌.ఐ. కార్యకర్తలను ప్రత్యేక ఎన్‌.ఐ.ఎ. న్యాయస్థానం నేరస్తులుగా తీర్పునిస్తూ కఠిన శిక్ష విధించింది.
  6. కర్నాటకకు చెందిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్త రుద్రేశ్‌ దారుణ హత్య ఘటనలో పి.ఎఫ్‌.ఐ. బెంగళూరు జిల్లా అధ్యక్షుడు అజీమ్‌ షరీఫ్‌తో పాటు మరో నలుగురికి వ్యతిరేకంగా ఎన్‌.ఐ.ఎ. చార్జిషీటు దాఖలు చేసింది.

సిమి ఉగ్రవాద సంస్థను నిషేధించినట్లు భారత ప్రభుత్వం పి.ఎఫ్‌.ఐ.ని నిషేధించలేదు. భారత్‌లో చాప కింద నీరులా ఐసిస్‌ (ఐ.ఎస్‌.ఐ.ఎస్‌.) కార్యకలాపాలను విస్తరింపజేయడంలో ఈ సంస్థ ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఐసిస్‌ చేసే జిహాద్‌ పోరాటంలో పాల్గొనేందుకు చాలామందికి ఈ సంస్థ ఒక రాజమార్గం. ఇటీవల ఐసిస్‌, పి.ఎఫ్‌.ఐ.ల మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయని ఎన్‌.ఐ.ఎ. దర్యాప్తులలో వెల్లడయ్యింది.

అక్టోబర్‌ 2, 2016న పి.ఎఫ్‌.ఐ. కేరళలో ఐసిస్‌కు అనుబంధంగా ‘అన్సురాల్‌ ఖలీఫా’ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన ఎన్‌.కె. జస్సిం, ఎన్‌.కె. రంషద్‌, స్వాలిహ్‌ మహమ్మద్‌, మన్సీన్‌ బిన్‌ మహమ్మద్‌, పి.సఫ్వాన్‌, అబూ బషీర్‌లను ఎన్‌.ఐ.ఎ. అరెస్టు చేసింది. మన్సీన్‌ ఆన్లైన్‌ ద్వారా ఐసిస్‌ కోసం యువకులను చేరుస్తూంటాడు. సఫ్వాన్‌ మళయాళం దినపత్రిక ‘తేజస్‌’కి గ్రాఫిక్స్‌ డిజైనర్‌గా పనిచేస్తూంటాడు. ఇది పి.ఎఫ్‌.ఐ. అనుకూల పత్రిక. సఫ్వాన్‌, మన్సీన్‌ ఇద్దరూ పి.ఎఫ్‌.ఐ., సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.డి.పి.ఐ.) కార్యకర్తలు.

ఎన్‌.ఐ.ఎ. తీవ్రంగా గాలిస్తున్న పి.ఎఫ్‌.ఐ. కి చెందిన మరో వ్యక్తి సజీర్‌ మంగళాచారి అబ్దుల్లా. ఇతడు ఆరుగురు యువకులను ఐసిస్‌లో చేర్చాడు. ఇతడే కేరళలోని నారత్‌ జిల్లాలో ఉగ్రవాద శిబిరం నడుపుతున్న 21 మందిని గతంలో చేర్చుకున్నాడు. అబ్దుల్లా తాజాగా చేర్చుకున్న ఆరుగురు యువకులూ ఇటీవల కొడైకెనాల్‌ పర్యటనకు వచ్చిన ఇజ్రాయిల్‌ దేశస్థులపై దాడి చేసినవారిలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అబ్దుల్లా ఎన్‌.ఐ.టి.లో ఇంజనీరింగ్‌ చదివాడు.

ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలలో చేరుతున్న పి.ఎఫ్‌.ఐ. కార్యకర్తలు మరికొందరిని ఈ సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారని ఎన్‌.ఐ.ఎ. దర్యాప్తులో స్పష్టమయ్యింది.

కేరళలో కన్నోర్‌కి చెందిన శ్రుతి అనే బాలికను అపహరించడానికి పి.ఎఫ్‌.ఐ. జీహాదీ మూకలు ప్రయత్నించాయి. ఆమె తల్లిదండ్రులు సహాయం కోసం విశ్వ హిందూ పరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా ప్రారంభించిన హిందూ హెల్ప్‌ లైన్‌ను ఆశ్రయించారు. హిందూ హెల్ప్‌ లైన్‌ సభ్యులు స్థానిక పోలీసుల సహాయంతో శ్రుతి అపహరణకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు. ఇందుకు ఆగ్రహించిన పి.ఎఫ్‌.ఐ. ‘తాము శ్రుతిని అపహరించి, ఐసిస్‌ కి అమ్మకుండా ఎలా అడ్డుకుంటారో చూస్తాం’ అని పోలీసులను సవాలు చేస్తూ కేరళ అంతటా పోస్టర్లు అంటించారు.

పి.ఎఫ్‌.ఐ. అంటించిన పోస్టర్లో ఇలా ఉంది.

‘సంఘ్‌ పరివార్‌ ముందు మోకరిల్లే వెన్నెముక లేని పోలీసులకు..

మేము శ్రుతిని అపహరించాలని నిర్ణయించాం. మేము ఆమెను యెమెన్‌ లేదా సిరియాకు తీసుకుపోయి ఐసిస్‌కు బహుమానంగా ఇస్తాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మమ్మల్ని మీరు ఆపగాలరో లేదో చూస్తాం.

– పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’.

భారత ఉపరాష్ట్రపతిగా ఆగస్టు 2017లో చేసిన తన ఆఖరి ప్రసంగంలో హమీద్‌ అన్సారీ భారతదేశంలో ముస్లింలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేసారు. బహుశా రానున్న రోజుల్లో దేశ రాజకీయాలలో ఒక ముస్లిం నాయకునిగా ఎదగాలని ఆయన ఆశిస్తుండవచ్చు. ఆయన వ్యక్తం చేసిన ఆందోళనను దేశ ప్రజలు మరచిపోయే లోపే తాజాగా కరడుగట్టిన జిహాదీ సంస్థ అయిన పి.ఎఫ్‌.ఐ. కేరళలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అన్సారీ పాల్గొన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. అదేమిటంటే భారత్‌లో ముస్లింలకి భద్రతా లేదని అన్సారీ అన్న వారం, పది రోజుల్లోనే రోహింగ్యా ముస్లింలకు సమర్థనగా దేశమంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు, హింసాకాండ మొదలయ్యాయి. వీటిని బట్టి హమీద్‌ అన్సారీ కదలికలపై రానున్న రోజుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తం కావచ్చు.

– దుగ్గిరాల రాజకిశోర్‌

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here