Home News చదువంటే అక్షర జ్ఞానం మాత్రమే కాదు– అఖిల భారత సహసర్‌ కార్యవాహ భాగయ్య

చదువంటే అక్షర జ్ఞానం మాత్రమే కాదు– అఖిల భారత సహసర్‌ కార్యవాహ భాగయ్య

0
SHARE

‘ఆచార్యులు అంటే ‘ఆచరించి చూపేవారు’ అని అర్థం. చాలా చోట్ల ఆచార్యుల మార్గదర్శనం ఉన్నప్పటికి ఆచరించే ప్రేరణ లేదు. పుస్తకాలు, ప్రవచనాలు, వీడియోలు చాలా ఉన్నప్పటికి ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించిన విషయాలను ఆచరించి, వారి వ్యక్తిగత నిర్మాణానికి తోడ్పాడాలి.’ అని ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారత సహసర్‌ కార్యవాహ భాగయ్య అన్నారు. విశాఖపట్టణంలోని భారతీయ విద్యాకేంద్రం ప్రారంభమై 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నవంబర్‌ 11, 12 తేదీలలో భారతీయ విద్యాకేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు రోజుల పాటు ఆచార్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరం ప్రారంభ ఉత్సవంలో భాగయ్య మాట్లాడుతూ భారతీయ విద్యాకేంద్ర పాఠశాల 1957లో సంఘ ప్రచారక్‌గా వచ్చిన మా||బాపూ రావుజీ మోఘేచే విశాఖపట్నంలో ప్రారంభమైనదని తెలిపారు. ఆ సమయంలో ఎస్‌.టి.జి. కృష్ణమాచారి, కె.ఎస్‌.ఎ.ఎన్‌. రాజు, డా|| డి. శివప్రసాద్‌లు పాఠశాల వికాసానికి కృషి చేశారని గుర్తుచేశారు. 1962లో విద్యాకేంద్రం రిజిష్టర్డ్‌ సంస్థగా గుర్తింపు పొందింది. అప్పుడే డాబాగార్డెన్స్‌, దొండపర్తి ప్రాంతాల్లో కూడా ప్రారంభమయ్యాయన్నారు. స్వర్గీయ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి, స్వర్గీయ బండారు సదాశివరావు విద్యాకేంద్రానికి అధ్య్ష, కార్యదర్శులుగా వ్యవహరించారని, పిళ్ళా రామారావు కూడా ఎంతో క్రియాశీలంగా పనిచేశారని తెలియ జేశారు. తరువాత ప్రముఖ న్యాయవాది కీ||శే|| తాతా రామమూర్తి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. ఈయనకు విద్యాకేంద్రంతో ఎంతో అనుబంధం ఉండేదని పాఠశాల నిర్వహణలోనూ, విద్యాకేంద్రవికాసం లోనూ, అంకితభావంతో పనిచేశారని తెలిపారు.

చేస్తున్నపనిని ‘ఉద్యోగం’ అనే భావనతో కాక సమర్పణ భావంతో పనిచేసిన ప్రధానాచార్యులు ఎందరో ఉన్నారని భాగయ్య పేర్కొన్నారు. ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు బాగా ఉన్నప్పటికి భారతీయ విద్యపై దృష్టిలేదు. విద్యాకేంద్ర పాఠశాలలకు వనరులు, భవనాలు, వసతులు లేకపోయినప్పటికి చాలా మంది చేసిన ప్రయత్నాల ఫలితంగా సమాజంలోని అనేక ప్రాంతాలలోనే గాక, మత్స్యకార, గిరిజన గ్రామాలలో కూడా విద్యాకేంద్రాలతో పాటు ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రారంభించారని గుర్తుచేశారు. దేశంలో విజ్ఞానశాస్త్ర రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా, అంతరిక్ష పరిశోధనలలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పటికి విద్యార్థులు ఆటలు ఆడకపోవడం, వ్యాయామం చేయకపోవడం వలన వారిలో ఊబకాయం పెరుగుతుందని అన్నారు. శిబిరంలో జరిగిన ‘కబడ్డీ, ఖోఖో’ ఆటలు, యోగాల ద్వారా విద్యాకేంద్రం వ్యాయామానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని తెలియజేశారు.

ఆర్థిక సహాయం లేకపోయినా విద్యాకేంద్ర సంస్థలు, విజ్ఞాన భారతి సంస్థలు నడుస్తున్నాయన్నారు. పదవీ విరమణ చేసినవారు, పాలకవర్గం, ఆచార్యులంతా కలిసికట్టుగా ఒకే కుటుంబ లాగా ఈ శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

విద్యాభారతికి అనుబంధమైన విద్యాకేంద్ర పాఠశాలలలో శారీరిక, నైతిక, సామాజిక, సంస్కృతి ఆధారమైన బోధనలతో విద్యార్థులలో రక్తదానం చెయ్యడం, ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం నేర్పుతున్నారన్నారు. 1977లో తుఫాను, వరదలు వచ్చినప్పుడు విద్యాకేంద్రాలు చపాతీలు సేకరించి బాధితుల ఇళ్ళకు సమకూర్చాయి. అనకాపల్లి శారదానది వరదల్లో ఇళ్ళను కోల్పోయిన వారికి ఇళ్ళు కట్టించి ‘శ్రీరామనగర్‌’ నిర్మాణం చెయ్యటం ఇందుకు ఉదాహరణ అని భాగయ్య చెప్పారు. పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనలకు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, పిల్లలకు మధ్య వారధులుగా ఉండాలి. ఆచార్య ప్రశిక్షణ, విద్యార్థి వికాసం కోసం ఒక్కో లెక్చరర్‌కు పదిమంది విద్యార్థులను జోడించి వారి వికాస బాధ్యతను అప్పగించారని విన్నానని, ఇది ఎంతో మేలు కలిగించే విషయమని భాగయ్య కొనియాడారు.

విద్య అంటే అక్షర జ్ఞానం మాత్రమే కాదు. ఆంగ్లం రాకపోతే విజ్ఞాన శాస్త్రం బోధపడదు అనే ఆలోచన సరైనది కాదని; జపాన్‌, చైనా, జర్మనీ దేశాలలో భాష పట్ల ఇటువంటి ఆలోచన లేదని వివరించారు. స్వాభిమానంతో మాతృభాషను గౌరవించాలి. ఆంగ్లభాషనూ నేర్చుకోవాలి, సామాజిక వికాసానికి కారణమైన మన భాషలోని సుమతి, వేమన మొదలగు శతకాలు చదివించాలి. ఉపాధ్యా యులు నైపుణ్య శిక్షణ, కష్టపడే లక్షణం విద్యార్థులలో చిగురింపచేయాలి అని భాగయ్య అన్నారు. నేడు ఆంగ్లదేశాలలో కూడా విద్యాభారతి పాఠ్యప్రణాళిక లను అనుసరిస్తున్నారని ఆయన తెలియజేశారు. భారతీయ విద్యాకేంద్రానికి పూర్వం నుండే ఉన్నత స్థానం ఉందని, రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ విద్యాకేంద్రాలు మరింత అభివృద్ధి సాధించాలన్నారు.

విద్యాకేంద్రం జాతీయ చైతన్యం నింపింది – ముగింపు ఉత్సవంలో భాగయ్య

శిబిరంలో రెండవ రోజు జరిగిన ముగింపు ఉత్సవంలో కూడా భాగయ్య మార్గదర్శనం చేశారు. ముగింపు సందేశంలో ఆయన మాట్లాడుతూ – ఈ విద్యాకేంద్రం వికసించటానికి కారణం ఉపాధ్యాయులు ఎంతో అంకిత భావంతో, సేవాభావంతో పని చేయడమే అన్నారు. అప్పుడు పనిచేసిన ఆ ఉపాధ్యాయులు నేడు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా రన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వారిలో ఒకరని చెప్పారు. శివప్రసాద్‌, మరికొంత మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తూ తమ విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ పి.హెచ్‌.డి.లను సాధించి విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్లుగా బాధ్యతలు వహించారన్నారు. అంతేకాక విద్యాకేంద్ర నిర్వహణ బాధ్యతలు స్వీకరించి ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా ఉన్న జి.నాగేశ్వరరావు, బి.వి.కె. కళాశాలలో ఉపన్యాసకులుగా కూడా పనిచేశారని తెలిపారు. శిబిరంలో ఏర్పాటు చేసిన విందులో వరుసల వారీగా అందరూ కలిసి కూర్చోని డిగ్రీ, జూనియర్‌ కళాశాలల విద్యార్థులు, విద్యార్థినులు వడ్డిస్తుంటే ఎంతో ఆత్మీయత వాతావరణం ఏర్పడిందన్నారు.

గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆంగ్లములోనూ, బయాలజీలోనూ జరిగిన పోటీలలో పాల్గొని ప్రథమ స్థానం సంపాదిం చడం వారి సాధనకు నిదర్శనం అని అన్నారు. గత 60 సంవత్సరాలుగా విద్యారంగంలో విద్యాకేంద్రం చేసిన కృషి ప్రజలందరిలో జాతీయ చైతన్య నిర్మాణం చేసిందన్నారు. 1952లో గోరఖ్‌పూర్‌లో, 1957లో విశాఖపట్నంలో ప్రారంభమైన విద్యాలయాలు విద్యాభారతికి అనుబంధమైనవన్నారు. ఆనాటి భారత్‌ ట్యుటోరియల్‌ కాలేజీలు ప్రాచీన శ్రేష్ఠ పరంపరకు నడుం బిగించి ఈనాడు విజ్ఞాన భారతులుగా వికసించాయని భాగయ్య తెలిపారు.

విద్యాకేంద్రాలు గుడిలోవలో ఆవాస విద్యాలయ ప్రారంభానికి, గిరిజన ప్రాంతాలలో, మత్స్యకార గ్రామాలలో ఏకోపాధ్యాయ పాఠశాలల ప్రారంభానికి కృషి చేశాయన్నారు. జూనియర్‌ కాలేజీ ప్రారంభానికి అప్పటి విద్యాశాఖ డైరెక్టర్‌ రాజగోపాల్‌ ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. కళాశాల ప్రారంభించిన కొన్ని నెలలు గడిచిన తరువాత విద్యార్థులు యూనిఫారం ధరించాలనే ఆలోచన వచ్చింది. అయితే కొన్ని వ్యతిరేకతలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ ప్రిన్సిపాల్‌గా ఉన్న పిళ్ళా రామారావు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి ఆ నియమాన్ని అమలు చేయడానికి ఎంతో ప్రయత్నించారన్నారు. తరువాత చాలా కళాశాలలలో అదే నియమం పాటించారని గుర్తు చేశారు. పిళ్ళా రామారావు ప్రిన్సిపాల్‌గా మాత్రమే కాక ఒక సామాజిక కార్యకర్తగా గవర్నర్‌, జిల్లా కలెక్టర్‌ కూడా చేయలేని పనులను సాధించ గలిగారని చెప్పారు. ఆయన ప్రిన్సిపాల్‌గా ఉండగా ఒక ముస్లిం ఆఫీసరు కుమార్తెలు కాలేజీలో చదుకున్నారు. వారి చదువు, సంస్కారం, ప్రవర్తన, భగవద్గీత శ్లోకాల పఠనం గూర్చి నేను, సుబ్రహ్మణ్య శాస్త్రి ఒక ట్రైన్‌లో ప్రయాణిస్తూ మాట్లాడుకొంటుండగా తోటి ప్రయాణికుడిగా ఉన్న ఆ ఆఫీసరు మా మాటలు విని శాస్త్రిగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆనాటి కాలేజీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలలో ప్రొఫెసర్‌ ఎస్‌.ఎస్‌.ఆర్‌.కె. ప్రసాద్‌, పరమ పూజ్యనీయ బాలా సాహెబ్‌ దేవరస్‌ కూడా పాల్గొన్నారు. సహృదయులు, నిజాయితీ గల ఉపాధ్యాయుల తపస్సు, నిస్వార్థ సేవ ఎంతో సార్థకమయ్యాయని భాగయ్య తెలిపారు. వివిధ ప్రైవేట్‌, ప్రభుత్వ కళాశాలలలో లక్షన్నర జీతం తీసుకునే లెక్చరర్స్‌ కాలేజీలో అందుబాటులో ఉండకపోవటం, వేరొక పనులలో నిమగ్నం కావటం మానవతలేని విషయం. కాలేజీలో బోధించేవారికి డిగ్రీలు మాత్రమే కాదు. నిజాయితీ, సౌశీల్యం కూడా కావాలి. ఉపాధ్యాయులందరి హృదయాల్లో విద్యార్థుల పట్ల ప్రేమ, ఆదరణ, అనురాగం చోటు చేసుకోవాలి. 60సం||ల బి.వి.కె. చరిత్రలో నాలుగు జిల్లాల సహకారం తీసుకుంటూ జాతి పట్ల, దేశం పట్ల అభిమానం, స్వాభిమానం నింపుకుంటోంది. ఇంకా ఎంతో శ్రమతో నూతన పరివర్తనకు పూనుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని భాగయ్య అన్నారు.

సభా కార్యక్రమానికి భారతీయ విద్యాకేంద్రం అధ్యక్షుడు జి.ఎస్‌.ఎ. నరసింహం అధ్యక్షత వహించారు.

విశాఖ పార్లమెంట్‌ సభ్యులు కంభంపాటి హరిబాబు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. నాగేశ్వరరావు, విశాఖజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా||సృజన ఐ.ఎ.ఎస్‌. ప్రసంగించారు.

విద్యార్థుల బృందగానం, క్రీడా పోటీలు శిబిరంలో పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి. ముగింపు ఉత్సవంలో ఆచార్యులు ప్రదర్శించిన సాంస్కృతిక, శారీరిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గిరిజన బంధువులు చేసిన ‘థింసా నృత్యం’ అందరినీ ఆకర్షించింది. ఈ శిబిరంలో ‘నూతన పద్ధతుల ద్వారా విద్యాబోధన’ అంశంపై పోటీలు నిర్వహించారు.

(జాగృతి సౌజన్యం తో)