Home Telugu ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కథ ముగిసినట్టే

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కథ ముగిసినట్టే

0
SHARE

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పేరుతో ఇన్నాళ్లు పేట్రేగిపోయిన ఉగ్రమూకలను మోసుల్‌లో ఇరాక్ సైన్యం పూర్తిగా మట్టుబెట్టింది. ఐఎస్ ఆధీనంలో ఉన్న మోసుల్‌ను ఇరాక్ సేనలు తిరిగి తమ వశం చేసుకున్నాయి. దీంతో ఐఎస్ కథ ముగిసినట్టయింది. జిహాద్ పేరుతో ఐఎస్ సృష్టించిన మారణహోమం నుంచి ప్రాణాలను అరచేతపట్టుకొని లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. నెలల తరబడి జరిగిన పోరులో ప్రస్తుతం మోసుల్ పట్టణం పూర్తిగా శిథిలమై రాళ్లు రప్పలతో శ్మశానాన్ని తలపిస్తోంది. ప్రజలు మోసుల్‌ను విడిచి ఎక్కడెక్కడికో ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లిపోయారు. ఆస్తులు పూర్తిగా ధ్వంసమైపోయాయి, విద్యుత్, నీరు, వైద్యం వంటి వౌలిక సదుపాయాలు ఏమాత్రం లేని ఈ నగరాన్ని పునర్నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. ఐఎస్ పీడ విరగడైనా పట్టణాన్ని తిరిగి నిర్మించడం, ప్రజలు తిరిగి వచ్చేలా చేయడం, వారికి కనీస వసతులు కల్పిండం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడంత లేదు. ఇంకా పాతనగరంలోని ఓ ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులున్నట్టు సమాచారం ఉందని, వాళ్లు లొంగిపోవడానికి సిద్ధంగా లేరని లెఫ్ట్‌నెంట్ జనరల్ సమీ అల్ అఫ్రిది తెలిపారు. అయితే సైన్యం జిహాదీలను పూర్తిగా తుడిచిపెట్టే పనిలో నిమగ్నమై ఉందని, ఈ రోజుతో అది పూర్తవుతుందని చెప్పారు. ఐఎస్ పీడ విరగడవ్వడంతో ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ మోసుల్ పట్టణాన్ని ఆదివారం సందర్శించారు. ఐఎస్ ఉగ్రవాదులను అంతమొందించడంలో సైన్యం చూపిన ధైర్య సాహసాలను ప్రధాని అభినందించారు. ఇది చాలాపెద్ద విజయం, నెలల తరబడి సాగుతున్న పోరులో సైన్యం చూపిన తెగువ అసాధారణమైంది, విజయం తథ్యమని ముందే తెలుసు, దీనికి శక్తివంచన లేకుండా కృషి చేసిన సైన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.

అమెరికా సంకీర్ణ దళాలతో కలిసి ఇరాక్ సైన్యం గత అక్టోబరులో ఐఎస్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న మోసుల్ పట్టణానికి విముక్తి కలిగించేందుకు పెద్దఎత్తున పోరాటం చేస్తోంది. 2014లో మోసుల్ పట్టణంతోపాటు ఇరాక్, సిరియాలోని కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఐసిస్ అక్కడి ప్రభుత్వాలకు పెను సవాలు విసిరింది. ఆర్మీ, పోలీస్, ప్రత్యేక దళాలు అమెరికా విమానదాడుల సహకారంతో గత జనవరిలో మోసుల్ తూర్పు ప్రాంతాన్ని ఇరాక్ సైన్యం తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. టిగ్రిస్ నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న మోసుల్ నగరాన్ని ఉగ్రవాదులనుంచి తిరిగి స్వాధీనం చేసుకోడానికి ఇరాక్, అమెరికా సంకీర్ణ సేనలకు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరికి వీధి పోరాటాలకు కూడా దిగాల్సి వచ్చింది. ఈ పోరులో వేలాది మంది మరణించగా, సగానికి పైగా మోసుల్ వాసులు పట్టణాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 9.2లక్షల మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే మోసుల్‌లో యుద్ధం ముగిసింది కానీ అక్కడ ప్రజలు నివసించడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించడం ఓ పెద్ద సమస్యేనని ఐక్యరాజ్య సమితిలోని ఇరాక్ ప్రతినిధి లిసే గ్రాండీ పేర్కొన్నారు. వల్లకాడులా మారిన మోసుల్‌ను జనావాసంగా మార్చడం కత్తిమీద సామే అవుతుందని అన్నారు. ప్రజలు తిరిగి ఇక్కడకు వచ్చేలా సౌకర్యాలు కల్పించేందుకు చాలా కాలమే పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చేయాల్సింది చాలా ఉంది: బ్రిటన్

మోసుల్ పట్టణంలో ఐఎస్ ఉగ్రవాదుల్ని అంతంచేయడంలో విజయం సాధించిన ఇరాక్ సైన్యాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి మైకేల్ ఫాలాన్ అభినందించారు. అయితే ఐఎస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టాలని, దీనికి చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ఇరాక్‌లోని ఇతర ప్రాంతాల్లో ఐఎస్ ఉగ్రవాదులు ఉన్నారని ఇది ఆదివారం మోసుల్ పట్టణంలో ఆ దేశ ప్రధాని పర్యటించినప్పుడు వినిపించిన పేలుడు శబ్దాలే స్పష్టం చేశాయని అన్నారు. సంకీర్ణ దళాలతో కలిసి తమ దేశ సైనికులు మోసుల్‌లోని ఐఎస్‌కు చెందిన 750 స్థావరాలను ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. సరియాలో ఐసిస్‌పై యుద్ధం ఇంకా కొనసాగుతోందని, ఆదేశ సైన్యంతో కలిసి అమెరికా సంకీర్ణ దళాలు అక్కడ పోరు చేస్తున్నాయని గుర్తు చేశారు. సిరియాలోని రాఖా ప్రాంతం ఇప్పటికీ ఐసిస్ ఆధీనంలోనే ఉందని అక్కడ కూడా జిహాదీ మూకలను పూర్తిగా తుడిచి వేయాలని అన్నారు.

భారతీయుల ఆచూకీ తెలుసుకుంటాం

మోసుల్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు 2014లో బంధించిన 39 మంది భారతీయుల ఆచూకీ తెలుకునేందుకు కృషి చేస్తున్నామని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారని వారి ఆచూకీ కనుగొనేందుకు రిటైర్డ్ జనరల్ వికె సింగ్‌ను ఇరాక్ పంపించినట్లు చెప్పారు. మోసుల్‌లో ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న 39 మంది భారతీయులను 2014లో ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఆచూకీ తెలియకుండా పోయిన భారతీయులను క్షేమంగా భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె చెప్పారు. అపహరణకు గురైన వారిలో పంజాబీలు ఎక్కువ మంది ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సుష్మ స్వరాజ్‌ను కలిశారు. అపహరణకు గురైన వారిని క్షేమంగా తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సుష్మ స్వరాజ్ పంజాబ్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. మోసుల్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ తీసుకువచ్చేందుకు ఎయిర్ ఇండియా అధికారులతో కూడా చర్చించినట్టు తెలిపారు. భారత్‌కు వచ్చిన వెంటనే తమ రాష్ట్రానికి చెందిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పంజాబ్ సిఎం పేర్కొన్నారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)