Home Telugu Articles ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా అఫ్ఘాన్‌లో చెరిగిపోతున్న హిందూ చరిత్ర

ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా అఫ్ఘాన్‌లో చెరిగిపోతున్న హిందూ చరిత్ర

0
SHARE

గజనీ ముహమద్‌ దాదాపు 1000 సంవత్సరాల క్రితం మరణించాడు. అతడి సంకుచిత మనస్తత్వం ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నది. తమ మత సేవలో ‘కాఫిర్ల’ (అవిశ్వాసులు)ను అంతమొందించడంలో ఆనందంగా చనిపోయేలా ఇస్లాం అనుయాయులను అది నిర్దేశిస్తోంది. నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ భయానక చరిత్రలో జలాలాబాద్‌ ఘటన మరో దారుణ ఉదంతం మాత్రమే.

గాంధారం గతకాలపు ఒక ఉత్తేజకరమైన స్మృతి; వర్తమానపు ఒక విషాదం! ఈ నెల 1న అఫ్ఘానిస్తాన్‌లోని జలాలాబాద్‌ నగరంలో సంభవించిన ఒక పేలుడు ఘటనలో 17 మంది హిందువులు, సిక్కులు మరణించారు ఇస్లామిక్‌ పూర్వ నాగరికత అవశేషాలను తుడిచివేయడానికి బహుశా ఇది తుది ప్రయత్నమేమో! భూపరివేష్టిత ఆఫ్ఘాన్‌లో ఎనిమిది శతాబ్దాల క్రితం వరకు హిందూ నాగరికత వర్ధిల్లిందన్న విషయం అవిస్మరణీయ సత్యం కదా.

అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీతో సమావేశానికి హిందువులు, సిక్కులను తీసుకు వెళ్ళుతున్న ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న ఒక ఆత్మాహుతి బాంబర్‌ ఈ ఘటనకు కారకుడని జలాలాబాద్ పోలీసులు వెల్లడించారు. మరుసటి రోజు ఆ ఆత్మాహుతి దాడికి బాధ్యత తమదే అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఒక ‘బహుదేవతారాధకుల’ బృందాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇస్లామిక్‌ స్టేట్‌ పేర్కొంది. ఈ దారుణ దురాగతానికి ‘భగవంతుని’ అనుమతి ఉందనే అంతస్సూచన ఆ ప్రకటనలో ఉందనేది స్పష్టం. ఈ ఘటన సహజంగానే ఆఫ్ఘాన్‌లో స్వల్ప సంఖ్యలో ఉన్న హిందూ, సిక్కు పౌరులను తీవ్రంగా కలచివేసింది. వారు తమ మాతృభూమి నుంచి మూకుమ్మడిగా వలస వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. 1990ల్లో కశ్మీర్‌లోయ నుంచి కశ్మీరీ పండిట్‌ల వలసలను నేటి ఆప్ఘాన్ హిందువుల– సిక్కుల దుస్థితి సహజంగానే జ్ఞప్తికి తెస్తోంది.

‘ఈ దేశంలో తాము ఇంకెంత మాత్రం జీవించలేమని నాకు స్పష్టమయిందని’ 35 ఏళ్ళ తేజ్వీర్‌ సింగ్‌ అన్నాడు. ఈ యువకుడు అఫ్ఘాన్‌ హిందూ, సిక్కు పౌరుల జాతీయ సంఘం కార్యదర్శి. అతని పినతండ్రి జలాలాబాద్‌ పేలుడు ఘటనలో మరణించాడు ‘మా మతాచారాలను ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎంతమాత్రమూ సహించడం లేదని’ తేజ్వీర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అఫ్ఘాన్‌లోని హిందూ, సిక్కు కుటుంబాల సంఖ్య 300 కంటే తక్కువగానే ఉంటుంది. ఈ మూడువందల కుటుంబాల సభ్యుల సంఖ్య కూడా 1000 లోపే సుమా! 1990 వ దశకంలో అంతర్యుద్ధం ప్రజ్వరిల్లక ముందు అప్ఘాన్‌లో దాదాపు రెండున్నర లక్షల మంది హిందువులు, సిక్కులు ఉండే వారు. ఒక దశాబ్దం క్రితం కూడా అప్ఘాన్‌లో 3000 మంది హిందువులు, సిక్కులు నివశిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికలో పేర్కొంది.

జలాలాబాద్‌ పేలుడు ఘటనతో భీతావహులైన హిందువులు, సిక్కులు కొంతమంది ఆ నగరంలోని భారత్‌ కాన్సలేట్‌లో ఆశ్రయం పొందడానికి ప్రయత్నించారు. ఆ నగరంలో ఒక పుస్తకాల దుకాణం, ఒక బట్టల దుకాణానికి యజమాని అయిన సర్దార్‌ బలదేవ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు: ‘ఇప్పుడు మాకు రెండే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి భారత్‌కు వలస వెళ్ళిపోవడం; రెండు–ఇస్లాంకు మారిపోవడం’. 1000 సంవత్సరాల క్రితం వరకు పశ్చిమాసియాలో అప్ఘాన్‌ నుంచి ఆగ్నేయాసియాలోని ఇండోనేసియా వరకు భారతీయ సంస్కృతి (హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాలు) విస్తృతంగా వర్ధిల్లింది. ఇస్లాం ప్రవేశించిన అనంతరం, ఆ సంస్కృతీ సంప్రదాయాలు ఇప్పుడు భారత్‌, శ్రీలంక, నేపాల్‌, థాయిలాండ్‌, కంబోడియా, వియత్నాంకు మాత్రమే పరిమితమయ్యాయి.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరుల అనుభవాలే ఇప్పుడు అఫ్ఘాన్‌లో హిందువులు, సిక్కుల విషయంలో పునరావృతమవుతున్నాయి. 1947లో బంగ్లాదేశ్‌ (అప్పడు తూర్పు పాకిస్థాన్‌గా ఉండేది) జనాభాలో హిందువులు 30 శాతం కాగా పాకిస్థాన్‌ జనాభాలో హిందువులు, సిక్కులు కలిసి 24 శాతం మేరకు ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు దేశాలలోను దాదాపు ఇరవై కోట్ల చొప్పున జనాభా ఉన్నది. దేశ విభజన కాలంనాటి హిందూ జనాభా సంఖ్యను బట్టి చూస్తే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులు ఆరుకోట్ల మంది ఉండాలి. అలాగే పాక్‌లో 4.80 కోట్ల మంది హిందువులు ఉండాలి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు రెండిటిలోనూ కలిపి మొత్తం 11 కోట్ల మంది హిందువులు, సిక్కులు ఉండివుండాల్సింది.

మరి ఉన్నారా? లేరు. ఆ రెండు దేశాలలోని మొత్తం హిందువులు, సిక్కులు కనీసం రెండు కోట్ల మంది కూడా లేరు. మరి మిగతా తొమ్మిది కోట్ల మంది ఏమయినట్టు? ఇస్లాంలోకి నిర్బంధంగా మారిపోవడమో లేక మత పరమైన వేధింపులను తట్టుకోలేక ఇతర దేశాలకు వలసపోవడమో జరిగి వుంటుందనేది స్పష్టం.

అఫ్ఘాన్‌ నుంచి ఇండోనేసియా వరకు వర్థిల్లిన ఇస్లామిక్‌ పూర్వ నాగరికత శతాబ్దాలుగా విధ్వంసానికి గురయింది. ఈ విధ్వంసానికి పాల్పడిన వారికి స్ఫూర్తి ముహమద్ గజనీ (క్రీ.శ. 971–1030). గజనీ రాజ్య సింహాసనాన్ని అధిష్టించిన సందర్భంగా ముస్లిం ప్రపంచ అధినేత ఖలీఫా ప్రదానం చేసిన గౌరవాలను అందుకుంటూ భారత్‌లోని విగ్రహారాధకులకు వ్యతిరేకంగా జిహాద్ (పవిత్ర యుద్ధం) చేస్తానని ముహమద్‌ ప్రతిన బూనాడు. ఆ మేరకు ఆతడు తన 32 ఏళ్ళ పాలనలో భారత్‌పై దాదాపు 17 సార్లు దండెత్తాడు. ముహమద్‌ దాడులకు మూడు ప్రేరణలు ఉన్నాయి. అవి: అవిశ్వాసులను వధించడం, వారి దేవాలయాలను ధ్వంసం చేయడం, భారత్‌లోని అపార ధనరాసులను కొల్లగొట్టడం. ఆ తరువాత భారత్‌పై దాడి చేసిన ముస్లిం దురాక్రమణ దారులందరూ మహమద్‌ గజనీ అడుగుజాడల్లో నడిచిన వారే.

2001 మార్చిలో ముల్లా మహమ్మద్ ఒమర్ ఆదేశాల మేరకు తాలిబన్లు బమియాన్‌లోయలోని గౌతమ బుద్ధుడి విగ్రహాలను కూల్చివేశారు. క్రీ.శ. 4, 5 శతాబ్దాల నాటి ఆ బుద్ధ ప్రతిమలు గాంధార శిల్పకళకు పరిపూర్ణ తార్కాణాలు. ప్రపంచ దేశాల విజ్ఞప్తులను ధిక్కరించి తాలిబన్లు మత మౌఢ్యంతో ఆ చరిత్రాత్మక విగ్రహాలను నేల మట్టం చేశారు. 115, 174 అడుగుల ఎత్తు ఉన్న ఆ బుద్ధ విగ్రహాలను గాంధార శిల్పకళకు ఉత్కృష్ట నిదర్శనాలుగా గానీ, చారిత్రక వారసత్వంగా గానీ తాలిబన్లు పరిగణించలేదు. అవిశ్వాసుల విగ్రహాలుగా మాత్రమే వాటిని తాలిబన్లు చూశారు. తమ మత విశ్వాసాల ప్రకారం వాటిని కూల్చివేయడంలో తప్పు ఏమీలేదని వారు భావించారు. ఆ విధ్వంసాన్ని ఆనాటి అప్ఘాన్‌ ప్రభుత్వం సమర్థించింది. ఇస్లామిక్ మత విశ్వాసాలు, ఆచారాల ప్రకారమే బుద్ధ విగ్రహాలను కూల్చివేయడం జరిగిందని స్పష్టం చేసింది.

క్రీ.శ. 12వ శతాబ్దం వరకు, ప్రస్తుత పాకిస్థాన్‌, కశ్మీర్‌లోయతో పాటు అప్ఘాన్‌లో హిందువులు, బౌద్ధులు అత్యధికంగా ఉండేవారు. తమ సొంతదేవుళ్ళు, దేవతలను ఆరాధించే ఆదిమ జాతుల వారు చెదురుమదురుగా ఉండేవారు జర్మన్‌ ఇండాలజిస్ట్‌ విల్లెమ్‌ వొగెల్సాంగ్‌ ఇలా రాశారు: ‘ఆధునిక అప్ఘాన్‌లోని తూర్పు ప్రాంతాలలో క్రీ.శ. 8, 9 శతాబ్దాల వరకు ముస్లిమేతర పాలకుల అధీనంలో ఉండేవి. వారిలో చాలా మంది హిందువులు, బౌద్ధులే’. 10వ శతాబ్దిలో ముహమద్ గజనీ సింధునదిని దాటి హిందుస్థాన్‌పై దాడులకు ఉపక్రమించాడు. ఈ గజ్నీవీద్‌ దాడుల మూలంగానే ఇప్పటి అప్ఘాన్‌, పాకిస్థాన్‌లలో సున్నీ ఇస్లాం ప్రాబల్యం వహిస్తోంది. మహమద్‌ గజనీ దురాక్రమణ ఫలితంగానే కాబూల్‌లోయలోను, అప్ఘాన్‌ ఇతర ప్రాంతాలలోను ఇస్లాం విస్తరించిందని పలువురు చరిత్రకారులు నిర్ధారించారు. గజనీ రాజ్యాన్ని క్రీ.శ. 998 నుంచి 1030 వరకు పాలించిన ముహమద్‌ గాంధార దేశం నుంచి హిందువులను వెళ్ళగొట్టాడని మార్టిన్‌ ఇవాన్స్‌ అనే చరిత్రకారుడు రాశాడు. కాస్పియన్‌ సముద్రం నుంచి వారణాసి వరకు ఉన్న ప్రాంతాలనన్నిటినీ అతడు దురాక్రమించుకున్నాడని ఆయన తన ‘అప్ఘానిస్తాన్‌: ఎ న్యూ హిస్టరీ’ అనే పుస్తకంలో రాశాడు. తాను ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని ప్రజలు మూకుమ్మడిగా ఇస్లాంలోకి మారేలా ప్రోత్సహించాడు. హిందూ దేవాలయాలలోని ఆస్తులను పూర్తిగా దోచుకుని తన రాజ్యానికి తరలించాడని ఆ చరిత్రకారుడు రాశాడు. ‘విగ్రహ విధ్వంసకుడు’గా ‘భారత్‌ పీడకుడు’గా గజనీ చరిత్రలో నిలిచాడు.

ముహమద్‌ దాదాపు 1000 సంవత్సరాల క్రితం మరణించాడు. ఆయితే అతడి సంకుచిత మనస్తత్వం ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నది. తమ మత సేవలో ‘కాఫిర్ల’ (అవిశ్వాసులు)ను అంతమొందించడంలో ఆనందంగా చనిపోయేలా ఇస్లాం అనుయాయులను అది నిర్దేశిస్తోంది. నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ భయానక చరిత్రలో జలాలాబాద్‌ ఘటన మరో దారుణ ఉదంతం మాత్రమే. ఈ ఘోర చరిత్రకు అంతం అనేది కనుచూపుమేరలో కన్పించక పోవడమనేది మనకాలం విషాదాలలో ఒకటి.

-బల్బీర్ పూంజ్
సీనియర్‌ బీజేపీ నాయకుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here