Home Telugu Articles వ‌న‌వాసిల ఆరాధ్య‌ దైవం.. సంత్ సేవాలాల్ మహారాజ్‌

వ‌న‌వాసిల ఆరాధ్య‌ దైవం.. సంత్ సేవాలాల్ మహారాజ్‌

0
SHARE

— డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్‌

సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు. ఆయన జ‌యంతిని పండుగలా జ‌రుపుకొంటారు. గిరిజ‌నుల‌కు ద‌శ‌-దిశ‌ను చూపి, హైందవ ధ‌ర్మం గొప్ప‌ద‌నం, విశిష్ట‌తల‌ను తెలియ‌ జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని చరిత్రకారులు చెబుతారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. దీంతో శ్రీ సంత్‌సేవాలాల్ ఇత‌ర కులాలవారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారు.

1739 ఫిబ్ర‌వ‌రి 15న అనంత‌పురం జిల్లా రాంజీనాయ‌క్ తండాలో సేవాలాల్ మ‌హారాజ్‌ జన్మించారు. జ‌గ‌దాంబ మాత‌నే త‌న మార్గ‌ద‌ర్శకురాలిగా, గురువుగా స్వీక‌రించి ఆమె ఆదేశానుసారం బంజారాల సేవ‌లో నిమగ్న ‌మ‌య్యారు. సేవాలాల్ ప్ర‌జ‌ల మూఢవిశ్వాస‌మైన జంతుబ‌లికి తీవ్ర వ్యతిరేకి. బంజారాలు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వ‌ర‌కు వివిధ రాజ్యాల‌కు అవ‌స‌రమైన యుద్ధ సామాగ్రిని చేర‌వేస్తూ సంచార జీవ‌నం సాగిస్తుండేవారు.

ఆ క్ర‌మంలో బ్రిటిష్‌, ముస్లిం పాల‌కుల మ‌త ప్ర‌చారం వల్ల బంజారా స‌మాజం అనేక ఇబ్బందుల‌కు గురైంది. ఈ క్ర‌మంలోనే బంజారా జాతిని స‌న్మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ మహారాజ్ అవ‌త‌రించారని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. సేవాలాల్ మహారాజ్, దండి మేరామయాడీలను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ లంబాడీలు ప్ర‌తి ఏటా తీజ్ ఉత్స‌వాలను కూడా జ‌రుపుకొంటారు. అనంత‌పురం జిల్లా గుత్తిలోని గొల్ల‌ల‌దొడ్డి ప్రాంతంలో కుల దైవ‌మైన సేవాలాల్ మహారాజ్ గ‌ఢ్ ఉంది.

సేవాలాల్ శివ పూజా రుడు. ఆయ‌న తండ్రి, తాత‌లు తెగ పెద్ద‌లు. తొమ్మిది రోజుల పాటు పెళ్లికాని యువతులు తీజ్ ఉత్స‌వాల్లో పాల్గొని త‌మ‌కు వివాహం కావాల‌ని పూజ‌లు చేస్తారు.సంత్ సేవాలాల్‌ మహారాజ్ ప్ర‌జ‌ల కోసం చేసిన ఉద్య‌మాలలో ధ‌ర్మ ప్ర‌చారం, ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు, మ‌త మార్పిడులను అరికట్ట‌డం వంటివి ఉన్నాయి. స‌న్మార్గంలో తన జాతిని న‌డిపించి భార‌త్‌లోని దాదాపు 11 కోట్ల బంజారా లకు ఆరాధ్య దైవంగా ఆయన నిలిచారు.

బంజారాలు రాజపుత్రుల్లాంటి వారని చరిత్ర కారుడు క‌ల్న‌ల్‌ టాడ్ పేర్కొన్నారంటే… వారెంత దృఢకాయులో అర్థం అవుతుంది. లంబాడీలు, బంజారాలు, సుగాలీలు, గ్వార్ భాయ్ అని పిల‌వ‌బ‌డుతున్న ఈ గిరిజ‌నులు ప్ర‌పంచవ్యాప్తంగా గోర్ బంజారాలుగా పేరుపొందారు. మధ్య యుగంలో మ‌హ‌మ్మ‌ద్‌ ఘోరీకి వ్య‌తిరేకంగా పృథ్వీరాజ్ చౌహాన్ ప‌క్షాన పోరాడిన వీరోచిత చ‌రిత్ర బంజారాల సొంతం. ద‌క్క‌న్‌ పీఠ‌భూమిలో లంబాడీలు కాక‌తీయుల కంటే ముందే ఉన్నార‌ని, సంచార జాతివారైనా వీరు రజాకార్ల‌తో పోరాడార‌ని, నవాబులు వారి ధైర్య‌సాహసాల‌కు మెచ్చి భూముల‌ను ఇనాములుగా ఇచ్చారని చ‌రిత్ర చెబుతోంది. బంజారాలు ఎవ‌రికీ హాని త‌ల‌పెట్టేవారు కాద‌ని, స‌హాయ గుణం విరివిగా క‌ల‌వార‌ని, ధైర్య‌సాహ‌సాల‌కు ప్ర‌తీకలనీ చ‌రిత్ర ద్వారా తెలుస్తుంది. త‌ర‌త‌రాలుగా జాతి వివ‌క్ష‌కు గుర‌వుతూ ఆర్థిక, సామాజిక‌, రాజ‌కీయ అభివృద్ధిలో వెనుక‌బ‌డి ఉన్న లంబాడాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది.

(నేడు సంత్ సేవాలాల్ మహారాజ్ జ‌యంతి)

First Published On 15.02.2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here