Home Interviews ‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’

‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’

0
SHARE

రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) ‌సందర్భంగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండ‌వ భాగం

ప్ర‌శ్న‌ : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త భాష్యాలతో దేశాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం, ఒక విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు?

జ‌వాబు : సెక్యులరిజమనేది భారతీయ సంప్రదాయంలో ఇమడని భావన. ఎందుకంటే, క్రైస్తవం తీసుకోండి. చర్చి అనేది అక్కడ ఒక వ్యవస్థ. అన్నింటినీ శాసిస్తుంది. దేశ పాలన నుండి మనిషి జీవితం వరకు అన్నిటినీ నిర్దేశిస్తుంది. అంటే అన్నీ మత సంబంధ మైనవే. సర్వం మతమే. ఇక మత సంబంధం లేనిది సెక్యులర్‌. ఇపుడు మిలిట్రీ పాలన ఉన్నది. వాళ్ల తుపాకీ గొట్టం ఉన్నది. తుపాకీకి మతం ఉండదు. అది సెక్యులర్‌. ‌మిగతా విషయాలన్నీ మత సంబంధమైనవి. ఇప్పుడు ఈ సమస్య చుట్టూ తిరుగుతున్న అబ్రహామిక్‌ ‌మతాలు ఇదే ధోరణిలో ఉంటాయి. మాదే ఉండాలి. వేరేది ఉండడానికి వీలు లేదు. అప్పుడు సెక్యులర్‌ అన్న భావనకు అవకాశం ఎక్కడ? ఈ పరిస్థితి మన దేశంలో ఎన్నడూ లేదు. పార్శీలు, ముస్లింలు, క్రిష్టియన్స్ ‌వచ్చారు, ఇంకా ఎందరో వచ్చారు. మన రాజులు ఆహ్వానించారు. వచ్చినవారు దుర్బుద్ధితో, దురాశతో అకృత్యాలు చేశారు, అది వేరే సంగతి. మనకు ఒకరి పట్ల ద్వేషం లేదు. సర్వేజనాః సుఖినోభవంతు అన్న సంస్కృతి మనది. అందులో సర్వేజనాస్సుఖినో భవంతు అన్నప్పుడు ఏ శైవమో, వైష్ణవమో ఉండాలి. భగవద్గీతను తీసుకోండి. భగవద్గీత శ్లోకాలలో సగం కంటే ఎక్కువ మానవ జీవితానికి సంబంధించినవే తప్ప, భగవంతుని ఆరాధించడం గురించి చెప్పవు. ఇస్లాం రాకముందు పర్షియన్లు, యూదులు భగవద్గీత శ్లోకాలను పవిత్రమైనవిగా భావించేవారని ఒక ప్రముఖుడు ఒకసారి చెప్పారు.

‘ధ్యాయతో విషయాన్‌ ‌పుంసః సంగస్తేషూప జాయతే/ సంగాత్‌ ‌సంజాయతే కామః కామాత్‌ ‌క్రోధో భిజాయతే’ అంటుంది గీత. మానవుడు అదే పనిగా ఆలోచిస్తే దానిమీద అభిమానం కలిగే అవకాశం ఉంది. అది అందకపోతే దానిమీద మమకారం పెరిగి కోపం కలుగుతుంది. కోపంవలన క్రోధం పెరిగి జ్ఞాపకశక్తి తగ్గి చివరికి అధోగతి పాలవుతాడు. ఇది మానవ నైజం గురించి చెబుతున్నది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి మూలసూత్రాలు. మనస్సన్నది చంచలమైనది. దాన్ని నిలపడం చాలా కష్టం. దానికి రెండే మార్గాలు అభ్యాసం, వైరాగ్యం-ఇదొక శ్లోక భావం. దీన్లో హిందూయిజం ఏముంది? అసలు మతపరమైనది ఏముంది? కానీ ఇది భగవద్గీతలో ఉంది కాబట్టి పనికిరానిది అని ముద్ర వేసి, వాళ్లే సంకుచిత దృష్టితో చూసి సెక్యులరిం పేరుతో అడ్డుకుంటున్నారు.సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం ఎమర్జెన్సీ దురాగతాలలో ఒకటి. ఇందిరాగాంధీ పదవీకాలం పూర్తయి పోతుంది. కాబట్టి ఏం చేయాలి? లోక్‌సభ కాల పరిమితి ఐదేండ్ల నుంచి ఆరు ఏళ్లు అయింది. ఒక సర్పంచ్‌ ‌లేదా ఏదైనా ఎన్నికలప్పుడు పదవీకాలం పెంచాలంటే దానికి చాలా తతంగం ఉంటుంది. కానీ ఒక నియంతలా ఆమె వ్యవహరించారు. అసలు వారి ఎన్నికనే ఎవరూ సవాలు చేయకూడదని భావించారు. వీటిలో ఒక వ్యవస్థను నరికేసే ప్రయత్నం కనిపిస్తుంది.

ప్ర‌: సెక్యులరిజం అన్న భావనకు రాను రాను కొత్త భాష్యాలు, వక్రభాష్యాలు పెరిగిపోతున్నాయి. ఈ పదం ఆధారంగా ఇప్పుడు భారతదేశానికి కొత్త బెడదలు తయారవుతున్నాయి. చివరికి మెజారిటీ ప్రజలలో తమకు రక్షణ లేదన్న భావన కలిగిస్తోంది. ఎందుకు?

సెక్యులరిజమనేది నాట్‌ ఏ ‌లైసెన్స్ ‌టు ఎబ్యూస్‌ ‌ది మెజార్టీ కమ్యూనిటీ. సెక్యులరిజాన్ని ఎవరు దుర్వినియోగపరిచే ప్రయత్నం చేసినా ఆపడానికి మిగతా వారు ప్రయత్నం చేయాలి. దేనిమీదనైతే నిలబడ్డారో దాన్నే నరుకుతామంటే ఎలా? ఈ అభ్యుదయవాదులంతా ఉన్నారు గదా! వారు ఆదర్శంగా తీసుకుంటున్న ఆ వ్యవస్థలలో ఇలాంటి పోకడలకు వీలుందా? కమ్యూనిస్టులకి చైనా ఆదర్శం. ఉదారవాదం పేరుతో, సెక్యులరిజం పేరుతో ఇక్కడ వీళ్లు మాట్లాడుతున్న మాటలు ఆ వ్యవస్థలలో మాట్లాడితే వాడు మళ్లీ బతికి బయటపడగలడా? అట్లాగే వేరే మతాల పండితుల సంగతి కూడా ఇంతే. హిందూమతం, ఇక్కడి జీవన విధానం ఇచ్చిన స్వేచ్ఛతో వాళ్లు అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. హిజాబ్‌ ‌తీసుకోండి, ఇరాన్‌లో ఏమవుతోంది? ఇస్లాం సంప్రదాయం తిరుగులేని విధంగా ఉండే సౌది అరేబియాలో ఈ వివాదాలు లేవు. కానీ దాని గురించి ఈ మేధావులు మాట్లాడే తీరు ఏ విధంగా ఉంది? భారతదేశాన్ని తృణీకరించడం లేదా నిందించడం వాళ్లకి ఒక ఎజెండా. అది ఎక్కువ కాలం నిలువదు. ఈ మేధావివర్గ కుంచితత్త్వం రాను రాను బయట పడుతుంది. హీనాతిహీనమైన వ్యక్తులు వీరంతా. సెక్యులరిజాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే, మత ప్రసక్తి లేని రాజ్యం కాదు, సెక్యులరిజం పేరుతో మెజారిటీ మత ఆచారాలలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. శనిసింగనాపూర్‌, ‌శబరిమల ఆలయం వివాదాలు ఏమిటి? హిందూమతం ఇలాగే ఉండా లని ఎలాంటి సంబంధంలేని వాళ్లు పాఠాలు చెప్పే ప్రయత్నమే. క్రిప్టో క్రిస్టియన్స్ ‌కాన్సెప్ట్ ‌వచ్చింది. అంటే బయిటికి హిందూ మాదిరిగా కనిపిస్తాడు. కానీ అసలు లక్ష్యం హిందూత్వను తృణీకరించడం, నిందిం చడం. వాళ్ల ఈ అసహనానికి కారణం, మన అధిక సహనం. ఇదంతా చేసేది విదేశాలలో గుర్తింపు కోసం.

ఈ మొత్తం అవాంఛనీయ వాతావరణానికి బలి అవుతున్నది ఫెడరలిజం అనిపిస్తుంది.

ఫెడరలిజం ప్రస్థానం, భావనలను గమనించడం ప్రత్యేకమైన అనుభవం. అవసరం కూడా. కాంగ్రెస్‌పార్టీ బలహీనపడుతూ వచ్చిన క్రమంలో ఆ స్థానాన్ని ప్రాముఖ్యం, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆక్రమించారు. ఇదే అంతటా కనిపించకపోవచ్చు. ఆ వ్యక్తులు ఎంత పెద్ద నినాదాలు, ఆదర్శాలు వల్లించినా వాళ్లు తెచ్చిపెట్టింది కుటుంబ వ్యవస్థనే. కాంగ్రెస్‌ ‌కుటుంబ వ్యవస్థనే వాళ్లు మళ్లీ తెచ్చి పెట్టారు. ఉదాహరణకు ములాయంసింగ్‌. ఆయన సామాజిక మూలాలు బలమైనవి. ఆర్యసమాజానికి చెందినవాడాయన. తరువాత అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌వచ్చాడు. అతడు తండ్రి వారసత్వాన్ని తీసుకోలేక పోయాడు. వైఫల్యాలు మొదలయినాయి. ఇలాంటి సందర్భంలోనే మా సంస్కృతి వేరు, నా భాష వేరు, మా ప్రాంతం వేరు అంటూ నినాదాలు వస్తాయి. తమిళనాడు, బెంగాల్‌ ఎక్కడైనా కుటుంబ పార్టీలు ఉన్నప్పుడే ఫెడరలిజాన్ని ప్రశ్నార్థకం చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ మధ్యలో టీఆర్‌ఎస్‌ ‌కూడా వచ్చింది.

ప్ర‌: ఈశాన్య భారత రాష్ట్రాలు, ఫెడరలిజానికి అక్కడ ఎదురవుతున్న సవాళ్లని ఎలా చూస్తాం?

ఆ ప్రాంతాన్ని అసలు భారతదేశంలో భాగమని మన తొలితరం నాయకులు అనుకోలేదు. ఆ ప్రాంతాన్ని క్రైస్తవ మిషనరీలకి అప్పగించారు. మరొకరికి ప్రవేశం లేకుండా చేశారు. ఇప్పుడు మారిన పరిస్థితులలో వాళ్లు తామంతా భారత్‌లో అంతర్భాగమని బలంగా విశ్వసించడం శుభ పరిణామం.

ఇటీవల ఒక వార్త వచ్చింది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో హిందువులు మైనారిటీలు. ఉదాహరణకి లక్షద్వీప్‌. ‌కశ్మీర్‌ ‌కూడా. అలాంటి చోట హిందువులను మైనారిటీలుగా గుర్తించే విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అడిగింది. ఈ ప్రతిపాదనకు వెంటనే సమాధానం చెప్పలేమని, అది సున్నితమైన అంశమని కేంద్రం జవాబిచ్చింది. అసలు మైనారిటీ అనేది ఎంత రాశిని బట్టి నిర్ధారించాలి?

మెజారిటీ కానిది మైనారిటీ. సాంకేతికంగా చూస్తే 49 శాతం ఉన్నా మైనారిటీ కిందకే రావచ్చు. కానీ విషయం అది కాదు. మైనారిటీ, మెజారిటీ అన్నది కాదు. మతపరంగా నీ జనాభా ఎంతన్నదీ కాదు. దేశంపట్ల నీ దృక్పథం ఏమిటి? ఈ దేశం నాది అనుకోవడంలో నీవు ఎక్కడ ఉన్నావు? ఇది ప్రధానం. అందులో స్పష్టత ఉంటే ఇలాంటి చిక్కులు, ప్రశ్నలు రానేరావు. మిగతావారి సంగతి నాకు అనవసరం. నాకు మాత్రమే సకల సౌకర్యాలు ఉండాలి అన్న వాదన మొదలైతే మైనారిటీ, మెజారిటీ అన్న విభేదం తలెత్తుతుంది. వందమంది ఉన్నారు, యాభయ్‌ ‌రొట్టెలే ఉన్నాయి అనుకుందాం. విజ్ఞులు చెప్పేది- మొదట బలహీనులకీ, వృద్ధులకీ, స్త్రీలకీ, పిల్లలకీ ఇద్దామంటారు. అదీ కాకపోతే, అందరికీ సగం సగం. ఇందులో ఏదీ కాకుండా మేం వేరు, మాకే అంతా దక్కాలి అని ఎవరైనా అంటే అది ప్రపంచంలో ఎక్కడా చెల్లదు. కానీ అలాంటి వాదన కూడా ఇక్కడ చెల్లుబాటవుతోంది. అది ఒక్క భారతదేశంలోనే సాధ్యం కూడా. ఇది ప్రథమ ప్రధాని నెహ్రూ వంటివారి పుణ్యం.

మొన్నటికి మొన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏమన్నారు? ఇక్కడి ప్రతి రూపాయిలోను తొలి హక్కు ముస్లింలకేనట. ఇలాంటి పోకడ ఏమటి? దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? మెజారిటీలు ఏమై పోయినా, మైనారిటీలు మాత్రం సుఖంగా ఉండా లనా? ఇది వైవిధ్యం, భిన్న సంస్కృతుల సమ్మేళనం అనే చింతనకు వ్యతిరేకం కాదా? ఇక్కడే ఒక ప్రశ్న. ఇప్పుడు మైనారిటీలుగా చెప్పుకుంటున్నవాళ్లు కొన్నిచోట్ల మెజారిటీలు. అక్కడ మైనారిటీలను ఎలా చూస్తున్నారు? మైనారిటీ హోదా ఇస్తున్నారా? ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా?

ప్ర‌: కశ్మీర్‌లో హిందువులను మైనారిటీలని చెప్పడం లేదు కదా!

అక్కడనే కాదు. మైనారిటీల మీద దాడులు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ మైనారిటీలుగా గుర్తింపు ఉన్న వర్గాలే రాజ్యాలేలుతున్న ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మైనారిటీలను ఎలా చూస్తున్నారు? దేశంలో మీడియా ఒక అనుచిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. ముస్లింలలో విశాల దృక్పథంతో ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని వదిలి మీడియా షర్జిల్‌ ఇమామ్‌ ‌జపం చేస్తోంది. నీవు మైనారిటీవి కాబట్టి నీకు ఎలాంటి హక్కులూ లేవు అనే పరిస్థితి ఉంటే రక్షణ కల్పించవలసిందే. కానీ ఏ విషయంలో అయినా పౌరులందరితో సమంగా హక్కులూ, అవకాశాలూ ఉన్నప్పుడు ఆ మైనారిటీ పేరుతో చలామణి కావాలని ఎందుకు అనుకోవాలి? అందరితో పాటు మైనారిటీ లనీ సమానంగా చూస్తున్నారు. అయినా నాకే సమస్తం కావాలని కాలు దువ్వితే, మాకు సరైన వాటా దక్కడం లేదని వాదిస్తే అది దుర్మార్గమే.

మొద‌టి భాగం : ‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’ 

జాగృతి సౌజ‌న్యంతో…