Home Telugu Articles సార్వజనీనం ‘గీతా’ మకరందం

సార్వజనీనం ‘గీతా’ మకరందం

0
SHARE

-డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

డిసెంబర్‌ 23 ‘గీతా’ జయంతి

విశ్వమానవాళి అభ్యుదయాన్ని కాంక్షించిన శ్రీకృష్ణుడు సర్వశాస్త్రసారంగా ‘గీతా’మృతాన్ని పంచి, జ్ఞానసిరులను అనుగ్రహించాడు. ‘జీవితమంటేనే నిరంతర సమరం. జీవితంలో కానీ యుద్ధంలో కానీ పురోగమనమే తప్ప పలాయనం చిత్తగించడం, నిష్క్రమించడం, అచేతునులుగా వ్యవహరించడం ధీరుల లక్షణం కాదు. విజయం, శాంతిసౌఖ్యాల కోసం పోరు అనివార్యం. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ప్రత్యేకతలు, శక్తియుక్తులు ఉంటాయి. వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనసులోని అల్లకల్లోలాను నివారించి, కర్తవ్యపరాయ ణులు కావాలి’ అన్నది గీతాచార్యుని దివ్యోపదేశం. కాగా, మనిషి మనీషిగా మారే వైనం చెప్పే ‘జ్ఞాన’గీత శ్రవణాన్ని శవ జాగారానికో, శవయాత్రకో పరిమితం చేయడం శోచనీయం. ఇది ‘శోభ’ గీతే కాని ‘శోక’ గీత కాదు, కారాదు అని నిరూపించేందుకు కంకణబద్ధులు కావడమే ‘గీతా జయంతి’కి ఇచ్చే నిజమైన గౌరవం.

భగవద్గీత సాక్షాత్తు భగవద్వాణి. అద్భుత విజయం, ఐశ్వర్యం, అసాధారణ శక్తి, నీతిని ప్రసాదించేందుకే దీని ఆవిర్భావం అని తెలిస్తే ‘గీత’పట్ల అమోఘ, అపూర్వాభిమానం కలుగుతుంది. అర్జునుడి అంతటి పరాక్రమవంతుడు ‘విజయం వద్దు.. రాజ్యసుఖమూ వద్దు’ అని అస్త్ర సన్యాసానికి సిద్ధపడినప్పుడు భగవానుడు కర్తవ్యబోధ చేశాడు. గీతోపదేశంతో అర్జునుడు ప్రబుద్ధుడై ‘విజయుడు’ అయ్యాడు. భగవద్గీతను శ్రద్ధగా విని ఆచరిస్తే మోహాంధకారాన్ని (మోహం అంటే చేయవలసిన పనిని మరచి ఇతర ఆలోచనలో పడడం) వీడి నిశ్చయంగా సత్ఫలితాలు సాధిస్తారని భావం. అన్ని స్థాయిలు, అన్ని వర్గాల వారికి ‘మోహం’ సూత్రం వర్తించవచ్చు. ఉదాహరణకు, విద్యార్థిలోకాన్నే తీసుకుంటే వారిలో కొంత శాతమైనా చదువుకు బదులు వేరే కలాపాలకు లోనుకావడం మోహం లాంటిదే అవుతుంది. గీతోపదేశం ద్వారా అర్జునుడికి కర్తవ్యం స్ఫురించినట్లే గీతాభ్యాసం/శ్రవణంతో వర్తమానంలో పాలకుల నుంచి పాలితుల దాకా తమ తమ తక్షణ కర్తవ్యాలు గుర్తుకు రాకమానవు.

‘గీత’ ఆవిర్భావం..

శ్రీమత్‌ మహాభారత అంతర్గతమైన భగవద్గీత సకల మానవాళికి నిత్య పఠనీయ గ్రంథం. నరనారాయణుల మధ్య సంవాద రూపంలో అనేక విషయాలను ప్రబోధిం చిన ఈ అష్టాదశాధ్యాయనిలోని ప్రతి అంశం మానవ జీవనానికి ఉపకరించేదే.

‘సర్వశాస్త్రమయీ గీతా సర్వదేవ మయోహరిః
సర్వతీర్థమయీ గంగా సర్వ వేదమయో మనుః’

మనువు సర్వవేదమైనట్లు, గంగ సకలతీర్థరూపిణి అయినట్లు, శ్రీహరి సర్వదేవ మయుడైనట్లు భగవద్గీత సర్వ శాస్త్రమయం. ఇది సార్వకాలీనం, సార్వజనీనం. జ్ఞానపరిణతిని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా బోధపడే నిత్యనూతన గ్రంథం. ఈ అష్టాదశాధ్యాయినికి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, వేదత్రయి, పర, అనంత, త్రిసంధ్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, ముక్తిగేహిని, అర్థమాత్ర, చిదానంద, భవఘ్న, భయనాశిని, తత్త్వార్థ జ్ఞానమంజరి అని పద్దెనిమిది పేర్లున్నాయి. భగవానుడైన శ్రీకృష్ణుడు ఉపదేశించాడు కనుక ‘భగవద్గీత’, పరబ్రహ్మను తెలిపే విద్య కనుక ‘బ్రహ్మవిద్య’ అని, వేదాంతాలను సంగ్రహించిన చెప్పినందున ‘ఉపనిషత్సారం’అంటారు.

‘న కాంక్షే విజయం కృష్ణ
న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింన్ద

కిం భోగై ర్జీవితేన వా’ (విజయం వద్దు, రాజ్య సుఖమూ వద్దు) అని అర్జునుడు కదనరంగంలో బంధుప్రీతి, బేలతనంతో అస్త్రసన్యాసం చేసిన క్షణంలో (మార్గశిర శుద్ధ ఏకాదశి) ఈ మహోత్కృష్ట గ్రంథం ప్రభవించింది. భగవంతుడు ముఖత: ఉపదేశించిన పుణ్యదినమే గీతాజయంతి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఒక గ్రంథం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ‘గీత’కే చెల్లింది. ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంథమే కాదు. వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు సాధనం. లక్ష్యసాధకులకు మార్గదర్శి. ప్రపంచ భాషలన్నిటిలోకి అనువదితమైన దీనిపై వందలకొద్దీ భాష్యాలు వచ్చాయి. గీతాధ్యయనం, గీత ఆదేశానుసారం జీవితాన్ని కొనసాగించే వారికి విజయాలు సొంతమవుతాయని అనుభజ్ఞులు చెబుతారు.

అర్జునుడికే ఎందుకు?

భీష్మద్రోణాది ఉద్ధండులు ఎందరో ఉండగా భగవానుడు అర్జునుడికే ఎందుకు గీతాబోధ చేశాడు? లాంటి సందేహాలకు విజ్ఞులు, పండితులు, విద్యావేత్తలు చక్కటి వివరణలు ఇచ్చారు. యుద్ధ విముఖుడైన అర్జునుడిని యుద్ధానికి సిద్ధం చేయడం అందుకు కారణంగా కనిపించినప్పటికీ, తరచి చూస్తే ఎన్నో విశేషాలు అవగతమవుతాయి. ‘పాండవానాం ధనం జయః’ (పాండవులలో అర్జునుడను) అని శ్రీకృష్ణుడే చెప్పుకున్నాడు. పైగా వారిద్దరు నరనారాయణులు. అర్జునుడు అనేక దేవతల మెప్పు పొంది అస్త్ర శస్త్రాదులతో పాటు పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సాధించాడు.

భగవానుడికి బాల్యంలో సఖుడు, అనంతరం భక్తుడు. ఈ రెండిరటిని పరిగణలోకి తీసుకుని ‘రహస్యమైన ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించాను’ అన్నాడు భగవానుడు. అంటే నరుడి భక్తితత్వమే నారాయణుడి ప్రియత్వానికి హేతువైందని పండిత వాక్కు. వారిద్దరు కురుక్షేత్రం నాటికే ఆత్మబంధువు లైనా, కర్తవ్యాకర్తవ్యాల గురించి పార్థుడికి సందేహాలు రాలేదు, పార్థసారధికి వాటిని తీర్చవలసిన ఆస్కారం కలగలేదని, రణరంగంలో వైరాగ్య ప్రపూరితమైన అర్జునుడికి జ్ఞానబోధకు తగిన సమయంగా భావించిన పరమాత్మ తన ధర్మాన్ని నిర్వర్తించారని చెబుతారు. భగవానుడు అర్జునుడిని సాకుగా పెట్టుకుని, కురుక్షేత్ర సంగ్రామాన్ని కారణంగా ఎంచుకుని సమస్త మానవులు కర్మ జ్ఞాన భక్తి యోగాలు, పరమ విజయాలు పొందేందుకు భగవద్గీతోపదేశం చేశారని పెద్దలు అంటారు.

వ్యక్తిత్వ వికాసిని

మానవ జీవన గమనంలో అడుగడుగునా భయాందోళనలే. ఏదైనా కార్యం ఆరంభించే ముందు అది సరైనదేనా? అనే భయం… ప్రారంభించిన తరువాత సజావుగా సాగుతుందో? లేదో! అనే అనుమానం. పూర్తయ్యాక ఫలితంపై శంక. ఇక మృత్యుభయం ఉండనే ఉంటుంది. ఇలాంటి ఎన్నో అంశాల పట్ల మనిషిని జాగృత పరిచేదే భగవద్గీత. ‘ధర్మవిహితమైన కర్తవ్య పాలనలో ఊగిసలాట పనికిరాదు. కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందే. నిష్కామ కర్మకు అంతిమ విజయం తథ్యం. ధర్మబద్ధంగా, భగవదర్పితంగా నిర్వహిస్తే అది పాపనాశనమై తుదకు మోక్షసాధకం అవుతుంది’ అని గీతాచార్యుడు చెప్పారు. ‘ధర్మంగా కర్తవ్యాన్ని నిర్వర్తించు’ అని భగవానుడి సందేశం పార్ధుడికే కాదు, సర్వ మానవాళికి వర్తిస్తుంది.

ఒక పనిని చేయబూనడానికి కానీ, నిరాకరిం చడం కానీ విధి లేదా ప్రకృతికి లోబడి ఉంటుంది తప్ప మనిషి చేతిలో లేదని భగవద్గీత చెబుతోంది. ‘అర్జునా! నీవు చేయబోతున్న యుద్ధంలో నీవు చంపుతున్నావని, వైరి పక్షంలోని వారు చావబోతున్నా రని అనుకోవడం భ్రమ. నీవు నిమిత్తమాత్రుడివి మాత్రమే. యుద్ధం చేయడమే నీ ధర్మం. అలా చేయకున్నా వారిలో బతికేవారు ఎవరూ లేదు. ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు’ అన్న భగవానుడి మాటలు వేదాంతంలా అనిపించవచ్చు. శ్రద్ధగా పరిశీలిస్తే… ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వ హిస్తూ పోవాలని, జననమరణాలు, జయాపజయాలు సహజ పరిణామాలని బోధపడి, చింత, శోకం లాంటి భావోద్వేగాలు దూరమై ప్రశాంత జీవనానికి ఆస్కారం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటారు.

జ్ఞానసముపార్జన, కర్తవ్యపరాయణత, జీవన సంవిధానం, అద్భుత విజయం, ఐశ్వర్యం, అసాధారణ శక్తి, నీతిని ప్రసాదించడం లాంటి వాటివి ‘గీత’ సహా పురాణేతిహాసాల పరమ లక్ష్యం. అయినప్పటికి ‘ఫలశ్రుతి’ పట్ల ఆసక్తి మానవనైజం. ఆ కోణంలోనే కావచ్చు, ‘గీత’లోని ఒక్కొక్క అధ్యాయ పారాయణం వల్ల కలిగే అమోఘ ఫలితం గురించి పద్మపురాణంలోని కథలు చెబుతున్నాయి. భగవద్గీత లోని కనీసం ఒక్క శ్లోక సారాంశాన్నయినా అర్థం చేసుకుని ఆచరించగలిగితే మోక్షసాధనకు వీలుంటుందని ‘గీత’కు మొదటగా భాష్యం రాసిన శ్రీశంకర భగవత్పాదులు పేర్కొన్నారు. ‘భగవద్గీతా కించిదధీతా గంగాజల కణికా పీతా’ (గీతా శ్లోకం ఒక్కటి పారాయణం చేసినా గంగ జలం తాగినంత పుణ్యం వస్తుంది) అని, ‘భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్నైనా గురుముఖతః అధ్యయనం చేసినవారు ధన్యులు’ లని ఆయనే అన్నారు. ఎందరో మహామహులు లెక్కకు మిక్కిలిగా వెలువరించిన వ్యాఖ్యానాలను చదివి జీర్ణించుకొనే తీరిక, ఓపిక, శక్తిసామర్ధ్యాలు లేనివారు మొదటి, చివరి శ్లోకాలను జాగ్రత్తగా చదివితే గీతాసారం ఒంటబడుతుందని చెబుతారు.

మానవాళికి కలిగే అనేకానేక సంశయాలను నివృత్తి చేసే ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీత. నిరాశా నిస్పృహలు, నిస్తేజం, నిస్సత్తువ లాంటివి ఆవరించి నప్పుడు గీతాసందేశం మార్గదర్శిగా నిలుస్తుందని వివేకానంద, మహాత్మాగాంధీ లాంటి ఎందరో మహనీయులు అనుభవపూర్వకంగా చెప్పారు.

‘ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతమ్‌
ఏకోదేవో దేవకీ పుత్ర ఏవ
ఏకో మంత్రస్య నామానియాని

కర్మాప్యేకం తస్య దేవస్య సేవా’ (గీతాశాస్త్రమే ఏకైక శాస్త్రం, దేవకీనందనుడు శ్రీకృష్ణుడే ఏకైక దైవం, ఆయన నామాలు దివ్యమంత్రాలు, ఆయన సేవే సత్కర్మయుక్త ఏకైక సేవ) అని ఆర్యోక్తి. ‘సృష్టిలో పరిణామం, మార్పులు అనివార్యం. ఏది ఆదిలో ఉన్నట్లు అంతంలో ఉండదు. జీవితం పరిమిత కాలం. నియమిత కాలంలో చేయగలిగే మంచిపనులే అపరిమిత తృప్తిని ఇవ్వగలుగుతాయి. తద్వారా జన్మ సార్థకమవుతుంది. ఈ జీవన సత్యమే భగవద్గీత పరమోపదేశం.

జాగృతి సౌజ‌న్యంలో… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here