Home Rashtriya Swayamsevak Sangh గోవా స్వాతంత్రోద్యమ చరిత్ర

గోవా స్వాతంత్రోద్యమ చరిత్ర

0
SHARE

-ప్రదక్షిణ

గోవా విమోచన దినం- 19 డిసెంబర్ 1961

వేలాదిమంది ఉద్యమకారులు పోర్చుగీస్ ప్రభుత్వంతో చేసిన ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్ర్య సంఘర్షణ ఫలితంగా గోవా విమోచనం 1961లో జరిగింది. ఇది వినడానికి వింతగా అనిపించినా, భారత దేశానికంతా ఒకేసారి 1947లో స్వాతంత్ర్యం రాలేదనే విషయం, ఇప్పటి భారత ప్రజలకే తెలియదు. గోవా, దమన్ మరియు దీయు ప్రాంతం పోర్చుగీస్ పాలనలో 1961దాకా ఉండగా; పాండిచ్చేరి, మాహే, యానం నగరాలు ఫ్రెంచ్ ప్రభుత్వం క్రింద 1954 వరకు ఉన్నాయని తెలిస్తే ఆశర్యపోతాము.  

గోవా విమోచనోద్యమం 20వ శతాబ్దపు తొలి దశకంలో ప్రారంభమైనా, అది ఊపు అందుకోడానికి చాలా కాలమే పట్టింది.

లూయిస్ బ్రగాంకా 1917లో పోర్చుగీస్ దినపత్రికను, ఆ ప్రాంత విమోచన కోసం రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించగా, పోర్చుగీస్ ప్రభుత్వం అన్ని స్వతంత్ర పత్రికలను, ప్రచురణాలయాలను బలవంతంగా మూసివేసి ప్రజలకు పౌరహక్కులు లేకుండా చేసింది. పోర్చుగీస్ కాథలిక్ చర్చ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, వారు శతాబ్దాలుగా సాగిస్తున్న దమన రాజకీయాలను కొనసాగిస్తూ, క్రిస్టియన్లు పోర్చుగీస్ రాజ్యంలో ఉండాలని, భారత్ తో వారికి ఎలాంటి సంబంధం ఉండకూడదని చర్చిల్లో బోధిస్తుండేవారు. 

1928 లో `ట్రిస్టూ బ్రగాంకా కున్హా’, గోవా కాంగ్రెస్ స్థాపించి, దానిని అఖిల భారత కాంగ్రెస్ కి అనుబంధంగా చేసినప్పటికీ, పోర్చుగీస్ ప్రభుత్వ ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది, 1938లో బొంబాయి నగరంలో గోవా కాంగ్రెస్ ప్రారంభమైంది. 1940లలో భారతదేశం యావత్తు స్వాతంత్ర్య కాంక్షతో రగులుతుండగా, గోవాలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి, అయితే పోర్చుగీస్ ప్రభుత్వం వాటిని నిరంకుశంగా అణిచివేసింది. 1946లో `కున్హా’ని నిర్బంధించగా, ఎ.జి తెoడుల్కర్ గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు అయారు. డా. రాంమనోహర్ లోహియా, ఆయన మిత్రుడు అయిన గోవా నాయకుడు డా.మెనెజెస్ 1946లో సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించగా, వారిద్దరినీ అరెస్ట్ చేసి తరువాత విడుదల చేసారు. ఆ సమయంలో వేలాదిమందిని జైల్లో పెట్టారు. బ్రగాంకా కున్హా, పురుషోత్తం కాకోడ్కర్, లక్ష్మీకాంత్ భెమ్బ్రే మొదలైన నాయకులను లిస్బన్ తరలించి అక్కడ జైల్లో నిర్బంధించారు. ఆ తరువాత ఉద్యమాలు ఎన్ని జరిగినా, పోర్చుగీస్ ప్రభుత్వం అందరు నాయకులను జైల్లో పెట్టింది e persoDaksha,  e. గాంధీగారి సలహాతో అక్కడి కార్యకర్తలు `క్విట్ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంబించారు. 1947లో తమతో సహా భారతదేశమంతటా స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని గోవా ఉద్యమ నాయకత్వం నమ్మింది. అయితే అనూహ్యంగా డా. లోహియా గోవా ప్రజలు తమ స్వాతంత్ర్య ఉద్యమాన్ని కొనసాగించాల్సి ఉంటుందని ప్రకటించారు. కొందరు స్థానిక నాయకులు గోవాని స్వయంప్రతిపత్తి కల దేశంగా పోర్చుగీస్ కామన్వెల్త్’లో ఉంచాలని కోరారు. 

గోవాలో స్వాతంత్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతూ కీలక దశకు చేరింది. ఆ కాలంలో `ఆజాద్ గోమంతక్ దళ్’ నాయకులు విశ్వనాథ్ లావండే, నారాయణ్ హరినాయక్, దత్తాత్రేయ దేశపాండే, ప్రభాకర్ శినారి మొదలైన వారు పోలీస్ స్టేషన్లపై దాడి చేసి, పోర్చుగీస్, అంగోలా జైళ్లలో బంధింపబడ్డారు. శివాజీరావు దేశాయి స్థాపించిన `గోవా లిబరేషన్ ఆర్మీ’ ఒక ప్రభుత్వ గనిని పేల్చేసింది. శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న పిడి గైతోండే వంటి ఎందరో నాయకులు 1954లో జైలు పాలయారు.  

మొట్టమొదటిసారి 1955లో పణజీ సచివాలయంపై, భారత త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఘనత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేత శ్రీజగన్నాథ్ రావు జోషికి చెందుతుంది; ఇతర పార్టీలతో కలిసి సత్యాగ్రహం చేస్తున్న వేలాదిమంది స్వయంసేవకులు, జనసంఘ్ కార్యకర్తలు అరెస్ట్ అయారు. ఎందరో కాల్పులకి గురై అమరులయారు; కొందరు పోర్చుగీస్ జైళ్లలో ఎన్నెన్నో సంవత్సరాల నరకయాతన అనుభవించారు. 1961లో గోవా విమోచన తరువాత కూడా శ్రీ జగన్నాథ్ జోషి విడుదల అవక, 17సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. అట్లాగే డా. గైతోండే, శ్రీయుత్ దేశపాండేలను కూడా  పోర్చుగీస్ తరలించి అక్కడి జైళ్లలో బంధించారు.

1954–55 తరువాత ఉద్యమం మరింత ముమ్మరoగా సాగింది.  1955లో పోర్చుగీస్ ప్రభుత్వం సత్యాగ్రహులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపగా ఎందరో ప్రాణత్యాగం చేసారు. ఉజ్జయినికి చెందిన స్వయంసేవకుడు శ్రీ రాజాభావ్ మహంకాళ్ అక్కడినుంచి వేలాది కార్యకర్తలతో గోవాలో ప్రవేశించి సత్యాగ్ర్రహం చేసారు.  మొదటి మూడు వరుసల సత్యాగ్రహులు నేలకి ఒరగగా, సహోదరా దేవి అనే మహిళా కార్యకర్త, జాతీయజెండా అందుకుని ముందుకి వెళ్ళగా, ఆమె కూడా దెబ్బలకి ఒరిగిపోయింది. అప్పుడు శ్రీ రాజాభావ్ ఆమెనుంచి జెండా అందుకుని ముందుకి ఉరికి, ఇతర కార్యకర్తలకి అప్పగించి జెండా ఎగురవేసేలా చూసారు. ఆయన కళ్ళల్లో బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలి అమరులయారు.

భారత ప్రభుత్వ వైఖరి

డిసెంబర్1947లో స్వతంత్ర భారతదేశం, నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు, పోర్చుగీస్ దేశంతో దౌత్య సంబంధాలు ఏర్పరచి, గోవాని భారతదేశంలో విలీనం చేయాలని కోరారు, అయితే దానికి పోర్చుగీస్ అంగీకరించలేదు. (అలాగే పాండిచేరి విలీనంపై ఫ్రాన్స్ అంగీకరించలేదు). 1950 దశకంలో, భారత- పోర్చుగీస్ సంబంధాలు బలహీనమై, భారత ప్రభుత్వం `ఐక్యరాజ్యసమితి’ ద్వారా ఒత్తిడి తేవాలని కొంత ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు గోవాలోని స్వాతంత్ర్య పోరాటానికి, భారత ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం అందలేదు. భారతీయ కార్యకర్తలు, పోర్చుగీస్ రాజ్యంలోకి ప్రవేశించి, వారి సార్వభౌమత్వాన్ని వమ్ము చేస్తున్నారని, పోర్చుగీస్ అంతర్జాతీయంగా ఒత్తిడి తేవడంతో, ప్రధాని నెహ్రూ సత్యాగ్రహుల చర్యలకు ప్రభుత్వ ఆమోదం లేదని ప్రకటన కూడా చేసారు.  

నెహ్రూ ప్రకటనతో గోవా స్వాతంత్ర్య ఉద్యమం తీవ్రంగా దెబ్బతింది. 1954లో కొందరు సత్యాగ్రహులు, ముందు దాద్రా, ఆ తరువాత నాగర్-హవేలీలలో, పోర్చుగీస్ సైన్యంపై దాడి చేసి పోరాడి గెలిచి, ఆ ప్రాంతాలకు విముక్తి కలిగించారు. (దీనిపై పోర్చుగీస్ `అంతర్జాతీయ న్యాయస్థానం’ లో కేసు కూడా వేసింది, అయితే అది ఎటూ తేలలేదు). అయినా భారత ప్రభుత్వం ఈ ప్రాంతాలను, దేశంలో విలీనం చేయలేదు; అవి చాలా కాలం `వరిష్ట పంచాయత్’ పేరుతో స్వతంత్రంగా కొనసాగాయి.  అయితే గోవాలోని ఉద్యమం ఈ విజయంతో బలం పుంజుకుంది. ఆరు స్థానిక పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి, స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతం చేసాయి. చివరికి డిసెంబర్1961లో, గోవాలో జరుగుతున్న ఉద్యమం, దాని అణచివేతను ఇకపై చూస్తూ ఊరుకోము అని ప్రధాని నెహ్రూ హెచ్చరించారు. భారత సైన్యం గోవా సరిహద్దుల చుట్టూ మొహరించబడింది. 18-19డిసెంబర్1961లో అతి సునాయాసంగా పోర్చుగీస్ సైన్యం లొంగిపోగా, పోర్చుగల్ `లొంగుబాటు ఒప్పందం’పై సంతకం చేసింది. 1963లో గోవాని భారతదేశంలో విలీనం చేస్తూ భారత పార్లమెంట్ తీర్మానించింది. గోవా, దామన్, దీయు  కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబడింది. దాద్రా నగర్-హవేలీ వేరొక  కేంద్రపాలిత ప్రాంతం అయింది. 1987లో గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇటీవలే అంటే డిసెంబర్ 2019లో దామన్, దీయు, దాద్రా నగర్-హవేలీలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా పార్లమెంట్ ఆమోదించింది.

ఆధారం: https://arisebharat.com; వికీపీడియా