Home News ఘోరం మల్లన్నా.. ఘోరం! కబేళాలకు తరలుతున్న కొమురవెల్లి మల్లన్న కోడెలు

ఘోరం మల్లన్నా.. ఘోరం! కబేళాలకు తరలుతున్న కొమురవెల్లి మల్లన్న కోడెలు

0
SHARE

– వేలం నిర్వహించి కబేళా ఏజెంట్లకు అమ్మేస్తున్న ఆలయ అధికారులు

– రెండు మూడు నెలలకోసారి విక్రయం

– సిండికేట్‌గా మారి కొంటున్న బేరగాళ్లు

– అక్కడ్నుంచి లారీల ద్వారా హైదరాబాద్‌లోని కబేళాలకు తరలింపు

– భక్తితో సమర్పించిన కోడెల్ని కోతకు పంపడంపై భక్తుల ఆగ్రహావేశాలు

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. భక్త జనుల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్నకు కోడె కడితే కోరుకున్న కొడుకు పుడతాడట! కొండరాళ్ల నడుమ పుట్ట మన్నుతో రూపం పోసుకున్న ఆ మల్లికార్జునుడికి తిరుగుడు కోడెను ఇస్తే కోరిన కోరిక తీరుతుందట!! ఈ విశ్వాసంతో భక్తులు మొక్కుబడి కింద కోడెలు, దూడలను మల్లన్నకు సమర్పించుకుంటారు. కానీ ఆ భక్త వత్సలుడి మూగజీవాలు కబేళాలకు తరలిపోతున్నాయి.

పశు పోషణ భారం నుంచి తప్పించుకునేందుకు ఆలయ అధికారులే వాటిని కబేళాల ఏజెంట్లకు అప్పగిస్తున్నారు. నెలనెలా పదుల సంఖ్యలో వస్తున్న పశువులను ఎప్పటికప్పుడు వేలం వేసి వారికి ఇచ్చేస్తున్నారు. ఓ అజ్ఞాత భక్తుడు ‘సాక్షి’కి చేరవేసిన సమాచారంతో కూపీ లాగగా… మల్లన్న లేగదూడలు గత కొన్నేళ్లుగా కోతకు, కబేళాలకు తరలిపోతున్నట్లు తేలింది.

రెండు మూడు నెలలకోసారి వేలం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొలువైన మల్లన్నకు లేగ దూడలు, కోడెలు అంటే చాలా ఇష్టం. సంతానం లేని దంపతులు, దారిద్య్రంతో బాధపడుతున్న భక్తులు కోనేటిలో తడిబట్ట స్నానం చేసి ఆలయం ముందు ఒళ్లు బండ వద్ద మల్లన్న దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. కోరుకున్న కోరిక తీరగానే మల్లన్నకు ఇష్టమైన కోడెలను కట్టి మొక్కు తీర్చుకుంటారు. ఇలా ప్రతినెలా పదుల సంఖ్యలో కోడెలు, దూడలను భక్తులు స్వామివారికి మొక్కులుగా చెల్లిస్తున్నారు. ఈ మూగజీవాలను పోషించడం వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం అన్న కారణంతో ఆలయ అధికారులు ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి వేలం పాటలు నిర్వహించి వాటిని విక్రయిస్తున్నారు.

మూడేళ్లుగా కోతకే..

గడిచిన మూడేళ్లుగా ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెల వివరాల నివేదికలను, ఆలయ అధికారులు వేలం వేసిన రికార్డులను ‘సాక్షి’పరిశీలించింది. 2014లో ఐదుసార్లు, 2015లో ఆరుసార్లు, 2016 ఐదు పర్యాయాల చొప్పున పశువులను వేలం వేసినట్టు రికార్డుల్లో ఉంది. అన్నిసార్లు జరిగిన వేలం పాటల్లోనూ కేవలం ఆరు నుంచి ఏడుగురే పాల్గొని పశువులు దక్కించుకున్నట్టు తేలింది. చిరునామాల ఆధారంగా ‘సాక్షి’వారి వివరాలను సేకరించింది. చేర్యాల మండలం నర్సాయపల్లి, వేచరేణి గ్రామాలకు చెందిన ముగ్గురు సభ్యుల చొప్పున ఉన్న రెండు సిండికేటు బేరగాళ్లను గుర్తించి వారితో మాట్లాడింది. దీనిపై వారిని కదిలించగా.. ‘‘వేలం పాటలు వేసే ముందు దేవాలయం అధికారుల నుంచి మాకు ఫోన్‌ వస్తుంది. వేలంలో పశువులు తీసుకుంటాం. వాటిని ఎక్కువ రోజులు మా దగ్గర ఉంచుకోం. కొంత లాభం చూసుకొని అమ్ముకుంటాం. పశువులు కోతకు పోతాయి. చేర్యాల, సిద్దిపేట అంగడికి తీసుకపోతాం. అక్కడికి హైదరాబాద్‌ ఏజెంట్లు వచ్చి లారీల్లో తీసుకుపోతారు’’అని చెప్పారు.

బాబుమియానే సాక్ష్యం…

కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన ఓ బేరగాడు రూ.3,400, రూ.2,400, రూ.3,200, రూ.2,700, రూ.3,900, రూ.3,800, రూ.16,200 చొప్పున 7 కోడెలను వేలం పాటలో కొనుగోలు చేశాడు. పశువుల వ్యాపారం చేసే ఆయన్ను ప్రశ్నించగా.. ‘‘బతకడానికి ఏదో పనిచేసుకోవాలే కదా. కొమురవెల్లి దేవుడికి మొక్కులు తీర్చేటోళ్లు అప్పగించే లేగలు, దూడలను వేలం పాటలో కొంటా.. కమీషన్‌ మీద కబేళాకు విక్రయిస్తా.. వాటిపై వచ్చే కొద్దిపాటి పైసలతో ఇళ్లు గడుస్తుంది. కొమురవెల్లి దేవస్థానం నుంచి బాగా తెలిసినోళ్లు వేలంపాట అప్పుడు నాకు ఫోన్‌ చేస్తరు. వెంటనే పోయి పాటలో పాల్గొని అన్నింటినీ కొనుక్కుంటా. ఒక్కొక్కసారి తక్‌పట్టీలు(రశీదులు) ఇత్తరు.. ఒక్కోసారి ఇయ్యరు..’’అని ఆయన చెప్పాడు.

దేవాలయం నుంచి కబేళా దాకా..

ఈ ఏడాది నవంబర్‌ 25న ఆలయ అధికారులు పశువుల వేలం నిర్వహించారు. ఇద్దరు సిండికేటు బేరగాళ్లు రూ.6,300, రూ.6,000, రూ.1,400, రూ.3,600, రూ.19,000, రూ.7,000, రూ.5,000 చొప్పున ఏడు కోడెలను కొనుగోలు చేశారు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన ఫొటో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆ కోడెలను వాళ్లు డిసెంబర్‌ 2న నేరుగా హుస్నాబాద్‌ అంగడికి తోలుకెళ్లారు. అంగట్లో కబేళా ఏజెంట్లకు విక్రయించారు. వారు అక్కడ్నుంచి వాటిని లారీలో కుక్కి హైదరాబాద్‌ వైపు తీసుకెళ్లారు. అంతకుముందు జరిగిన వేలం పాటలో (సెప్టెంబర్‌ 3న) చేర్యాలకు చెందిన మరో వ్యక్తి రూ.5 వేల చొప్పున రెండు, రూ.23,000, రూ.1,800, రూ.1,000 చొప్పున మొత్తం ఐదు కోడెలను కొనుగోలు చేశారు. వాటిని ఆయన వారానికి ఒకటి చొప్పున కోత కోసి మాంసం విక్రయిస్తున్నాడు. ఎంతో భక్తిశ్రద్ధలతో మల్లన్నకు మొక్కుగా చెల్లించిన కోడెలను కబేళాలకు తరలించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-వర్దెల్లి వెంకటేశ్వర్లు

(సాక్షి సౌజన్యంతో )