Home Telugu Articles కార్యశీలి, దార్శనికుడు.. దత్తోపంత్ జీ                                     

కార్యశీలి, దార్శనికుడు.. దత్తోపంత్ జీ                                     

0
SHARE

– డా. మన్మోహన్ వైద్య

దత్తోపంత్ ఠేంగ్డేజీ భారతీయ మజ్దూర్ సంఘ్ ను స్థాపించిన కాలానికి ప్రపంచమంతటా కమ్యూనిజం ప్రభావం బాగా ఉంది. అలాంటి సమయంలో నూటికినూరుపాళ్లు భారతీయ చింతన ఆధారంగా కార్మిక ఉద్యమాన్ని ప్రారంభించడం, అనేక అవరోధాలను ఎదుర్కొంటూ దానిని బలోపేతం చేయడం చాలా కఠినమైన, కష్టమైన పని. అచంచలమైన విశ్వాసం, అకుంఠితమైన శ్రద్ధ, అలుపెరుగని పరిశ్రమ లేకపోతే ఆ కార్యం సాధ్యపడేది కాదు. ఆ సమయంలో వారి ఆలోచనలు, మనస్థితి ఎలా ఉండేవో తెలియజేసేందుకు తగిన ఒక కధ గుర్తుకు వస్తోంది –

అప్పటికి ఇంకా వసంతకాలం ప్రారంభం కాలేదు. మామిడి పూత ఇంకా రానేలేదు. చలి గాలిని సహిస్తూ కలుగులోంచి ఒక జంతువు బయటకు వచ్చింది. ఇలాంటి చలిలో బయటకు వెళ్లవద్దని, అలా వెళితే చావు కొనితెచ్చుకోవడమేనని మిగతా జంతువులు చెప్పాయి. అయినా అది ఎవరి మాట వినలేదు. చాలా కష్టపడుతూ మామిడి చెట్టు ఎక్కడం ప్రారంభించింది. చెట్టు కొమ్మమీద ఉన్న ఒక చిలక దానిని చూసింది. కిందకు చూస్తూ అది ఇలా అడిగింది ‘’అరే ఇంత చలిలో ఎక్కడికి బయలుదేరావు?’’ ‘’మామిడి పండు తినడానికి’’అని ఆ జంతువు జవాబిచ్చింది. ఆ సమాధానం విన్న చిలుక నవ్వడం ప్రారంభించింది. ‘’ఓరి మూర్ఖుడా! ఈ చెట్టు మీద ఎక్కడా పూత లేనేలేదు’’ అన్నది. ‘’నీకు ఇప్పుడు పూత ఏమి కనిపించకపోవచ్చును. కానీ ఈ చెట్టు పూసి, కాయలు కాసే సమయానికి నేను పైకి ఎక్కుతాను’’ అన్నది ఆ జంతువు. ఆ సమాధానంలో ఒక సాధకుడి దృష్టి, ఆలోచన కనిపిస్తాయి. ఆ చెట్టు ఎక్కడంలో తాను పడే కష్టం, ఇబ్బందులకు ఆ జంతువును భయపడలేదు. తాను అనుకున్నది నెరవేరుతుందనే ఆశ, సూచనలు అప్పటికి ఏమాత్రం కనిపించకపోయినా లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శ్రద్ధ మాత్రం దానిలో ఉన్నాయి. తన ఒక్కో అడుగు వేస్తూ పైకి చేరేసరికి పళ్ళు కూడా పండుతాయనే నమ్మకం పూర్తిగా ఉంది. పైన కూర్చున్నా చిలుక ఏమి చెప్పినా, ఏమన్నా పట్టించుకోలేదు. దాని మనస్సులో ఒకే ఆలోచన ‘హరిని అంటిపెట్టుకుని ఉండు, నీ లక్ష్యం నెరవేరుతుంది’(హరీ సే లగీ రహో మేరే భాయి, తేరీ బనత్ బనత్ బన్ జాయీ).

నేడు మనం చూస్తున్నాం భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా అవతరించింది. నాయకుడు ఎంత ప్రతిభావంతుడు అయినా, సహచరుల సూచనలు, సలహాలను కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు నడిచినప్పుడే సంస్థ నిలబడుతుంది, బలపడుతుంది. దత్తోపంత్ జీ అటువంటి నాయకుడు. కార్మిక సంఘం ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ సంస్థకు `భారతీయ శ్రామిక్ సంఘ్’ అని పేరు పెట్టాలనుకున్నారు. అయితే కార్యకర్తల సమావేశంలో పేరు విషయమై చర్చ జరిగినప్పుడు కార్మికుల్లో ఎక్కువమందికి `శ్రామిక్’ అనే పదం వెంటనే అర్ధం కాకపోవచ్చనే సందేహాలు పలువురు వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ పదాన్ని సరిగా ఉచ్చరించలేరని కూడా కొందరు చెప్పారు. కాబట్టి ‘శ్రామిక్’ కు బదులు ‘మజ్దూర్’ అనే పదం ఉపయోగించాలని పలువురు సూచించారు. అప్పుడు వెంటనే ఆ సలహాను తీసుకుని సంస్థ పేరును ‘భారతీయ మజ్దూర్ సంఘ్’ గా నిర్ణయించారు.

ఒక సంస్థను నిలబెట్టడం, అందులో పనిచేయదమంటే `నేను’ నుంచి ‘మనం’ అనే భావనకు ప్రయాణించడమే. కానీ అలా `నేను’ అనేది వదిలిపెట్టడం చాలా కష్టం. ఎప్పుడో ఒకప్పుడు `నేను’ అనే భావన ముందుకు వస్తూనే ఉంటుంది. `నేను’ అనే భావనే చాలా విచిత్రమైనదని సంత్ లు చెపుతారు. కాని సంఘటనా కార్యంలో నిమగ్నమైన వాళ్లు దీని నుండి బయటపడవలసి ఉంటుంది. ఠేంగ్డీ అందులో నుంచి బయపడినట్టు   ఉండేవారు. వారు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక లోతైన విషయం గాని, ఒక ప్రధాన దృష్టికోణం గాని లేదా పరిస్కారం ఇచ్చేటప్పుడు ‘నేను’ ఈ విధంగా చెప్పాను అనకుండా ‘మేము’ ఈ విధంగా చెప్పామని అనడం నేను విన్నాను. ఈ ‘నేను’ అనే దానిని తొలగించడం సులభమేమి కాదు. కాని ఠేంగ్డీ ఇందులో విజయం సాధించారు.

ఠేంగ్డీజీలో మరో విశేషమేమిటంటే అతి సామాన్యమైన కార్మికునితో కూడా  ఆత్మీయంగా మాట్లాడేవారు. అలాంటప్పుడు ఏ కార్మికునికి కూడా ఒక అఖిల భారతీయ స్థాయి నాయకునితో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్తతో మాట్లాడుతున్నానని అనిపించకుండా ఆత్మీయుడైన పెద్దతో, కుటుంబ పెద్దతో మాట్లాడుతున్నాననే అనుభూతి కలిగేది. ఇలా వ్యవహరిస్తున్నప్పుడు ఠేంగ్డీ కూడా చాలా సహజంగానే కనపడేవారు. ఆయనది విస్తృతమైన, లోతైన అధ్యయనం. మాట్లాడుతున్నప్పుడు అనేక గ్రంథాలను, ఎందరో నాయకుల జీవిత ఘట్టాలను, అనుభవాలను, అభిప్రాయాలను ఉదహరించేవారు. ఠేంగ్డీజీ తన ఉపన్యాసాలలో అనేక ఉదాహరణలు, చిన్నచిన్న కథలు చెప్పేవారు. ఆ తరువాత వాటిని నాలాంటి(వ్యాస రచయిత) అనుభవం తక్కువగా ఉన్న కార్యకర్త చెబుతూవుంటే ఇది నాకు తెలుసుననే భావనను వ్యక్తపరుచేవారు కాదు. ఇలాంటి సంయమనం పాటించడం సులభం కాదు. ఇది నాకు తెలుసని చెప్పే మోహం ఎంతో అనుభవజ్ఞలైన  కార్యకర్తలకు కూడా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు గమనించాను. కాని ఠేంగ్డేజీ వాటిని మొదటిసారి వింటున్నట్లు శ్రద్ధగా వినేవారు. ఆ తర్వాత దానికి సంబంధించిన మరో చిన్నకథ కూడా చెప్పేవారు. ఒక సామాన్య కార్యకర్తతో ఇంత సన్నిహితంగా, ఆత్మీయతతో ఉండటం ఒక గొప్ప కార్యకర్త లక్షణం.

పనిని విస్తరించే పనిలో మునిగి ఉన్నప్పటికి తొందరపాటును ప్రదర్శించకుండా ఉండటం కూడా ఉత్తమ కార్యకర్త లక్షణమే. `మెల్లగానే వేగం పెంచు’ అని పూజనీయ గురూజీ చెబుతుండేవారు. ఏ పనిలోనైనా తొందరపడకూడదు. నా రైతు మిత్రుడు ఒకాయన మహారాష్ట్రలో ‘షేత్కారీ సంఘటన్‌’ అనే రైతు ఉద్యమంలో విదర్భ ప్రాంత ప్రముఖ నాయకుడు. ఆ తర్వాత ఆ ఉద్యమానికి దూరమయ్యాడు. ఈయన పెద్ద రైతు నాయకుడు. ఠేంగ్డీ నాయకత్వంలో ప్రారంభమయిన కిసాన్‌ ‌సంఘ పనికి ఈయన ఉపయోగపడుతాడన్న ఉద్దేశంతో నాగ్‌పూర్‌లో వున్న ఠేంగ్డీని కలిశాం. ఆ రైతు కూడా ఠేంగ్డీకి తెలుసు. కిసాన్‌ ‌సంఘం కోసం పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు లభించినందువల్ల కిసాన్‌ ‌సంఘానికి ఊతం లభిస్తుందనీ, ఠేంగ్డీజీ వెంటనే ఆనందంగా ఆయన్ను స్వీకరిస్తారనీ నాకు పూర్తి విశ్వాసముంది. ఉపోద్ఘాతం తర్వాత ఈ ప్రస్తావన వారి ముందుంచాను. ఠేంగ్డీజీ వెంటనే తిరస్కరించారు. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత నాతో ‘మన కిసాన్‌ ‌సంఘ పని చాలా చిన్నది, అది ఇంత పెద్ద నాయకుడిని భరించలేదు. ఈ నాయకుడు కిసాన్‌ ‌సంఘాన్ని తనతో పాటు లాక్కొనిపోతాడు. ఇలాంటిది మనం కోరుకోవడం లేదు’ అని చెప్పారు. అప్పుడు నేనన్నాను, ఒకవేళ కిసాన్‌ ‌సంఘం ఆయనను స్వీకరించనట్లయితే భారతీయ జనతా పార్టీ వాళ్లు కలుపుకొని ఎన్నికలలో పోటి చేయించగలరు కదా! అని. దానికి ఠేంగ్డీజీ శాంతమైన స్వరంలో ‘భాజపాకు తొందర ఉండవచ్చు, మనకు లేదు’ అంటూ సుస్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చారు. ఇది నాకొక మంచి గుణపాఠం. గురూజీ చెప్పిన ‘మెల్లగానే వేగం పెంచు’ అనే వాక్యం అర్థమైంది.

ఠేంగ్డీ సంఘటనా నిపుణుడేకాక దార్శనికుడు కూడా. వారితో మాట్లాడుతున్నప్పుడు భారతీయ చింతనకు సంబంధించిన లోతైన విషయాలు  వ్యక్తమయ్యేవి. కార్మిక రంగంలో కమ్యూనిస్ట్ ల ప్రభావం, పెత్తనం ఉండేవి. అందువలన అన్ని కార్మిక సంఘాల నినాదాలు, అవి ఉపయోగించే మాటలు కూడా అలాగే ఉండేవి.  అటువంటి సమయంలో వారు కమ్యూనిస్టు నినాదాల స్థానంలో భారతీయతను ప్రతిబింబించే కొత్త నినాదాలను అందించారు.

 భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌, ‌భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ‌సంస్థలే కాకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌, ‌స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌, ‌ప్రజ్ఞా ప్రవాహ, విజ్ఞాన భారతి మొదలైన సంస్థల పునాదులు కూడా ఠేంగ్డీజీ వేశారు.  భారతీయ కళాదృష్టిని వివరిస్తూ వ్రాసిన వ్యాసం ఆతర్వాత సంస్కారభారతికి మార్గదర్శకమైంది.

ఠేంగ్డీజీ లాంటి సమున్నత మేధావి, సంఘటనా కార్యకర్త, దూరదృస్టి కలిగిన నాయకునితో పాటు చర్చిస్తూ, వారి సలహాలు పొందుతూ పనిచేయడం నా అదృష్టం. ఠేంగ్డీ ఈ జన్మ శతాబ్ది సందర్భంగా వారికి  వినమ్ర శ్రద్ధాంజలి.

This Article Was First Published in 2020