Home Rashtriya Swayamsevak Sangh మహనీయులలో మహనీయుడు శ్రీ గురూజీ

మహనీయులలో మహనీయుడు శ్రీ గురూజీ

0
SHARE

భారతదేశంలో దేశమంతటిని ప్రభావితం చేసిన మహాపురుషులు అనేక మంది ఈ దేశంలో జన్మించారు. ఆదిశంకరాచార్య సాధించిన జాతీయ సమైక్యత ఒక సాంస్కృతిక విప్లవం. అలా బ్రిటిష్‌ ఆక్రమణ కాలంలో ఈ దేశంలో సాంస్కృతిక జాతీయ వాదానికి బలమైన పునాదులు వేసినవారు స్వామి వివేకానంద, బంకించంద్ర, అరవింద మహర్షి . ఆ ప్రారంభాన్ని ప్రస్పుటింపచేసిన వారు పూ|| శ్రీ గురూజీ. సాంస్కృతిక జాతీయవాదాన్ని ఈ దేశానికి స్పష్టంగా అర్థం చేయించిన వారు శ్రీ గురుజీ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ద్వితీయ సర్‌సంఘచాలకులు.

శ్రీ గురూజీగా ప్రసిద్ధిపొందిన మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్‌ మాఘబహుళ ఏకాదశి రోజున జన్మించారు (1906 సం|| ఫిబ్రవరి 19 సోమవారం).

శ్రీ గురూజీ కాశీ విశ్వ విద్యాలయంలో చదువుకొని అక్కడే ఆచార్యులైనారు. అక్కడ అనేక విషయాలు అధ్యయనం చేసారు. దేశంలో జరుగుతున్న ఉద్యమాలు; సామాజిక మార్పుకై జరుగుతున్న ప్రయత్నాలు; పెరుగుతున్న ఇస్లాం దాడులు అన్ని విషయాలపై అధ్యయనం సాగేది. ఈ దేశపు జాతీయతపై జరుగుతున్న చర్చలను పరిశీలించారు. 1930 సంవత్సరంలో డాక్టర్జీని కలిశారు.

1940 సంవత్సరంలో సంఘానికి రెండవ సర్‌సంఘచాలక్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1940-73 వరకు 33 సంవత్సరాలు సంఘ కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. స్వాతంత్య్ర పోరాటం; దేశ విభజన; సంఘంపై నిషేధం వంటి అత్యంత క్లిష్టమైన సమస్యల సమయంలో పనిచేసారు. భారతదేశం అన్ని విధాల అగ్రగామి దేశంగా రూపుదిద్దుకోవటానికి అన్ని రంగాలలో అవలంబించాల్సిన విధానాలపై దారిచూపినవారు శ్రీగురూజీ.

ఆంగ్లేయులు ”ఇది ఒక దేశం కాదు; ఇది ఒక జాతి కాదు; ఇక్కడ అనేక భాషలున్నాయి; సంస్కృతులు ఉన్నాయి” అని చేసిన తప్పుడు ప్రచారాన్ని తలకెక్కించుకున్న రాజకీయనాయకులు  తమకు తోచిన విధంగా ఈ దేశాన్ని వర్ణించటం జరుగుతూ ఉండేది. ఇటువంటి విషయాలలో గురూజీకి ఎంతో స్పష్టత ఉండేది. ఇది హిందూ దేశం, హిందూ సంస్కృతి; హిందూధర్మం;  అని స్పష్టం చేసేవారు.

1957-58 సంవత్సరంలో శ్రీ గురూజీ ఒకసారి నెహ్రూని కలిశారు. ఆ సమయంలో ”దేశంలో  సంస్కృతి  అనేక ధర్మాల, జాతుల, సంస్కృతుల సమ్మేళనం. అటువంటిదానిని కేవలం హిందూ సంస్కృతిగా పిలవటం సముచితం కాదు. అలా అంటే విబేధాలు పుట్టుకొస్తాయి. విఘటన ఏర్పడుతుంది. అందరిని కలిపి ఉంచడం కష్టమవుతుందని” అని నెహ్రూ అన్నారు. అప్పుడు శ్రీ గురూజీ ”గంగలో అనేక నదులు కలుస్తాయి. అనేక ఉపనదులు కలుస్తాయి అంతమాత్రాన మూలధార పేరు మారదు. దానిని గంగ అనే అంటారు. అలాగే ఈ దేశానికి మూలమైన హిందూ సాంస్కృతికధారలో అనేక పంథాలు కలిసి ఉండ వచ్చును. కాని దానిని హిందూ సంస్కృతనే అంటాము” అని స్పష్టంచేశారు. దీనితో  నెహ్రు గారికి అగ్రహం కలిగింది.

సంఘం ఒక మతానికే మద్దతు నిస్తోందని, అది ‘మతతత్వాన్ని ప్రోత్స హిస్తోందని’ ప్రచారం ప్రారంభమైంది. దుష్ప్రచారం కారణంగా హిందూత్వం అంటే  కేవలం మతం అనే భావన దేశంలో ప్రచారమైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ సంస్కృతికి, మతానికి మధ్య తేడాను పట్టించుకో కుండా ఇష్టవచ్చినట్లు వ్యాఖ్యానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నవి. ఈ విషయంలో గురూజీ ఇచ్చిన స్పష్టత అందరికీ తెలియాలి. దానికోసమే సంఘం పని చేస్తున్నది. ఈ పనికి నష్టం కలిగించాలని; సంఘాన్ని నామరూపాలు లేకుండా చేయాలని; అనేక ప్రయత్నాలు జరిగాయి.

గాంధీజి హత్య నేరంమోపి సంఘాన్ని నిషేధించటమే కాక భవిష్యత్తులో సంఘం తమకు ప్రబల శత్రువు అవుతుంది; ఆ శక్తిని నామరూపాలు లేకుండా చేయాలని పథకం రచించారు. నిషేధం సమయంలో సంఘం సంయమనంతో వ్యవహరించి ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చి నిషేధం తొలగించేట్లుగా పనిచేసింది. దానికి ఎంతో మూల్యం  చెల్లించుకొంది కూడా. దేశంలో అంతర్గత సంఘర్షణ నిర్మాణం కాకుండా జాగ్రత్తపడింది. సంఘానికి గాంధీజి హత్యకు ఎటువంటి సంబంధం లేదు అని సుప్రీం కోర్టు కూడ చెప్పింది. అయినా  నిషేధానంతరం సంఘం దేశంలో విస్తరించకుండ ఉండేందుకు పదేపదే గాంధీజి హత్యలో సంఘం పొత్తు ఉన్నదని ఈ రోజుకి కూడా మాట్టాడటం జరుగుతున్నది. అయినా సంఘం ఈ రోజు దేశవ్యాప్తము; విశ్వ వ్యాప్త మయింది. దానిలో శ్రీ గురూజి మార్గదర్శనం ఎంతో విశిష్టమైనది.

దేశ విభజన సమయంలో గురూజీ చెప్పి విషయాలు కాని; ఆ సమయంలో ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దటంకాని; పాకిస్థాన్‌ నుండి వరదలాగా వచ్చిన లక్షల మందికి వ్యవస్థలు చేయటం కాని; పాకిస్థాన్‌లో జరిగిన దాడుల నుండి హిందువులను రక్షించి భారత్‌కు పంపటం కాని శ్రీ గురూజి చేసిన విశేష ప్రయత్నం ఈ జాతి ఎప్పుడు మరవలేనిది.

ఈ దేశంలోఉన్న అన్ని సామాజిక వ్యవస్థల మధ్య సమస్వయం సాధిస్తే ఈ దేశానికి తిరుగులేదు. దేశ సమైక్యతకు పూ|| శ్రీ గురూజీ చూపిన మార్గంలో సంఘం వేగంగా ముందుకు వెళుతోంది. ఈ జాతి నిరంతరం జ్ఞాపకం చేసుకొనే దార్శనికులలో గురూజీ ఒకరు.

(లోకహితం సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here