Home Telugu మార్గదర్శి బాలాసాహెబ్‌ దేవరస్‌

మార్గదర్శి బాలాసాహెబ్‌ దేవరస్‌

0
SHARE
బాలాసాహెబ్‌ దేవరస్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌. మూడవ సర్‌సంఘచాలక్‌

డిసెంబ‌ర్ 17 (మార్గశిర‌ శుక్ల పంచమి, 1915) – బాలాసాహెబ్‌ దేవరస్ జీ జ‌యంతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి మూడవ సర్‌సంఘచాలక్‌గా నేతృత్వం వహించిన బాలాసాహెబ్‌ దేవరస్‌ది విశిష్ఠ వ్యక్తిత్వం. బాలాసాహెబ్‌ అసలు పేరు మధుకర్‌ దత్తాత్రేయ దేవరస్‌. మధుకర్‌, అతని తమ్ముడు భావురావు దేవరస్‌ ఇద్దరూ 1929లో తమ 12వ యేటనే బాల స్వయంసేవకులుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో చేరారు. ఇద్దరిలో చిన్నప్పటి నుండే సహజంగా నాయకత్వ లక్షణాలుండేవి. మధుకర్‌ నిర్వహించే ఆర్‌.ఎస్‌.ఎస్‌. గణకు ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో బాల స్వయంసేవకులు హాజరయ్యేవారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు, మొదటి సర్‌సంఘచాలక్‌ డాక్టర్‌ కేశవరావు బలిరామ్‌ హెడ్గేవార్‌ (డాక్టర్జి). ఈయన చిన్ననాటనే వైద్య విద్య పేరుతో కలకత్తా వెళ్ళి విప్లవకారుల సంస్థ అయిన అనుశీలన సమితిలో చురుగ్గా పాల్గొన్నారు. తీవ్రవాద ఉద్యమాల వల్ల సామాన్య ప్రజలను సైతం దేశనిర్మాణ కార్యంలో భాగస్వాములను చేయలేమని తరువాత ఆయన గుర్తించి, వెనక్కు వచ్చి 1925లో సంఘాన్ని ప్రారంభించారు.

మధుకర్‌ కూడా డాక్టర్జి వలె చిన్ననాటనే తీవ్రవాద ఉద్యమాలకు ఆకర్షితులయ్యారు. ఒకపక్క స్వాతంత్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. వందేమాతరం నినాదంతో అనేకమంది యువకులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని లాఠీదెబ్బలు తింటున్నారు. జైళ్ళకు వెళుతున్నారు. అదే సమయం లో భగత్‌సింగ్‌ మిత్రత్రయం నవ్వుతూ నవ్వుతూ ఉరికంబాలకెక్కారు. రెండవ పక్క భారతదేశ పునర్ని ర్మాణంకోసం అంకితమైన ఆర్‌.ఎస్‌.ఎస్‌. శాఖలో హడావుడి లేని ప్రశాంతమైన ఆటలు పాటలు.

సహజంగానే బాలాసాహెబ్‌ దేవరస్‌ (మధుకర్‌) మిత్రబృందానికి స్వాతంత్య్రం కోసం తాము కూడా తీవ్రవాద ఉద్యమాలలో పాల్గొనాలనే కోరిక కలిగింది. ఈ విషయాన్ని సంఘ సంస్థాపకులు డా||హెడ్గేవార్‌తో చెప్పాలి. ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఈ బాధ్యతను మిత్రబృందం బాలాసాహెబ్‌ దేవరస్‌కు అప్పచెప్పింది. యువ స్వయంసేవకుల హృదయ భావాలను డాక్టర్జీ అర్ధం చేసుకున్నారు. ‘సరే! అలాగే చేద్దురుగాని. రాత్రి మీరందరూ భోజనం చేసి నా ఇంటికి రండి. అన్నీ మాట్లాడుకుందాం’ అన్నారు డాక్టర్జీ. రాత్రి 9 గంటలకు ప్రారంభమయిన చర్చా గోష్టి ఉదయం 3 గంటల వరకు కొనసాగింది. ఇలా 10 రోజులు కొనసాగింది. యువ స్వయంసేవకుల హృదయం నుండి వెలువడ్డ లావాను డాక్టర్జీ స్వీకరించారు. ఓపిగ్గా విన్నారు. ‘ఈ తీవ్రవాద ఉద్యమాల నాయకుల దేశభక్తిని ఎవరమూ కొలవలేం. వారి దేశభక్తికి, వారి బలిదానాలకు జోహారులు. వారి బలిదానాల వల్ల సామాన్య ప్రజలలో వెలిగిన దేశభక్తి ఎక్కువకాలం ఉండటం లేదు. వెంటనే ఆరిపోతోంది. దేశంకోసం మరణించటం కాదు. దేశంకోసం పనిచేస్తూ జీవించాలి. సామాన్య ప్రజలను సైతం దేశ పునర్నిర్మాణ కార్యంలో భాగస్వాములను చేయాలి. ఈ పని చేస్తున్న సంఘకార్యాన్ని విస్తరించాలి, బలోపేతం చేయాలి’ అని డాక్టర్జీ ఉదాహరణలతో సహా ఆనాటి ఉద్యమాల ఘటనల పూర్వాపరాలను విశ్లేషిస్తూ వివరించారు. ఆ యువబృందం తీవ్రవాద ఉద్యమాలలో చేరాలన్న నిర్ణయాన్ని మానుకుని సంఘకార్యానికై అంకితమైంది. మౌలికంగా తీవ్రవాద భావాలు కలిగిన బాలాసాహెబ్‌ దేవరస్‌ డాక్టర్జీ హృదయాన్ని అర్ధం చేసుకుని తన జీవితం మొత్తాన్ని సంఘానికి అర్పించారు.

సామాజిక సమరసతకు ప్రాముఖ్యం

1932-33 నాటి కుల పరిస్థితులు, సామాజిక పరిస్థితులను ఊహించుకోవచ్చు. బాలాసాహెబ్‌ దేవరస్‌ కుటుంబం సనాతన భావాలు కలిగిన హిందూ కుటుంబం. ఒకనాడు తన తల్లితో ‘నేడు నా మిత్రుడు మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు, నాతో పాటు వంటింట్లోనే కంచంలోనే భోజనం పెట్టాలి. మరొక రకంగా వద్దు’ అని బాలాసాహెబ్‌ దేవరస్‌ అన్నారు. కుమారుని హృదయం అర్ధం చేసుకున్న తల్లి అదేవిధంగా వ్యవహరించింది. బాల స్వయంసేవక్‌ బాలాసాహెబ్‌ దేవరస్‌కున్న సామాజిక భావాలు ఎంతో విప్లవాత్మకమైనవి.

ఆర్ధిక దోపిడికి వ్యతిరేకం

బాలాసాహెబ్‌ కొంతకాలం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న తమ సొంత భూమిలో వ్యవసాయం చేశారు. వ్యవసాయ దారులవద్ద ఉత్పత్తులను కొనేటప్పుడు ఒక రకమైన కొలతను, గ్రామంలోని వ్యాపారస్తులు ఈ ఉత్పత్తులను అమ్మేటప్పుడు మరో కొలతను వినియోగించే దోపిడి విధానాన్ని వారు గుర్తించారు. ఈ దోపిడి వ్యతిరేకించారు. ఈ కొలతలలో తేడాలను తమ గ్రామంలో లేకుండా చేశారు. దశాబ్దాలపాటు రైతు కూలీలుగా పనిచేసి వృద్ధులై పనిచేయలేని వృద్ధ రైతు కూలీలకు పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తుల వలె ఎందుకు పెన్షన్‌ ఇవ్వరాదు? అని ప్రశ్నిస్తూ ఈ నూతన ప్రయోగాన్ని తమ గ్రామంలో చేసిచూపిన ఆదర్శ ఆర్ధిక సంస్కర్త బాలాసాహెబ్‌ దేవరస్‌. దేశానికి చెందిన అనేక సమస్యలకు వ్యావహారికంగా మార్గంచూపిన మార్గదర్శకులు బాలాసాహెబ్‌ దేవరస్‌. సరస్వతి శిశు మందిరాలలో విద్యార్ధుల నుండి వసూలు చేసిన రుసుములో అత్యధిక భాగం శిశుమందిర ఆచార్యుల వేతనాలకే ఇవ్వాలి. సేవాభావం పేరుతో వారికి తక్కువ వేతనాలు ఇవ్వడం తగదు. భవన నిర్మాణాల కోసం ఈ నిధి నుండి కాక ప్రజల నుండి వసూలు చేయండి’ అంటూ ఒక సమావేశంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్వహకులకు సూటిగా మార్గదర్శనం చేశారు.

ఆ సాయం శాఖకు కార్యవాహను నియమించండి – దేవరస్‌ ఆదేశం

ముఖ్యశిక్షక్‌ల బైఠక్‌ జరుగుతోంది. ఏదైనా సందేహాలుంటే అడగండి అని అన్నారు సర్‌సంఘచాలక్‌ బాలాసాహెబ్‌ దేవరస్‌. బాల స్వయంసేవక్‌గా ఉన్న ఒక ముఖ్యశిక్షక్‌ లేచి ‘నా శాఖలో నా అన్నయ్య గణలో నా మాట వినడం లేదు, నేను ఏంచేయాలి?’ అని తన గోడును చెప్పుకున్నాడు. ఆ ముఖ్యశిక్షక్‌కు అదే పెద్ద సమస్య. నిజమే మరి! వెంటనే దేవరస్‌జీ సమాధానం ఇస్తూ ‘బాల స్వయంసేవకుల శాఖలో ఇలాంటి సమస్యలు సహజమైనవి. నీవు ముఖ్యశిక్షక్‌ అయినంత మాత్రాన నీ అన్నయ్య శాఖలో నీ మాట వినకపోవచ్చును. ఇలాంటి బాల స్వయంసేవకులు ముఖ్య శిక్షక్‌గా ఉన్న శాఖలకు ఒక ప్రౌఢ స్వయంసేవక్‌ శాఖ కార్యవాహగా ఉండాలి. ఇలాంటి సమస్యలను ఆ శాఖ కార్యవాహ పరిష్కరించాలి’ అంటూ జిల్లా అధికారులను లేపి ‘ఈ శాఖకు వెంటనే ఒక ఫ్రౌఢ స్వయం సేవక్‌ను శాఖా కార్యవాహగా నియమించండి, ముఖ్యశిక్షక్‌ సమస్యను వెంటనే పరిష్కరించండి’ అని ఆదేశించారు.

మాతృఛాయ ప్రారంభానికి ప్రేరణ

1985నాటి సంగతి. దేవరస్‌జి పర్యటన సందర్భంగా గుంటూరులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి సంఘ కార్యకర్తల సమావేశం జరుగుతోంది. విశాఖ పట్టణానికి చెందిన కొద్దిమంది కార్యకర్తలు తమ నగరంలో క్రైస్తవులు మత ప్రచారం చేస్తుంటే తాము ఎలా ఎదుర్కొన్నది వివరించారు. ‘మీరు క్రైస్తవ మత ప్రచారాన్ని ఆపారు. మంచిదే. వారు నిమ్న వర్గాల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అనాధ పిల్లలకు అనాధ ఆశ్రమాలను నిర్వహిస్తుంటారు. మనం చెయ్యం. వారిని చెయ్యనివ్వం. ఇది సరిఅయినదేనా? మహరాష్ట్రలో అప్పుడే జన్మించిన అనాధ శిశువులను గుర్తించి వారి కోసం వసతి గృహం ప్రారంభించాం. ఇంట్లో ఒక శిశువు ఉంటేనే పెంచడం గగనం. ఇలాంటి అనేకమంది శిశువులు ఉంటే ఆ వసతిగృహాన్ని నిర్వహించటం ఇంకెంత కష్టమో ఆలోచించండి? ఆ శిశువులకు అమ్మ ప్రేమను అందించాలి. అందుకై ఆ వసతి గృహానికి మాతృఛాయ అని పేరు పెట్టారు. మీరు మీ ప్రాంతంలో ఇలాంటి మాతృఛాయలు ప్రారంభించండి’ అంటూ నూతన ఒరవడిలో మార్గదర్శనం చేశారు తృతీయ సర్‌ సంఘచాలక్‌ బాలాసాహెబ్‌ దేవరస్‌. వారి ఆశయం మేరకే గుంటూరు వద్ద నూతక్కిలో మాతృఛాయ ప్రారంభమైంది. అలాగే హైదరాబాదులో వైదేహి, వాత్యల్యసింధు వంటి సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇలా కార్యకర్తలకు నూతన దిశ ఇవ్వటంలో బాలాసాహెబ్‌ దేవరస్‌ వారికి వారే సాటి.

కంచి పరమాచార్య మార్గంలో నూతన ఒరవడి

డాక్టర్జీ 1940లో తనువు చాలిస్తూ సర్‌సంఘచాలక్‌ బాధ్యతను గురూజీకి అప్పచెప్పారు. గురూజీ స్వర్గస్థులయిన తరువాత వారి ఉత్తరాల మేరకు బాలాసాహెబ్‌ దేవరస్‌ 1973లో సర్‌సంఘచాలక్‌ బాధ్యత స్వీకరించారు. చాలా కాలంగా వారికి మధుమేహం ఉంది. నిరంతర పర్యటనల వల్ల వారి శరీరం అన్నివిధాలా కృంగిపోయింది. రెండు చేతులకు, రెండు కాళ్ళకు పక్షవాతం వచ్చింది. మాట్లాడలేని పరిస్థితి. అయినా అంతతీవ్ర అస్వస్థతలో ఉన్నా వీల్‌ఛైర్‌లోనే తీవ్రవాదుల బాంబుపేలుళ్ళలో విధ్వంసమైన మద్రాసు సంఘ కార్యాలయాన్ని చూడ్డానికి వచ్చారు. బాంబుపేలుళ్ళలో చనిపోయిన కార్యకర్తలను చూశారు. అందరిని పరామర్శించారు. అలాంటి స్థితిలో కూడా దేశానికి, సంఘానికి అవసరమైన మార్గదర్శకాన్ని చేశారు. మనోనిగ్రహాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఈ శారీరక స్థితిలో సర్‌సంఘచాలక్‌గా కొనసాగటం సరికాదని భావించి, తాను జీవించి ఉండగానే నూతన సర్‌సంఘచాలక్‌ను నియమించే నూతన ఒరవడిని సృష్టించారు. నాలుగో సర్‌సంఘచాలక్‌గా ప్రొఫెసర్‌ రాజేంద్రసింహ్‌ను ప్రకటించారు. పూర్తిజీవితం సమర్పించిన ప్రచారకులకు, గృహస్థులకు సైతం వానప్రస్థ జీవితం ఉండాలని నూతన సందేశాన్ని అందించారు.

బలవంతుడు బలహీనుడిని దోచుకునే వ్యవస్థను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కుల అసమానతలతో కూడిన నేటి సామాజిక వ్యవస్థలో సామాజిక సమానత ఆవశ్యకతను వివరిస్తూ 1974లో వారు చేసిన ప్రసంగం ‘సామాజిక సమానత – హిందూ సంఘటన’ అక్షరాలా మొత్తం హిందూ సమాజానికి ఆచరణీయం. వారి మాటల్లోనే ‘దోపిడీకి అవకాశం లేని, ఎలాంటి దురాచారం లేని, సమానత్వంతో కూడిన హిందూ సామాజిక వ్యవస్థ నిర్మాణమే సంఘ లక్ష్యం’ అంటూ సంఘ లక్ష్యాన్ని తనదైన శైలిలో విశదీకరించారు.

– కె.శ్యాంప్రసాద్‌, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్‌

(జాగృతి సౌజన్యం తో)

ఇది కూడా చ‌ద‌వండి : బాలసాహెబ్ దేవరస్ జీవితంలోని ప్రేరణదాయక సంఘటన