Home Telugu Articles సార్వజనీనం.. గురునానక్ సందేశం

సార్వజనీనం.. గురునానక్ సందేశం

0
SHARE

– అనంత్ సేథ్

బాబా నానక్ గా గుర్తింపు పొందిన గురునానక్ ఈ దేశంలో ఉద్భవించిన మహోన్నత తత్వవేత్తలు, కవులు, సామాజిక సంస్కర్తలు, ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన 1469 లాహోర్ దగ్గర రాయ్ భోయికి తల్వండీ (దీనినే ఇప్పుడు నాన్ కానా సాహిబ్ అని అంటున్నారు) గ్రామంలో జన్మిచారు. ఆయన జన్మించిన ఇంటిలోని గది నేడు నాన్ కానా సాహిబ్ గురుద్వారా ప్రధాన స్థానం(గర్భగుడి) అయింది.

చిన్నతనం నుంచి గురునానక్ ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపేవారు. సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలని ఇస్లాం మతఛాందసవాదులు అనేకరకాలుగా ప్రయత్నిస్తున్న సంక్షుభిత కాలంలో ఆయన జీవించారు. అలాగే అప్పుడే భక్తి ఉద్యమం ద్వారా హిందుసమాజంలో అంతర్గత సంస్కరణ సాగుతోంది. `నా దేవుడు, నా దారి’(మతమౌఢ్యం) అనే ధోరణికి, `నీ దేవుడు, నీదైన దారి’(సమన్వయం, సహనశీలత) అనే ఆలోచనకు మధ్య సంఘర్షణ జరుగుతున్న రోజులవి.  చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్నా భగవంతుడు మాత్రం ఒక్కడే (పవిత్ర గురుగ్రంథ్ సాహెబ్ లోని ప్రారంభ వచనం – ఇ(ఎ)క్ ఓంకార్) అని గురునానక్ బోధించారు.

గురునానక్ తన జీవిత కాలంలో అనేక ప్రాంతాలలో పర్యటించారు. తూర్పున అసోమ్, దక్షిణాన శ్రీలంక, ఉత్తరాన టిబెట్, పశ్చిమాన బాగ్ధాద్ వరకు ఆయన పర్యటించారు.  భాయి బాల, భాయి మర్దానా (ముస్లిం) అనే తన ఇద్దరు శిష్యులతో ఆయన సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి(ఈ సుదూర ప్రయాణాలను పంజాబీలో ఉద్దసి అంటారు. ఈ మాట నుంచే ఆంగ్ల పదం ఒడిసి వచ్చిఉండవచ్చును) అక్కడ సాధుసంతులు, మహాపురుషులను కలుసుకుని శాస్త్ర చర్చ చేసేవారు.

తన మొదటి ఉద్దసి(1499-1507) పర్యటనలో గురునానక్ నేటి పాకిస్తాన్, భారత్ లోని దాదాపు అన్నీ ప్రాంతాలను చూశారు. రెండవ ఉద్దసి (1507-1514)లో ఆయన అయోధ్య శ్రీరామజన్మభూమి (1511), అలాగే దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాలు, శ్రీలంకలకు వెళ్లారు. మూడవ ఉద్దసి(1514-1518)లో ఉత్తర భారతంలో కాశ్మీర్ తో సహా నేపాల్, సుమర్ ప్రభాత్, టిబెట్, సిక్కిం మొదలైన ప్రాంతాల్లో పర్యటించారు. నాలుగవ ప్రయాణంలో (1519-1521) పశ్చిమాన ఉన్న మక్కా, మదీనా, బాగ్దాద్ తో సహా పలు మధ్య ప్రాచ్య ప్రాంతాలకు వెళ్లారు. ఇంత సుదూర, సుదీర్ఘ పర్యటనలు చేసిన ప్రవక్త ప్రపంచంలో మరొకరు ఎవరూ లేరు. తన పర్యటనల ద్వారా ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు మరల్చాల్సిన భగవంతుని అనుజ్ఞ, ఆదేశాన్ని(హుకుం) ఆయన నిర్వర్తించారు.

ఆయన తన పర్యటనలలో హిందువులు, బౌద్ధులు, జైనులు, ముస్లింలు, జొరాష్ట్రియన్ లు మొదలైన అనేక మతాలకు చెందిన వారిని కలిసేవారు. పవిత్ర హృదయంతో, నిస్వార్ధంగా భగవంతుని సేవించాలనే ఆదర్శాన్ని అనుసరించిన ప్రముఖ భక్తుడు సంత్ కబీర్ ను కలిసిన గురునానక్ కొంతకాలం ఆయనతోపాటు ఉన్నారు. అటు పండితులు, ఇటు పామరులతో కూడా ఆయన చర్చలు జరిపారు.

తన బోధలు చేసేందుకు ఆయన పంజాబీ భాషను ఉపయోగించారు. మొదట్లో ఆయన అనుచరులు ఖత్రి కులానికి చెందినవారే ఉండేవారు. కానీ ఆ తరువాత ఆయన బోధనల ప్రభావానికి లోనై అన్నీ కులాలు, వర్గాలకు చెందినవారు ఆయన అనుచరులు, శిష్యులు అయ్యారు. ఆయన పంజాబీ భాష , కవితలు, గీతాలు, సంగీతం ద్వారా ఏకత్వాన్ని బోధించారు. మూఢచారాలు, మూఢనమ్మకాలను వదిలి వివేకం, బుద్ధి ఉపయోగించాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారు. దేశ, కాలాలకు అతీతంగా విశ్వజనీనమైన సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఆయన కాలంలోనే భారత్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇరాన్, ఇరాక్ వంటి సుదూర ప్రాంతాల్లో కూడా ఆ సందేశం చేరింది.

నాలుగవ ఉద్దాసి తరువాత గురునానక్ 1521లో కర్తార్ పూర్ చేరుకున్నారు. గృహస్తాశ్రమంలో ప్రవేశించారు. తన శిష్యులకు సూచించిన నామ్ జపో (దేవుడి నామాన్ని తలుచుకో), కీరత్ కరో (భజన చెయ్యి), వంద్ చక్కో (పంచుకో) అనే సూత్రాలను స్వయంగా ఆచరించారు. భగవంతుని కీర్తనలను గానం చేయడం, లంగర్ (సామూహిక ఆన్నదాన కార్యక్రమం) నిర్వహించడం రోజువారీ కార్యక్రమంగా ఉండేది.

లంగర్ (సామూహిక ఆన్నదాన కార్యక్రమం) 1500 సంవత్సరంలో గురునానక్ ప్రారంభించిన వినూత్నమైన, సమానత్వాన్ని ప్రబోధించే సేవాకార్యక్రమం. దీని ద్వారా ప్రజల్లో భేదభావాలను తొలగించడానికి ఆయన ప్రయత్నించారు. దేవాలయాల్లో కూడా నిత్యాన్నదాన సత్రాలు నిర్వహించడం పురాతన కాలం నుంచి వస్తున్నదే. గుప్తుల సామ్రాజ్యంలో ఈ పద్దతి మరింత ప్రముఖంగా కనిపిస్తుంది. వీటికి వివిధ ప్రాంతాల్లో సత్రం, చౌల్ట్రీ, ఛత్రం అనే వేరువేరు పేర్లు ఉండేవి.

గురునానక్ ఉపదేశాలు (వీటిని గురు ఆర్జన్ సమీకరించిన ఆది గ్రంథ్ లో చేర్చారు) కేవలం మతానికి చెందినవేకాక సామాజిక, కుటుంబ, ఇతర విషయాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఆయన సామాజిక సమానత, స్త్రిపురుష సమానత్వం వంటి విషయాలను బోధించారు. కులతత్వం, నిరంకుశ రాజ్యాధికారం వంటివాటిని నిరసించారు. వంద్ చక్నా(పంచుకునే తత్వం) వంటి భావనలు అనేకమంది దురాశాపరులకు నచ్చేవి కావు. ఆయన సతి ఆచారాన్ని కూడా నిరసించారు. అహంకారాన్ని తగ్గించుకునేందుకు సేవా మార్గాన్ని మించినది లేదని ఆయన బోధించారు. అది మనిషికి నైతిక, ఆంతరిక శక్తిని ఇస్తుందని ఆయన చెప్పారు.  ఆయన బోధనలను అనుసరించే గురుద్వారాల వద్ద సేవ చేసే పద్దతి వచ్చింది.

ఈ సంవత్సరం నవంబర్ 30న గురునానక్ 551వ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గురుగ్రంథ్ సాహిబ్ ను పఠించడం, గురునానక్ విశ్వజనీన సందేశాన్ని అనుసరించే ప్రయత్నం చేయడం ఆయనకు సరైన నివాళి అవుతుంది. భగవంతుడే అంతిమ, శాశ్వత సత్యం అని ఎవరు ఘోషిస్తారో వారికి శాశ్వత, పరమపదం లభిస్తుంది(జైకారా జో బోలె సో నిహాల్… సత్ శ్రీ ఆకాల్ ) అనే సందేశాన్ని మనమంతా గుర్తుపెట్టుకుందాం.

This Article was first Published in 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here