Home Telugu Articles హజియా సోఫియా, రామమందిరం ఒకటేలా అవుతాయి?

హజియా సోఫియా, రామమందిరం ఒకటేలా అవుతాయి?

0
SHARE

– – రతన్ శార్దా

ఐదు శతాబ్దాల ధర్మబద్ధమైన పోరాటం ఫలించి ఆగస్ట్ 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రజల సంతోషాన్ని, హర్షాన్ని నీరుగార్చేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ కొందరి దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రజలంతా ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించారు. రాజ్యాంగబద్ధంగా హిందూ సమాజం సాధించిన విజయం అది. హిందువుల సంయమనం, సహనం, ధర్మ బుద్ధిని ప్రశంసించవలసినదిపోయి బూటకపు సెక్యులరిస్ట్ లు, ఉదారవాదులు, ఇస్లాంవాదులు, ఉదారవాదులుగా చెలామణి అవుతున్న ఇస్లాంవాదులు పదేపదే హిందువులను అవమానించారు. అదృష్టవశాత్తు హిందువులు కూడా `భౌతికమైన’ దాడులకు దిగలేదు.

అన్ని మతాలను ఒకటిగా చూసే హిందువును కూడా ఇటీవల కొన్ని పరిణామాలు మాత్రం ఆలోచనలో పడవేసే విధంగా ఉన్నాయి.

టర్కీలోని హజియా సోఫియా ప్రదర్శనశాలను మసీదుగా మారుస్తున్నట్లు ఆగస్ట్ 9న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు అది మసీదేనని, క్రైస్తవులే దానిని చర్చ్ గా మార్చారని ప్రభుత్వం తెలిపింది. కమల్ అతతుర్క్ కాలంలో ఆ చర్చ్ ని ప్రదర్శనశాలగా చేశారు. అయితే క్రైస్తవులు, ముస్లింల మధ్య ఆ కట్టడం అనేకసార్లు చేతులుమారిందన్నది ఎవరూ చెప్పరు. ఒకప్పుడు పాగన్ ఆలయం అయిన ఆ కట్టడం మసీదుగా మారడానికంటే ముందు చర్చ్ గా ఉండేదన్నది నిజం. ప్రదర్శనశాలను తిరిగి మసీదుగా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టర్కీలో ఇస్లామిక్ పాలనను పక్కనపెట్టి సెక్యులర్ వ్యవస్థను వృద్ధి చేయడం కోసం ఒకప్పుడు అతతుర్క్ పడ్డ తాపత్రయం ఇప్పుడు పూర్తిగా బూడిదిలో పోసిన పన్నీరు అయింది. మసీదు ఎప్పటికైనా మసీదేనని, దానిని ఎప్పటికైనా ఆవిధంగానే పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా ఇస్లాంవాదులు సగర్వంగా ప్రకటించారు.

అయితే ప్రవక్త స్వస్థలమైన సౌదీ అరేబియాలో కూడా అనేక మసీదులను `తొలగించారు’ అనే సంగతి వీళ్ళు మరచిపోతుంటారు. ఆ తొలగింపు కూడా వాటిని పెద్దవి చేసి, మరింతమంది ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా తయారుచేసేందుకు కాదు. విలాసవంతమైన హోటళ్లు కట్టడానికి అలా మసీదులు తొలగించారు. “విలాసవంతమైన హోటళ్లు, దుకాణా సముదాయాలు, ఆకాశహర్మ్యాలు కట్టడం కోసం మక్కా, మదీనాల్లోని చరిత్రాత్మక ప్రదేశాలను కూడా కూల్చివేయడాన్ని స్థానికులు, వారసత్వ సంపద కాపాడాలనే ఉద్యమకారులు నిర్ఘాంతపోయి చూశారేకాని ఏమి అనలేకపోయారు. గత 20ఏళ్లలో ఈ రెండు నగరాల్లో ఉన్న వెయ్యెళ్ళనాటి పురాతన కట్టడాలలో 95శాతం కూల్చివేశారని వాషింగ్టన్ లోని గల్ఫ్ సంస్థ అంచనా వేసింది. ఒట్టమాన్ కాలం నాటి అయ్యద్ కోటను, ఆ కోట ఉన్న కొండను కూడా సౌదీ ప్రభుత్వం పూర్తిగా కూల్చేసింది. ఇతర చారిత్రక స్థలాలకు కూడా ఇదే గతి పట్టింది. మహమ్మద్ ప్రవక్త పుట్టిన ఇల్లును గ్రంధాలయంగా చేస్తే, ఆయన మొదటి భార్య ఖదీజా ఇంటిని మూత్రశాలగా మార్చారు’’ అని 2012 అక్టోబర్ 26 నాటి ఇండిపెండెంట్ పత్రిక వ్రాసింది. పాకిస్తాన్ లో కూడా ఇలా మసీదులను తొలగించిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

హజియా సోఫియాను మసీదుగా తిరిగి మార్చడం  ఒకప్పుడు జరిగిన తప్పిదాన్ని సరిచేయడం కోసమేనని అంటే హిందువులకు కూడా అలాంటి హక్కే ఉంటుంది కదా. టర్క్ లు, మంగోలుల దాడులు, విధ్వంసాన్ని ఎదుర్కొన్న హిందువులు తమ దేవాలయాలను పునరుద్ధరించుకోవాలనుకుంటున్నారు. పైగా భారత్ లో ఇలా ఒక కట్టడం అనేకసార్లు, అనేకమంది చేతులు మారిన వివాదం కూడా లేదు. హజియా సోఫియాను తిరిగి మసీదుగా మార్చడం గురించి ఏ సెక్యులర్ – ఉదార – కమ్యూనిస్ట్ – ఇస్లాంవాదీ ప్రశ్నించలేదు, మాట్లాడలేదు. కానీ తమ దేవాలయాలను పునరుద్ధరించుకోవడానికి హిందువులకు ఉన్న హక్కును మాత్రం ప్రశ్నిస్తున్నారు, కాదంటున్నారు. ఎంతటి ద్వంద్వ వైఖరి !

అలాగే ముస్లిం ప్రతినిధులమని చెప్పుకుంటున్న కొందరు అయోధ్యలో ఉన్నది నూటికి నూరుపాళ్లు మసీదే అని, తాము తగిన బలం సంపాదించుకున్న రోజున రామమందిరాన్ని తిరిగి మసీదు చేయడం ఖాయమని బహిరంగంగా ప్రకటనలు చేసినప్పుడు కూడా ఈ సెక్యులర్ వాదులు ఏమి మాట్లాడలేదు.

ఈ ప్రకటన నిజానికి భారత రాజ్యాంగంపై, భారతీయ రిపబ్లిక్ వ్యవస్థపై పెద్ద దాడి. తమ ప్రయోజనాలకు తగినట్లుగా ఉన్నంతవరకే భారత  రాజ్యాంగాన్ని ముస్లింలు అంగీకరిస్తారని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) చెప్పదలుచుకుందా? తమకు అంగీకారం కాకపోతే షరియాను అమలు చేస్తారా? టీవీలు, వివిధ ప్రసార మాధ్యమాల్లో పలు చర్చల్లో పాల్గొనే ఈ స్వయంప్రకటిత ముస్లిం నేతలు తమకు రాజ్యాంగం కంటే షరియా పైనే గౌరవం ఎక్కువని బాహాటంగానే ప్రకటిస్తుంటారు. తమ అణచివేత, ఆక్రమణ ధోరణి బయటపడిపోకుండా రాజ్యాంగంపై గౌరవం, రాజ్యాంగ విలువలు అనే ముసుగు వేసుకుంటూ ఉంటారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇస్లాంవాదులు ఇలాగే చట్టాలను కించపరుస్తూ, వ్యవస్థలను తూలనాడుతూ ఉంటారు.

వారికి `అవిశ్వాసుల’పై ఉండే అసహనం, కోపం వారి మాటల్లో ఎప్పుడు పయటపడుతూనే ఉంటుంది. మధ్య ప్రాచ్య ప్రాంతం నుంచి `పీడితులైన’ముస్లింలు పక్కనే ఉన్న ముస్లిం రాజ్యంలోకి వెళ్లకుండా పరమతానికి చెందిన యూరప్ కు పడవల ద్వారా చేరుకున్నారు. అక్కడకు శరణార్ధులుగా, దొడ్డిదారిన చేరినవాళ్ళు కాస్త స్థిరపడిన వెంటనే దారుల్ – హర్బ్ (అవిశ్వాసుల భూమి)ను దారుల్ – ఇస్లాం (ఇస్లాం భూమి)గా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అంతే యూరప్ భగ్గున మండింది. ఇక ఇస్లాం దేశాల్లో కూడా ప్రధాన ఇస్లాం శాఖలకు చెందనివాళ్లు, కుర్డులు, యజ్దీల పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది.

రాగల కొన్ని సంవత్సరాల్లో యూరోప్ గతి ఏమవుతుంది? ఇటీవలి బాంబు పేల్లుళ్ళు ప్రమాదవశాత్తు జరిగాయా లేక తీవ్రవాదుల దాడులా అన్నది ఇంకా తేలలేదు. లెబనాన్ ఇప్పటికే పూర్తి షరియా రాజ్యంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల్లో యూరోప్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడవచ్చును. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు వేలాదిమంది `అణచివేతకు గురైన’ పాలస్థినియన్లు లెబనాన్ లో ప్రవేశించారు. ఉదార, ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడిన లెబనాన్ వారందరికి ఆశ్రయం కల్పించింది. 1975నాటికి పాలస్తినియన్ల సంఖ్య 5లక్షలకు చేరింది. అప్పుడే అక్కడ పాలస్తీనా లిబరేషన్ సంస్థ కార్యలయం కూడా వెలసింది. అదే సంవత్సరం పౌరయుద్ధం చెలరేగి ముస్లింలకు `మెరుగైన ప్రతినిధ్యాన్ని’ కల్పించడం కోసం లెబనాన్ ను రెండుగా విభజించారు. కొన్ని దశాబ్దాలలోనే లెబనాన్ తన ఉదారవాద, సంపన్న స్థితిని కోల్పోయింది.

ఇస్లాంవాదులవల్ల వివిధ దేశాలు వివిధ కారణాలతో నాశనమయ్యాయి. కానీ వాటన్నింటిలో ఉదార ప్రజాస్వామ్య  సమాజం మాత్రం పూర్తిగా కనుమరుగయ్యింది. ఒకప్పుడు జిన్నా కూడా సెక్యులర్ పాకిస్థాన్ ఏర్పాటుచేస్తానని హామీ ఇవ్వలేదా? వివిధ దేశాల్లో ఉదారవాదులు, ప్రజాస్వామ్యవాదులను నమ్మించడానికి, చివరికి మోసగించడానికి వేరువేరు అంశాలను వాడుకున్నారు. చివరికి ప్రజాస్వామ్యవాదులు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించేలోగానే వామపక్ష నాస్తికులు, మతఛాందస ఇస్లాంవాదులు కలిసి మొదట ప్రత్యేక సదుపాయాలు, హక్కులు పొంది ఆ తరువాత పూర్తిగా దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అనేక ఆఫ్రికా దేశాల్లో కూడా ఇదే జరిగింది. సూడాన్ విభజన, నైజీరియా, కెన్యాల పతనం ఇలాంటివే. ఇక అణచివేత విషయానికి వస్తే కమ్యూనిస్ట్ ల రాజ్యంలో ఇస్లాంవాదులు, ఇస్లాం దేశాల్లో కమ్యూనిస్ట్ లు అణచివేతకు గురయ్యారు. ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి చైనా చూడండి. కానీ కమ్యూనిస్ట్ లు, ఇస్లాం వాదులు కలిసి ప్రజాస్వామ్య దేశాలను నాశనం చేస్తూనే ఉన్నారు.

ఈ సత్యాలను గురించి ఎవరు మాట్లాడతారో వారు ఇస్లాం వ్యతిరేకులు అని ముద్ర వేస్తారు. కానీ నిజాలు చెప్పవలసిందే. ఎందుకంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను ఉపయోగించుకుని చివరికి షరియా రాజ్యాన్ని తేవడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని భారతీయులందరూ తెలుసుకోవాలి, అప్రమత్తమవ్వాలి. అవిశ్వాసులపై యుద్ధం చేసి వారిని జయించడం అన్నది మాత్రమే వారి అంతిమ లక్ష్యమని, అందులో ఎలాంటి రాజీ ఉండదని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటన చూస్తే అర్ధమవుతుంది.

పవిత్ర గ్రంధంలో చెప్పిన ప్రకారమే తాము చేస్తున్నామని తీవ్రవాదులు చెప్పే మాటలు నమ్మరాదని, `నిజమైన’ ముస్లింలు వేరని, వాళ్ళు అలా వ్యవహరించరని నిజాలను చూడలేని కొందరు ఇతరులను మభ్యపెట్టాలని చూస్తారు. వహాబీలు చెప్పేవన్నీ నిజం కావని వాళ్ళు గ్రహించరు. “నీకు నీ మతం ఎంతో, నాకు నా మతం’’ (109:1-6) అనే  సూక్తి నిజమే అయినా, `పవిత్ర మాసాలు పూర్తయిన తరువాత విగ్రహారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ చంపేయ్యి. బందీలుగా పట్టుకో. వాళ్ళను వెంటాడి వేటాడు. వాళ్ళు లొంగిపోతే ప్రార్ధన చేయించు, వాళ్ళు జకా ఇస్తే పుచ్చుకుని వదిలిపెట్టు. ఎందుకంటే అల్లా క్షమిస్తాడు, జాలిచూపిస్తాడు’(9.5) అని కూడా అదే గ్రంధంలో ఉంది. వహాబీలు ప్రవక్త జీవితంలో రెండవ అంశాన్నే అనుసరిస్తామని అంటే అది తప్పని చెప్పే ధైర్యం, బలం ఈ `సెక్యులర్’వాదులకు లేవు. ఆ విధంగా `శాంతిమతం’ వహాబీల చేతిలో చిక్కుకుంది.

ప్రాచీన నాగరకతను పునరుద్ధరించుకునే కార్యంలో రామమందిర నిర్మాణం మొదటి అడుగు మాత్రమే. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటన, హజియా సోఫియా, రామమందిరాలను ఒకే గాటన కడుతున్న వామపక్ష – ఉదార – ఇస్లాంవాదుల కూటమి వాదన భారతీయ నాగరకతపై జరుగుతున్న దాడులు అంతంకాలేదని స్పష్టం చేస్తాయి. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్ళు ఈ పోరాటం మరింత ఉధృతమవుతున్నదని సూచిస్తున్నాయి.

Source: News Bharati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here