Home News సంచార సమాజ జ్ఞానం నుండి యావ‌త్ సమాజం ప్రయోజనం పొందింది – డాక్టర్ మోహన్ భగవత్...

సంచార సమాజ జ్ఞానం నుండి యావ‌త్ సమాజం ప్రయోజనం పొందింది – డాక్టర్ మోహన్ భగవత్ జీ

0
SHARE

సంచార సమాజం వ్యాపారం కోసం కాదు, యావ‌త్ స‌మాజం కోసం బతుకుతోందని, సంచార సమాజం జ్ఞానం నుండి సమాజ‌మంతా ప్రయోజనం పొందింద‌ని, అది నేటికీ కొనసాగుతోంద‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ భగవత్ జీ అన్నారు. మ‌హారాష్ట్రలోని  జల్నాలో సంత్ భగవాన్ మహారాజ్ ఆనంద్‌గడ్కర్ రచనల ప్రాముఖ్యతను వివరించే ‘ఆనంద్ నిధాన్’ పుస్తకాన్ని మోహన్ భగవత్ జీ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో హిందుస్థాన్ ప్రకాశన్ సంస్థ అధ్యక్షుడు, పద్మశ్రీ రమేష్ జీ పతంగే, సంత్ భగవాన్ మహరాజ్ ఆనంద్‌గడ్కర్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మోహ‌న్ భ‌గ‌వ‌త్ జీ మాట్లాడుతూ సంచార సమాజానికి మెటలర్జీ, వైద్య చికిత్స మొదలైన వాటిపై అవగాహన ఉంద‌న్నారు. వారు అమ్మే వస్తువులను ముందుగా పూజిస్తార‌ని తెలిపారు. పరాయి పాలకుల వల్ల సంచార సమాజం అధోగతి పాలైంద‌ని, మనం కూడా పట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో మన సాధువులు విశేష కృషి చేశార‌న్నారు.

‘జ్ఞానం, క్రియలు కలిసి కోరుకున్నప్పుడే ఉపయోగపడతాయని, భక్తి లేకపోతే ప్రయోజనం ఉండదని అన్నారు. ఆలోచనలు మనిషిని దేవతలుగా, రాక్షసులుగా మారుస్తాయ‌ని, దీనిని అర్థం చేసుకోగల జ్ఞానం సాధువులకు ఉంద‌న్నారు. భగవంతుడు మన ఊహలలో అనంతమైన ఆకాశాన్ని సృష్టించడం చూస్తాం, కానీ జ్ఞానాన్ని ప్రసాదించేది సాధువులే అని అన్నారు. వారు మన ఊహకు మించి చూస్తార‌ని, సాధువుల బోధలను పాటించడం మన కర్తవ్యమ‌ని అన్నారు. అలాగే, హిందూ సమాజం ఎన్నో ఎళ్ల ప్ర‌య‌త్నం త‌ర్వాత నేడు అయోధ్య‌లో బాల‌రాముడు కొలువుదీరిన బంగారు క్షణాల‌ను చూశామ‌న్నారు. నేడు ప్రపంచం భారతదేశం నుంచి నేర్చుకుంటున్నద‌ని, ప్రపంచం సంతోషించేలా భార‌త్‌ ఎదగాలని ఆయ‌న ఆక్షాంక్షించారు.

కులాలు దేవుడి వల్ల కాదు సమాజం ద్వారా సృష్టించబడ్డాయ‌ని, కావున మనిషి సమానత్వం, ఆప్యాయతలను అర్థం చేసుకుని జీవించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రాముడు, భరతుడు మ‌న‌కు ఆదర్శ‌మ‌ని, ఇదే మన సోదరభావ‌మ‌ని, ఈ ఆదర్శంతోనే మనం భగవంతుడిని పూజించినట్లుగా సాత్వికంగా జీవించాల‌న్నారు. భగవాన్ బాబా ఒక వ్యక్తి కాదు శక్తి అని, ఆయ‌న సన్నిధి ద్వారా మీ జీవితమంతా ధన్యమైంద‌ని, మీరందరూ అదృష్టవంతుల‌ని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్ సంఘచాలక్ జీ ఆనంద్‌ఘర్‌లోని అన్ని మహాపురుషులు, దేవాలయాలను సందర్శించారు. స్వాతంత్య్ర‌ వీరుడు తాంత్యా మామా భిల్ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. శబరీధాం, సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం, గౌశాల వద్దకు వెళ్లి గోవులకు బెల్లం తినిపించారు.