Home Telugu Articles హిందువులకు మానవ హక్కులు ఉండవా ?

హిందువులకు మానవ హక్కులు ఉండవా ?

0
SHARE

పాకిస్థాన్ , బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందువులకు మానవహక్కులు ఏవి?  కాశ్మీరీ పండిట్ ల కు మానవ హక్కులు ఉండవా ??

ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1948 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి చేసిన ఒక తీర్మానంతో మానవ హక్కుల దినోత్సవానికి ప్రాముఖ్యత వచ్చింది. కానీ ఈ మానవహక్కుల పరిరక్షణ అంతటా జరుగుతోందా? మానవహక్కుల ఉల్లంఘనను యుఎన్ అరికట్టగలుగుతోందా అంటే సందేహమే. మన పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో మైనార్టీలుగా జీవనం సాగిస్తున్న హిందువులకు మానవహక్కులు అందని ద్రాక్ష అయ్యాయి. ఇస్లామిక్ ఛాందస భావజాలంతో ఆ దేశాలు అక్కడి మైనారిటీల హక్కులను కాలరాస్తున్నాయి. అంతదాకా ఎందుకు మన దేశంలోనే కాశ్మీర్ లో పండిట్ ల హక్కులను , వాల్మీక మొదలగు హిందూ జాతుల హక్కు ల ను ఆర్టికల్ 370 కింద ఎంత దారుణాలు జరిగినాయొ అందరికీ తెలుసు అయినా సరే మన లిబరల్ మూకలు ఒక్క మాట మాట్లాడరు . పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల అకృత్యాలు కశ్మీరీ పండితులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఏడాది దాటిన క్రమంలో స్వస్థలాలకు తిరిగి చేరుకుంటున్న కశ్మీరీ పండితులను నిరాశ్రయులను చేసే కుట్రను దాయాది దేశం పాకిస్తాన్ అమలు చేస్తున్నది. కానీ మానవహక్కులంటూ గుండెలు బాదుకునే మేధావులు సొంత గడ్డపై కశ్మీరీ పండితులకు మృగ్యమైపోతున్న హక్కులపై ఎలాంటి నిరసనలు వ్యక్తం చేయరు.

ఒక వైపు జమ్మూ కాశ్మీర్‌లో కశ్మీరీ పండితుల నుంచి మానవ హక్కులను దూరం చేస్తున్న పాకిస్తాన్ పాలకులు.. వారి దేశంలో మైనార్టీలుగా జీవిస్తున్న హిందువులపై కొనసాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. హిందూ దేవాలయాలపై మెజార్టీ ముస్లిముల దాడులు నిత్యకృత్యంగా మారిపోయింది. ఇటీవల హిందువులపై అక్కడి సర్వోన్నత న్యాయస్థానం మూడు కోట్ల రూపాయలకు పైగా విధించిన అపరాధ రుసుము అక్కడ సాగుతున్న వివక్షకు పరకాష్ట. దేవాలయంపై దాడి చేసిన ముస్లిము మూకలను వదిలి హిందువులపై అపరాధ రుసుము విధించడమే విచిత్రమైన విషయం. అంతేకాదు అఖిల పాకిస్తాన్ హిందూ మండలి చెల్లించే ఈ మూడు కోట్ల రూపాయలను ముస్లిం మూకలు ధ్వంసం చేసిన దేవాలయాల పునరుద్ధరణకు వినియోగించాలని కోర్ట్ చెప్పడం మరీ విచిత్రం. బాధితుడి బాధను తీర్చడానికి వాడి జేబులో నుంచే పరిహారం ఇవ్వాలనే తీర్పు మైనార్టీ హిందువులపట్ల పాకిస్తాన్ ధోరణికి ఉదాహరణ. పాలకుల ప్రోద్బలంతో మెజార్టీ ముస్లిములు జరుపుతున్న అకృత్యాలు, బలవంతపు మత మార్పిడులతో.. మొదట్లో జనాభాపరంగా రెండంకెల్లో ఉన్న హిందువుల శాతం ప్రస్తుతం అత్యంత కనిష్టానికి పడిపోయిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయినా సరే ఈ మానవ హక్కుల గురించి గప్పాలు కొట్టే ‘ ఉదారుణ’ భావజాలులకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు.

హిందువుల హక్కులను కాలరాయడంలో మరో పొరుగుదేశమైన బంగ్లాదేశ్ సైతం తక్కువేమీ తినలేదు. గడచిన 50 సంవత్సరాలుగా ఏదో ఒక సాకుతో మైనార్టీలుగా జీవిస్తున్న హిందువులపై అక్కడి ముస్లిము మూకలు దాడులు చేస్తూనే ఉన్నాయి. పాలకులు మారినా మైనార్టీ హిందువుల తలరాతలు మారడంలేదు. ఇటీవల విజయదశమి నవరాత్రుల సందర్భంగా హిందూ దేవాలయాలపై ముస్లిము మూకలు జరిపిన దాడి బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనది. మైనార్టీ హిందువుల పట్ల బంగ్లాదేశ్ పాలకుల ఉదాసీనత, మెజార్టీ ముస్లిములు చూపుతున్న వివక్ష, పాల్పడుతున్న అకృత్యాలు దేశ జనాభాలో హిందువుల శాతం గణనీయంగా పడిపోతున్నది. 50 ఏళ్ళ క్రితం బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పుడు దేశ జనాభాలో 30 శాతంగా ఉన్న హిందువులు ప్రస్తుతం తొమ్మిది శాతానికి పరిమితమయ్యారంటే వారిపై దాడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్ధమవుతుంది.

ప్రతి సంవత్సరం మొక్కుబడిగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరిపినందువల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మానవహక్కుల పరిరక్షణ గురించి తగు చర్యలు చేపట్టాలి. ఆ దిశగా ఐక్యరాజ్యసమితితో పాటుగా అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.