Home Interviews హిందూ దేశం కాబట్టే భారత్ సెక్యులర్ దేశం అయింది – ఎస్. గురుమూర్తి

హిందూ దేశం కాబట్టే భారత్ సెక్యులర్ దేశం అయింది – ఎస్. గురుమూర్తి

0
SHARE

అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడపడం నరేంద్ర మోడి సాధించిన అతిపెద్ద ఘనత అని మీరు అనుకుంటున్నారా?

అది ప్రధానమైన ఘనత. అవినీతిరహిత ప్రభుత్వం లేనిదే మోడి ఏది సాధించలేరు. అలాంటి అవినీతి లేని ప్రభుత్వాన్ని నడపడం భారత్ లో అసాధ్యమనే అభిప్రాయం ఉండేది. కానీ అది అసాధ్యం కాదని మోడి చూపించారు.

ఇది ఆయన ప్రాధమిక రాజకీయ దృక్పథం. పెడదారిలో పోతున్న రాజకీయాలను మార్చి నిజాయితీతో కూడిన నిర్ణయాలను తీసుకునే ప్రక్రియను ప్రారంభించడానికి కొంత సమయం పట్టింది.

ఆయన స్వయంగా 75 మంది సంయుక్త కార్యదర్శులను ఎంపిక చేసి నియమించారు. ఇది ఇప్పటివరకు ఏ ప్రధాని  చేయలేదు. ఇక్కడే పరిపాలనా వ్యవస్థలో మంచి, చెడు ప్రారంభమవుతాయి.

పైకి చూడటానికి అనేక మంత్రిత్వ శాఖలు కనిపిస్తున్నా దేశాన్ని మాత్రం ప్రధానమంత్రి కార్యాలయమే నడిపిస్తోందనే విమర్శ ఉంది.

ప్రభుత్వాన్ని నడపడంలో ప్రధానమంత్రి కార్యాలయం పాత్ర ఉందని మాత్రమే నేను చెపుతాను. మన్మోహన్ సింగ్ హయాంలో అసలు ప్రధాని కార్యాలయమే లేదు. అందువల్లనే ప్రతి నిర్ణయంలోను బయటనుండి జోక్యం చేసుకునేవారు.

అయితే ఇప్పుడు ప్రతి మంత్రిత్వ శాఖలోను ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుంటోందని మీరు చెప్పలేరు. కేవలం నిజాయితీతో, తగినంత అధికారంతో ఆయా శాఖలు బాగా పనిచేసేటట్లు చూస్తోంది. ఏ శాఖపై బలవంతంగా నిర్ణయాలను రుద్దడం లేదు. ఆయా శాఖలతో పూర్తి సమన్వయం, చర్చల ద్వార అవి తీసుకున్న నిర్ణయాలకు ప్రధాని మద్దతు లభిస్తోంది. అంటే దీని అర్ధం ప్రధానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కాదు.

అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడపడమనేది ఘనత అయితే, గో సంరక్షకులు, అమాయాకుల హత్యలు చెడ్డ పేరు తెచ్చాయని అనుకుంటున్నారా?

ఇలా అమాయకులపై దాడులు చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే గోసంరక్షకులు కూడా ఎప్పుడు ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అవన్నీ భూతద్దంలో చూపిస్తున్నారు. అవన్నీ అలా జరగాలని నేను అనడం లేదు. కానీ వాటన్నిటికి ప్రభుత్వ ఆమోదం ఉన్నదా? ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ప్రభుత్వం నిందితులను శిక్షిస్తున్నదా లేదా?

పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గోసంరక్షకుల చర్యలను స్వయంగా నరేంద్ర మోడి ఖండించారు. ఆయన పాలనలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయని మీరు అంటున్నారా?

ప్రస్తుతం దేశంలో గో మాంసం గురించి బాగా చర్చ జరుగుతోంది. ప్రజల ఆహారపు అలవాట్లలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఎంతవరకు సబబు?

ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం లేదు. ఇప్పుడు పశువులను కాపాడుకోకపోతే పదేళ్ళ తరువాత పాలు కూడా దిగుమతి చేసుకోవాల్సివస్తుంది. గోమాంస భక్షణాన్ని ప్రోత్సహిస్తే పర్యావరణం నాశనమవుతుంది. పారిస్ పర్యావరణ సదస్సులో సోమవారాన్ని మాంసరహిత దినంగా పాటించాలని అంతా ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే మాంసం పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. శాకాహారం కంటే గోమాంసంకు 48 శాతం ఎక్కువ నీరు అవసరమవుతుంది. తాము తీసుకునే మాంసాహారంలో సగం తగ్గించుకోవాలని చైనా తమ ప్రజానీకాన్ని కోరుతోంది. అలా కోరడం ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడమేనని అనుకున్నా అది పర్యావరణానికి మంచిది. అందులో తప్పు లేదు. పశుసంపద నష్టమైనప్పుడు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడినప్పుడు ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించవచ్చును. భారతదేశంలో గోవు అన్ని జంతువులవంటిది కాదు. రాజ్యాంగం ప్రకారం గోవును, గోసంతతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. రాజ్యాంగంలోని 48వ అధికరణం అటువంటి బాధ్యతను ప్రభుత్వంపై ఉంచుతోంది. ఆవు మూత్రం, పేడ నేలను సారవంతం చేస్తాయి కాబట్టి ముసలివైపోయిన, ఆర్థికంగా నిరుపయోగమైన ఆవులను కూడా పరిరక్షించాల్సిందేనని 2005లో సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. నిజానికి పనికిరాని ఆవు అంటూ లేదని కోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజనానికి పెద్దపీట వేసే 48వ అధికరణం ఆహారాన్ని ఎంపిక చేసుకునే  వ్యక్తిగత హక్కును పక్కకు పెడుతుందని సుప్రీం కోర్ట్ పేర్కొంది. ఈ రోజు అనేక దేశాలు పర్యావరణ పరిరక్షణ కోసం గోమాంసం వినియోగాన్ని నియంత్రిస్తున్నాయి. మనదేశంలోనే మొత్తం 29 రాష్ట్రాల్లో 18 ఇప్పటికే గోవధను నిషేధించాయి. ఈ నిషేధం చాలామటుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అమలులోకి వచ్చింది. అలా వారు కూడా ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకున్నారని అనాల్సిందేగా? గోవు మతపరమైన విషయం ఎలా అవుతుంది?  1970లో కాంగ్రెస్ ఎన్నికల గుర్తు ఆవు, దూడ. ఇవాళ కాంగ్రెస్ అదే దూడను బలిపెడుతోంది. ఎంత పతనం!

ఉత్తరాదిలో మాదిరిగా కాకుండా కేరళలో హిందువులు కూడా గోమాంసం తింటారు. బెంగాల్, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలలో కూడా అంతే .

సరే. దీనిని బట్టి ఇది మతపరమైన అంశం కాదని, ముస్లిములను లక్ష్యం చేసుకున్నది కాదని మీరు అంగీకరిస్తున్నట్లే కదా. ఇది మన పశుసంపద, వ్యవసాయం, పర్యావరణాలను కాపాడటం కోసమని మీరు ఎందుకు అనలేరు? ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో ఆవు మాదిరిగా కనిపించే మిథున్ మాంసాన్ని తింటారు. అక్కడ ఈ ముస్లిములపై దాడి అనే వాదన ఎందుకు రావడంలేదు?

అదంతా రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి కదా? రాష్ట్రాలు(ప్రజానీకం) ఏమి తినాలన్నది నాగపూర్(ఆర్ ఎస్ ఎస్ కేంద్రం), ఢిల్లీ వారు నిర్ణయించకూడదని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ అన్నారు కదా?

గోమాంసం తినరాదని ఎవరైనా వారిని అడ్డుకున్నారా? కావాలంటే వాళ్ళు తినవచ్చును. పర్యావరణానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళు గోమాంస వివాదంగా ఎందుకు మారుస్తున్నారు? చట్టం ఒక్కటే చెపుతోంది. మార్కెట్ లో బహిరంగం గా పశువులను అమ్మడానికి వీలులేదు. ప్రైవేటుగా కొనుక్కోండి, తినండి. గోమాంసం పై 50% పన్ను విధిస్తే అప్పుడు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని అనవచ్చును. నిజానికి పాశ్చాత్య దేశాలు అదే చేయబోతున్నాయి. ప్రజలకు అందకుండా భారీ పన్ను విధించాలని అనుకుంటున్నాయి.

రైతులు తమ ఆవుల్ని మరొకరికి అమ్ముతుంటే, గో రక్షకులకు ఇతరులను ఇబ్బందిపెట్టేందుకు అవకాశం లభించడం లేదా?

అలాంటి సందర్భాల్లో గో రక్షకులు అడ్డంకులు సృష్టించినప్పుడు ఆలోచిద్దాం. ఇలాంటి ఊహలు ఎందుకు?

మోడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో హైందవీకరణ జరుగుతోందని విమర్శకుల వాదన. మీరేమంటారు?

భారతదేశం హైందవీకరణ చెందిన దేశం. అందుకనే అది మతనిరపేక్ష (సెక్యులర్) దేశంగా ఉంది. ఒకవేళ అది ఇస్లామీకరణ చెందిన దేశమై ఉంటే అప్పుడు ఈ మతనిరపేక్షత ఎక్కడ ఉండేది? తన `గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకంలో నెహ్రూ భారతీయ జాతీయత , హిందూ జాతీయత మధ్య అంతరం చాలా పలుచగా ఉంటుందని, దీనికి కారణం హిందువులు అధికసంఖ్యాకులుగా ఉన్న ఏకైక దేశం భారతదేశమేనని రాశారు. అదే నేటికీ నిజం. దేశవిభజన, స్వాతంత్ర్యం తరువాత ఈ మతనిరపేక్ష వాదం పక్కదారులు పట్టింది. సెక్యులర్ వాదులు దేశంలో  బూటకపు సెక్యులర్ విధానాన్ని ప్రచారం చేశారు. ఓటు బ్యాంకు ప్రయోజనాలకోసం దానిని మైనారిటీ హక్కులు, మైనారిటీల సంతుష్టీకరణగా మార్చేశారు. అలా సెక్యులరిజం భ్రష్టుపట్టిపోయింది. సెక్యులరిజం అంటే అన్ని మతాలకు సమాన అధికారాలు అని అర్థం. నిజానికి ప్రత్యేక హక్కులు అంటే సెక్యులరిజానికి వ్యతిరేకం. భారతదేశానికి హిందూత్వంతో సంబంధం లేదని మీరు అనలేరు. ఇక్కడ హిందూ విలువలు, ఆచారాలు, తత్వం, ప్రతి మతంపట్ల హిందూ దృష్ఠి , అంగీకారం కనిపిస్తాయి. ఇవన్నీ భారతదేశానికి విలువైన ఆస్తి. ఈ దేశం సెక్యులర్ గా ఉందంటే దానికి కారణం అది హిందూ దేశం కాబట్టే.

మీరు ఇలా మాట్లాడడం వల్ల ఇతర మతాలకు చెందినవారు మీకు దూరమవుతున్నారని అనిపించడం లేదా?

వాళ్ళు ఎందుకు దూరం కావాలి? పాకిస్తాన్ లాగా భారత్ ముస్లిం ఆధిక్య దేశం కానందుకు ముస్లిములు సంతోషించాలి. అక్కడ షియాలు, అహ్మదియాలు మొదలైన సున్నీయేతర వర్గాలకు ఏంజరుగుతోందో చూడండి. మైనారిటీ హక్కులు అని మాట్లాడితే మెజారిటీ పాలనను ఒప్పుకోవాల్సిందే.  భారత్ హిందూ అధిక సంఖ్యాక దేశమన్నది నిర్వివాదాంశం. ఇక్కడ హిందూ సంస్కృతే ప్రధాన సంస్కృతి. దీనిని కూడా కాదనలేరు. రాజ్యాంగం మైనారిటీలకు రక్షణ కల్పిస్తోంది. ఈ సెక్యులర్ వాదం అనేది భారత దేశపు అస్తిత్వాన్ని వక్రీకరిస్తుంది. రాజ్యాంగపు ప్రధమ ప్రతిని చూడండి. అందులో రామాయణం, మహాభారతాల చిత్రాలు ఉంటాయి. ఆనాటి రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేసిన అప్పటి పెద్దలకు భారతదేశపు హిందూ అస్తిత్వం, సెక్యులర్ స్వభావాల మధ్య ఎలాంటి వ్యత్యాసం, ఘర్షణ కనిపించలేదు.  

ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే లేదా వ్యతిరేకిస్తే వాళ్ళని దేశ వ్యతిరేకులంటున్నారు

దీనిని కారణం అలా ప్రశ్నిస్తున్నవారిలో ఎక్కువమంది దేశ వ్యతిరేకులు ఉండడమే. వాళ్ళ గత చరిత్ర చూస్తే అర్ధమవుతుంది. వాళ్ళు వేర్పాటువాదుల్ని ఎలా సమర్ధించారు, భారత్ అసహనశీల దేశమనే ప్రచారం ఎలా చేశారు అన్నది గమనిస్తే తెలుస్తుంది. ఒకవేళ బిజెపిపై  అసహనశీలత ఆరోపణ చేశారంటే అది నేను అర్ధం చేసుకుంటా. కానీ వాళ్ళు మొత్తం హిందూ సమాజం, భారతదేశమే అసహనశీలమైనదని ప్రచారం చేశారు. ఒకవేళ కొందరు తప్పు చేస్తే వారిని మాత్రం అసహనశీలురు అనవచ్చును. కానీ ఏకంగా జాతి మొత్తం అసహనశీలమైనది ఎలా అవుతుంది? అలా అంటున్నారంటే వాళ్ళు దేశ వ్యతిరేకులు కారా?

మోడి ప్రభుత్వ పనితీరుపై మీరు సంతోషంగా ఉన్నారా?

తనను హిట్లర్ గా అభివర్ణించినవారి నోళ్ళు ఆయన మూయించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఒక హిందూ సాంస్కృతిక జాతీయవాది అందరికీ న్యాయం చేయగలుగుతాడని ఆయన చూపారు. ప్రపంచపు గౌరవాన్ని పొందగలిగారు. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పగలిగారు. కాశ్మీర్ విషయంలో దృఢమైన వైఖరి అవలంబించగలిగారు. ణా అభిప్రాయం వారకు చాలామంది ప్రధానమంత్రులు 10 ఏళ్లలో చేయగలిగేది ఆయన 3 ఏళ్లలో చేసి చూపారు. 

ఆయనకు ఎన్ని మార్కులు ఇస్తారు?

మొత్తం 10 మార్కులలో ఆయనకు 7 మార్కులు ఇవ్వవచ్చును. ఆయన అద్భుతాలు సాధించారు. ఆయన మాటల మనిషి కాదని చేతల మనిషని ప్రత్యర్ధులు కూడా అంగీకరిస్తారు. చాలామంది ప్రధానులు కనీసం ఊహించలేని  క్లిష్టమైన, కష్టమైన నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. పోఖరన్ అణు పరీక్షల తరువాత అంతటి క్లిష్ఠమైన జాతీయ నిర్ణయాలు మోడి హయాములోనే కనిపిస్తాయి. కొందరు మంత్రిమండలి సహచరుల పనితీరు ఆ స్థాయిలో లేదు. మంత్రిత్వ శాఖల్లో లోపాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిఉంటుంది. ముద్రా యోజన పధకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం సఫలం కాలేదన్నది నిజం. ఈ పధకం వల్లనే దేశ ప్రగతికి, ఉపాధి కల్పనకు దోహదం చేసే చిన్న పరిశ్రమలు వస్తాయి. పధకం అమలు రెండేళ్ళు ఆలస్యం అయింది.

(రీడిఫ్.కామ్ సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here