Home Telugu Articles హిందూ మారణహోమం – కాశ్మీర్ ఫైల్స్- ప్రజల చలనచిత్రం

హిందూ మారణహోమం – కాశ్మీర్ ఫైల్స్- ప్రజల చలనచిత్రం

0
SHARE

-ప్రదక్షిణ

ఒక జాతి మొత్తాన్ని కదిలించే శక్తి, ఒక సినిమాకి అరుదుగా లభిస్తుంది.  కాశ్మీర్ ఫైల్స్ అది నిరూపించింది.  వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారి హృదయవిదారకమైన వాస్తవిక హిందీ చిత్రం `కాశ్మీర్ ఫైల్స్’, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు, ముఖ్యంగా కాశ్మీరీ హిందువుల హృదయాలను కలచివేస్తోంది. ఎక్కడో మనసు పొరల్లో అణగారిపోయిన బాధ, ఆక్రోశం పెల్లుబుకుతున్నాయి. సినిమా చూసినవారు చలించిపోతూ ఎపుడు తాము తమ ప్రియమైన మాతృభూమి కాశ్మీర్ వెళ్ళగలరో అని ఎదురుచూపులు చూస్తున్నారు.

హృదయాలని పిండేసే కధనంతో, ముందుకు వెనక్కు ఫ్లాష్బ్యాక్ పద్దతిలో, దర్శకుడు జరిగిన సంఘటనలను క్రమంగా మన కళ్ళ ముందు ప్రతిభావంతంగా ఆవిష్కరిస్తారు. ఈ చిత్రంలో కొన్ని ముఖ్య సన్నివేశాలు ఇంతకుముందు `హిందూ నరసంహారం’ అనుభవించిన  కాశ్మీరీలు వెల్లడి చేసినా, వాటిని సమర్థవంతంగా కధనంలో చొప్పించారు దర్శకుడు. ఇస్లామియా జిహాదీ మూకలు కాశ్మీరు లోయలో, `కాఫిర్’ హిందువులను దూరంగా ఉంచి, ఆహారం కూడా లేకుండా చేసి, వారిపై విద్వేషం పెంచుకుని, `రాలివ్, సాలివె, గాలివ్, (ఇస్లాంకి మతం మారండి, ఇక్కడినుంచి పారిపోండి, లేదా చావండి) అనే నినాదాలిస్తూ ఆ ప్రాంతమంతా జిహాదీ ఉగ్రవాదాన్ని బలంగా వ్యాప్తి చేసారు. పైగా హిందూ పురుషులను వెళ్ళిపొమ్మని, స్త్రీలు మాత్రం మతమార్పిడికి, అనుభవించడానికి పనికి వస్తారని, వారి భావజాలాన్ని నిర్లజ్జగా ప్రకటించారు. క్రమక్రమంగా నెలలు, సంవత్సరాలపాటు ఈ భయానక విద్వేష వాతావరణాన్ని సృష్టించి, చివరికి 19thజనవరి1990 తేదిన ఉగ్రవాద జిహాదీలు, యధేఛ్చగా హిందువుల నరసంహారం, బలాత్కారాలు జరిపించారు. శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉండి, తమతో కలిసి తిని తిరిగి,  పండుగలు పబ్బాలు కలిసి జరుపుకుంటున్న తమ స్నేహితులు, ఇరుగుపొరుగువారు, తమ మీద దాడి చేయడంతో, ఆ కాళరాత్రి, తెల్లని మంచుకొండల్లో గడ్డకట్టేసే చలిలో, హిందువులు ప్రాణాలు అరచేత పెట్టుకుని, ఇళ్ళు సంపద, వస్తువులు అన్ని వదిలేసి పారిపోయారు. ఉగ్రవాద జిహాదీలు దొరికిన వారిని హత్య చేసారు, స్త్రీలపై  బలాత్కారాలు జరిపారు.

ఇంత భయావహ చరిత్రని, దర్శకుడు ప్రతిభావంతంగా అల్లుకుపోతారు, కఠినమైన వాస్తవాలను చాకచక్యంగా క్రమబద్ధంగా పేర్చుకుంటూ వెళ్తారు. చాలా చోట్ల సంభాషణలు కాశ్మీరీ భాషలో, కింద ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ తో ఉంటాయి. నటి `భాషా సుమ్బ్లి’, `శారద’ పాత్రను ఎంతో సున్నితంగా పోషించారు, ఆమెకు ఇద్దరు పిల్లలు, రెండో బాబు పసివాడు. తన మామగారైన `పుష్కర్నాథ్ పండిట్’ దగ్గర స్కూల్లో ఒకప్పుడు చదువుకున్న  విద్యార్థి, ఉగ్రవాదిగా వారింట జొరబడి, ఆమె భర్తని చంపి, అతని రక్తంతో తడిసిన బియ్యాన్ని ఆమె తింటేనే ఆమె పిల్లల్ని  వదిలేస్తానంటే, ఆమె ఏడుస్తూ అ పని చేస్తుంది. జనాదరణ ఉన్న హిందూకవి `సర్వానంద్  ప్రేమీ కౌల్’ ఇంట్లో ఆ భయంకరమైన మంచుగడ్డల చలిరాత్రిలో స్త్రీలు అందరూ తలదాచుకుంటారు, అయన ముస్లిం స్నేహితులు తలుపు తట్టి ఎదో నెపంతో ఆయనని ఆయన కొడుకుని బయటకి తీసుకెళ్ళి చంపేసి, నిశిరాత్రి మంచుకొండల్లో,  నిలువెత్తుగా ప్రేతాలలా చెట్లకు వేళ్ళాడదీస్తారు. 7000మంది హిందువులను సమాధి చేసారని సినిమాలో ఒక ప్రస్తావన ఉంటుంది.

ఎన్నో  ఫ్లాష్బాక్ల మధ్య తమ స్వస్థలాల నుంచి వెళ్లగొట్టబడిన లక్షలాది కుటుంబాలు, కాశ్మీర్ లోయ అవతల, అత్యంత దయనీయ పరిస్థితుల్లో, టెంట్లలో బతుకు వెళ్ళదీస్తుంటారు. కొంతకాలం తరువాత ఉగ్రవాదులు, భారత సైన్యం దుస్తుల్లో వచ్చి మోసంచేసి, మళ్ళి మూకుమ్మడి హత్యలు చేస్తారు. శారద బట్టలు ఊడదీసి, రంపపు యంత్రంలోకి ఆమెని జొప్పించి, నిలువునా రెండు ముక్కలు చేసి ఆమెని హతమారుస్తారు; ఓం నమశ్శివాయ అంటూనే ఆమె ప్రాణాలు పోతాయి. పెద్ద కొడుకు ఆ దృశ్యాన్ని చేష్టలుడిగినట్లు గాజు కళ్ళతో చూస్తాడు, తరువాత ఆ బాలుడిని ఇంకా23మంది ఇతరులతో కలిపి బుల్లెట్ల వర్షం కురిపించి చంపేస్తారు.

ఈ మొత్తం సినిమా మనం జెఎన్యు విశ్వవిద్యాలయ విద్యార్థి కృష్ణ కళ్ళ ద్వారా చూస్తాము, ఇతను శారద చిన్న కొడుకు, తాతగారైన పుష్కర్నాథ్ పండిత్, గతం తెలియకుండా ఇతన్ని పెంచుతారు; ఇతను విద్యార్థి సంఘం నాయకుడిగా పోటీ చేస్తుంటాడు. యువ నటుడు `దర్శన్ కుమార్’ అద్భుతంగా నటించిన పాత్ర ఇది. ఇతను తాతగారి చితాభస్మంతో కాశ్మీరు యాత్రకై వెళ్ళగా, తాతాగారి పాత స్నేహితులను కలిసి, ఆ జ్ఞ్యాపకాలలో, సంభాషణల్లో మెల్లిగా తన కుటుంబ గతం తెలుసుకుంటాడు. ప్రఖ్యాత నటుడు. కాశ్మీరీ కూడా అయిన `అనుపమ్ ఖేర్’, `పుష్కర్నాథ్ పండిత్’ పాత్రలో జీవించారు. వృద్ధాప్యం మీదపడినా, ఆర్టికల్370 రద్దు చేయాలని అలుపులేని పోరాటం చేసే కార్యకర్తగా, తన మనవడు తప్పుదారిలో నడుస్తూ, దేశ వ్యతిరేక కార్యకలాపాలలో తిరుగుతున్నాడనే వ్యధ, నిస్సహాయతతో దీనావస్థలో ఉన్న తాతగారి పాత్రలో ఖేర్ జీవించారు.  జెఎన్యు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గా నటి `పల్లవీ జోషి’ విద్యార్థులను దేశవ్యతిరేక ఆలోచనలు, తప్పుడు కార్యక్రమాలకు ఎగదోసి, విద్యార్థుల మనస్సుల్లో దేశం పట్ల విషం నింపే పాత్రను అద్భుతంగా పోషించారు. విద్యార్థులను `ఆజాదీ’ అంటూ నినాదాలు చేయిస్తూ, కాశ్మీర్ను`ఇండియా ఆక్రమణ’ నుంచి విడిపించాలని విద్యార్థులకు ఉద్బోధ చేసే పాత్ర అది. ఆ క్రమoలోనే, భారత విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ప్రొఫెసర్లకు, కాశ్మీర్లోని దేశ విచ్చిన్నకర  ఉగ్రవాద నెట్వర్కులతో  ఉండే బలమైన సంబంధాల పైన దర్శకుడు తమ దృష్టి పెడతారు. పాకిస్తానీ కవి `ఫైజ్ అహ్మద్ ఫైజ్’ ప్రఖ్యాత `హం దేఖేంగే’ గేయాన్ని కాశ్మీరును ముక్కలు చేయడానికి ప్రతీకగా జెఎన్యు విద్యార్థి సంఘం చూపించగా, దర్శకుడు తెలివిగా ఆ దుష్ప్రచారాన్ని తిప్పి కొడతారు.

ఈ దేశంలో దశాబ్దాలుగా చలామణిలో ఉన్న ఎన్నో కుహనా భావజాలాలను, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, తనదైన సూటి నిజాయితీ శైలిలో, ముసుగులను తొలగించి నిజాలు బయటపెట్టారు. ఇస్లామియా జిహాద్ ని, `నరసంహారం’ అనే చూపిస్తారు, కాశ్మీరీ హిందువుల `స్వఛ్చoద పలాయనం’ అనే శుష్క పదాలు వాడరు. అప్పటి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఏ విధంగా ఉగ్రవాదుల బలగాలకు, బలం రక్షణ కల్పించిందో చూపించారు; తమ ప్రభుత్వం `లౌకిక’మని చెప్పుకోవడానికో లేక నిజంగానే హిందువులను కాపాడే ఉద్దేశం లేకపోవడమో కారణంగా, భారత ప్రభుత్వ నిష్క్రియాత్త్వం స్పష్టంగా చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జిహాదీలతో కుమ్ముక్కైoదో, జాతీయ అంతర్జాతీయ మీడియా సంపూర్ణ మౌనం మొదలైన విషయాలను సినిమా ద్వారా చెప్పగలిగారు. హిందూ నరసంహారం యదేఛ్చగా కులాసాగా కొనసాగింది, 5లక్షల మంది హిందువులు, వారి ఇళ్ళు, వ్యాపారాలు, ఆస్తులు, వదిలేసి, దేహి అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు, దయనీయ స్థితిలో ఎక్కెడేక్కడో దశాబ్దాలుగా బ్రతుకుతున్నారు, ఈ రోజు కూడా, భారత జాతి వెళ్ళగొట్టబడి స్థానచలనానికి గురైన లక్షలాది హిందువులు ఈ దేశంలోనే ఉన్నారని గుర్తించదు.

మారుమోగిన నిశ్శబ్దం
శతాబ్దాలుగా కాశ్మీరులో జరిగిన ఎన్నో  `హిందూ నరసంహారాలలో’, 1980లు, 1990 కాలంలో జరిగినది ఇటీవలిది మాత్రమే. ఇదే కాలంలో, అయోధ్యలో బాబ్రీ మస్జిద్ పేరుతో ఉన్న వివాదాస్పద కట్టడం కూల్చడం, ఉగ్రవాదుల ద్వారా 1993 ముంబై అల్లర్లు జరిగాయి. అప్పుడు సోషల్ మీడియా లేకపోయినా, జాతీయ అంతర్జాతీయ మీడియాలు భారత దేశాన్ని, హిందువులను కావాలని అపఖ్యాతి పాలు చేస్తూ, ప్రపంచమంతా ఆ సంఘటనలు రచ్చకెక్కించారు, కాని భారతీయ మీడియా,  కాశ్మీరు  `హిందూ నరసంహారo’ గురించి మాత్రం భారతీయులకు చెప్పకుండా దాచిపెట్టింది. భారతీయ మీడియా 1947దేశ విభజన, స్వాతంత్ర్యం, హిందూ మారణకాండల గురించి కూడా ఇటువంటి మౌనమే పూర్తిగా పాటించింది, ఎవరూ వారి నోరు నొక్కిన దాఖాలాలు లేవు. అయినా కూడా, నేటికీ స్వాతంత్రోద్యమంలో పత్రికల పాత్ర అంటూ ఎందరో శ్లాఘిస్తుంటారు.

రాజకీయంగా కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. బహుశా అప్పటి హోంమంత్రి `ముఫ్తీ మహమ్మద్ సయీద్’ భారత ప్రథమ ముస్లిం హోంమంత్రి కావడం దానికి కారణమేమో? అయన తరవాత కాలంలో, మళ్ళి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి అయి, 2016లో పదవిలో ఉండగానే మరణించారు. కాశ్మీరు `హిందూ నరసంహారo’, భారత `రాజ్యం’, దాని వివిధ అంగాలు, భారత ప్రజలు, ముఖ్యంగా హిందువులు, ఎప్పటికీ చెరుపుకోలేని మచ్చ, రక్త చరిత్ర. హిందుస్తాన్లో ఎన్ని `హిందూ నరసంహారాలు’ జరిగినా, హిందువులు ఎప్పుడూ మౌనంగానే ఉంటారు, వారికి ఏమీ పట్టదు అనేది కూడా అంతే నిజం.

నెలలు, సంవత్సరాల, ఇస్లామియా జిహాదీ కార్యకలాపాలు; తరతరాల సత్సంబంధాలు, స్నేహాలు కాదని, హిందువులను వెలివేయడం, దాని పర్యవసానమైన జనవరి1990 కాశ్మీరు `హిందూ నరసంహారo’లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విశేషం ఇంకొకటుంది, కంటితుడుపు చర్యగా కూడా, ఎప్పుడూ ఎటువంటి విచారణ కమిషన్ గాని, కమిటి గాని, ట్రైబ్యునల్ గాని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.  ఉగ్రవాదులకోసం అర్ధరాత్రి తలుపులు తీయగల భారత న్యాయస్థానాలు, కాశ్మీరీ హిందువుల ఆర్తనాదాల కేసులను వినడానికి నిరాకరించాయి, ఈ సంఘటనలు జరిగి చాలాకాలం అయింది అనే కారణాల చేత!

Also Read  : కాశ్మీరీ పండిట్‌లకు కాళరాత్రి

సినిమా – అనంతరం  
దేశంలోని కాంగ్రెస్-వామపక్ష భావజాల `ఆవరణ వ్యవస్థ’- ఈ సినిమాకి సంబంధించిన వార్తాకధనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది, కొందరు సినిమా విడుదల ఆపేయాలని కోర్టులకెక్కారు, సెన్సర్ బోర్డు కొన్ని అర్ధంలేని కోతలు విధించింది. ఈ అడ్డంకులు దాటుకుని సినిమా థియేటర్లలో అడుగు పెట్టింది. మిగతా బాలీవుడ్ సినిమాలలాగా  కాక, ఈ సినిమాకి కావలసినన్ని థియేటర్లు దొరకలేదు, మీడియా ప్రచారం లభించలేదు, ఓటిటి(OTT) ప్లాట్ఫార్మ్స్ దొరకలేదు.

మొదట్లో, మీడియా కావాలని ఈ సినిమాని పట్టించుకోలేదు. తరువాత సోషల్ మీడియాలో జనం వెల్లువలా మాట్లాడుతుంటే, ఇక వారికి తప్పలేదు. అప్పుడు కొందరు సమీక్షల పేరు మీద–`కాశ్మీరీల స్వఛ్చoద వలసలు, పలాయనం’ వంటి పాత కుహనా కధనాలు వినిపించారు, ఈ సినిమా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించిందని విమర్శిoచారు.

అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఈ  సినిమా హిందువుల హృదయాలను కదిలించింది. కాశ్మీర్ లోయలో అప్పుడు జరిగిన సంపూర్ణ ఇస్లామియా జిహాద్, హిందువుల మారణకాండ గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆ నోటా, ఈ నోటా ప్రచారం జరుగుతూ, ఈ సినిమా ఇప్పుడు ప్రభంజనంలాగా మారింది.

రాజధర్మం
భారత ప్రభుత్వం, జమ్మూకాశ్మీర్ పాలనా యంత్రాంగం ఇప్పటికైనా కొన్ని సత్వర క్రియలు చేపట్టక తప్పదు. భారత `హోలోకాస్ట్’ అనదగ్గ అప్పటి ఇస్లామియా జిహాద్, హిందువుల ఊచకోత, జిహదీలు అవలబించిన హింసా దౌర్జన్య దమనకాoడా మార్గాలు, జరిగిన మూకుమ్మడి హత్యాకాండ, సామూహిక సమాధులు, వీటన్నిoటి మీదా సమగ్ర విచారణ జరిపి, కాశ్మిరీ హిందువులకి న్యాయం జరిగేలా చూడాలి. ప్రభుత్వం తన రాజధర్మం నిర్వహించాలి.

ఆర్టికల్ 370 రద్దు అయిన తరువాత, జమ్మూకాశ్మీర్ పాలనా యంత్రాంగం తీసుకుంటున్న కొద్ది చర్యలు కూడా ఎలా ప్రతిఘటన ఎదుర్కుంటున్నాయో మనం గమనిస్తున్నాము. కాశ్మిరీ హిందువులకి తిరిగి పునరావాసం కల్పించాలనే ప్రయత్నాలు మొగ్గలోనే తుంచేయాలని,  హిందువులే లక్ష్యంగా మళ్ళి జిహాదీ హింసాకాండ, దౌర్జన్యం, హత్యలు ప్రారంభమైనాయి.  భయానక వాతావరణం సృష్టించి, హిందువులను వారి మాతృభూమికి రాకుండా నిరోధించాలనే ఒకేఒక లక్ష్యంతో కొన్ని వర్గాలు పని చేస్తున్నాయి.

కొన్ని దశాబ్దాలలోనే కాశ్మీర్లో 30000కు పైగా ధ్వంసం చేయబడిన దేవాలయాలను పునరుద్ధరణ చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పని సవ్యంగా జరుగుతోందని ఆశిద్దాం.  1992 అయోధ్యలో ఒక్క వివాదాస్పద కట్టడాన్ని కూల్చేసినప్పుడు, అదీ తరతరాలుగా హిందువులు నిరంతరం దాదాపు 200సంవత్సరాలు పోరాడిన కోర్టు కేసుల తరువాత; అ కూల్చివేతపై హిందువులను ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతిపాలు చేసి దూషించారు; అదే 1970s-90మధ్య కాలంలో కాశ్మీర్లో,  వేలాది దేవాలయాలను ధ్వంసం చేసి, చాలా వాటిని మూత్రశాలలుగా మార్చినపుడు, భారతీయులు, ముఖ్యంగా హిందువులు, ఎప్పటిలాగే మౌనంగా ఉండిపోయారు. (విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన `హైదర్’ సినిమాలో, కాశ్మీర్ మార్తాండ సూర్య దేవాలయం శిధిలాల ముందు, హీరో వికృతమై `బిస్మిల్లా’ డాన్స్ చిత్రీకరించారు. అప్పట్లో కొంతమంది హిందువులు అభ్యంతరం చెప్పినా, హిందూ-వ్యతిరేక బాలీవుడ్ లో ఎలాంటి చలనం లేదు).

వివేక్ అగ్నిహోత్రి గారికి హిందువులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు, ఆయన తమ అద్భుత సృష్టి `కాశ్మీర్ ఫైల్స్’ ద్వారా కుహనా వాదాలెన్నింటికో సమాధి కట్టి, అబద్ధపు తెరలు తొలగించి, మొత్తం `హిందూ కధనాన్ని’ సరైన మార్గంలోకి మళ్ళించారు. దేశ-వ్యతిరేక, హిందూ-వ్యతిరేక జెఎన్యు విశ్వవిద్యాలయంలో, అక్కడి `ఆజాదీ’ విషప్రచారానికి లోబడిన సినిమాలో యువ నాయకుడు, అదే ప్రాంగణంలో, సత్యం ఇచ్చే ధైర్యంతో, దశాబ్దాల అసత్య ప్రచారాన్ని తిప్పికొడతాడు. అది ఈ సినిమా సాధించిన విజయం. ఈ సినిమాకి నిజమైన భూమిక- సత్యం, న్యాయం. సత్యమేవ జయతే.

ఇప్పుడు `కాశ్మీర్ ఫైల్స్’ ప్రజా చిత్రం.  

Also Read : Holocaust Day: Four physical pillars of Kashmiri Hindus struggle in exile