Home Telugu Articles ప్రభుత్వపరంగా హిందూ దేవాలయాల దోపిడి

ప్రభుత్వపరంగా హిందూ దేవాలయాల దోపిడి

0
SHARE

– ఎం.వి.ఆర్‌.శాస్త్రి

ప్రభుత్వాలు ఉన్నది బందిపోట్లను అణచడానికి. కాని మన దేశంలో ప్రభుత్వాలే బందిపోట్లు! ఒక గుళ్లో దోపిడీ జరిగితే పోలీసులు కేసు పెడతారు. దొంగలను పట్టుకుంటారు. కోర్టులు వారిని శిక్షిస్తాయి. అన్ని గుళ్లనూ గవర్నమెంటే తెగబడి నిలువుదోపిడీ చేస్తూంటే ఏ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాలి? ఆ దొంగలను ఎవరు పట్టుకోవాలి? ఏ కోర్టులు వారిని శిక్షించగలవు?

మామూలు దొంగలు ఎవరూ లేని సమయం చూసి సాధారణంగా రాత్రివేళ కన్నం వేస్తారు. అందిన కాడికి దోచుకుంటారు. గవర్నమెంటు గజ దొంగలు పట్టపగలే అందరి కళ్లముందే పబ్లిగ్గా దేవుళ్ల సొమ్మును, ఆస్తులను దోచుకుంటారు.

గుడి దోపిడి ఒక ఊరు, ఒకరోజు, ఒక చోటు అని లేకుండా అన్ని ఊళ్లలో, అన్ని రోజులూ, అన్ని గుళ్లలో నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. ఇంత భారీ చోరీని ఎక్కడా తేడా రాకుండా క్రమపద్ధతి ప్రకారం నిరంతరం నిర్వహించడానికి గవర్నమెంటు ఏకంగా ఒక డిపార్టుమెంటునే పెట్టింది.

దాని పేరు ఎండోమెంట్సు డిపార్టుమెంటు. మనలాంటి పామరులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది సర్కారీ గజదొంగల ముఠా!

గుడిదోపిడి చట్టబద్ధంగా, కోర్టులు కూడా అడ్డం రాలేనట్టు పకడ్బందీగా జరిగేట్టు చూడటానికి ఒక గట్టి చట్టం ఉంది. దాని పేరు హిందూ దేవదాయ, ధర్మదాయ చట్టం. దేవాలయాల, ధార్మిక సంస్థల ఆదాయాన్ని అడ్డంగా గుంజేస్తారు కాబట్టి జనం దానిని దేవాదాయ, ధర్మాదాయ చట్టం అని దీర్ఘాలు పెట్టి పిలుస్తారు.

దేవాలయాలు, ధార్మిక సంస్థలు ముస్లిం, క్రిస్టియన్‌ వగైరా మతాల్లోనూ ఉన్నాయి కదా? మరి చట్టం పేరులో ‘హిందూ’ అని ఉన్నదేమిటి? మనది సెక్యులర్‌ దేశం కదా? విషయం తెలియని వాళ్లకు ఈ అనుమానం రావచ్చు.

మీ ఇంటికి దొంగలొస్తే మీరు ఊరుకోరు. ఇంటిని దోచుకుంటామంటే ఎవరూ ఊరుకోరు. ఇంటివాళ్లు ఎలర్టుగా ఉంటే దొంగలు ఆ ఇంటి జోలికి వెళ్లరు. ఇళ్లలాగే గుళ్లు కూడా! చర్చిల జోలికి వెళితే క్రిస్టియన్లు చుక్కలు చూపిస్తారు. మసీదుల మీద పడితే మహమ్మదీయులు బొక్కలు విరగగొడతారు. కాబట్టి గవర్నమెంట్లు సహజంగానే వాటి తెరువు పోయేందుకు సాహసించవు.

అదే – హిందూ దేవాలయాల జోలికి వెళితే హిందువులు ఏమీ అనరు. ఎదురు తిరగరు. వారు గొప్ప వేదాంతులు. వాటమైన కర్మ సన్యాసులు. అన్నీ దేవుడే చూసుకుంటాడనీ, ఎవరి పాపాన వారే పోతారనీ, తాము కట్టుకున్న గుళ్లలో తాము పూజించే దేవుళ్ల పట్ల తమకు బాధ్యత ఎంతమాత్రమూ లేదనీ సగటు హిందువు నమ్మిక. ఈ చేతకానితనాన్ని, పలాయన మనస్తత్వాన్ని, బాధ్యతారాహిత్యాన్ని హిందువులు మంచితనం, హుందాతనం, పరిణత దృక్పథం అని భ్రమపడుతుంటారు. కాబట్టి హిందువులంటే గవర్నమెంట్లకు అలుసు. హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలు ప్రభుత్వ దృష్టిలో వంటింటి కుందేళ్లు.

ప్రభుత్వపరంగా హిందూ దేవాలయాల దోపిడిని మొదలు పెట్టింది ఇంగ్లిషువాళ్లు. తిరుమల లాంటి పెద్ద గుళ్ల సంపద ఏ మేరకు ఎలా కాజెయ్యగలమా అని ఈస్టిండియా కంపెనీ దొరలే పథకాలు వేశారు. హైందవ ఆలయాలపై ప్రభుత్వ కంట్రోలును చట్టబద్ధం చేస్తూ బ్రిటిషు హయాంలో 1925లోనే ‘మద్రాస్‌ హిందూ రిలిజియస్‌ ఎండోమెంట్స్‌ యాక్ట్‌’ వచ్చింది.

దేశాన్ని దుర్మార్గంగా దోచుకున్న తెల్లవాళ్లని తన్ని గెంటేశాక, స్వతంత్ర మనబడేది తెచ్చుకున్నాక దోపిడి వ్యవస్థకు స్వస్తి పలికి మిగతాదేశం లాగే దేవాలయాలకు కూడా స్వాతంత్య్రం ఇచ్చి ఉండాల్సింది. కాని తెల్లవాళ్లు పోయి మనవాళ్లు మన నెత్తినెక్కాక మన దేవాలయాల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టయింది.

వెనుక జరిగిన తప్పులకు, దుర్మార్గాలకు ఇకపై ఆస్కారం లేకుండా చేయాలంటే కొత్తగా రాసుకునే రాజ్యాంగంలో దానికి తగ్గట్టు గట్టి కట్టుదిట్టాలు చేయాలి. ప్రజాస్వామ్య శాస్త్రప్రకారం భారత రాజ్యాంగంలో – దేశంలో ప్రతిఒక్కరికీ సంపూర్ణ మత స్వాతంత్య్రం ఉంటుందని హామీ దిట్టంగానే ఇచ్చారు. ఏ మతసంస్థలను ఆయా మతస్థులు స్వేచ్ఛగా, నిరాఘాటంగా నడుపుకోవచ్చని గొప్ప వరమైతే ఇచ్చారు 26వ అధికరణంలో ఇదిగో ఇలా :

26 Freedom to manage religious affairs.

Subject to Public order, morality and health, every religious denomination or any section thereof shall have the right.

  1. a) to establish and maintain institutions for religious and charitable purposes.
  2. b) to manage its own affairs in matters of religion.
  3. c) to own and acquire movable and immovable property; and
  4. d) to administer such property in accordance with law.(26 మత వ్యవహారాలను మేనేజ్‌ చేసుకొనే స్వేచ్ఛ.

ప్రజా భద్రత, నైతికత, ప్రజారోగ్యాలకు లోబడి –

అన్ని మతాలకు చెందిన మత శాఖలకు లేక వాటిలోని విభాగాలకు –

అ) మత, ధార్మిక ఆశయాల కొరకు సంస్థలను నెలకొల్పి, నిర్వహించుకొనడానికి –
ఆ) మత విషయాల్లో వాటి వ్యవహారాలను అవి సొంతంగా మేనేజ్‌ చేసుకొనడానికి –
ఇ) స్థిరాస్తిని, చరాస్తిని కలిగి ఉండటానికి, కొత్తవి సంపాదించడానికి –
ఉ) అట్టి ఆస్తిని చట్ట ప్రకారం అజమాయిషీ చేయటానికి హక్కు ఉండును.)

హిందూమతంలో శైవం, వైష్ణవం, వగైరా అనేక శాఖలున్నాయి. మళ్లీ వాటిలో వీరశైవం, అద్వైతం, విశిష్టాద్వైతం వంటి ఉపశాఖలు, ఒక ఉపశాఖలో వేర్వేరు విభాగాలు ఉన్నాయి. మత శాఖలు, సంప్రదాయాలు, ఆచారాలు, ఆగమాలు వేరువేరు అయిన దేవాలయాలు, ధార్మిక సంస్థలు లెక్కలేనన్ని. ఇలాంటి అన్ని శాఖలకూ, వాటిలో అన్ని విభాగాలకూ తమతమ మత వ్యవహారాలను తామే మేనేజ్‌ చేసుకోవటానికి, దేవాలయాల వంటి మత, ధార్మిక సంస్థలను స్వతంత్రంగా నడుపుకోవటానికి, ఆస్తిపాస్తులను సొంతంగా అజమాయిషీ చేసుకోవటానికి రాజ్యాంగం ఈ అధికరణంలో సర్వహక్కులు ఇచ్చింది.

ఇంతకుమించి కోరవలసింది ఏదీలేదు. అన్ని మతాలకు ఉద్దేశించిన ఈ రాజ్యాంగవరం ఇతర మతాల లాగే హిందూమతానికి, దానికి సంబంధించిన ఆలయాలు, ధర్మసంస్థలు అన్నిటికీ సమానంగా వర్తించే పక్షంలో ఆక్షేపించవలసింది ఎంతమాత్రమూ లేదు.

మరి – ఎవరి మత సంస్థలను వారు, ఎవరి మత వ్యవహారాలను వారు సొంతంగా నిభాయించుకోవడానికి రాజ్యాంగం ఇంత స్పష్టంగా హక్కు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఈ హక్కును ఎలా తుంగలో తొక్కగలిగాయి? హిందూ మత కమతంలోకి గవర్నమెంటు అచ్చోసిన ఆంబోతులా చొరబడి నానా ఆగం ఎలా చేయగలిగింది? హిందూ మత సంస్థల్లో సర్కారు వేలు పెట్టటానికి ఈ అధికరణంలో వీలు ఎక్కడుంది?

మత వ్యవహారాల స్వతంత్ర అజమాయిషీకి ఉద్దేశించిన 26వ రాజ్యాంగ అధికరణంలో అలాంటి వీలు లేనిమాట నిజమే. కాని దానికి ముందు ఉన్న 25వ అధికరణం ప్రభుత్వ జోక్యానికి తలుపు కాస్త ఓరగా తీసిపెట్టింది!

ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్య విషయాలకు లోబడి – మత స్వాతంత్య్రమూ, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు అందరు వ్యక్తులకూ సమానంగా ఉండును – అని మాత్రం చెప్పి 25(1) అధికరణం ఊరుకోలేదు. దానికింద ఇంకో క్లాజు ఉంది. ఆ క్లాజులో రెండు సబ్‌ క్లాజులు ఉన్నాయి. అసలు చిక్కంతా మొదటి సబ్‌ క్లాజులో ఉంది.

25(2) Nothing in this article shall affect the operation of any existing law or prevent the state from making any law.

  1. a) relulating or restricting any economic, financial, political or other secular activity which may be associated with religious practice;
  2. b) Providing for social welfare and reform… … … …

25 (2) ఈ అధికరణంలో పేర్కొన్నది ఏదిన్నీ –

ఇప్పుడున్నట్టి ఏ శాసనమైనా అమలు కాకుండా గాని,
ప్రభుత్వం ఏ శాసనమైనా చేయకుండా నిరోధించడంగా గాని –
ప్రభావం చూపజాలదు. ఆ శాసనాలు ఎటువంటివనగా

అ) మత ఆచరణలో సంబంధం ఉన్న ఏ ఆర్థిక, ద్రవ్యపరమైన, రాజకీయ, లేక సెక్యులర్‌ యాక్టివిటీని నియంత్రించేది, లేక పరిమితం చేసేవి.
ఆ) సాంఘిక సంక్షేమం, సంస్కరణలకు ప్రోదిచేసేటట్టివి…

ఈ రాజ్యాంగ నిర్దేశాన్ని దానివరకు చూస్తే సమంజసంగానే కనిపిస్తుంది.

అందరు వ్యక్తులకు మత స్వాతంత్య్రం, మతాన్ని ఆచరించే, ప్రకటించే, ప్రచారం చేసే స్వేచ్ఛ సమానంగా ఉండును – అని 25వ అధికరణంలో స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇది దేశంలోని అన్ని మతాలకు చెందిన వారికి సమానంగా వర్తిస్తుందన్నది నిస్సందేహం.

మతానికి సంబంధించి అనేక వ్యవహారాలు ఉంటాయి. రకరకాల కార్యకలాపాలు ఉంటాయి. అవి రకరకాల వ్యక్తుల చేతుల మీదుగా నడుస్తుంటాయి. వారిలో మంచివాళ్లు ఉంటారు. చెడ్డవాళ్లు ఉంటారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, నిర్ణయాలు వాళ్లు ఎన్నో చేస్తుంటారు. ఒక్కోసారి ఆయా మత సంస్థలు, ధర్మ నిధులు ఏ ఉద్దేశాలతో, ఏ ఆశయాల కోసం నెలకొల్పబడ్డాయో వాటికి పూర్తి విరుద్ధంగా నిధులను ఖర్చు పెట్టటం జరగవొచ్చు. ఆస్తులు దుర్వినియోగం కావచ్చు. తప్పుడు నిర్ణయాలు తీసుకోబడనూవచ్చు. అటువంటి తప్పిదాలు, లోటుపాట్లు ఏ మతానికి సంబంధించి ఏ సంస్థలో జరిగినా వాటిని అరికట్టి, యాజమాన్య నిర్వహణ సవ్యంగా జరిగేట్టు చూసేందుకు ప్రభుత్వం చేతిలో అధికారం ఉండటం తప్పుకాదు. అవకతవకలు జరిగిన సందర్భాల్లో అన్ని మతాల వలెనే హిందూ మతానికి చెందిన మత సంస్థల మీద, ధర్మ సంస్థల మీద ప్రభుత్వం చట్ట ప్రకారం చర్య తీసుకున్నా, దానికోసం ప్రత్యేకంగా శాసనాలను చేసినా ఎవరూ దానిని ప్రశ్నించజాలరు.

జరిగిందేమిటంటే – రాజ్యాంగం 25(2)(a) అధికరణం మత స్వాతంత్య్ర దుర్వినియోగాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వానికి ఇచ్చిన ఈ వెసులుబాటును మన సెక్యులర్‌ (అనగా హిందూ వ్యతిరేక) ప్రభుత్వాలు కేవలం హిందూ మతం మీదే విచ్చలవిడిగా దుర్వినియోగం చేశాయి. హిందూ దేవాలయాలను, ధర్మ సంస్థలను పూర్తిగా తమ కబ్జాలోకి తెచ్చుకొని, నిరంకుశంగా పెత్తనం చేయసాగాయి. దేవుళ్లకు భక్తులు సమర్పించే కానుకలను, దేవాలయాలకు పూర్వం దాతలు ఇచ్చిన ఆస్తులను, సొంత అవసరాలకు, రాజకీయ స్వార్థాలకు అడ్డగోలుగా వాడేసుకోసాగాయి.

అవిభక్త మద్రాసు ప్రభుత్వం 1951లో తెచ్చిన దుర్మార్గపు చట్టం నమూనాగా దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ రిలిజియన్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ చట్టాలను తెచ్చి హిందూ దేవాలయాలలో, ధర్మ సంస్థలలో మేరలేని అవినీతికి, అక్రమాలకు, అధికార దుర్వినియోగాలకు, పగటి దోపిడీలకు పట్టపగ్గాలు లేకుండా బరితెగించాయి.

ఆ విధంగా పవిత్ర దేవాలయ వ్యవస్థకు దుష్ట రాజకీయ గ్రహణం పట్టింది. అరవై ఏళ్ల తర్వాత కూడా విడువకుండా అది హిందూ మతాన్ని పీడిస్తూనే ఉంది.

 

(ఈ వ్యాసం మొదట 8 సెప్టెంబర్ 2018 నాడు ‘జాగృతి’లో ప్రచురితమైంది)