Home Uncategorized హిందుత్వ నిష్ఠ పెరుగుతున్నది

హిందుత్వ నిష్ఠ పెరుగుతున్నది

0
SHARE

తమిళనాడులోని ప్రఖ్యాత హిందూ పీఠాలలో ఒకటి కుర్తాళం పీఠం. ఈ పీఠం హిందూ ధర్మ రక్షణకు, విస్తరణకు మొదటి నుండి ఎంతో కృషి చేస్తున్నది. ఈ పీఠానికి ప్రస్తుతం శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరా నంద భారతి స్వామి పీఠాధిపతిగా వ్యవహ రిస్తున్నారు. వీరు దేశ విదేశాలలో నిరంతరం పర్యటిస్తూ హిందూ ధర్మ రక్షణకు పనిచేస్తున్నారు. వారితో జాగృతి ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. అనేక ప్రశ్నలకు వారు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చారు. ఆ వివరాలు పాఠకుల కోసం..

ప్రశ్న : భక్తి అంటే ఏమిటి ? ఈ రోజుల్లో నిజమైన భక్తులను ఎవరినైనా మీరు చూశారా ?

సమాధానం : భగవంతుని యందుండే అనిర్వచ నీయమైన ప్రేమయే భక్తి. సర్వకాలాలలో నిజమైన భక్తులున్నారు. సంఖ్యలో కొంచెం తేడా ఉంటుంది అంతే. ఇష్టదేవతకు సర్వార్పణం చేసిన రసయోగు లను, ప్రేమ భక్తిలో అత్యంత పరిణతులను నేను చూచాను. దేవతను స్మరించినంత మాత్రం చేతనే అశ్రువులు జాలువారే సిద్ధ మహాత్ములను నేను దర్శించాను.

ప్రశ్న : ఈ రోజుల్లో యువత దేవాలయానికి రావటం ఎక్కువయింది. అలా వారు వస్తున్నది వారి కోర్కెలను తీర్చమని అడగడానికి తప్ప దేవునిపై నిజమైన భక్తితో కాదు అని కొందరి అభిప్రాయం. మీరేమంటారు ?

స : దేవాలయాలకు వస్తున్న యువత సంఖ్య ఇటీవల ఎక్కువైన మాట సత్యమే. కోరికల కోసమే రావచ్చు కూడా. అది తప్పు కాదు. వేదములలో మంత్ర శాస్త్రములలో కోరికలను తీర్చమని ప్రార్థించే మంత్రములెన్నో ఉన్నవి. పూజలు, వ్రతములు, యజ్ఞములు, జపములు-వీనిద్వారా భక్తితో దేవతలను ఆశ్రయించి సంతుష్టిపరిస్తే వారు అభీష్టసిద్ధిని ప్రసాదిస్తారు. దేవాలయాలలో ఏ కోరికలనైనా కోరి సంకల్పం చెప్పించుకొని అర్చన, అభిషేకములు చేయించుకోవచ్చు. ఇవన్నీ భక్తిలో భాగమే. ఏ కోరికలూ లేక దేవుని ఆశ్రయించే విరాగులు జ్ఞానులు కొద్దిమంది ఉంటారు. వారు అహేతుకమైన భక్తి గలవారు. కనుక భగవంతుడు కోరికలు తీరుస్తాడన్న నమ్మకం – భక్తిలో ఒక భాగమే.

ప్రశ్న : హిందువులు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది ? ఇంటిలో పూజలు చేస్తున్నారు కదా !

స : దేవాలయాలు మహాశక్తి కేంద్రాలు. దేవతలు, ఋషులు, తపస్వులు అక్కడ దివ్యశక్తిని ప్రతిష్ఠించటం వలన ఆ తేజోవలయంలోకి వెళ్ళి ప్రార్థిస్తే ఏ కోరికైనా తొందరగా సిద్ధిస్తుంది. ఇంటిలోనూ పూజా జపాదుల వల్ల శక్తి ఉదయిస్తుంది. కాని అది పరిమితం. ఇంటికంటే దగ్గర గుడి, దానికంటే కాశీ మొదలైన మహాక్షేత్రాలు అపరిమిత శక్తి సమన్వితాలు.

ప్రశ్న : దైవభక్తి, దేశభక్తి అనేవి పరస్పరా ధారమా? కాదా ?

స : దేశమును దేవతగా భావించగలిగినవారు కొందరుంటారు. వేదంలో పృథివీ సూక్తంలో భూమిని దేవతగా ప్రార్థించటం ఉంది. భూదేవి – పురాణా లలో గొప్ప దేవత. బంకించంద్ర ఛటర్జీ వందే మాతరం గీతంలో భారతమాతను దుర్గగా, లక్ష్మిగా, వాణిగా వర్ణించి పూజించటం అద్భుతంగా రూపొందించాడు. దైవభక్తి దేశభక్తి మీద ఆధారపడి లేదు. దేశభక్తి దైవభక్తి మీద ఆధారపడి ఉంది.

ప్రశ్న : దేవాలయాలు ఉన్నది కేవలం దైవభక్తి కోసమేనా ? దేశభక్తి గురించిన ప్రవచనాలు చెప్పే వ్యవస్థ దేవాలయాలలో ఎందుకు లేదు ?

స : దేవాలయాలు మానవులను రక్షించటం కోసం ఉద్ధరించటం కోసం పాపరహితమైన ధార్మిక వ్యవస్థను నిర్మించటం కోసం కృషి చేస్తున్నవి. నిజమైన భక్తుడు పాపభీతి వల్ల దోషం చేయడు. దోషరహితమైన సమాజాన్ని రూపొందించటంతో పాటు మానవుని మాధవునిగా తెలియజెప్పి మాధవ సేవ చేయటానికి వచ్చిన వ్యక్తికి మానవ సేవ చేయటం కర్తవ్యమని ప్రతి పూజ చివర చదివే మంత్రపుష్పం పలుకు తున్నది. సహస్రశీర్షుడు, విశ్వాక్షుడు అయిన పరమ పురుషుడు ”విశ్వమేవ” అని తెలియజేస్తున్నది. దేవుని సేవించటానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఆ స్వామి ప్రపంచ స్వరూపుడని గ్రహించి ఇక్కడ గుడిలో నేర్చుకొన్న సేవ మానవులకు చేయమని బోధిస్తున్న దేవాలయాన్ని మించిన దేశభక్తి ప్రవచన స్థానం మరొకటి యెక్కడ ఉన్నది? అయితే సంస్కృత భాషలో ఉన్న ఈ విషయాన్ని ప్రజలకు స్థానిక భాషలలో అర్థమయ్యేలా చెప్పవలసిన అవసరమున్నది.

ప్రశ్న : హిందుత్వంలో మహిళకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మహిళ లేని కుటుంబాన్ని మనం ఊహించలేము. అదేవిధంగా మహిళలో దేశభక్తి ఉంటే ప్రతి ఇంటిలోనూ దేశభక్తులు తయారవుతారనేది కూడా అందరూ ఒప్పుకొనేదే. స్వామీజీల వద్దకు ఎక్కువగా వచ్చేది కూడా మహిళలే. అటువంటప్పుడు మహిళలలో కుటుంబ, సామాజిక విలువలు; దేశభక్తి నింపేందుకు మీరేమైనా చేస్తున్నారా?

స : స్వామీజీల దగ్గరకు మహిళలు ఎక్కువ వస్తారన్నది పాక్షిక సత్యం మాత్రమే. అయితే ఇప్పటికీ పాశ్చాత్య నాగరికత, క్రైస్తవ సంస్థల ప్రభావం పెరుగు తున్నా కట్టుబొట్టు, సంప్రదాయాల విలువలు- నిలబెట్టుతున్నవి ఎక్కువ భాగం మహిళలే అన్న సంగతి గుర్తించాలి. సామూహిక పూజలు, వ్రతములు, ధ్యానములు, పారాయణలు చేయించి దైవభక్తితో పాటు ధర్మప్రబోధం చేయటం ద్వారా సన్యాసులు, ధర్మాచార్యులు దేశభక్తిని ఆర్షసంప్రదాయ విజ్ఞానరూప మాధ్యమం ద్వారా అందిస్తున్నారు. అధర్మాన్ని నాశనం చేయాలనే పట్టుదలను కలిగించి కర్తవ్య ప్రబోధం చేస్తున్నారు.

ప్రశ్న : హిందుత్వ వ్యవస్థలో స్వామీజీల పాత్ర ఏమిటి ?

స : హిందూత్వ వ్యవస్థలో స్వామీజీల పాత్ర చాలా ప్రధానమైనది. దక్షిణ భారతంలో మహమ్మ దీయ హింసాపీడితమైన హిందూజాతిని రక్షించటానికి విద్యారణ్య స్వామి చేసిన విజయనగర సామ్రాజ్య స్థాపన, గోస్వామి తులసీదాస్‌- రాజామాన్‌సింగ్‌ రాణా ప్రతాప్‌ను బంధించటానికి వచ్చినప్పుడు మాన్పించటము, శివాజీ జీవితంలో సమర్థరామదాస్‌, తుకారాంల ప్రభావం వంటి పూర్వ చారిత్రక సంఘటనలతో పాటు – ఇటీవల మన దేశంలోనూ, విదేశాలలోను ధర్మప్రచారం చేస్తూ హిందూ ధర్మ రక్షణ మాత్రమేకాక విదేశీయులను హిందూమతంలోకి మార్చటం కూడా స్వామీజీలు చేస్తున్నారు. భక్తి ఉద్యమ నిర్వాహకులు ఈ విషయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు.

ప్రశ్న : ‘హిందుత్వం మతం కాదు, జీవన విధానం’ అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మతానికి జీవన విధానానికి గల తేడా ఏమిటి?

స : కోర్టు తీర్పులు మత సిద్ధాంతాల మీద అంత ప్రభావం చూపించలేవు. ఎవరు ఎన్ని అన్నా హిందూమతమన్న మాట అదృశ్యం కాదు. కొందరు హిందూ శబ్దం పనికి రాదన్నారు. కొందరు మతం అని అనకూడదంటారు. ఈ శబ్దాల పూర్వాపరాలను, అర్థాలను చర్చిస్తుంటారు. ఎందరు కాదన్నా హిందూ మతమనే మాట కోట్లమంది హృదయాలలో నిలచి వుంది. ఉంటుంది. దానికి మూలమైన ధర్మంలో జీవన విధానం ఒక భాగం. అంత మాత్రమే. ధర్మానికి ఎన్నో ముఖాలున్నవి. రెంటికి తేడాలు లేవు.

ప్రశ్న : దేశంలో హిందూ ధర్మం ఆధారంగా ఎన్నో మఠాలు, పీఠాలు, సంస్థలు పనిచేస్తున్నప్పటికీ హిందువులందరిలో తమ ధర్మం పట్ల నిష్ఠ ఉన్నట్లుగా కనిపించదు. ఎందువల్ల ?

స : కోట్లమంది అవలంబిస్తున్న ఏ మతంలోనైనా అందరూ ధర్మ నిష్ఠతో ఉండటం సాధ్యం కాదు. యుగ ప్రభావమని కొందరు, సైన్సు ప్రభావమని కొందరు, కమ్యూనిజం ప్రభావమని, హేతువాద ఫలితమని ఎన్నో కారణాలు చెపుతుంటారు. పాశ్చాత్య దేశాలలో చర్చీలకు వచ్చేవారు లేక ఆ భవనాలను అమ్ముకొంటున్న వార్తలు ఎక్కువగా వస్తున్నవి. అందువల్ల అది ప్రపంచ వ్యాప్తమైన అంశం. అయితే మన దేశంలో ఇటీవల పాశ్చాత్య, హేతువాద వాసనలు తగ్గి హిందూమత నిష్ఠ పెరుగుతున్న అంశం గమనించాలి. అయితే ఈ విషయంలో చేయ వలసినది చాలా ఉంది. దీనిని ప్రచారము, ప్రసారము, ప్రబోధము ద్వారా సాధించాలి.

ప్రశ్న : ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలో హిందుత్వం గురించి, పీఠాధిపతుల గురించి మంచికన్న దుష్ప్రచారానికే పెద్దపీట వేస్తారు. దీనిని మీరు ఎలా తీసుకుంటారు ?

స : ప్రసార మాధ్యమాలకు సెన్సేషనల్‌ న్యూస్‌ కావాలి. ఇతర మతాలలో ఉన్న, జరుగుతున్న లోపాలను, దోషాలను ఎత్తి చూపించే ధైర్యం చాలక సహనశీలమైన హిందూ సమాజాన్ని గురించి లేనిపోనివి ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పులు గమనించాలి. ఇతర మతస్థులు మీడియాను ధనంతో శాసిస్తున్నారు. హిందువులు ఈ విషయానికి తగిన రీతిలో విక్రియ చెంది – ప్రసార మాధ్యమాల మీద అనుశాసనం సాధించి ఉపయోగించుకోవాలి.

ప్రశ్న : ప్రజలు ధార్మిక జీవనం పట్లకన్న భోగవాద జీవితం వైపుకు లాక్కెళ్ళే పరిస్థితులలోనే ఎక్కువకాలం గడుపుతున్నారు. అలాకాక వారిని ధార్మిక జీవనం వైపుకు మళ్ళించడానికి పీఠాధిపతులు, మఠాధిపతులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది ?

స : పురాణ ప్రవచనాలు, సామూహిక భజనలు, పారాయణాలు, దేవతలు, సిద్ధుల విశేషాలు, అంతేకాక జన్మకర్మ సిద్ధాంతం గురించి, మంత్ర, యజ్ఞ మహత్వాన్ని గురించి విదేశాలలోను జరుగుతున్న పరిశోధనలు, పాప పుణ్యాల ఫలితాలు సోదాహరణంగా ప్రజలకు అందించాలి.

ప్రశ్న : నేడు అమలులో ఉన్న విద్యావిధానం వలన విద్యార్థులలో మన ధర్మం పట్ల, మాతృభూమి పట్ల, దీని ఉన్నతికి పాటుపడిన మహానుభావుల పట్ల కించిత్‌ గౌరవం ఉండటం లేదు. దీనికి పరిష్కాం ఏదైనా ఉన్నదా ?

స : మహనీయుల, త్యాగమూర్తుల, మహావీరుల ధార్మిక జీవిత విశేషాలు పాఠశాలలలో, కళా శాలలలో పాఠ్యాంశాలలో చేర్చాలి. ప్రార్థన సమా వేశాలు, వాటిలో ధర్మ ప్రబోధం జరగటం కోసం ఉద్యమాలు నడిపి ప్రభుత్వాన్ని ఒప్పించాలి.

ప్రశ్న : హిందువులు అన్య మతాలలోకి మారిపోతున్నారు. దీనిని పీఠాధిపతులు, మఠాధి పతులు తలచుకుంటే ఆపలేరా ? మత మార్పిడులు జరగకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి?

స : ఉద్యోగ ధన వ్యామోహాలు మాత్రమే కాక మన కుల వ్యవస్థలోని లోపాలను, ఆచార వ్యవహారాలలోని దోషాలను ఆధారం చేసుకొని ఇతర మతాలు విజృంభిస్తున్నవి. వాటిని సరిదిద్దుకుంటూ ధర్మాసక్తిని, దేవతల పట్ల విశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలుచేయాలి. గిరిజన ప్రాంతా లలో దేవాలయ నిర్మాణాలు, భజన మండలులు, ఇతర మతస్థులు మన మతాన్ని గురించి చేస్తున్న విమర్శలకు సమాధానాలు – ఇటువంటివి ప్రజలకు ఎక్కువమందికి అందించే ప్రయత్నాలు చేయాలి.

హిందూమతంలోనించి ఇతర మతాలకు వెళ్ళటాన్ని ఆపటానికి ప్రయత్నిస్తున్నాము. అవసరమే. కాని ఎంత కాలం మనం డిఫెన్సులో ఉంటాము? అఫెన్సులోకి దిగవలసిన సమయం వచ్చింది. ఇతర మతస్థులను, బలవంతంగా తరతరాల క్రింద ఇతర మతాలలోనికి మార్చబడినవారిని హిందూమతంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలి. ఘర్‌వాపసీ కార్యక్రమాలను ప్రోత్సహించాలి. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ వంశీయులు రెండు లక్షలమందిని హిందూమతంలోకి పునరాగమనం చేసిన కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించటం చూసినప్పుడు చాలా సంతృప్తి కలిగింది. ఇటువంటివి ఎక్కువగా జరిగేలా చూడాలి.

ప్రశ్న : కుర్తాళం పీఠం గురించి ఏమైనా చెబుతారా ?

స : కుర్తాళంలోని సిద్ధేశ్వర పీఠం హిమాలయ యోగుల సంప్రదాయం నుండి వచ్చిన సిద్ధపీఠం. ఒక ఆంధ్రయోగి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి స్వర్ణయోగ, దివ్యజ్ఞానాది దివ్యశక్తులు సాధించి, అక్కడి సిద్ధాశ్రమ యోగుల ఆదేశంలో-బానిసతనంలో మగ్గుతున్న భారత జాతిలో ధర్మచైతన్యాన్ని కలిగించటానికి యోగశక్తుల మహత్వాన్ని నిరూపించ టానికి తమిళనాడులోని కుర్తాళంలో శక్తి మంతమైన పీఠాన్ని స్థాపించారు. హిమాలయాలలోని శంకర పీఠంలో సన్యాసం స్వీకరించి శివచిదానంద సరస్వతీ స్వామి పేరుతో వచ్చి-మౌనాన్ని అవలంబించటం వల్ల మౌనస్వామిగా పేరు పొందారు. నాటి పాశ్చాత్య పాలకులను, అక్కడి ప్రజలను ప్రభావితులను చేసి దివ్యశక్తులతో అద్భుతాలు చేసి దైవ సామ్రాజ్యాన్ని ధర్మవీరులను – పెంపొందించారు. తరువాత వచ్చిన పీఠాధిపతులు వారి అడుగుజాడలలో నడిచి ధర్మాభివృద్ధి కోసం కృషి చేశారు. వారి కృపవల్ల నేనిప్పుడు దేశవిదేశాలలో హిందూధర్మరక్షణ యజ్ఞాలు చేయిస్తూ, మన మతాన్ని ప్రచారం చేస్తూ వేలమందికి మంత్రోపదేశాలు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి బాధలు నివారిస్తూ దైవమునందు విశ్వాసాన్ని భక్తిని వర్ధిల్ల జేయటం జరుగుతున్నది. మంత్ర సాధనవల్ల ఎందరో దివ్యానుభూతులు పొంది ఆధ్యాత్మిక పురోగతి నందుకొంటున్నారు. వందల ఉపన్యాసాలు, వేల పుస్తకాలు చేయలేని పని ఒక దివ్యానుభూతి చేస్తుంది. ఈ మార్గంవల్ల ఎందరో నాస్తికులు హిందూ దేవతలను విశ్వసిస్తున్నారు. ఇతర మతాలవాళ్లు చాలామంది కష్టాలు తీరి మన దేవతల, మంత్రముల మహత్వాన్ని తెలుసుకొంటు న్నారు. మా పీఠంలో కొంతమందికి మంత్ర సాధనలో శిక్షణ యిచ్చి వారు సమస్యా పీడితులకు ¬మముల ద్వారా బాధలు తొలగించేలా ప్రయత్నం జరుగు తున్నది. ఈ విధంగా కుర్తాళపీఠం హిందూధర్మ రక్షణకు, విస్తరణకు దేశ విదేశాలలో కృషిచేస్తున్నది. ఆధ్యాత్మిక, మంత్ర శాస్త్ర, పౌరాణిక విశేషాలతో గ్రంథాలు ప్రచురించి వేల లక్షలమందికి వాటిని అందిస్తున్నాము.

(జాగృతి సౌజన్యం తో)