Home Hyderabad Mukti Sangram హిసామొద్దీన్‌ను తుదముట్టించాలని ప్రతిజ్ఞ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-26)

హిసామొద్దీన్‌ను తుదముట్టించాలని ప్రతిజ్ఞ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-26)

0
SHARE

పటేల్ తన గ్రామానికి పట్టిన దురవస్థను విని కోపంతో ఊగిపోయాడు. అతని ఆత్మాభిమానం బాగా దెబ్బతిన్నది. ఏ విధంగానైనా హిసామొద్దీన్‌ను తుదముట్టించాలని ప్రతిజ్ఞ చేశాడు. రజాకార్ల వేషాలు వేసుకొని తన మిత్రులతో పాటు దారికాచాడు. గోర్టా నుండి వ్యాపార నిమిత్తం కళ్యాణ్‌కు ప్రజలు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. ఈ దారి మధ్యలో హిసామొద్దీన్‌ను ఏ విధంగానైనా పట్టుకోవాలని పటేల్ వేచి ఉన్నాడు. నెలరోజులు గడిచిపోయినా హిసామొద్దీన్ ఆ దారిగుండా వెళ్ళలేదు.

చివరికి ఒకరోజు గోర్టా రైతులు హిసామొద్దీన్‌కు లంచమిచ్చి తమ వెంట రక్షణగా రావలసిందని కోరారు. తన నలుగురు అనుచరులతో పాటు హిసామొద్దీన్ తుపాకులు తీసుకొని బయలుదేరారు. ఈ విషయం భావురావు పటేల్‌కు తెలిసింది. అతను తన మిత్రులతో పాటు దారి మధ్య ఒక కాలువ గట్టుక్రింద రాత్రంతా వేచిఉన్నాడు. నలభైయైదు బండ్లు దాదాపు డ్బుభైమందితో పాటు వస్తున్నాయని, వాళ్ళంతా హిందువులనే విషయం పటేల్‌కు తెలుసు. దాదాపు రాత్రి గడిచిపోయింది. తన పధ్నాలుగా మంది మిత్రులతో పటేల్ ఎదురుచూచి విసిగెత్తి పోయాడు. మొదట్లో కొన్ని బండ్లు అటువైపు రాగా పటేల్ బృందం అటకాయించింది.

కానీ అందులో హిసామొద్దీన్ లేడు. తర్వాత తెల్లవారుతుండగా గోర్టారైతుల బండ్లు కాలువ దగ్గరికి చేరుకున్నాయి. పటేల్ బృందం బండ్లను ఆపవలసిందని హెచ్చరించింది. రజాకార్ల వేషాల్లో ఉన్న పటేల్ మిత్రుల్ని, రైతుల్ని చూసి మొదట బండ్లలో ఉన్న రైతులు రాళ్ళు విసరటం మొదలుపెట్టారు. తాము హిందువులమని హిసామొద్దీన్ ఎక్కడున్నాడో చెబితే చాలునని కేకలు వేసి చెప్పాడు. బండ్ల మధ్య ఉన్న హిసామొద్దీన్‌ను  పటేల్ బృందం చుట్టుముట్టింది.

ఈ లోగా రామారావు పాటిల్ బొరొల్ అనే వ్యక్తి ధైర్యంగా హిసామొద్దీన్ తలపై  తుపాకి మడమతో కొట్టాడు. రజాకార్ల నాయకుడు పడిపోగానే మిగతా నలుగురు అనుచరులు పరుగెత్తి పారిపోయారు. హిసామొద్దీన్‌ను పటేల్ తుపాకీతో కాల్చి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. హోసలిని దోచిన రజాకార్లు బుద్ధి చెప్పారు. ఆ తర్వాత భావురావు పటేల్ త మిత్రులతో నిజాం సరిహద్దుల్ని దాటి తప్పించుకున్నాడు. పోలీసు చర్య తర్వాత పటేల్  తన దళంతో పాటు లింగదల్లి గ్రామాన్ని విముక్తిపరిచి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.

ముచలమ్‌లో హింసాకాండ
పటేల్ చేతుల్లో హిసామొద్దీన్ చనిపోవటం తమకు ఘోరమైన ఓటమిగా రజాకార్లు భావించారు. పటేల్‌ను ఏ విధంగానైనా నిర్భందించాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ అతను ఏనాడో సరిహద్దుల్ని దాటి వెళ్ళిపోయారు. ప్రతీకార హింసతో చెలరేగిన రజాకార్లను చూసి హిందువులు భయపడిపోయారు.

రజాకార్లు పటేల్‌కు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తుల్ని వెదకసాగారు. హిసామొద్దీన్‌ను అంతం చేసే ముందు పటేల్ ముచలమ్ అనే గ్రామంలో శరణప్ప పటేల్ ఇంట్లో ఉండేవాడని అక్కడినుండి తన కార్యకలాపాలు కొనసాగించాడనే విషయాన్ని తెలుసుకున్నారు. భావురావు పటేల్ బదులు అతనికి ఆశ్రయమిచ్చిన మిత్రుల్ని నాశనం చేయాలని రజాకార్లు నిర్ణయించుకున్నారు. ఆ విధంగా తమ ప్రతీకార వాంఛను చల్లార్చుకోవాలని కుట్ర పన్నారు.

ఒకరోజు సాయుధులైన రజాకార్ల ముచలమ్ గ్రామాన్ని నలువైపుల నుండి చుట్టుముట్టి వేశారు. తుపాకులు కాలుస్తూ గ్రామస్థులను  భయకంపితులను చేశారు. దాదాపు గ్రామమంతా ఇళ్ళలో తలుపుల వెనక దాక్కొన్నది. కాల్పులు కొనసాగిస్తూ రజాకార్లు గ్రామాలలోకి ప్రవేశించారు. శరణప్ప పటేల్ ఇంటిపై దాడి చేశారు. నిరాయుధులైన శరణప్ప తన భార్యా, ఇద్దరు పిల్లలతో ఇంట్లో తలుపులు బిగించుకొని కూచున్నాడు. రజాకార్లు ఇంటిపై కిరసనాయిలు చల్లి నిప్పు అంటించారు. ఎవరూ రాకుండా కాల్పులు సాగిస్తునే ఉన్నారు. ఇల్లు మొత్తం కాలి ఆ మంటల్లో శరణప్ప, అతని భార్య, పిల్లలు బూడిదైపోయారు. తర్వాత రాజాకార్లు కసిదీరక గ్రామాన్ని దోచుకొని హింసాకాండ సాగించారు. శరణప్ప వంశాన్ని మొత్తం నాశనం చేశామని రజాకార్లు తృప్తి పడ్డారు. కానీ ఆ సమయంలో ఇంట్లో లేని శరణప్ప తమ్ముడు మాత్రం బ్రతికిపోయాడు.

గోర్టలో అమానుషాలు
ఆ తర్వాత గోర్ట గ్రామంపై రజాకార్ల కన్ను పడింది. అసలు 1928లోనే ఒకసారి ఒక మసీదు నిర్మాణ విషయంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ జరిగింది. గోర్టలో హిందువులు ఎదురు తిరిగారనే నేరంపై రెండువందల మంది పోలీసులు, ఐదు వందలమంది ముస్లింలు హిందువులను దోచుకున్నారు. పైగా నలభై ఆరుమంది హిందూ యువకులపై కేసులు పెట్టి అందులో ముప్ఫురైండు మందికి పాతికేసి రూపాయల చొప్పున జుర్మానా విధించి సంవత్సరం పాటు జైలుశిక్ష విధించారు. ఇదీ నిజాం పాలనలో జరిగిన న్యాయం.

Source: Vijaya Kranthi