Home News ‘పద్మావతి’ వివాదం వెనక…చారిత్రక కల్పనలు

‘పద్మావతి’ వివాదం వెనక…చారిత్రక కల్పనలు

0
SHARE

సంజయ్‌ లీలా భన్సాలీ చిత్రం ‘పద్మావతి’కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొన్ని వర్గాలు ఉన్మాదంతో వూగిపోతున్నాయి. స్థూలంగా చూస్తే అందులో ఎలాంటి అర్థంపర్థం లేదని స్పష్టమవుతుంది. చిత్రాన్ని తాము చూడలేదని నిరసనకారులు స్వయంగా అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ రాజ్‌పుత్‌ సముదాయానికి చెందినవారు, ఉత్తర భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఉన్న ఇతర వర్గాలు ఆ చిత్రాన్ని నిషేధించాలంటూ లక్షల సంఖ్యలో వీధుల్లోకి వస్తున్నాయి. కొంతమంది తమ ఆందోళనలను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. చాలామంది గుంభనంగా ఉన్నారు. ఇప్పటికే బయటికి వచ్చిన కొన్ని దృశ్యాలనుబట్టి చూస్తే అల్లావుద్దీన్‌ ఖిల్జీకి సన్నిహితంగా పద్మావతి వ్యవహరించినట్లుందని వారు అంటున్నారు. ఇది హిందూమతాపచారమేనని, తమకు ఎంతమాత్రం సమ్మతం కాదని స్పష్టం చేస్తున్నారు. పద్మావతి చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించిన కొంతమంది మీడియా ముఖ్యులు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. సినిమాలో పద్మావతి, ఖిల్జీ పాత్రలు సన్నిహితంగా మెలిగే లేదా ఒక్క దగ్గరికి వచ్చే సన్నివేశాలే లేవంటున్నారు. అయినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. రెండు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే పద్మావతి వివాదాన్ని రగిల్చారన్నది మరికొందరి వాదన. అందులో వాస్తవం లేదనిపిస్తోంది.

సమస్య మూలాల్లోకి వెళ్లి చూస్తేనే పరిస్థితి కొంతవరకు అవగతమవుతుంది. భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా మధ్యయుగాల చరిత్రను కొంతమంది కుహనా లౌకికవాదులు, నెహ్రూవాద, మార్క్సిస్టు చరిత్రకారులు రాశారు. దాన్ని హిందువుల్లో అత్యధికులు విశ్వసించడం లేదు. రాజ్‌పుత్‌ తదితర హిందూవర్గాల ఆగ్రహం, ఆవేదన, అసంతృప్తి, నిరసనల మూలం అక్కడుంది. కొందరు చరిత్రకారులు మధ్యయుగ భారతదేశ చరిత్రను తమ కల్పనలతో నింపేశారు. ఉదాహరణకు ఔరంగజేబు సంగతే తీసుకొందాం. ఆయన పెద్దసంఖ్యలో హిందూ దేవాలయాల మీద విరుచుకుపడ్డాడు. ఆలయ సంపదను దోచుకున్నాడు. హిందువులను తీవ్ర అణచివేతకు గురిచేశాడు. కానీ, ఈ చరిత్రకారుల దృష్టిలో మాత్రం ఆయన అసలుసిసలు లౌకికవాది. వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసు. కానీ, ఇన్నాళ్లుగా ఇన్నేళ్లూగా వారెవరూ ఆ బూటకపు చరిత్రను గట్టిగా సవాలు చేయలేకపోయారు. 2014దాకా న్యూదిల్లీలో ఈ నెహ్రూవాద, మార్క్సిస్టు మేధావులు ఆడింది ఆట, పాడిందే పాటగా సాగింది. సాహిత్యం, సినిమా సహా ప్రతిఒక్క రంగాన్నీ వారు గణనీయంగా ప్రభావితం చేయగలిగారు. సినిమా నిర్మాతలు, చిత్రకారుల (ఎంఎఫ్‌ హుస్సేన్‌) వంటి కొంతమంది కళాకారులకు దీంతో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. భావ వ్యక్తీకరణ హక్కు పేరుతో హిందూమత దూషణను పతాకస్థాయికి తీసుకెళ్లారు.

ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. సినిమాల వంటి జనరంజక సాధనాలే అభూత కల్పనలను వ్యాపింపజేస్తున్నాయి. కనుక, వారిప్పుడు వాటిని ప్రశ్నించనారంభించారు. ఆర్‌సీ మజుందార్‌ మొదలుకొని ప్రొఫెసర్‌ కేఎస్‌ లాల్‌, డాక్టర్‌ ఎస్‌పీ గుప్తా, ప్రొఫెసర్‌ మఖన్‌లాల్‌, ప్రొఫెసర్‌ బీబీ లాల్‌ వరకు ఎందరో చరిత్రకారులు భారత ప్రాచీన, మధ్యయుగ చరిత్రను రచించిన తీరును సవాలు చేశారు. చరిత్ర రచనలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలన్న భావన, వాదన బలం పుంజుకొన్నాయి. జాతి జీవనంలో ప్రస్తుత దశను అది ప్రభావితం చేస్తోంది. పద్మావతి సినిమా మీద వ్యక్తమవుతున్న భయాందోళనలు మితిమీరినట్లు కనిపిస్తున్నమాట నిజమే కానీ, ఇదంతా ప్రస్తుత ప్రక్రియలో భాగమే!

అల్లావుద్దీన్‌ ఖిల్జీ విషయానికి వద్దాం. ఆయన 1303 జనవరి ఎనిమిదిన చితోడ్‌పై దండయాత్రకు దిల్లీ నుంచి బయలుదేరాడు. పెద్దస్థాయిలో ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం- అనేక రాజ్యాలను హస్తగతం చేసుకొని, యావత్‌ ప్రపంచాన్నే పాదాక్రాంతం చేసుకోవాలన్నది ఆయన ఉద్దేశం. రాణి పద్మావతిని ఆయన మోహించారని, ఆమె కోసం ఎంతకాలమైనా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడన్నది మరో కథనం. ఆ ఏడాది చివర్లో ఆయన చితోడ్‌గఢ్‌ను ముట్టడించాడు. రాజపుత్రుల చరిత్ర, సంస్కృతిని నిక్షిప్తం చేసిన చరిత్రకారుడు దశరథ శర్మ తెలియజేసినదాని ప్రకారం బెరాబ్‌-గాంభిరి నదుల మధ్య ఖిల్జీ గుడారాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. లొంగిపోవాలని రాజారత్నసింగ్‌ ఆగస్టు 26న నిర్ణయించుకొన్నారు. కానీ, మరికొంత కాలం పోరాడదామని ప్రజలు పట్టుపట్టారు. చివరకు కోట ఖిల్జీ వశమైంది. ఒకే ఒక్కరోజు 30 వేలమంది హిందువులు ఖిల్జీ కరవాలానికి బలయ్యారు. అతిలోక సుందరి పద్మావతి, ఆమె చెలికత్తెలు అగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతికి పాల్పడ్డారు. ‘అల్లావుద్దీన్‌ ఆమెను పొందాలనుకొన్నాడు. చివరకు ఆయనకు దక్కింది పిడికెడు బూడిదే’ అంటూ మాలిక్‌ మొహమ్మద్‌ జాయసీ 1540లో ‘పద్మావత్‌’ కవితలో రాసిన విషయాన్ని శర్మ ఉటంకించారు. చాలామంది చరిత్రకారులు జాయసీ కవితమీదే ఆధారపడ్డారు. పద్మిని తరహాలో కవులు, రచయితలను ఆకర్షించిన యోధురాలు రాజస్థాన్‌లో మరొకరు లేరని శర్మ పేర్కొన్నారు. ‘పద్మిని ఎంతో ధీశాలి. కుప్పపోసిన అందం ఆమె సొంతం. ఆమెది తిరుగులేని వ్యక్తిత్వం. కామాంధుడి చేజిక్కకుండా, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ధైర్యసాహసాలతో అగ్నిగుండంలోకి దూకి, ఆత్మాహుతి చేసుకొంది’… ఇది తరతరాలుగా ఈ దేశంలో పాఠశాలల్లో, విద్యాసంస్థల్లో విద్యార్థులకు చెబుతున్న పాఠం. ఖిల్జీ పాలబడే బదులు ఆత్మాహుతి చేసుకోవాలన్న పద్మావతి నిర్ణయం గొప్ప ధైర్యసాహసాలతో కూడుకొన్నదని, తద్వారా భారత నారీమణుల ఆత్మగౌరవాన్ని, ఔన్నత్యాన్ని ఆమె పరిరక్షించారని రాజ్‌పుత్‌లు, ఇతర హిందూవర్గాలు భావిస్తున్నాయి. అందుకే ప్రజల హృదయాల్లో ‘దేవి’గా ఆమె చిరస్థానం సంపాదించుకొంది.

బాలీవుడ్‌ సినిమాలో రాణి పద్మిని జీవిత చరిత్రను వక్రీకరించారేమోనని రాజ్‌పుత్‌లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందుకే వారు ఈ స్థాయిలో స్పందిస్తున్నారు. పద్మావతి కేవలం కల్పిత పాత్రకాదని, ఆమె చారిత్రక వాస్తవమని వారు వాదిస్తున్నారు. భారత నారీమణుల ఆత్మగౌరవ పతాకగా ఆమెను అభివర్ణిస్తున్నారు. ఒక కల్పిత పాత్రను ఆధారం చేసుకొని ఈ స్థాయిలో రెచ్చిపోవడమేమిటంటూ మరోవైపు కొందరు వామపక్ష హేతువాదులు హేళనలకు దిగుతున్నారు. హిందూ విశ్వాసాలు, నమ్మకాలు, అభిప్రాయాలను తరచుగా సవాలు చేస్తున్న ఇలాంటి పేచీకోరు మేధావుల విషయంలో బాలీవుడ్‌ అప్రమత్తంగా ఉండాలి. సమస్యకు మూలకారణమేమిటో తెలుసుకొంటే, దాన్ని పరిష్కరించడం భన్సాలీ బృందానికి పెద్ద కష్టమేమీకాదు. తన చిత్రంలో వక్రీకరణలు ఏవీ లేనప్పుడు నిప్పుకణాన్ని ఆదిలోనే ఆర్పడానికి సంజయ్‌ లీలా భన్సాలీ ఎందుకు ప్రయత్నించలేదు? బూటకపు చరిత్రలు రాసిన నెహ్రూవాద, వామపక్ష చరిత్రకారులకు, వారి వక్రీకరణలకు దూరంగా ఉన్నప్పుడే బాలీవుడ్‌ ఇలాంటి ఘర్షణల బారి నుంచి తప్పించుకోగలుగుతుంది. ఈ వివాదాన్ని పక్కనపెడితే, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సంజయ్‌ లీలా భన్సాలీకి గల ప్రాథమిక హక్కు అని గుర్తించాలి. దాన్ని కాపాడటం ప్రభుత్వ కర్తవ్యం. సినిమా దర్శకుణ్ని, నటులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.

-ఏ సూర్యప్రకాష్

ప్రసార భారతి చైర్మన్

(ఈనాడు సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here