Home Telugu Articles భారతీయ యోగా చరిత్ర

భారతీయ యోగా చరిత్ర

0
SHARE

`ఐక్యరాజ్యసమితి/UN’ సంస్థ,  2014 సంవత్సరం నుంచి, జూన్ 21వ తేది ప్రతి సంవత్సరం, `అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించింది. గత 6 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఉత్సాహంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు.

ఇది సాధారణంగా, `సమ్మర్ సోల్స్టిస్’ రోజు (సంవత్సరంలో దీర్ఘమైన `పగలు’ ఉండే రోజు) కూడా! 

యోగా – పుట్టుక, చరిత్ర మరియు అభివృద్ధి

మనిషి శరీరానికి మెదడుకి మధ్య ఏకత్వాన్ని లేక సంయోగాన్ని కుదిర్చే సునిశితమైన శాస్త్రమే యోగా. ఆరోగ్యకరమైన జీవన ప్రక్రియ, కళ యోగా. యోగ సాధన ద్వారా వ్యక్తి చేతనకి, విశ్వ చైతన్యానికి /అలాగే మనిషికి ప్రకృతికి మధ్య సమన్వయము సిద్ధిస్తుంది. ఈ ఏకత్వాని యోగ సాధన ద్వారా సాధించిన వ్యక్తి యోగి, మానసికంగా ఈ స్వీయ-అవగాహన సాధించిన వారు, వేదనలను అధిగమించి, మానసిక `స్వేచ్ఛ’ను, అనగా `మోక్ష’ సాధన దిశగా ప్రయాణించగలరు. జీవనం, ఆరోగ్యం, సామరస్యతల్లో ఈ `స్వేచ్ఛ’  అనుభూతి చెందడం యోగ సాధన ముఖ్య ఉద్దేశం.

2700 BCE సింధు-సరస్వతీ నాగరికత సమయం నాటికే యోగ- సాధనను `అమృత సాంస్కృతిక పరిణామo’గా, మానవాళి భౌతిక- ఆధ్యాత్మిక ప్రయోజనాలను, మానవతా విలువలను పెంపొందించే శాస్త్రంగా భావించేవారు.

యోగా- చరిత్ర

యోగ శాస్త్రం అనాదిగా, కొన్ని వేల’సంవత్సరాలుగా మన దేశంలో ప్రభవిoచినదిగా తెలుస్తోంది.   హిమాలయాలలోని కాంతి సరోవరం వద్ద `ఆదియోగి’ `ఆది గురువు’ మహాశివుడు, యోగ పరిజ్ఞ్యానాన్ని సప్త ఋషులకి ప్రదానం చేస్తే, వారు దీనిని ప్రపంచం నలుమూలలకి తీసుకుని వెళ్ళారని భావిస్తున్నారు. అందుకే వివిధ దేశాల ప్రాచీన సంస్కృతుల్లో, వారికి మనకు ఎన్నో పోలికలు కనిపిస్తాయని ఆధునిక పరిశోధకులు చెపుతున్నారు.  అయితే భారత దేశంలో ఇది పూర్తిగా అభివృద్ధి చెందింది. సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహార్షి, దేశమంతా పర్యటించి యోగిక జీవనాన్ని రూపొందించారు. 

సింధు-సరస్వతీ నాగరికత తవ్వకాల ఆధారాలు, అవశేషాలలో యోగ ముద్రలు కనిపించాయి, దానిని బట్టి అప్పటికే దేశంలో యోగా ఉండేదని నిర్ధారణ అయింది. తంత్రయోగకి సంబంధించిన దేవతామూర్తులు లభించాయి. సింధులోయ నాగరికత, వేద-ఉపనిషత్తులు, దర్శనాలు, బౌద్ధ-జైన గ్రంథాలు, రామాయణ-మహాభారత ఇతిహాసాలు, స్మృతులు, జానపద సాహిత్యం, పాణిని `అష్టాధ్యాయి’, శైవ-వైష్ణవ-తంత్ర సంప్రదాయాలన్నిటిలోనూ, యోగ-సాధన ప్రస్తావన కనిపిస్తుంది.     

అనాదిగా దక్షిణాసియాలో, గురు-శిష్య పరంపరలో, ఉపాసన- యోగ- ధ్యాన-సాధన వారి ఆచారాలలో భాగంగా ఉండేది. వేదకాలంలో సూర్యుడు ముఖ్యమైన దేవుడు కాబట్టి, తరువాత కాలంలో `సూర్య నమస్కారాలు’ ఆవిష్కరించబడ్డాయి.  అలాగే `ప్రాణాయామం’ రోజువారీ పూజా విధానంలో భాగoగా ఉండేది.

పతంజలి మహర్షి

అనాదిగా యోగసాధన ఉన్నా, శ్రీ పతంజలి మహర్షి, యోగ క్రియలు- వాటి అర్థ తాత్పర్యాలన్నిటినీ క్రమపద్ధతిలో క్రోడీకరించి `యోగ-సూత్రాలు’ రూపొందించారు. 500 BCE – 800 CE కాలంలో ` శ్రీమద్ భగవద్గీత’ `యోగ-సూత్రాల’ పై మహాభాష్యాలు, వ్యాఖ్యానాలు వెలువడడమేకాక, ధార్మిక గురువులైన శ్రీ మహావీరుడి `పంచ మహావ్రతాలు’, గౌతమ బుద్ధుని `అష్ట మార్గాలు’  కూడా ప్రాథమిక యోగ-సాధన మార్గాలే.  ఈనాటికీ మానవ-వివేకానికి, వ్యక్తి వికాసానికి, మానసిక శాంతికి, అత్యంత ప్రామాణికమైనదిగా భావించబడే మూడు యోగ సూత్రాలు- జ్ఞ్యానయోగo, భక్తియోగం, కర్మయోగం శ్రీ భగవద్గీతలో అద్భుతంగా వివరించబడింది. పతంజలి మహర్షి తమ `యోగ-సూత్రాల’లో అన్ని యోగాoశాలతోపాటు `అష్టావిధ యోగమార్గాలు’ కూడా వివరించారు. శ్రీ వ్యాసమహర్షి యోగ-సూత్రాలకి భాష్యం వ్రాయబడింది. యోగ-సాధన ద్వారా బుద్ధి-శరీరాలను నియంత్రించి శాంతిని పొందవచ్చన్న భావన స్థిరపడింది.   

800 CE – 1700 CE కాలంలో మహా ఆచార్యత్రయం – పీఠాధిపతులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు తమ బోధనల ద్వారా యోగశాస్త్రం మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు; సూరదాసు, తులసీదాసు, పురందరదాసు, మీరాబాయి మొదలైనవారు భక్తియోగ మార్గదర్శకులైనారు.. హఠయోగ సంప్రదాయo గురువులు- శ్రీ మత్స్యేoద్రనాథుడు, గోరఖనాధుడు,  గౌరంగానాధుడు, స్వాత్మారామ సూరి, ఘేరాంద, శ్రీనివాస భట్ట మొదలైన వారు హఠయోగ పద్ధతులకు ప్రాచుర్యం కలగజేసారు.  

1700 – 1900 CE ఆధునిక కాలంలో శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ పరమహంస యోగానంద, స్వామి వివేకానంద మొదలైన గొప్ప యోగాచార్యులు `రాజ-యోగ’ మార్గాన్ని అభివృద్ధి చేసారు. వేదాంత, భక్తి, నాథ లేక హఠయోగ మార్గాలు వర్ధిల్లాయి.  `గోరక్షాశతకం’ లో `షడాoగ-యోగం’, `హఠయోగాప్రదీపిక’ లో `చతురంగ-యోగం’, `ఘెరాంద సంహిత లోని `సప్తాంగ-యోగం’ హఠయోగంలో ముఖ్యమైనవి. 

ప్రస్తుత కాలంలో యోగ-సాధన వల్ల మానసిక-శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని అందరికీ తెలుసు. ఎంతోమంది మహా గురువుల బోధనవల్ల యోగ-సాధన ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. వారిలో కొందరు స్వామి శివానంద, శ్రీ టి. కృష్ణమాచార్య, స్వామి కువలయానంద, శ్రీ యోగేంద్ర,  స్వామి రామా, శ్రీ అరవింద మహర్షి, శ్రీ రమణ మహర్షి, మహర్షి మహేష్ యోగి, ఆచార్య రజనీష్, పట్టాభి జోయిస్, బికెఎస్ అయ్యెoగార్ (అయ్యెoగార్ యోగ)స్వామి సత్యానంద సరస్వతి మొ. వారు.


చాలామందికి యోగా అంటే, యోగాసనాలు అని మాత్రమే తెలుసు. అయితే `యోగసూత్రాలు’ గ్రంథంలో మూడు సూత్రాలు మాత్రమే హఠ/ఆసనాల గురించి చెపుతాయి. హఠయోగం కేవలం శరీరాన్ని అత్యున్నత `శక్తి’ కేంద్రంగా మార్చే ప్రాథమిక దశ మాత్రమే, `శరీరం’ తరువాత `శ్వాస’, తరువాత `బుద్ధి/మెదడు’, ఆ పైన మనలోని అంతర్గత `స్వయంశక్తి’ని సాధించడం యోగం.  శారీరక-మానసిక స్వస్థత ఎటూ చేకూరతాయి, అంతకు మించి వ్యక్తికి- విశ్వానికి మధ్య సమన్వయ స్థితిని సాధించడమే యోగా.  ఈ సమతుల్యతను సాధించే సాంకేతిక పరిజ్ఞ్యానo యోగా.  యోగ-సాధనకి కులమతాల తారతమ్యం లేదు. యోగ-సాధనకి ప్రపంచమంతా అర్హులే.

గురు-శిష్య పరంపర దృష్ట్యా వివిధ యోగ సిద్ధాంతాలు- అభ్యాసాలు వాడుకలోకి వచ్చాయి. జ్ఞ్యాన-యోగం, భక్తి-యోగం, కర్మ-యోగం, ధ్యాన-యోగం, పతంజలి-యోగం, కుండలినీ-యోగం, హఠ-యోగం, మంత్ర-యోగం, లయ-యోగం, రాజ-యోగం, జైన-యోగం, బౌద్ధ-యోగం- అన్నిటి లక్ష్యం యోగమే.          

యోగ సాధనాలలో ముఖ్యమైనవి- యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, బంధాలు & ముద్రలు, షట్-కర్మలు, యుక్త-ఆహార, యుక్త-కర్మ, మంత్ర-జపo మొ. `యమ’ అంటే చేయకూడనివి, `నియమ’ అంటే పాటిoచాల్సినవి. `ఆసనాలు’- శరీరం – బుద్ధికి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. `ప్రాణాయామం’ శ్వాసపైన ధ్యాస, `శ్వాస-ప్రశ్వాస’ల గ్రహింపును కలగచేసి, పట్టు సాధించడంతో `బుద్ధి’ని నియంత్రించగలుగుతుంది.

`ప్రత్యాహార’ అంటే మన మానసిక చేతనను, ఇంద్రియాలనుంచి వేరు చేయడం; `ధారణ’ అంటే ఏకాగ్ర చిత్తం, తరువాత `ధ్యానం’, వీటన్నిటినీ అనుసంధానం చెయడమే `సమాధి’ స్థితి.  `బంధాలు & ముద్రలు’ ప్రాణాయామానికి సంబంధించినవి, యోగ-సాధనాలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళగలవు. `షట్-కర్మలు’ శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలను తొలగించడానికి ఉపయోగించే చికిత్సా విధానం. `యుక్తాహార’ అంటే సరియైన ఆహార పద్ధతులు. వీటిలో `ధ్యానం’ యోగ-సాధనకు అతి ముఖ్యమైనది.      

భారతదేశo యోగ-భూమి, యోగ-సాధనకు పుట్టినిల్లు; మన సాంఘిక ఆచారాలు- సంప్రదాయాలు, వ్యక్తికి ప్రకృతికి, సమస్త జీవజాలంపట్ల సహనం, సమన్వయ దృష్టి  ప్రతిబింబిస్తాయి. అర్ధవంతమైన జీవనానికి, సామాజిక ఆరోగ్యానికి,  యోగ-సాధన అవసరం.  మన ప్రాచీన ఋషులు, యోగా గురువులు మనకు అందచేసిన యోగ-శాస్త్రాన్ని, ఈరోజు యావత్ ప్రపంచంలో కొన్ని కోట్లమంది సాధన చేసి, ప్రయోజనం పొందుతున్నారంటే మనకు గర్వకారణం.


సౌజన్యం:  డా. ఈశ్వర్ బసవరెడ్డి
మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ అఫ్ యోగా (స్వేచ్ఛానువాదం: ప్రదక్షిణ)

This article was first published in 2020