Home News గ్రామాభివృద్ధి కమిటీల ముసుగులో దేవాలయాలకు చెందిన గోసంతతి అమ్మకాన్ని ఆపడం ఎలా?

గ్రామాభివృద్ధి కమిటీల ముసుగులో దేవాలయాలకు చెందిన గోసంతతి అమ్మకాన్ని ఆపడం ఎలా?

0
SHARE

‘గావో విశ్వస్య మాతరం’
‘విశ్వమంతటికి గోవు తల్లి వంటిది’.
– వేదం

గ్రామాలలో గోసంతతిని రక్షించటానికి పూర్వకాలం నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని గ్రామాల్లో చాలామంది తమ మొక్కులు తీరిన వెంటనే ఆవులు లేదా కోడెదూడలను గ్రామ దేవాలయాలకు తీసుకెళ్ళి పూజలు చేసి, ఆలయం చుట్టూ తిప్పి దేవుని పేరుతో గ్రామంలో వదిలి పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది.

ఆ రోజు నుండి ఆ గోసంతతిని దేవునివిగా గుర్తించి, గ్రామస్తులు వాటిని పూజిస్తూ ఉంటారు. కాలక్రమేణ వాటి సంతతి పెరిగి, గ్రామానికి ఎంతో మేలు జరిగేది. గ్రామ వికాసంలో వాటి భాగం ఎంతో ఉండేది. ఆ గ్రామంలోని భూసార పరిరక్షణ, వ్యవసాయం, సేంద్రియ ఎరువులు, పర్యావరణ సమతౌల్యం, పాడి, ఆరోగ్య, ఆర్థిక, పటిష్టతలకు, ఆధ్యాత్మిక అవసరాలకు ఉపయోగపడుతూ వర్థిల్లుతురడేవి.

కాని కొన్ని సంవత్సరాలుగా గ్రామాభివద్ది కమీటీల వారు తమకు ఏ అధికారం లేనప్పటికీ, తన ఇష్టారాజ్యంగా ప్రతిఏట గోసంతతిని అమ్మేస్తున్నారు. ముఖ్యంగా ముస్లింల పండుగ బక్రా-కా-ఈద్‌ (బక్రీద్‌) ఉన్న మాసంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం అనేక రకాల సాకులతో వేలాది గ్రామాల్లో ప్రతి ఏటా కొన్ని చోట్ల బహిరంగంగా వేలంపాటలు నిర్వహించి, మరికొన్ని చోట్ల నేరుగా దళారీలకు లేదా కటిక కసాయి వ్యాపారులకు, మరికొన్ని చోట్ల బినామి పేర్లతో తమకు వాటమున్నట్లు అమ్మేస్తున్నారు. ఫలితంగా అమూల్యమైన దేవుని గోసంతతి బక్రీద్‌ ఖుర్బానీ పేరుతో కసాయిల చేతుల్లో హతమవుతున్నది.

వాస్తవానికి ఈ గోసంతతి కేవలం దేవుని సొత్తు. గ్రామ దేవాలయానికి చెందిన ఆస్తి. దీనిని దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు. గ్రామంలో ముఖ్య శక్తులైన :

1) గ్రామాభివృద్ధి కమిటీలు : వీరిని ప్రభుత్వం నియమించలేదు. వీరికి ఏవిధంగా కూడా గో సంతతిని అమ్మే అధికారం లేదు.

2) గ్రామ సచివాలయ కార్యదర్శి : వీరికి గోసంతతిని అమ్మే ఎటువంటి ఆదేశం గాని , అధికారం గాని లేదు. ఇందులో వీరి జోక్యం చట్ట విరుద్ధం.

3) గ్రామ ప్రజలు ఎన్నుకున్న పంచాయితీ సమితి: వీరికి కూడా గోసంతతిని అమ్మేహక్కు గాని అధికారం గాని ఎక్కడా లేదు.

ఎందుకంటే అన్ని గ్రామాలలో మసీదులు, దర్గాలు, చర్చీలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన ఏదైన ఆస్తిగాని మరొకటిగాని వీరు అమ్మగలరా? ఆ సాహసం చేయగలరా? ఎందుకంటే వీటి వ్యవహారాలను వారి వారి మత పెద్దలు మాత్రమే చూసుకుంటారు. ప్రభుత్వం లేదా ఇతరుల జోక్యం వీరు సహించరు. మరి గ్రామ దేవాలయపు గోసంతతిని అమ్మేహక్కు వీరికెక్కడిది ? ఇది దేవాలయ ఆస్తి. తెలుగు రాష్ట్రాలలో వేలాది గ్రామాలలో వర్ధిల్లుతున్న ఇటువంటి గోసంతతి సంరక్షణ హిందూ సంస్థల బాధ్యత. ఏదైన గ్రామంలో గోసంతతిని అమ్ముతున్నట్లయితే గ్రామస్తులు గట్టిగా అభ్యంతరం తెలిపి అడ్డుకోవాలి.

ఉదాహరణకు నిజామాబాద్‌ జిల్లాలో ప్రబలిన ఈ దురాచారాన్ని గో సేవా విభాగం కార్యకర్తలు గత 5 సంవత్సరాలుగా అడ్డుకుంటున్నారు. కొన్నిచోట్ల గ్రామాభివద్ధి కమిటీలు, వాటికి వత్తాసు పలికే గ్రాపంచాయితీ సెక్రటరీ, గ్రామపంచాయితి కమిటీ వారు అక్కడ గోసంతతిని అమ్ముకోవడాన్ని వ్యతిరేకించే వారిని గ్రామబహిష్కరణ చేస్తామని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. కాని ఇవన్నీ చట్ట విరుద్ధం. న్యాయస్థానాలలో వీరి బెదింపులు చెల్లవు. ధైర్యంగా ఎదిరించి జిల్లాలోని కొన్ని గ్రామాలలో బలంగా అడ్డుకొని విజయం సాధించి గోసంతతిని కసాయిపాలు కాకుండా, పైసా చెల్లించకుండ గోశాలలకు తరలించారు. ఫలితంగా జిల్లా మొత్తం ప్రభావితమయి వందలాది గ్రామాల్లో హిందూ సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, యువజన సంఘాలు, అభ్యంతరం తెలుపడం ప్రారంభమై గోసంతతిని గోశాలలకు తరలించడమో లేదా గ్రామంలోనే ఉంచడమో జరుగుతున్నది.

కాబట్టి ఈ సంవత్సరం రాబోయే బక్రా-కా-ఈద్‌ (బక్రీద్‌) (ఆగస్టు 22) బారి నుండి తెలుగు రాష్ట్రాలలో వేలాది గ్రామాలలో వర్ధిల్లుతున్న దేవుని గోసంతతిని కాపాడడానికి ప్రజలు ముందుకు రావాలని గోసేవా విభాగం కోరుతున్నది.

– ఆకుతోట రామారావు,
(తెలంగాణ ప్రాంత గో సేవా ప్రముఖ్‌)

గమనిక :

ప్రజలు స్థానిక కలెక్టర్‌, డి.పి.వో., ఆర్‌.డి.వో., తహసిల్దారులకు వినతి పత్రమిచ్చి వారు తగిన చర్యలు తీసుకొనేటట్లుగానూ, అలాగే పత్రికలకు ప్రెస్‌ నోట్‌ ఇవ్వటం ద్వారా కూడా గోసంతతిని కాపాడేందుకు ప్రయత్నం చేయవచ్చు.