Home Ayodhya రామమందిరం నుండి రామరాజ్యం వైపు…

రామమందిరం నుండి రామరాజ్యం వైపు…

0
SHARE

పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ 

మూడవ భాగం

ప్ర. మన జనాభా చూస్తే అందులో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళా శక్తి భారత్ ను తిరిగి విశ్వగురువుగా నిలపడంలో ఎలాంటి పాత్ర పోషించాలని మీరనుకుంటున్నారు?

జ: మహిళల సాధికారత చాలా ముఖ్యం. వారిలో కర్తవ్య భావన ఉంది. వారికి ఇతరమైన సహాయం ఏది అవసరం లేదు. మనం వారికి ఏ ద్వారాలు మూసివేశామో వాటిని తెరిస్తే చాలు. నేడు మహిళలు ఇంటిని తీర్చిదిద్దుకోవడంతోపాటు అనేక పనులు చేస్తున్నారు. అయితే వారికి వారు కోరుకున్న స్వేచ్చ, కాస్త పని వెసులుబాటు కలిగించాలి. మహిళలో సృజనాత్మకతతోపాటు శక్తి కూడా ఉంది. ఆ శక్తి మాతృస్థానం వల్ల కలుగుతోంది. ఈ ముఖ్యమైన స్థానాన్ని గుర్తించి అందుకు తగినట్లు ఇతరులు సహకరించాలి. అంతేకాని ఆమెను దేవతలా గౌరవిస్తూ ఇంటికి పరిమితం చేసినా, దాసిలా పరిగణిస్తూ గడప దాటనివ్వకపోయినా లాభం లేదు. వారిని పురుషులతో సమానంగా పని చేయనివ్వాలి. బాధ్యతలు తీసుకుని వాటిని నిభాయించేందుకు తగిన శక్తిసామర్ధ్యాలు సంపాదించుకొనివ్వాలి. ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని సాధించుకునే అవకాశాలు ఇవ్వాలి. ఇలా చేయగలిగినప్పుడు వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడతాయి.

ప్ర. భారత్ యువ దేశం అంటున్నారు. యువత ఎలా ఉండాలనుకుంటున్నారు?

జ. యువ శబ్దం అర్ధం ఏమిటో అదే మనం ఆశిస్తాము. యువత ఎలాంటి బంధనాల్లో చిక్కుకోదు. ఎప్పుడు కొత్త ఆలోచనలకు ఆహ్వానం పలికేదే యువత. వారిలో సాహసం ఉంటుంది. ఉత్సాహం ఉంటుంది. ఉదారత్వం ఉంటుంది. పిల్లలు, యువతలో సంవేదనశీలత ఎక్కువ. నిజానికి పిల్లల్లో మరింత ఎక్కువగా ఉన్నా వాళ్ళు ఇతరులపై ఆధారపడిన వారి కనుక పెద్దగా ఏమి చేయలేరు. కానీ యువతలో శక్తియుక్తులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు సత్యం, న్యాయం వైపు నిలబడతారు. కొండలనే కదల్చగలరు. వారి శక్తియుక్తులను సరైన దిశలో మరల్చగలగాలి. అలా కాకుండా కేవలం కెరీర్, స్వార్ధం మాత్రమే చూసుకునే వాళ్ళు ఉద్యోగాలకే పరిమితమై ఎలాంటి ఇతర పనులు చేయడానికి సిద్ధపడరు. అలాంటివాళ్లు వయస్సు చిన్నదైనా వృద్ధుల్లా ఆలోచిస్తారు. కానీ అబ్దుల్ కలాం వంటి తలనెరిసిన వృద్ధులు మాత్రం ఎప్పుడూ ఉత్సాహంగా, నిత్యనూతనంగా ఆలోచిస్తూ, పనిచేస్తూ యువకుల్లా ఉంటారు. యువతలో ఉత్సాహం ఉరకలు వెయ్యాలి. కొత్త పనులు చేయడానికి వారిని ప్రోత్సహించాలి. అందుకు తగిన అవకాశాలు కలిగించాలి.

ఒకసారి డా. జోషి పర్యటన కోసం చైనా వెళ్లారు. పర్యటన ముగించుకుని ఆయన తిరిగి రావాలనుకుంటున్నప్పుడు మరికొంత కాలం ఉండమని చైనా అధ్యక్షుడు కోరాడు. చైనాలోని ఒక విశ్వవిద్యాలయపు సమ్మేళన కార్యక్రమం ఉందని, దేశం మొత్తం నుంచి 2 లక్షల మందికి పైగా విద్యార్ధులు అందులో పాల్గొంటారని, ఆ సమ్మేళన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉండాలని కోరాడు.  అది 1980 సంవత్సరం. కార్యక్రమం మొదలైంది. అందులో ఒక ప్రదర్శన ఏర్పాటైంది. వేదికపై తెర ఒక్కసారిగా తెరచుకుంది. ఆ వెనుక ఉన్న మరో తెరపై ప్రపంచ పటం, అందులో ఎర్రటి రంగులో స్పష్టంగా కనిపెంచే విధంగా చైనా ఉన్నాయి. ఆ చైనా నుంచి లేచిన డ్రాగన్ విశ్వాన్ని మొత్తాన్ని కప్పివేస్తున్నట్లుగా చూపించారు. ఇంతలో వెనుక నుంచి వ్యాఖ్యానం మొదలైంది. ఒకప్పుడు డ్రాగన్ ఇలా ప్రపంచాన్ని చుట్టివేసింది. మనం మళ్ళీ ఆవిధంగా జరిగేట్లు చూడాలి అంటూ వ్యాఖ్యాత చెపుతున్నాడు. ఇలా లక్షలాదిమంది యువత ముందు ఒక లక్ష్యాన్ని ఉంచారు. కాబట్టి యువత ముందు ఉన్నతమైన లక్ష్యాన్ని ఉంచాలి. అలాగే ఆచరణాత్మక ఆదర్శాన్ని ఉంచాలి. మనం అలా చేయగలిగితే యువత ద్వారా సాధించలేనిది ఏది లేదు.

ప్ర. ప్రస్తుతం మనం ఈ కరోనా విపత్తు ఆపత్కాలంలో ఉన్నాము, దీని తరువాత ముందుకు ఎలా వెళ్తాము అనే చర్చ దేశంలో జరుగుతోంది, భవిష్య భారతం చర్చ ఎటూ జరుగుతోంది. సంఘ్ ముఖ్య అధికారిగా `భవిష్య భారతాన్ని’ మీరు ఏ విధంగా, ఏ రూపంలో చూస్తారు?

జ. మన `మదిలోని అయోధ్య’ గురించి నేను ఇంతకుముందు మాట్లాడాను. భారత దేశంలోని వ్యవస్థలను ప్రపంచం ఏ విధమైన దృష్టితో పరిశీలిస్తుంది అని అడిగారు, అది కూడా నేను వివరించాను.

ఈ పై అంశాలు రెండూ సరిచూసుకుంటే, భవిష్యత్తులో భారతం కూడా సరైన దారిలో పడుతుంది. నేడు దేశంలో, ముఖ్యంగా యువతకి మన దేశాన్ని ఘనమైన దేశంగా మార్చాలని  ఎంతో కోరికగా ఉంది. అదృష్టవశాత్తు జరుగుతున్న సంఘటనలు కూడా సానుకూలంగానే ఉన్నాయి, అందువల్ల నమ్మకం పెరుగుతోంది. దేశ స్వాతంత్ర్యం తరువాత, బహుశా మొదటిసారిగా, ఈ కరోనా విపత్తు కాలంలో, ప్రభుత్వం వైపు నిస్సహాయంగా చూడకుండా, మొత్తం సమాజం ఒక్కతాటిపై నిలబడిoది, స్వయంగా ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు. మీడియా ఎక్కువ శాతం ప్రతికూలమైన, నిరాశాత్మక సమాచారాన్నే ఇస్తున్నాయి, కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య ఇస్తాయి కానీ, నెగిటివ్ సంఖ్య ఇవ్వరు. చాలామంది యజమానులు ఈ కష్టకాలంలోకూడా, శ్రామికులను పనిలోంచి తీసేయకుండా, పూర్తి వేతనాలు ఇస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. ఇప్పుడు యజమానులు పరిశ్రమలు తిరిగి ప్రారంభించబోతుంటే ‘అప్పుడు మా కష్టకాలంలో మీరు ఆదుకున్నారు, ఇప్పుడు మీకు కఠినకాలం, మీరు వేతనాలు తరువాత ఇవ్వండి, మేము పని మొదలు పెడతాము’ అని చాలా ప్రదేశాలలో శ్రామికులు స్వయంగా ముందుకొస్తున్నారని తెలుస్తోంది. అన్నీ కలిపి చూస్తే, సమాజం కలిసికట్టుగా ఉందని ప్రత్యక్షంగా కనపడుతోంది.

రెండవ అంశం, ప్రభుత్వ పాలనా వ్యవస్థ చెపుతున్న విషయాలను, సామాన్యంగా సమాజం అమలుచేసే పధ్ధతిని మనం గమనిస్తే, ప్రసుతం సమాజం క్రమశిక్షణతో వీటిని పాటిస్తున్న సంగతి మనకు కనపడుతోంది. కేవలం పాటించడమే కాక, పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేస్తున్నట్లు స్పష్టమౌతోంది. ప్రధానమంత్రి `దీపం వెలిగించండి, చప్పట్లు కొట్టండి’ అని పిలుపునివ్వగా, కొంతమంది దీనివల్ల ఏమౌతుంది అని నిరసించినా, జనసామాన్యం  ప్రతికూలవాదులని పట్టించుకోకుండా, ప్రధానమంత్రి చెప్తున్నారంటే దీనికి విలువ ఉంది, అని చేతలలో చేసి చూపించారు. లాలబహదూర్ శాస్త్రిగారు, 1971లో ఇందిరాగాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు కూడా ఈ పరిస్థితి కనిపించింది. ఇది నేను వ్యక్తులను ప్రశంసించడానికి చెప్పట్లేదు, సమాజం తనలోని అంతర్గత శక్తి కారణంగా, ఒక్కతాటిపై నిలబడుతుంది. ఈ పెనుసవాళ్లని మన దేశాన్ని నిర్వీర్యం చెయ్యనివ్వకూడదు అని సమాజం సంకల్పిస్తోoది. ఇవాళ మనముందు చైనా ఒక పెనుసవాలుగా నిలిచిఉంది. ఎంతో గొడవచేసి మరీ కొనిపించుకున్న ఆటవస్తువు చైనా తయారీ అని తెలిస్తే, 8సం బాలుడు కూడా అది విసిరేస్తాడు, `నాకిది వద్దు, నా డబ్బులు తిరిగి ఇచ్చేయి’ అంటాడు. ఈ రోజు ఇటువంటి వాతావరణం ఉండబట్టి, ఇటువంటి భావనలు మనలో జాగృతమయ్యాయి. దీనికి కావలసిన లక్షణాలు, మనఃస్థితి గురించి నేను `మదిలో అయోధ్య’ విషయమై మాట్లాడుతున్నపుడు చెప్పాను. ఈ భవిష్య మార్గంలో `బ్రిటిష్ వలసపాలకుల విఛ్చన్నకర ప్రభావం నుంచి సంపూర్ణంగా బయటపడి, భారతీయ ఆలోచనా విధానంతో’ ముందుకు వెళతాము. మన దేశకాలపరిస్థితులకి ఉపయుక్తమైనది, మనకు సంబంధించినది మనం ఇతర దేశాలనుంచి తీసుకోవచ్చు. ఈ రెండు పనులు మనం చేయగలిగితే, ఇంక ఇతర విషయాల అవసరం మనకు కలగదు.

ప్ర. భవిష్య భారతం విషయం వచ్చినప్పుడు `భారత్ విశ్వగురు’చర్చ తప్పకుండా వస్తుంది. శ్రీ స్వామి వివేకానంద నుంచి శ్రీ గురూజీ వరకు అనేక మంది మహాపురుషులు `భారత్ విశ్వగురు’ అనే ఆలోచన చేసారు. ఈనాటి పరిస్థితిలో భారత్ విశ్వగురువుగా ఎలా పరిణమిస్తుంది? ఇతర దేశాలలాగా ప్రపంచ ఆర్ధికశక్తిగా ఎదిగి ఇతర దేశాల తలలువంచి అవుతామా? విశ్వగురు అంటే మన భావం ఏమిటి?

జ. రాజ్యాధికారo వల్ల అంతా జరుగుతుంది అని మేము అసలు  అనుకోము. మనం పెద్దరికం వహించడమంటే, ఇంకొకరి భూభాగం పై అధికారం కాదు, కోటానుకోట్ల మానవాళి హృదయ సామ్రాజ్యాన్ని గెలవడం.

ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః |

స్వం స్వం చరిత్రం శిక్షరేంపృథివ్యాం సర్వ మానవాః   ||

మన వ్యక్తిత్వo చరిత్రల ద్వారా ప్రపంచానికి మనం ఉద్బోధించాలి, మనం ఎవరినీ ఆక్రమించుకోదలుచుకోలేదు, ఎవరి ప్రత్యేకతలనూ హరించము, ఏ దేశాన్నిమనకి దాసులుగా చేసుకోవాలని మనం అనుకోవట్లేదు, ఎవరి ధనసంపదలు మనం కొల్లగొట్టాలని అనుకోవట్లేదు. ఈ విధమైన మహాశక్తి అవాలని మనకులేదు. మనకి మన శక్తి ఉంటుంది, మహాజ్ఞ్యానo ఉంటుంది, సమస్త ధనసంపదలు అపారంగా ఉంటాయి, ప్రపంచంలో ప్రధాన ఆర్ధికశక్తిగా ఎదుగుతాము, కానీ మనం `జ్ఞ్యానాయ దానాయ చ రక్షణాయ’ అనే విధంగా మన శక్తిని సంపదను ఉపయోగిస్తాము.

విద్యా వివాదాయ ధనం మదాయ శక్తిః పరేషాం పరపీడనాయ |

ఖలస్య సాధోర్విపరితమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ ||

శక్తివంతమైన దేశాలు ఇతరదేశాలమీద దండనీతి పాటిస్తాయి. కానీ మనం అలా చేయము. మన జ్ఞ్యానాన్ని మనం ఇతరులకు పంచుతాము. బలహీన దేశాలకు మన శక్తితో రక్షణ కల్పిస్తాము. మన ధనసంపదలు పెరిగినపుడు, పేదదేశాలకి దానం చేస్తాము.  చాలా దేశాలకి ప్రప్రధమంగా వారి మనుగడ ఎలా అన్న ప్రశ్న ఉంది. ఈ పోటీప్రపంచంలో ఎలా గెలవాలి అనే ఆలోచనలు ఉంటాయి. ఈ పోటీలో ముందున్నవాడు గెలుస్తాడు, కాబట్టి ఎలాగైనా ముందుకెళ్లాలి. ఎవరు ఎంత తియ్యగా మాట్లాడినా, వారి గమ్యం అదే. విశ్వమంతా `ప్రపంచ మార్కెట్’ అని మాట్లాడేవాళ్ళు, ఈ రోజు `జాతీయ/స్వదేశీ’ అని పదేపదే అంటున్నారు. ఎందుకంటే ఏ సిద్ధాంతమైనా, వారికి హాని కలిగించనంతవరకు మాత్రమే వారు పాటిస్తారు.  కానీ భారతదేశం అలా కాదు, `అందరూ బాగుంటేనే మనం బాగుంటాము, మనం జీవించిఉంటే, మిగతా అందరూ జీవించాలి’ అని అంటుంది. భారత్ ఇటువంటి దేశంగా పరిణమించినపుడు, ప్రపంచం `విశ్వగురువు’గా గౌరవిస్తుంది. ఈ రోజు కూడా ప్రపంచం మనని గౌరవిస్తోoది. కార్గిల్  యుద్ధం తరువాత, 4-5 ప్రగతిశీల దేశాల అధ్యయన బృందాలు భారత్ వచ్చాయి, మన సైనికులు శౌర్యపరాక్రమాలు తెలిసినవే, అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేరొక దేశం మొదలుపెట్టిన యుద్ధం, సరిహద్దులు దాటకుండానే, మన దేశం ఎలా గెలిచింది? ఈ ఆలోచనా విధానం భారతీయులు తప్ప వేరొక దేశo చేయలేదు. అది తప్పో ఒప్పో అనే చర్చ పక్కనపెట్టి చూస్తే, ఇది కేవలం భారతీయుల మదిలో మాత్రమే వచ్చే ఆలోచన. అందుకే భారత్ విశ్వగురువుగా అయినపుడు, `ఒక దేశం కాబట్టి ఒకే జాతీయత’ అనే ఆలోచన ప్రతి వ్యక్తి తన జీవన విధానంలో అవలంబించినపుడు, ప్రపంచo మొత్తం ఆ జీవనాన్ని అనుసరిస్తుంది.  అమెరికాలో 65% ప్రజలు శాఖాహారులుగా ఎందుకు మారుతున్నారు, ప్రపంచమంతా యోగా ఎందుకు చేస్తోంది? క్రమంగా ప్రపంచం మనవైపు చూస్తోంది, మన జీవనం గురించి ఆలోచిస్తోంది. ప్రపంచదేశాల అవసరాలకు సమస్యలకు సమాధానం ఇవ్వగల శక్తిగా మనం ఎదగాలి.

ప్ర. `రామరాజ్యం’ పట్ల కొన్ని సహస్రాబ్దాలుగా  భారతీయుల హృదయాలలో విశ్వాసం ఉంది. అసలు రామరాజ్య భావన ఏమిటి, దానిని మనం ప్రస్తుత కాలంలో ఏ విధంగా సాకారం చేయగలము? 

జ. ప్రజలు నీతిపరులు, రాజు శక్తివంతుడు నీతివంతుడు అనే సూత్రంపై రాజ్యవ్యవస్థ ఉండేది. ప్రజలముందు రాజు వినమ్రంగా ఉండేవాడు, ప్రజలు రాజాజ్ఞ్యకి బద్ధులై ఉండేవారు. ప్రజల మాట చెల్లేదా లేక రాజు మాటా అని కాదు ప్రశ్న; ప్రజలు ఏమి చెప్తే అదే జరుగుతుంది అని రాజు అనేవాడు, రాజుకు అన్నీ తెలుసు, ఆయన ఏమి చెప్తే అదే జరగాలి అని సమాజం అనేది. దొంగతనాలు వగైరా ఉండేవి కావు, ప్రభుత్వం మరియు ప్రజలు నీతిమంతులు, పరిశ్రమ-ఉపాధుల విలువ అందరికీ తెలుసు, శ్రమని గౌరవించి స్వశక్తిమీద జీవించే తెలివితేటలున్న యుక్తివంతుల సమాజం అది, కాబట్టే సంపద-సమృద్ధి నిండుగా ఉండేవి. శ్రీసూక్తంలో ఒక మంత్రం ఉంది `లక్ష్మీదేవి లేనప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి’ क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहं। అంటే –సమాజంలో రోగాలు, ఆకలిదప్పికలు ఉండడం ఒక లక్షణం. క్రోధం, లోభం, మాత్సర్యం, ఈర్ష్య, తగాదాలు, అశుభ్రత ఇవన్నీ `అలక్ష్మి’ అనగా లక్ష్మీదేవి లేకపోతే ఉండే అవలక్షణాలు. ఆ కాలంలో ఈ అవలక్షణాలు లేని కారణంగా, లక్ష్మీదేవి సమృద్ధిగా ఉండి, ధనం ధర్మకార్యాలకి వినియోగింపబడేది, భోగలాలసలకి కాదు. ఎంత భోగాలు సుఖాలు అవసరమో అవన్నీ లభించేవి. ఎక్కడెక్కడ ఎంత అవసరమో అంత అలంకరణలు, రంగులతో జీవనం కళగా ఉండేది.

సౌకర్యాలు ఉండేవి, అవసరాలు తీరేవి కాని భోగలాలసలు లేవు. క్రమశిక్షణతో, నియమబద్ధమై, సంయమనం మరియు జాగరూకత కలిగిన సమాజం; ధర్మరక్షకుడు, ధర్మబద్ధుడు, నియమనిబంధనలు సంపూర్ణంగా పాటించే రాజు; రాజపదవిని గౌరవంగా భావించి, ప్రజహితానికి శక్తియుక్తులను వినియోగించే రాజు, ఇవి ఆ లక్షణాలు. రాజ్యం మీది, మీరే పాలించండి అని తండ్రి అయిన మహారాజు కోరుకున్నాడు, కానీ తల్లి కోరికపై రాముడిని వనవాసానికి పంపాడు, ఆయన వెళ్ళిపోయాడు. భరతుడు `నాకు రాజ్యం వచ్చింది, తల్లిగారి ఆగ్రహం తొలగిపోయింది, నేను కోరుతున్నాను, వెనక్కి రాజ్యానికి మరలి  వెళ్లిపోదాం’ అన్నాడు. కాని రాముడు `నేను మాట ఇచ్చాను, తిరిగి రాను’ అన్నాడు. ఈ ఇద్దరికీ రాజ్యాధికారం ఉంది, కాని ఇద్దరికీ రాజ్యకాంక్ష లేదు. చివరికి భరతుడు వెనక్కి వెళ్లిపోవలసి వచ్చినపుడు, రామపాదుకలు సింహాసనం మీద ఉంచాడు. అనగా రాజులు ప్రజలు కూడా అలాంటివారు, అందుకే అది రామరాజ్యం.

ఈ రోజు వ్యవస్థలు మారిపోయాయి. కాని ప్రజల నీతినియమాలు మరియు భౌతిక పరిస్థితి, రాజుల లేదా ఎంతమంది ప్రజా పాలకుల ఉన్నా, వారి నీతినియమాలు మరియు భౌతిక పరిస్థితులలో మనం ఈ గుణాత్మక మార్పులు తిరిగి తీసుకురావాలి; ఈ లక్షణాలనే `రామరాజ్యం’ అంటారు. రోగభయం, అకాలమరణాలు, కరువుకాటకాలు, ఆకలిదప్పులు, పేదవారు, భిక్షగాళ్ళు, నేరస్థులు లేని సమాజం `రామరాజ్య’ ఫలితాలు. నేరస్థులు లేనప్పుడు ఇంక దండన, శిక్షలు ఎందుకు? ఇటువంటి రామరాజ్య స్థాపనకి మూలాలు- రాజ్యవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, ఒక్కటిగా నిలబడ్డ నీతివంతమైన సమాజం, ఈ మూడూ కలిసినపుడు అది రామరాజ్యమే. రాముడు తిరిగి అవతరిస్తే ఇది జరగదు, శ్రీ రామావతారం అప్పటి సమాజంలో ఉన్న కొన్ని కష్టాలని నివృత్తి చేయడానికి జరిగింది. ఆ కష్టాలు, బాధలు తొలగిపోగానే రామరాజ్యం రూపం సంతరించుకుంది. ఇప్పటి మన సమాజాన్ని మనం రామరాజ్యంలాగా రూపుదిడ్డాలి, ఎందుకంటే ఇప్పుడు సమాజంనుంచే రాజులు, పరిపాలనా వ్యవస్థ పుట్టుకొస్తున్నాయి. సమాజం నుంచి మనం పనిచేయడం మొదలుపెడితే, రామరాజ్యం తప్పక వస్తుంది.

——(సమాప్తం)——-

మొదటి భాగం : రామమందిరం నుండి రామరాజ్యం వైపు (పార్ట్1)
రెండో భాగం :  రామమందిరం నుండి రామరాజ్యం వైపు (పార్ట్2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here