Home Views రాజద్రోహ నేరం చట్ట అమలు తీరుతెన్నులు

రాజద్రోహ నేరం చట్ట అమలు తీరుతెన్నులు

0
SHARE

 – అనసూయ

రెండవ భాగం

అసలు ఏమిజరుగుతోంది…

100 మంది రైతులను హర్యానా రాష్ట్రంలో ఈ అభియోగంపై నిర్బంధించారు. దేశంలోని మిగతా ప్రాంతాలలో రైతులు లేరా? వారందరి మీదా అభియోగాలు ఎందుకు మోపడం లేదు. వారిని ఎందుకు నిర్బంధించడం లేదు అనే విషయం ఆలోచింఛాలి. కేవలం వారిని మాత్రమే ఎందుకు నిర్బంధించారు?  పదే పదే వారిని `రైతులు’ అని సంభోదించడంలో గల ఔచిత్యం ఏమిటో, ఈ ఆలోచనకు నాంది ఎవరు పలికారో వారిని విచారణ చేయాలి. అదేవిధంగా ఆ వంద మందిని ఎప్పుడు, ఎక్కడ ఏ సమయంలో ఏవిధమైన ఆరోపణలపై నిర్బంధించారో కనీసం తెలుసుకోవాలికదా?

ఈ దేశాన్ని మన ఇల్లుగా భావిస్తే, CAA , NRC కి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పి విపరీతమైన అల్లరులు సృష్టించి కేవలం ఒకవర్గం వారి ఆస్తులనే ధ్వంసం చేసిన విషపు నాటకం. ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. ఆ దారుణ సంఘటనలో ఒక ఇంటలిజన్స్ ఆఫీసరును కొట్టి కొట్టి చంపేశారు కదా. అది శాంతియుతమైన ప్రదర్శన అంటారా? ఆ ప్రదర్శనలో పాల్గొన్నవారిని ఎలా అదుపుచేయాలన్నది ఆలోంచించవలసిన విషయమేకదా?  మనం మన దేశం గురించి ఆలోచన చేయకూడదు అని ఎవరైనా అంటే, వారిని ఇక్కడి న్యాయస్థానాలు, చట్టాలు కూడా సమర్ధిస్తాయా? అలా ప్రశ్నించడం తప్పవుతుందా? ఈ ఆలోచన చేయవలసినది ఒకటి  లెజిస్లేటివ్,  రెండు జుడీషియరీ.

రైతు బిల్లులు సభల్లో  ప్రెవేశ పెట్టారు పార్లమెంటు ఆమోదం లభించింది. అది చట్ట అర్హత పొందినది అంటారా లేదంటారా? దీనికి వ్యతిరేకంగా దేశం మొత్తం అట్టుడుకుతోంది అన్నారు తీరా చూస్తే కేవలం ఒక్క పంజాబు రాష్ట్రం నుంచి మాత్రమే వ్యతిరేకత వచ్చింది. ఢిల్లీలో ప్రదర్శన టెంట్లు వేసుకొని కొన్ని నెలలకు సరిపడా ఆహార పదార్ధాలు ఏర్పాటు చేసుకొని ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ అంతటితో ఆగకుండా అల్లర్లకు తెగబడ్డారు. కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ అల్లకల్లోలం. భారత స్వతంత్రదినాన్ని ప్రపంచ దేశాల ముందు పలుచన చేసిన రోజు. ఎర్రకోట మీద భారత సార్వభౌమ స్ఫూర్తిని సవాలు చేస్తూ ఖలిస్థాని నినాదాలు, జెండాలు ఎగురవేయడాలు. ఎంతో ఆస్తి నష్టం. ఇది కూడా రైతుల ప్రదర్శనలో భాగమేనా?

వంద మందిని నిర్బంధించడానికి కారణం ఇదే కదా. వాళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా ప్రదర్శనలు చేస్తుంటే పోలీసులు వారిని వేధించారు, రాజద్రోహం కేసులు బనాయించారని అనడం సరైనదేనా? మరి పైన జరిగిన దుర్మార్గాలకు శిక్ష ఉండదా?

బీమా కోరేగావ్ ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రదర్శనలు జరగవలసి యున్నది. మరి ఎందుకు  అంతటి విధ్వంసం సృష్టించారు?  హక్కుల సాధన పేరుతో, కుల సంఘాల పేరుతో, అంబేద్కర్ గారి వారసుల పేరుతో వేల మంది ఒక్కసారిగా విధ్వంసానికి పాల్పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా?   తీగ లాగితే డొంక కదిలిన చందాన నెమ్మది నెమ్మదిగా ఒక్కటొక్కటిగా బయటకు వచ్చిన సత్యాలకు దేశమే విస్తుపోయింది. మేధావులు, పెద్దలుగా చెలామణి అవుతున్న దాదాపు 16 మంది పెద్దలు నక్సల్ వాదులు పెద్ద ఎత్తున  ధ్వంస రచన చేశారన్నది తరువాత విచారణలో తేలింది. ఏకంగా దేశ ప్రధానినే హత్యచేయాలన్నది వారి కుట్ర.  మావో వాదులకు ఈ బీమా కోరేగావ్ ప్రదర్శనకు సంబంధం ఏమిటో  తేలిపోయింది. అయినా అలాంటివారిపై రాజద్రోహ నేరం మోపకూడదా?

వార్త ప్రసార మాధ్యమాలు ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర పోషించి సంస్కారవంతమైన రాజ్యాన్ని నిర్మాణం చేయడంలో భాగస్వాములు కావాలి. దీనిని ప్రజాస్వామ్య వ్యవస్థకి నాలుగవ స్తంభమంటారు. గత సంవత్సర కాలంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ మాధ్యమాలలో జరిగిన చర్చా కార్యక్రమాలు, వార్త ప్రసారాలు న్యాయాధీశులు ఒక్కసారి పరికించి, పరిశీలించాలి.  అసలు ఈ మాధ్యమాలు ఎందుకు, ఎవరికోసం పనిచేస్తున్నాయి అనేది ఏమాత్రం చదువు లేని వారిని ప్రశ్నించినా చెప్తారు.  మరి ప్రసార మాధ్యమాలు అలాగే ఉండాలా?  వాటికి మార్గదర్శకాలు ఏవీ నిర్ణయించకుండా మీడియా హౌస్ యజమానులు వేసిన కేసుల విషయంగా ఇంతటి రాద్ధాంతం చేయడం సరైనదేనా? ఎవరు నిర్ణయిస్తారు?

ఢిల్లీ అల్లరులలో ఎంతోమంది అమాయకులు బలి అయ్యారు వారికి ప్రాధమిక హక్కులు ఉండవా, తుపాకీ గొట్టాం ద్వారా రాజ్యం అంటూ అడ్డదిడ్డంగా పేల్చే వారి వల్ల ఎంతోమంది చంపబడ్డారు. వారి ప్రాధమిక హక్కులకు భంగం కలగలేదా? తీవ్రవాద కార్యకలాపాలు చేస్తూ ప్రజలను తిప్పలు పెడుతుంటే దేశద్రోహానేరం మీద వారిని నిర్బంధిస్తే అది తప్పనే సమయంలో ఎందరో సాధారణ ప్రజల హక్కులకు భంగం ఏర్పడుతోందని, వాటిని పరిరక్షించాలని ప్రభుత్వాలను  కోరాలి కదా.

తీవ్రవాదం కానీ, నక్సలిజం కానీ ప్రచారం మూలకంగానే ప్రబలుతోంది అనేది సత్యం. ప్రచారం మాటల  రూపం, రాతల రూపం, పాటల రూపం, ప్రకటనల రూపం, సైగల రూపం, బొమ్మల రూపంలో, ప్రసార మాధ్యమాల రూపంలో, జరుగుతున్నది అక్షర సత్యమే కదా. ఇవన్నీ సెడిషన్ చట్టంలో పొందుపరచి వున్నాయి కదా, 8 సంవత్సరాల క్రితం వరకు లేని ఈ ఆరోపణలు, విమర్శలు ఇప్పుడు ఊపు అందుకోవడానికి కారణం?

జరిగిన అన్ని ఘటనలలో 99 శాతం కేవలం సమాజంలోని ఒకవర్గానికి కొమ్ము కాస్తున్నవారే. దేశ విచ్చిన్నమే వారి దృక్కోణంగా కనబడుతున్నది కూడా సత్యమే.

చట్టాలు మార్చండి,  రాజ్యాంగం కూడా మార్చండి, ప్రజా ఉపయోగ పంధా ఏర్పాటు చేయండి అలానే రాజ్యాంగం 42 సవరణలో ప్రవేశపెట్టిన ‘సెక్యులర్’ అనే పదానికి వ్యతిరేకం కాదు కానీ ఆ సెక్యులర్ పేరుతో మెజారిటీ వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా గమనించి ఆ పదం తీసివేసే ప్రక్రియను కూడా చేయగలిగితే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుందని కోరుకుంటూ, ఒక చట్టం తీసేయండి అన్నంత వేగంగా మార్గదర్శకాలు కూడా ఇచ్చి తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడం కూడా దేశానికి ఈనాటి ముఖ్యఅవసరంగా భావించి భావితరాల బాగోగులు 130 కోట్ల జనాభా ప్రాధమిక హక్కులను కాపాడాలని కోరుకుంటూ, మొక్కకు వున్న ముల్లు గుచ్చుకున్నదని మొక్కను మొత్తాన్ని తొలగించేద్దాం అనే ఆలోచనకు స్వస్తి పలికి అందరికి ఆమోదయోగ్యమైన ఆచరణను ప్రభుత్వాలు, వ్యవస్థలు అందించాలి.

మొద‌టి భాగం : రాజద్రోహ నేరం  చట్ట అమలు తీరుతెన్నులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here