Home Hyderabad Mukti Sangram ఫిరంగి గుండు తగలటంతో శత్రు వర్గంలో సంచలనం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-56)

ఫిరంగి గుండు తగలటంతో శత్రు వర్గంలో సంచలనం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-56)

0
SHARE

గఢ్ వెనకాల నుండి చాటుగా వెళ్ళిన కొందరు దళ సైనికులు చుట్టూవెళ్ళి పోలీసుల, రజాకార్లల వెనుక నుంచి కాల్పులు సాగించారు. ఫిరంగి గుండు పోలీసు అధికారికి తగిలింది. మరికొంత మంది పోలీసులు గాయపడ్డారు. శత్రు వర్గంలో సంచలనం బయలుదేరింది. వెనక్కి పోవడం ప్రారంభించారు. రైతు దళం అదే అదనుగా వాళ్ళని తరిమింది. అనేకమంది రజాకార్లు, పోలీసు అధికార్లు చంపబడ్డారు. దళం గురించి కబురు అందచేసిన హోసూల్ పటేల్ కొడుకును పట్టుకొని కాల్చివేశారు. హన్స్‌రాజ్ ఆ శవాన్ని మోసుకెళ్ళి మంజీరానదిలో పడవేసి వచ్చాడు. గుర్రాలు, ఆయుధాలు దొరికాయి.

మరుసటి రోజు నిజాం సైనికులు భారీఎత్తున లారీలలో బయలుదేరారు. బోట్‌కూల్‌పై దాడిచేసి దళాన్ని ఏ విధంగానైనా పట్టుకోవాలని ప్రయత్నం. ఉప్పొంగి ప్రవహిస్తున్న మంజీరానదిని లారీలు దాటలేకపోయాయి. లాతూర్ నుంచి చుట్టూ తిరిగి నిజాం పోలీసుల లారీలు అర్ధరాత్రి బోట్‌కూల్ చుట్టుముట్టాయి. కాని ఆశ్చర్యం, ఆ గఢ్‌లో ఒక్క రైతుదళ సభ్యుడు కూడా దొరకలేదు. తలుపులు బార్లా తెరుచుకొని ఉన్నాయి. అసలు దళానికి అంతకు పూర్వమే తమ గూఢచారులవల్ల లారీల విషయం తెలిసింది. అనేక రెట్ల సంఖ్యలో ఆయుధాలతో మించిఉన్న నిజాం సైనికుల బలాలను సరాసరిన ఎదుర్కోవడం కష్టమని ఆ రాత్రి మంజీరా నదిని ఈది దళం ఆట్టర్గా చేరుకుంది.

హఠాత్తుగా చావు నోట్లోకి..
ఆట్టర్గాలో ఐదారురోజులు విశ్రాంతి పొందిన తర్వాత తొండవీర్ దళం తిరిగి వెళ్ళిపోయింది. యశ్వంతరావ్, డాక్టర్ చన్నప్ప, వెంకట్రావ్ ఒకరోజు ఆట్టార్గా కృపాల్ గీర్ ఇంట్లో పాలు త్రాగుతున్నారు. ఉదయం పూట జల్లు పడుతూ ఉంది. అకస్మాత్తుగా ఒక స్త్రీ పరుగెత్తుకుంటూ వచ్చింది. గ్రామంలోకి పోలీసులు ప్రవేశించారనే వార్త. పై ముగ్గురు వెంటనే లేచి గుమ్మంలోకి వచ్చారు. గుమ్మం దాటుతుండగా అతని గుండెకు తుపాకీ గురిచూసి పెట్టబడింది. వెనకాల ఉన్న డాక్టర్ చెన్నప్ప మెల్లిగా తప్పించుకొని ఇంటిపైకి ఎక్కి పారిపోయి దళంలో కలిసిపోయాడు. వెంకట్రావు నిరాయుధుడుగా ఏమీ తెలియనట్లు ముందుకు వెళ్ళిపోయాడు.

ఎదురుగా తుపాకులతో ఆరుగురు పోలీసులు, ఒక డివై..యస్.పి, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. యశ్వంత రావు దగ్గర ఉన్న ట్వెల్వ్‌బోర్ తుపాకిని ఇచ్చివేయమన్నారు. అతను నిరాకరించాడు. అధికారి పిస్తోలు ఎత్తి హుకుం జారీ చేశాడు. యశ్వంతరావు దగ్గర ఉన్న తుపాకిని లాక్కోవడం జరిగింది. అప్పుడు పోలీసు అధికారి ప్రశ్నించడం ప్రారంభించాడు.. నీ పేరు ఏమిటి? ‘లక్ష్మణ్’ ‘ఈ ట్వెల్వ్‌బోర్ ఎవరిది?’ ‘నాదికాదు, తెలిసినవాళ్ళది’. ‘నీ దగ్గర ఎందుకుంది?’ ‘ఆత్మరక్షణ కోసం’. ‘అయితే ఈ తుపాకీ ఇంతకీ ఎవరిది?’ ‘ఇది తుల్జారామ్ నార్మా అనే రైతుది. అతని దగ్గర లైసెన్సు వగైరా ఉంది’.

యశ్వంతరావు తన పేరు చెప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించాడు. ఇద్దరు పోలీసులను తుల్జారాం ఇంటికి పంపించాడు. అధికారి యశ్వంతరావ్ తదితరులు ఎక్కడున్నారని ప్రశ్నించాడు. వాళ్ళంతా దగ్గరలోనే ఉన్న ఇంటిలో ఉన్నారని యశ్వంత రావ్ సమాధానమిచ్చాడు. అసలు పోలీసుల ఇలా అకస్మాత్తుగా చుట్టివేయడానికి కారణం ఉంది. తొండచీర్ దళం వెళ్ళిపోయిన తర్వాత రామా అనే పస్తక్వామ్ రహస్యంగా వెళ్ళి పోలీసులకు కబుర్లు చేశాడు. డివై.ఎస్.పి సాయుధ పోలీసులను తీసుకొని గ్రామాన్ని ఆ ఉదయం చుట్టివేయ గలిగాడు.

తాము పట్టుకున్న వ్యక్తి యశ్వంతరావు అనే విషయం పోలీసులకు తెలియదు. అతన్ని పట్టుకొని గ్రామంలోంచి నడిచి వెళుతున్నాడు. వానజల్లు, నేలంతా బురదమయం. ఇరుకైన సందులోంచి నడిచి వెళుతున్నారు. పోలీసులు బూట్లతో జాగ్రత్తగా బ్యాలన్స్ కాపాడుకుంటూ రాళ్ళపై కాళ్ళు ఆనించి నడుస్తున్నారు. యశ్వంతరావ్ అదే అదనుగా పోలీసుల పట్టు విడిపించుకొని ఆ సందుల్లోంచి పరుగు లంకించుకున్నాడు. బరువైన బూట్లతో పోలీసులు పరుగెత్తలేకపోయారు. ‘జాగ్రత్త! ఆగిపో! కాల్చివేస్తాం!’ అని అరిచారు. అయినా కాల్పులు విని దళంవాళ్ళు ఎక్కడ ఎదురు దాడి జరుపుతారో అనే భయం కూడా ఉంది. మరోవైపు దళం వాళ్ళు ప్రాణాలకు తెగించి పోలీసులపై దాడి చేయాలని యశ్వంత్‌రావును ఏ విధంగానైనా విడిపించుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు.

యశ్వంత్‌రావ్ పారిపోతూ ఒక మలుపు తిరిగి ప్రక్కనే ఉన్న నీటి మడుగులో దాక్కున్నాడు. పోలీసులు విజిల్ వేస్తూ ప్రక్కనుంచి వెళ్ళిపోయారు. యశ్వంత్‌రావ్ అక్కడే ఉన్న ఒక స్త్రీ సహాయంతో ఒక ఇంట్లోకి వెళ్ళి దుస్తులను మార్చుకొని వెనుక దారి నుంచి తప్పించుకొని దళం వాళ్ళను కలుసుకోవాలని బయలుదేరాడు.

పోలీసులు ఊరంతా గాలిస్తున్నారు. దారిలో గొల్లవాడు ఒకడు తన ధ్యాసలో తాను వేడుతున్నాడు. పోలీసులు అతన్ని ఆపి ఏదో అడిగినా అతను తనదారిన తానే వెళ్ళిపోతున్నాడు. ఆ గొల్లవాడు ఒక ఇంటిముందుకు వెళ్ళి సంకేతంగా ఈలవేశాడు. పరిచితమైన ఆ ఈలవిని ఆ ఇంటిలోవున్న దళం జై జై నినాదాలు చేసుకుంటూ బయటికి విరుచుకుపడి కాల్పులు ప్రారంభించింది.

డివై.యస్.పి. వధ
గొల్లవాడి వేషంలో ఉన్న యశ్వంతరావు, దళం వాళ్ళతో పోలీసులపై విరుచుకుపడ్డాడు. ఒక పోలీసు క్రిందపడిపోయాడు. అతని తుపాకి లాక్కుని యశ్వంతరావ్ డివై.యస్.పి కోసం చూశాడు. ఆ పోలీసు అధికారి గుర్రంపై అప్పటికే గ్రామం బయటికి వెళ్ళిపోయాడు. మేకర్ స్థావరానికి వెళ్ళిపోవాలని అతని ప్రయత్నం. అయితే మంజీరానది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దాటడం సాధ్యం కాలేదు. ఆ అధికారి మరోదారిగుండా వెళ్ళాలని బయలుదేరాడు. అటుప్రక్క పెద్దకాలువ నిండుగా పారుతోంది.

అధికారి కాల్వలోకి గుర్రాన్ని తోలాడు. అది బురదలో కూరుకు పోయింది. బురదమయమై ఎలాగో బయటికి రాగలిగాడు. ఈ లోగా యశ్వంతరావ్, వెంకట్రావ్ ఆ అధికారిని పట్టుకోగలిగారు. అతను పారిపోతుండగా యశ్వంతరావ్ తుపాకితో అతని కాళ్ళకు గురిచూసి కొట్టాడు. డివై.యస్.పి. గాయపడి క్రిందపడిపోయాడు. అతని దగ్గర ఉన్న తుపాకి, పిస్తోలు, గడియారం లాక్కున్నాడు. ప్రశ్నల ద్వారా సమాచారాన్ని రాబట్టారు.

Source: Vijaya Kranthi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here