Home News శ్రీ దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు, రాజనీతిజ్ఞుడు

శ్రీ దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు, రాజనీతిజ్ఞుడు

0
SHARE

స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు, రాజనీతిజ్ఞుడు అని ప‌లువురు ప్ర‌ముఖులు అన్నారు. శ్రీ దామోద‌రం సంజీవ‌య్య శ‌త జ‌యంతి ఉత్స‌వాలలో భాగంగా శుక్ర‌వారం ఆయ‌న వ‌ర్థంతి సభ‌ను హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడ‌లోని కేశ‌వ మోమోరియ‌ల్ పాఠ‌శాల‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు డా.జీ.వెంకట రాజం, దామోదరం సంజీవయ్య ఫౌండేషన్ అధ్య‌క్షులు, మాజీ ఐఏఎస్ దా‌సరి శ్రీనివాసులు, డా.వడ్డీ విజయ సారథి, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్రీ శ్యామ్ ప్రసాద్, సామాజిక సమరసత వేదిక తెలంగాణ అధ్యక్షులు డా.వంశ తిలక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. గౌర‌వ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు తమ సందేశం పంపారు.

ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ “ప్రతి వ్యక్తిలో జ్ఞానం, సమర్థతలు సహజంగా ఉంటాయి. వాటిని వెలికి తీసే గురువులే కావాలని” స్వామి వివేకానందుడు అన్నార‌ని గుర్తు చేశారు. ప్రతి కులంలోనూ సమర్థులైన వారు ఉన్నార‌ని, ఎవరిని కులం పేరున చిన్న చూపు చూడతగదనీ, అంట‌రానితనం పాటించరాదనీ అన్ని కులాల వారికి సమాన గౌరవం, అవకాశాలు కల్పించాలని అదే సామాజిక సమరసత వేదిక కోరుకుంటోంది, అందులో భాగంగానే శ్రీ దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోంద‌ని తెలిపారు.

“కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో 14 ఫిబ్రవరి 1921లో పేద దళిత కుటుంబంలో జ‌న్మించిన శ్రీ సంజీవయ్య ఉన్న‌త చ‌దువులు చ‌దివి న్యాయవాద పట్టాను పొందారు. వారు గాంధీజీని చూడలేదు, యే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన‌లేదు. అయినా రాజాజీ గుర్తింపుతో 1950లో ఆనాటి తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు అయ్యారు. 1952-60 లలో రాజాజీ, ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల రెడ్డి, సంజీవరెడ్డి మంత్రి వర్గాల్లో వివిధ శాఖలను మంత్రిగా సమర్థ వంతంగా నిర్వహించారు. 1960-62 ఆ నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేశారు. ఆ నాటి కాంగ్రెస్ లోని అన్ని వర్గాల వారిని మంత్రులుగా తీసుకున్నా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు సంజీవయ్య గారిని ఆ రెండు సంవత్సరాలూ సజావుగా ముఖ్య మంత్రిగా పని చేయనీయ లేదు.

నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ మంత్రి వర్గాల్లో కేంద్ర కార్మిక, పరిశ్రమల మంత్రిగా, రెండు సార్లు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ప్రభుత్వంతో ఎంతో సమన్వయంతో పని చేశారు. కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల వల్లే 1967లో పార్లమెంటు సభ్యునిగా ఓడిపోయారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎవరి పట్ల ఆగ్రహం చూపలేదు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం, విలక్షణంగా సమస్యల పరిష్కారం, నిరాడంబర జీవనం, అవినీతి, బంధు ప్రీతికి దూరంగా ఉండడం, తెలుగు, ఆంగ్లంలో మంచి వక్తృత్వము, సాహిత్యంలో మంచి పట్టు, తెలుగు మాతృ భాష పట్ల ఎనలేని శ్రద్ద, సమర్ధ వంతమైన పరిపాలన….ఇలా అనేక సుగుణాలు గల్గిన రాజ నీతిజ్ఞుడు శ్రీ దామోదరం సంజీవయ్య . వారు నేటి రాజకీయ నాయకులకు అన్ని విధాలా మార్గదర్శి ” అని వర్ధంతి సభలో వక్తలు కొని యాడారు.

అనంత‌రం జాగృతి మాజీ సంపాదకులు డా. వడ్డే విజయసారధి గారు తెలుగులో వ్రాసిన “పదవులకు వన్నె తెచ్చిన ప్రజ్ఞానిధి దామోదరం సంజీవయ్య” అనే పుస్తకాన్ని ఆవిష్క‌రించారు. ఈ పుస్తకాన్ని నవయుగ భారతి ప్రచురించింది.

విజ్ఞ‌ప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here