Home News అందమైన రంగవల్లికల ప్రాధాన్యం ఇదే

అందమైన రంగవల్లికల ప్రాధాన్యం ఇదే

0
SHARE

సంక్రాతి పండుగ వచ్చిందంటే చాలు పల్లెటూరి నుంచి పట్నం వరకు ఊరంతా పండుగ శోభ సంతరించుకుంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఈరోజునుంచే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులుగా జరుపుకుంటాం. అందుకే దీన్ని పెద్దల పండుగ అని పిలుస్తారు.  మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజున అంటే భోగి రోజున భూమికి పూజలు చేస్తారు. ఇక రెండవ రోజున సంక్రాంతి జరుపుకుంటారు. మూడోరోజున కనుమగా ఇంట్లో పాడిపశువులను అందంగా అలంకరించి పండగ చేసుకుంటారు. మన భారతీయ జీవన విధానం అంతా ప్రకృతితో మమేకమయ్యే ఉంటుంది. ప్రకృతి లేనిదేమనం లేము అనే గొప్ప భావనని ప్రజలకు కలిగించడానికే ఆచారం పేరుతో చేసుకునే ప్ర‌ముఖ పండుగే సంక్రాంతి..

ఈ పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పిండివంటలు, బోగిపండ్లు, బొమ్మల కొలువులు, దానితోపాటూ అందమైన రంగవల్లికలు కూడా. అంతేకాదు ఈ పండుగ సమయంలోనే కొన్ని ప్రత్యేకమైన పిండివంటలను తప్పనిసరిగా చేస్తారు. అందులో నువ్వులు, బెల్లంలాంటి పదార్థాలను వినియోగిస్తారు. అవి తినడం ఈ శీతాకాలంలో మన శరీరానికి చాలా మంచిది.

ఇక ఈ పండగకి నెల ముందు నుంచే ముగ్గుల సందడి మొదలవుతుంది. పెద్ద పెద్ద ముగ్గులు ప్రతీ ఇంటిముందు కనిపిస్తాయి. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

మరోవైపు ముగ్గుల్లో వివిధ రకాలుంటాయి. చాలా వరకు ముగ్గులు యోగ శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి, పురాణేతిహాసాలకు దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకు తొమ్మిది చుక్కల ముగ్గు. దీనిని నవగ్రహాలకు సంకేతంగా చెబుతారు. ఒక్కో చుక్క ఒక్కో గ్రహానికి సూచిక. ఇక త్రికోణ త్రిభుజ ముగ్గును కుండలినికి ఉదాహరణగా భావిస్తారు. ఇంకో ఉదాహరణలోకి వెళ్తే తులసి చెట్టు వద్ద పద్మం ముగ్గును వేస్తారు. దానిని మన మనసుకు ప్రతీకగా చెబుతారు. మారేడు దళాలు, పద్మాలు, మల్లె తీగలు, పందిరి మంచాలు ఇలా ఎన్నో రకాల ముగ్గులు ఉన్నాయి. ఇలా వివిధ సందర్భాలను అనుసరించి రకారకాల ముగ్గులను మన పూర్వీకులు మనకు అందించారు..

ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలున్నాయి. శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి తీస్తుంది. రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం. ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు. అట్లాగే వంగినప్పుడల్లాశ్వాస నిదానంగా పీలుస్తూ ఉండడం ఒక విధమైన ప్రాణాయామం అవుతుంది.

ఇక ముగ్గుల్లో వేసిన గీతలను కర్ర అంటారు. ఇవి క్రిమికీటకాలను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి కనుక కర్ర అని పిలుస్తారు. ఇప్పుడైతే సున్నంతో ముగ్గు వేస్తున్నారు కానీ ముగ్గును బియ్యంపిండితో మాత్రమే వేయాలి. దీనిలో ఎంతో భూతదయ దాగి ఉంది. బియ్యంపిండితో ముగ్గు వేయడం వల్ల ఆ పిండిని చీమలు, పక్షులు, రకరకాల కీటకాలు తింటాయి. వాటికి ఆహారాన్ని ఇచ్చినవారమవుతాము. ఇక ఆవుపేడతో కల్లాపు చల్లడం వల్ల పాములు, తేళ్లు లాంటివి ఇంట్లోకి రావు. హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది.

ముగ్గులు స్త్రీలలో కళాత్మకతను కూడా తెలియజేస్తాయి. అందుకే ఆడవారు ఎంత చక్కగా ముగ్గులు వేస్తే వారికి అంత కళాత్మకత ఉందనీ, ఇంటిని తీర్చిదిద్దుకునే ఓర్పు అంత ఉందనీ పెద్దలు అంటుంటారు. ముగ్గు మహిళలకు శారీరక వ్యాయామము మాత్రమే కాదు మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న ముగ్గుల ఆచారాన్ని మనం దూరం చేసుకోకపోవడం మంచిది. భావితరాలకు ఈ ఆచారాన్ని అందించి మన సంస్కృతిని పరిరక్షించుకుందాం.