Home News భారతీయ శాస్త్రీయ సంగీతం సత్యం, కరుణ, పవిత్రతల సంగమం – జైపూర్ స్వర గోవిందంలో...

భారతీయ శాస్త్రీయ సంగీతం సత్యం, కరుణ, పవిత్రతల సంగమం – జైపూర్ స్వర గోవిందంలో డా. మోహన్ భాగవత్

0
SHARE

భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రపంచాన్ని సత్యం, కరుణ, పవిత్రతల వైపు తీసుకువెళుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచంలో ఇతర దేశాల్లో సంగీతం కేవలం వీనులవిందుగా ఉంటే చాలని భావిస్తారని, కానీ మన దేశంలో సంగీతం ద్వారా సత్యం, కరుణ, పవిత్రతలను పొందడం లక్ష్యమని ఆయన అన్నారు. జైపూర్ వైశాలి నగరంలోని చిత్రకూట్ స్టేడియంలో  నవంబర్ 5 నాడు  భావ్యమైన స్వర గోవిందం కార్యక్రమంలో ఆయన పోల్గొన్నారు.

సంగీతం ద్వారా సమరస భావం పెంపొందుతుంది
భారతీయ సంగీతపు ప్రత్యేకతను గుర్తించడం వల్లనే ప్రారంభమయిన రెండు మూడు సంవత్సరాలలోనే సంఘ తన కార్యానికి సంగీతాన్ని కూడా జోడించిందని సర్ సంఘచాలక్ అన్నారు. పాడేవారిలోనూ, ఆ పాత వినేవారిలో సంస్కారాలు కలుగుతాయి. సామూహికంగా, అందరితో కలిసి పాడడం వల్ల సంస్కారాలు కలుగుతాయి, ఒకే స్వరంలో పాడడం వల్ల సమరసత భావం కలుగుతుందని ఆయన అన్నారు. మనం వివిధత్వం లో ఏకత్వాన్ని దర్శిస్తాము. సంగీతం ద్వారా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇది మన కర్తవ్యం. మనం ఎవరికి ఉపకారం చేయడం లేదు. ఘోష్ వాదన వల్ల మనకు ఎలాంటి బహుమతి, లాభం అందవు. ఈ వాదన దేశాకార్యం కోసం. మన జేబు నుండి డబ్బు ఖర్చు పెట్టి వాయిద్యం కొనుక్కుని సంఘకార్యం కోసం వాదన చేస్తాము. వాదకులంతా కేవలం తమ మనోరంజనం కోసం కాకుండా దేశ కార్యం కోసం వాదన చేస్తారు. దేశం మనకు చాలా ఇస్తుంది. మనం కొంతైనా ఆ రుణాన్ని తీర్చుకోవాలి. మనం ఏం నేర్చుకున్నా దానిని దేశ హితం కోసం సమర్పించగలగాలి. మనం అలవరుచుకోవలసిన మొదటి సంస్కారం ఏ ప్రతిఫలం ఆశించకుండా మనకు ఉన్నది ఇవ్వడమని డా. భాగవత్ అన్నారు.

భారతీయ సంగీతంలో శౌర్యం, పరాక్రమం, ధైర్యం లేవని కేవలం రాజభవనాలలో, సభలకు మాత్రమే పనికి వస్తుందనే ఆరోపణ ఉంది. అందరూ కలిసి అడుగులో అడుగు వేస్తూ నడిచే పథ సంచలనం (రూట్ మార్చ్) కోసం ప్రత్యేకమైన సంగీతం లేదని అనేవారు. ఆంగ్లేయుల నుండి కొన్ని రచనలు తీసుకున్నాము. కానీ ఆ తరువాత భారతీయ రాగాల ఆదారంగా అనేక రచనలు మనం తయారుచేసుకున్నాము. భారత దేశం ఎప్పుడు ఎక్కడ మంచి ఉన్నా దానిని గ్రహించింది కానీ ఎవరిపైనా ఆధారపడలేదు. ఘోష్ వాదన వల్ల మనకు కలిగే మరొక గుణం సంయమనం. ఎవరికి వారే, వారి ఇష్టం వచ్చినట్లు కాకుండా అందరితో కలిసి, అందరితో కలిపి వాదన చేయడం మనం అభ్యాసం చేస్తాము. సంగీతం సమరసత సంస్కారాన్ని కూడా మనకు కలిగిస్తుందని సర్ సంఘచాలక్ అన్నారు. రాగం, తాళానికి అనుగుణంగా వాదన చేయడమే సంగీతం. అందరి మేలు కోరే సమరసాతాపూర్వకమైన సంస్కారాలు దీని ద్వారా కలుగుతాయి.

భారతదేశం మళ్ళీ విశ్వగురువు కావాలి. మనమంతా హిందువులం. మనది హిందూ దేశం. ఈ పేరు ఎవరో ఇచ్చినది కాదు. వసుదైవ కుటుంబకం అంటూ సర్వ విశ్వపు సంక్షేమాన్ని కాంక్షించడం వల్లనే మనకు ఆ పేరు వచ్చింది. అఖండ భారతానికి హిందూ దేశం అని పేరు. మన సంస్కృతి సకల విశ్వపు మేలును కోరే సంస్కృతి. అందరి పట్ల సమాన భావన మనకు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కుల భేదాలు, అంతరానితనం అనే వికృతులు వచ్చాయి. దీనివల్ల చాలామంది వెనుకబడిపోయారు. ఈ వికృతులను సమూలంగా పెకిలించివేయాలి. దేశంలో స్వతంత్రత, సమత తేవాలంటే మనలో ఈ సమాన భావన ఉండాలని అంబేడ్కర్ చెప్పారు. బంధుభావన, సమరసత మానవత్వానికి రూపాలు.

దేశపు ఉన్నతిని సాధించే పని మాదేనని ఎవరు గుత్తాధిపత్యం తీసుకోవడం లేదు. ఇది అందరి పని. దీనికోసం మనమంతా కృషి చేయాలి. సంస్కారాలను పొందడం ద్వారా మనం సబల, సురక్షిత, సమర్ధ దేశాన్ని నిర్మించాలి. సంస్కారాలు లేనిచోట శక్తి దురుపయోగమవుతుంది. సంస్కారవంతులైన, శీలవంతులైన వ్యక్తులవల్ల దేశం సురక్షితమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. కనుక అంతా భారతదేశాన్ని తిరిగి విశ్వ గురువు చేసే ఈ అపూర్వ కార్యంలో భాగస్వాములు కావాలని డా. మోహన్ భాగవత్ అన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి శ్రీ. బి.ఎల్.నావల్ మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేడ్కర్ చూపిన మార్గంలోనే సమరసాతాపూర్వక భారతాన్ని నిర్మించగలుగుతామని అన్నారు.

విశిష్ట అతిధిగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ. కిశోర్ రూంగ్తా మనది ప్రాచీన దేశమని, వివిధత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే మన సంస్కృతి ప్రత్యేకతని అన్నారు. హిందూ జీవన పద్దతి మాత్రమే దేశాన్ని ప్రగతిపధంలో తీసుకువెళ్లగలదని ఆయన అన్నారు. హిందూ జాగరణ కార్యాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తోందని కిషోర్ అన్నారు.

కార్యక్రమానికి అనేకమంది పురప్రముఖులు, ప్రజానీకం హాజరయ్యారు.

అందరినీ మంత్రముగ్ధులను చేసిన ఘోష్

స్వరగోవిందం కార్యక్రమంలో స్వయంసేవకులు శంఖ, వంశీ, ఆనక్, శృంగ వాయిద్యాలపై మీరా, చేతక్, శివరంజని, కిరణ్, దుర్గా మొదలైన అనేక రచనలను వాదన చేశారు. వివిధ వ్యూహాలలో కదులుతూ స్వయంసేవకులు చేసిన వాదన అందరినీ ఆకట్టుకుంది.

వీరమాతలకు సన్మానం
కార్యక్రమంలో శ్రీమతి కాంతా యాదవ్, శ్రీమతి సుమిత్ర దేవి, శ్రీమతి నిశా లాల్, శ్రీమతి సంపత్, శ్రీమతి మేరీ కుట్టి, శ్రీమతి దేవి బుందేలా లను డా. మోహన్ భాగవత్ భరతమాత చిత్రపటం, శాలువా ఇచ్చి  సత్కరించారు.

రెండు మార్గాల్లో పథ సంచలన్
ఈ సందర్భంగా జరిగిన పథ సంచలన్ లో జైపూర్ ప్రాంతం మొత్తం నుండి వచ్చిన 1276మంది ఘోష్ వాదకులు పాల్గొన్నారు. రెండు వేరువేరు మార్గాల్లో వెళ్ళిన పాంచజన్య నాదం, దేవదత్త నాదం అనే రెండు పథ సంచలనాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాదాపు ఆరు కిలోమీటర్ల పథ సంచలన మార్గంలో ఆకర్షణీయమైన, రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు.

పనవా (బాస్ డ్రమ్) ఆకారంలో ఉన్న సభా వేదిక కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ద్వజమండలం  కూడా ఘోష్ లోని వివిధ వాయిద్యాలతో అలంకరించారు.

జైపూర్ లో ఆర్ ఎస్ ఎస్ నిర్వహించిన స్వరగోవిందం దృశ్శాలు