Home News ప్రపంచాన్ని చుట్టివచ్చిన భారత మహిళలు

ప్రపంచాన్ని చుట్టివచ్చిన భారత మహిళలు

0
SHARE

రంగం ఏదైనా భారత మహిళలు ఆకాశమే హద్దుగా దూసుకు పోతున్నారు. తగిన ప్రోత్సాహం, అండదండలు ఉంటే గొప్ప గొప్ప సాహసాలు చేయటానికి తాము సిద్ధమని చెప్పకనే చెబుతున్నారు. పురుషుల ప్రత్యక్షసాయం ఏమాత్రం లేకుండా మహాసముద్రాలలో నౌకాయానం చేసి ప్రపంచాన్ని చుట్టి రాగలమని భారత నౌకాదళానికి చెందిన ఆరుగురు మహిళా సాహసికుల బృందం చాటుకొంది. 254 రోజులపాటు నాలుగు ఖండాలు, మూడు మహాసముద్రాలు, ఐదు దేశాల ద్వారా అపూర్వ సాగరయానం చేసి భారత మహిళలకే గర్వకారణంగా నిలిచారు.

మహాసాగర సాహసం

ఉవ్వెత్తున ఎగసిపడే భయంకరమైన అలలు… ఎముకలు కొరికే చలి.. ఎటు చూసినా మహాసాగర ఘోష వినిపించే వాతావరణంలో ఆరుగురు మహిళలు ఓ బృందంగా తమ మరపడవను తామే నడుపుకొంటూ ప్రపంచాన్ని చుట్టి రావటాన్ని అపూర్వ సాహసమే అని చెప్పాలి. కుటుంబ సభ్యులను విడిచి మహాసాగరాలలో నెలల తరబడి నౌకాయానం చేయటానికి మగధీరులే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అలాంటిది సుకుమారులు, కోమలాంగులుగా పేరుపొందిన మహిళలు ప్రపంచాన్ని చుట్టివచ్చే సాహసం చేశారంటే అది అసాధారణం, అపురూపం కాక మరేమిటి.

గోవా నుంచి ప్రపంచ యాత్రకు

గోవాలోని భారత నౌకాదళానికి చెందిన ఆరుగురు మహిళలు ఓ బృందంగా ఏర్పడి తమ మరపడవను తామే నడుపుకొంటూ సాగరయానం చేస్తూ ప్రపంచాన్ని చుట్టి రావాలని నిర్ణయించారు. లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ వార్తికా జోషీ నాయకత్వంలోని ఈ జట్టులో లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ ప్రతిభ, స్వాతి, విజయాదేవి, పాయిల్‌ గుప్తా, ఐశ్వర్య సభ్యులుగా ఉన్నారు. భారత నౌకాదళం ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చిన తెరచాప మరపడవ ‘తరిణి’తో గత సెప్టెంబర్‌ 10న సాహసయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు ‘నావికా సాగర పరిక్రమ’ అంటూ ఓ పేరును సైతం ఖాయం చేసుకొన్నారు.

తరిణి బృందంలోని మొత్తం ఆరుగురు యువతుల్లో ఇద్దరు తెలుగువారే కావటం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచిపోతుంది. విశాఖపట్నానికి చెందిన పాతరపల్లి స్వాతి, హైదరాబాద్‌లోని హకీంపేటకు చెందిన బోడపాటి ఐశ్వర్య ఇద్దరూ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులే. భారత నౌకాదళంలో సెయిలింగ్‌ ఆఫీసర్లుగా ఉద్యోగాలు సంపాదించడమే కాక మహాసాగరయానం చేస్తూ ప్రపంచాన్ని చుట్టివచ్చే సాహసంలో భాగస్వాములు కాగలిగారు.

21,600 నాటికల్‌ మైళ్ల సాహసం…

భారత నౌకాదళంలోని వివిధ కేంద్రాలలో పనిచేస్తున్న ఈ ఆరుగురు మహిళలకు సాగరయానానికి అసరమైన అన్ని విభాగాలలోనూ తగిన శిక్షణ ఇచ్చారు. 2013 నుంచి 2015 వరకూ పలు అంశాలలో శిక్షణ పొందటమే కాక కార్వార్‌ నుంచి పోర్‌బందర్‌, రియో డిజెనీరో నుంచి కేప్‌టౌన్‌ మీదుగా మారిషస్‌ వరకూ నిర్వహించిన సాగరయానంలో పాల్గొనటం ద్వారా అపార అనుభవం సంపాదించారు.

అంతేకాక 18 వేల నాటికల్‌ మైళ్ల అనుభవంతో 2017లో గోవాలోని మాండోవీ జెట్టీ నుంచి 56 అడుగుల ఇండియన్‌ నేవీ సెయిలింగ్‌ వెసల్‌ తరిణిలో తమ అసాధారణ సాహసయాత్ర ప్రారంభించారు.

నావిగేషన్‌, సీమాన్‌షిప్‌, కమ్యూనికేషన్‌, మెట్రాలజీ విభాగాలలో ప్రత్యేకశిక్షణ పొందిన ఈ ఆరుగురు మహిళలకు నౌకలోని ఏ భాగం చెడిపోయినా తమకుతామే బాగుచేసుకొనేలా కూడా శిక్షణ ఇచ్చారు.

ఐశ్వర్య బొడ్డపాటి ఎలక్ట్రికల్‌ ఆఫీసర్‌గాను, ప్రతిభా జామ్‌ వాల్‌ హుల్‌ ఆఫీసర్‌గాను, పాతరపల్లి స్వాతి నావిగేటింగ్‌ అధికారిగాను, విజయాదేవి సీమాన్‌ షిప్‌ అధికారిగాను, పాయల్‌ గుప్తా లాజిస్టిక్స్‌ ఆఫీసర్‌ గాను, వార్తికా జోషీ టీమ్‌ లీడర్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు.

నాలుగు అంచెలుగా సాగర పరిక్రమ

ఏడు మాసాల ఈ విశ్వసాగర యాత్రను నాలుగు దశలుగా నిర్వహించారు. గోవాలో ప్రారంభమైన ఈ యాత్ర తొలిదశ ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటెల్‌ చేరడంతో ముగిసింది. అక్కడ నుంచి న్యూజిలాండ్‌ లోని క్రైస్ట్‌ చర్చి చేరడంతో రెండో అంచె, క్రైస్ట్‌ చర్చి నుంచి అర్జెంటీనా సమీపంలోని ఫాక్‌ ల్యాండ్స్‌ చేరడంతో మూడో అంచె, ఫాక్‌ ల్యాండ్స్‌ నుంచి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ చేరడంతో నాలుగో అంచెను ముగించగలిగారు.

తమ సాగరయాత్ర సమయంలో ఎదురైన సవాళ్లను, ప్రతికూల పరిస్థితులను తరిణి బృందం ధైర్యంగా ఎదుర్కొని తమయాత్రను విజయవంతంగా ముగించ గలిగారు.

ప్రపంచంలోని వివిధ దేశాల నౌకాదళాల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి మహిళా బృందంగా తరిణి, తొలి నౌకాదళంగా ఇండియన్‌ నేవీ చరిత్ర సృష్టించాయి. మొత్తం 21 వేల 600 నాటికల్‌ మైళ్ల ప్రయాణంలో భూమధ్య రేఖను రెండుసార్లు దాటి వెళ్లటమే కాక నాలుగు ఖండాలను ఆవరించి ఉన్న మూడు మహాసముద్రాలను, మూడు అఖాతాల ద్వారా ప్రయాణం చేయటం తమకు జీవితకాల అనుభవం మాత్రమే కాక గర్వకారణమని పొంగిపోతున్నారు.

ప్రశంసల వర్షం

భారత తొలి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2017 సెప్టెంబర్‌ 10న ఈ సాహసయాత్రను జెండా ఊపి ప్రారంభించడమే కాక నావికాసాగర పరిక్రమను విజయవంతంగా ముగించి గోవాకు తిరిగి వచ్చిన సమయంలోనూ ఘనస్వాగతం పలికారు.

భారత మహిళాశక్తి ఏ పాటిదో ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలిసి వచ్చిందని ఆరుగురు సభ్యుల తరిణి బృందం భారత మహిళలకే గర్వకారణమంటూ నిర్మలా సీతారామన్‌ ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రతి ఏడాది ఇలాంటి సాహసయాత్ర ఒకటి ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత నౌకా దళాధిపతికి సూచించారు. అంతేకాక ఓ తెరచాప నౌకలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన భారత మహిళా బృందంపై బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, పలువురు ఇతర ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. వివిధ రంగాలలో భారత మహిళలు సాధించిన అపూర్వ విజయాలలో ఈ నావికాసాగర పరిక్రమ సైతం ఒకటిగా మిగిలిపోతుంది.

– క్రీడా కృష్ణ ,
84668 64969

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here