Home News స్వయంప్రకటిత మేధావుల అసహనం

స్వయంప్రకటిత మేధావుల అసహనం

0
SHARE

గత వారం రోజులుగా వామపక్షవాదులు, అభ్యుదయవాదులు లేదా స్వయంప్రకటిత మేధావుల కలాలు, గళాలు స్పీడ్ అందుకున్నాయి. పర్సనల్ బ్లాగులు, ట్విట్టర్ అకౌంట్లు, ఫేస్బుక్ వాల్స్, ఎడిటోరియల్ పేజీలు, టీవీ చర్చలు ఎక్కడ చూసినా బెంగళూరులో హత్య చేయబడిన ఒక పాత్రికేయురాలు గురించి, వారి రచనల గురించి, పోరాటం గురించి ఆయా ప్లాట్‌ఫార్మ్స్‌పై హోరెత్తుకున్నాయి. పోలీస్ విచారణ ప్రారంభం కాక ముందే, నిందితులకు సంబంధించి ప్రాథమిక అంశాలేవీ నిర్ధారణకు రాక ముందే కొంతమంది మేధావులు హంతకులను నిర్ధారించారు. ఇంకెవరు ‘‘కాషాయవాదులే’’ అని స్పష్టీకరించారు. ఆ వాదనను బలపర్చుకోవడం కోసం గతంలో జరిగిన కల్బుర్గి, పన్సారే, దభోల్కర్‌ల హత్యలను ఉదహరిస్తూ, అవేవో సంఘ్ పరివార సంబంధీకులే చేసినట్లుగా నిరూపణ అయ్యినట్లూ, ఇంకేముంది అచ్చు గుద్దినట్లుగా అదే తరహా హత్య, వాళ్ళే చేశారు, అప్రకటిత ఎమర్జెన్సీ, పెన్నుపై కాషాయ గన్ను, ఇత్యాది విషయాలన్నీ ఏకరువు పెట్టారు. కొంత మంది మరింత ముందుకు వెళ్లి ఆరెస్సెస్‌, ఇతర సంఘ్ పరివార్ సంస్థల పేర్లను నిందారోపణ పర్వములోకి లాగారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారైతే అసలిది బీజేపీ బావజాలమున్న వారే చేశారని తేల్చేశారు. ఇక వారి అనుచరులు, కుహనా లౌకిక వాదులు, సాంప్రదాయిక హిందూ వ్యతిరేకులూ మరింత తీవ్ర పదజాలంతో బీజేపీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక విప్లవ రచయిత గారైతే ఇది మోదీత్వ హింస రచనలో భాగమని వాపోయారు. ఈ ఘటన ఆ పథక నిర్వహణలో భాగమన్నారు. వాస్తవానికి గౌరి లంకేశ్ అనే పాత్రికేయురాలు గురించి నాకు పెద్దగా తెలియదు, వారి పోరాటాలు జాతీయ స్థాయిలో ప్రజలను కానీ ప్రభుత్వాలను కానీ పెద్దగా ప్రభావితం చేసినట్లుగా కూడా స్ఫురణకు రాలేదు. బహుశా వారి వామపక్ష నేపథ్యం కూడా నా పరిచయలోపానికి కారణమయ్యి ఉండవచ్చు. ఏదేమైనా హత్య దురదృష్టకరం. ఏ భావమైనా భౌతిక హననంతో ఆగదు. మరొక వ్యక్తో లేదా వ్యవస్థల రూపంలో ఆ భావజాల వ్యాప్తి జరుగుతుంది. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. అలాంటప్పుడు గౌరి లంకేశ్ గారైనా మరొకరయినా, అటువంటి హత్యలను మనందరం ముక్త కంఠంతో ఖండించాలి దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలి. దానికి మినహాయింపులు ఉండకూడదు.

దురదృష్టకరమైన రీతిలో జరిగిన గౌరి లంకేశ్ హత్యకూ, ఒక భావజాలానికీ లింకు పెట్టడం, రాజకీయ రంగు పులమడం, పెడర్థాలు తీయడం, హిందూ ధర్మ పరిరక్షకులే నేరస్థులనడం, మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతనే ఈ తరహా హత్యలవుతున్నాయనడం, భావ స్వేచ్ఛను హరిస్తున్నారనడం, అస్సలు మోదీ ప్రభుత్వమే ప్రజా వ్యతిరేక ప్రభుత్వమన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం లోనే అసలు తిరకాసు కనపడుతుంది.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారికిష్టమున్న భావజాలాన్ని ఆచరించవచ్చు, ప్రచారం చేయవచ్చు, ఇష్టంలేని వారిని వ్యతిరేకించవచ్చు, గద్దె దింపే ప్రయత్నమూ చేయవచ్చు. అది సైద్ధాంతికంగా జరిగితే బాగుంటుంది. కానీ ఇటువంటి హత్యా సంఘటనలను రాజకీయ, సైద్ధాంతిక ప్రత్యర్థులపై ఆయుధాలుగా వాడుకోవాలనుకోవడమే దౌర్భాగ్యం. సదరు వ్యక్తుల, సంస్థల భావ హీనతకు, కుఠిల సంస్కృతికి నిదర్శనం. జరిగిన సంఘటనల వెనకనున్న కారణాలను తెలుసుకోకముందే ఆరోపణల జడివాన కురిపించడం ఆక్షేపణీయం. గతంలో కూడా, అప్పట్లో జరిగిన కొన్ని హత్యల విషయంలో ఇదే గుంపు అనేక నిరాధార ఆరోపణలు చేసింది. ఉదాహరణకు కల్బుర్గి, పన్సారే, దభోల్కర్, అఖ్లాఖ్ హత్య జరిగిన తరువాత సదరు నిందాపర్వాన్ని కొనసాగించింది. విశేషమేమిటంటే ఆయా సంఘటనలు జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలున్నా, వాటి విచారణలో ఈ మేధావి వర్గం చేసిన ఆరోపణలెవ్వి నిరూపణ కాలేదు, సరి కదా ఆయా ప్రభుత్వాల విచారణల్లో తేలిన అంశాలను పరిశీలిస్తే వీరి ఆరోపణల్లోని డొల్లతనం బయటపడుతుంది.

అయితే ఈ మొత్తం విషయంలో బీజేపీ కానీ, సంఘ్ పరివార్ సంస్థల పైన కానీ విమర్శలు సంధించే మేధావుల వ్యవహార శైలిలోని విచిత్ర, వికృత కోణం ఒకటి చెప్పుకోవాలి. వీరెవ్వరు కూడా మావోయిస్ట్స్ చేతుల్లో అకారణంగా చేయని తప్పులకు ఇన్‌ఫార్మర్‌గా ముద్ర వేయబడి చంపబడ్డ అభాగ్యుల గురించి కానీ, ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి విధుల్లో ఉంటూ మావోయిస్టులు, జిహాదీలు లేదా సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన, కోల్పోతున్న పోలీసులు, పారా మిలిటరీ, ఆర్మీ బలగాల గురించి కానీ మాట్లాడరు. వీసమంతైనా జాలి చూపించరు. అదేమంటే అది సైద్ధాంతిక పోరాటంలో భాగమంటారు. వర్గ శత్రు నిర్మూలన అనే వాదం అందుకుంటారు. దేశంలో ఏ మూలనైనా ఒక మావోయిస్టు చనిపోతే రెక్కలు కట్టుకొని వాలిపోయి, పిడికిలి బిగించి ‘‘లాల్ సలాం’’ చెప్పే వీళ్ళు కనీసం పైన ప్రస్తావించిన అభాగ్యుల గురించి ఒక్క కన్నీటి చుక్క… క్షమించాలి, ఒక్క పదమైనా మాట్లాడరు. మావోయిస్టులు చేసిన కొన్ని హత్యలను ఆ తర్వాతి కాలంలో చారిత్రక తప్పిదాలుగా అంగీకరించినప్పుడు వీరు కనీస విమర్శ చెయ్యరు.

ఇక ఆరెస్సెస్‌ లేదా అనుబంధ సంస్థల కార్యకర్తల హత్యలు జరిగితే వీరికి చీమ కుట్టినట్టైనా ఉండదు. వాళ్ళు కూడా మనుషులే; వారికీ హక్కులుంటాయి; వారికీ కుటుంబాలు, వారిపై ఆధారపడ్డ వాళ్ళందరూ ఉంటారని గానీ, వారు కూడా ఒక భావజాలాన్ని నమ్మి, ఆ భావజాల వేదికగా ప్రజాసేవ చేయడానికే సమాజంలో పనిచేస్తున్నారని గానీ అనిపించదు. వారు ప్రజల కోసం చేసిన పోరాటాలకు సంభందించిన ఆనవాళ్లు కూడా బయటకు రావు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే వందలాది మంది ఆరెస్సెస్‌, బీజేపీ కార్యకర్తలు కమ్యూనిస్టుల చేతుల్లో హతమయ్యారు. సాక్షాతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సొంత గ్రామంలో, సీఎం స్వగృహానికి కూతవేటు దూరంలో రెమిత్ ఉత్తమన్ అనే బీజేపీ కార్యకర్త దారుణంగా హత్యకు గురైతే పట్టించుకునే నాథుడు ఉండడు. అప్పుడు ఈ మేధావి వర్గానికి ఎటువంటి శాంతి భద్రతల సమస్యా కనపడదు. బెంగాల్లోనూ, ఇతర కాంగ్రెస్, బీజేపీ యేతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి చెప్పనక్కర లేదు.

దేశ పార్లమెంటుపై దాడి చేసినవాళ్ళు, ముంబై తరహా పేలుళ్లలో నేరస్థులూ కొందరు మేధావుల దృష్టిలో అమాయకులు. వారి హక్కులు వీరికి ప్రత్యేకమైనవి. భారత శిక్షాస్మృతిననుసరించి కోర్టులు వారికి శిక్షలను విధిస్తే ఆ శిక్షల నాపే ప్రయత్నంలో ముందు వరసలో ఉంటారు. అటువంటి ద్రోహుల జయంతులు, వర్ధంతులను ఉత్సవాలుగా జరుపుతూ, దేశ వ్యతిరేక నినాదాలిచ్చే విద్యార్థులు వీరికి దేవుడిచ్చిన కొడుకులు, కూతుర్లు అవుతారు. అటువంటి ప్రయత్నాలే సరైన న్యాయంగా భ్రమించే పరిస్థితులు కల్పిస్తారు. దేశ వ్యతిరేక భావననే నిజమైన దేశభక్తిగా, హక్కుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు.

వీరిలో కొంతమంది కార్యాచరణను నిశితంగా పరిశీలిస్తే కనపడేవి ఏంటంటే, పర్యావరణ పరిరక్షణ పేరిట అభివృద్ధిని, మౌలిక వసతుల కల్పనను, జాతీయ రహదారుల, విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాన్ని అడ్డుకొనడం, ఎన్జీఓల పేరిట విదేశీ విరాళాల మద్దతుతో జాతి వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తిచేయడం, కొంతమందైతే ప్రత్యక్షంగా ‘‘భారత్’’ అనే భావననే విభజించే ప్రయత్నం చేయడం… ఎంత దౌర్భాగ్యం! ఈ శక్తులకు అస్సలు మింగుడుపడని అంశం భారతీయ జనతా పార్టీ స్వంత బలంతో, తిరుగులేని మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టడం. దాద్రి ఘటనను ఆధారంగా చేసుకొని ఎన్నో కేసులు పెట్టించి, మృత్యు బేహారిగా వర్ణించి ఎంత విష ప్రచారం చేసినా దాన్ని ఛేదించి పూలు కడిగిన ముత్యం లాగ బయటకు వచ్చి, నిజం పునాదులపైన, అశేష భారతావని మద్దతుతో నరేంద్ర మోదీ ప్రధాని కావడం వారికి మింగుడుపడని విషయం. మతోన్మాదులనీ, హిందూ పక్షపాతులనీ, అగ్రవర్ణాల పార్టీ అని ఎంత ప్రచారం చేసినా అన్ని వర్గాల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అస్సలే జీర్ణించుకోలేని సంఘటన.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి ప్రతీ విషయంలో నానా యాగీ చేయడం (అది యూనివర్సిటీల్లో వీసీల నియామకం కావచ్చు, ఇతర జాతీయ సంస్థల్లో డైరెక్టర్ల నియామకం కావచ్చు, ఏదైనా వ్యవస్థలలో దేశ ప్రయోజనం దృష్ట్యా ప్రవేశపెట్టిన సంస్కరణలు కావచ్చు), విషయం -ప్రయోజనం అనవసరం, రాద్ధాంతం చేయడం, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే లక్ష్యం. దేశంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, దానికున్న ప్రజల మద్దతు, స్వదేశంలోనూ, విదేశంలోనూ పెరుగుతున్న మోదీ ప్రతిష్ఠ వారు అస్సలు ఊహించని పరిణామాలు. మరేం చేయాలి, ఏదో విధంగా మోదీని దెబ్బ తీయాలి. ప్రజల దృష్టిని అభివృద్ధి ఎజెండా నుంచి మరల్చాలి. అవసరమైతే అవార్డులు వెనక్కివ్వాలి. వీలైతే చైనా రాయబారితో కూడా రహస్యంగా చేయి కలపాలి. దేశంలో ఏ మూల చిన్న దుర్ఘటన జరిగినా దానికి మోదీనే భాధ్యుణ్ణి చెయ్యాలి. ప్రధాని స్వయంగా మాట్లాడాలని డిమాండ్ చెయ్యాలి. మాట్లాడినా, మౌనంగా ఉన్నా దాన్ని సాకుగా తీస్కొని నానా గొడవా చెయ్యాలి. ప్రజల మద్దతును దెబ్బ తీయాలి. ప్రజలను వర్గాలవారీగా విడగొట్టాలి. అప్పుడే మోదీ బలహీనమవుతాడు. అదీ వారి ఎజెండా.

అయితే వారి ఆశ నిరాశ కాక తప్పదు, వారి ప్రయత్నాలు నిష్పలమవ్వక తప్పదు. ఎందుకంటే ఇది ‘నవ భారతం’. మోదీ విధానాలను విశ్వస్తున్న ఆధునిక భారతం. ఇది ‘భారత్ జోడో’ అని నినదిస్తున్న మోదీ నాయకత్వాన్ని అబ్బురంగా అనుసరిస్తున్న భారతం. ఈ భారతంలో ‘మేక్ ఇన్ ఇండియా’కే తప్ప, ‘బ్రేక్ ఇన్ ఇండియా’కు స్థానం లేదు. డిజిటలైజేషన్‌కు తప్ప డిస్ట్రక్షన్‌కు స్థానం లేదు. ‘కరెంగే ఔర్ కర్కే రహేంగే’ అనే వారికే తప్ప ‘మారేంగే ఔర్ మార్తే రహేంగే’ అనే శక్తులకు స్థానం లేదు. కాబట్టి సదరు విభజన శక్తులకు ప్రజల విన్నపం ఏంటంటే వీలైతే ‘భారత్ జోడో, యా భారత్ కో చోడో’.

-రావుల శ్రీధర్ రెడ్డి

బీజేపీ సీనియర్ నాయకులు, తెలంగాణ విమోచన కమిటీ ఉపాధ్యక్షులు

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here