Home News “తప్పు చేసి ఉంటే క్షమించండి”: రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

“తప్పు చేసి ఉంటే క్షమించండి”: రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

0
SHARE
వివాదాస్పద ఐపీఎస్ అధికారి, తెలంగాణ సాంఘిక గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలను ఉద్దేశిస్తూ “కృతజ్ఞతాభివందనాలు” పేరిట ఒక లేఖ విడుదల చేశారు. దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుండి, వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్టు లేఖలో తెలిపారు. తన ఈ నిర్ణయాన్ని ఇమెయిల్ ద్వారా ప్రభుత్వ కార్యదర్శికి తెలిపానని అన్నారు.
“పదవీకాలం పూర్తవకుండానే ఈ వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది కొంత బాధ కలిగించినా, ఎట్టకేలకు ఎలాంటి పరిమితులు లేకుండా, నా మనసుకు ఇష్టమైన పనులను, నాకు నచ్చిన రీతిలో చేయబోతున్నాను అనే ఆనందం నాకు మరింత ఉత్సాహాన్ని, కొత్త శక్తిని ఇస్తోంది” అని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
 తప్పు చేసి ఉంటే క్షమించండి: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ 
తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసిన లేఖలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గురుకులాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేశారు. గురుకులాలు ప్రస్తుతం సమర్ధవంతమైన అధికారుల చేతిలో ఉన్నాయని, తమ పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి బెంగపెట్టుకోకుండా, మునుపటిలాగే సంస్థకు ఎల్లవేళలా సహకరించాలని  కోరారు. అలాగే గురుకులాల విద్యాలయాలను నిర్వీర్యం చేసే కుట్రలు పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నానని అన్నారు. “ఈ రెండున్నర దశాబ్దాల ప్రభుత్వ సర్వీసులో సాధ్యమైనంత వరకూ చట్టానికి, భారత రాజ్యాంగానికి లోబడే నా విధులు నిర్వహించాను. ఈ క్రమంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే, అవగాహన లోపం వల్ల జరిగిన తప్పులుగా భావించి, పెద్దమనసుతో క్షమించమని ప్రజలను కోరుతున్నాను” అని ప్రవీణ్ కుమార్ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

సర్వీసులో ఎన్నో వివాదాలు:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా, సివిల్ సర్వీస్ సాంప్రదాయాలకు విరుద్ధంగా  తొమ్మిది సంవత్సరాలుగా ఒకే హోదాలో కొనసాగుతున్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ‘స్వేరోస్’ పేరిట ప్రయివేట్ సంస్థకు ప్రాతినిథ్యం వహించడం, గురుకులాల్లోని విద్యార్ధులకు హిందూ వ్యతిరేక భావజాలం నూరిపోయడం వంటి అనేక ఆరోపణలు ప్రవీణ్ కుమార్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పైనా, అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ‘స్వేరోస్’ సంస్థ కార్యకలాపాలపైనా కేంద్ర హోంశాఖకు, జాతీయ బాలల హక్కుల కమిషనుకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు చేసింది. ‘స్వేరోస్’ సంస్థ కార్యకలాపాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. కేంద్ర హోంశాఖ కూడా ఈ అంశంపై విచారణ నిర్వహిస్తున్న సమయంలోనే ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించడం చర్చనీయాంశమైంది.