Home Telugu Articles జాతీయ సమైక్యతకు ప్రతీక పూరీ జగన్నాథ రథయాత్ర

జాతీయ సమైక్యతకు ప్రతీక పూరీ జగన్నాథ రథయాత్ర

0
SHARE

9 రోజులు… 
18 ఏనుగులు… 
38 మల్లయోధులు… 
101 వాహనాలు… 
మొత్తంగా 400 ఏళ్ళ చరిత్ర…. 
ఇదీ జగన్నాధ రథయాత్ర వైభవం. జగన్నాధుడంటే విశ్వానికి అధిపతి అని అర్థం. ఆ జగన్నాధుని రథయాత్ర తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుగుతుంది. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలను మరచి దేశం నలుమూలల నుంచి భక్తులు రథయాత్రను తిలకించడానికి పూరీ చేరుకుంటారు. రథయాత్ర వైభవాన్ని కనులారా చూసేందుకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడకి వస్తారు

ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేసే రథాలతో సాగే ఈ ఉత్సవం అద్భుతం. పూరీ జగన్నాథ యాత్ర విశేషం ఏమిటంటే దేవాలయంలోని మూలవిరాట్‌ విగ్రహాలే రథ యాత్రలో ఉత్సవ విగ్రహాలవుతాయి. మిగిలిన దేవాలయాల్లో మూలవిరాట్‌ విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు వేరువేరుగా ఉంటాయి. అలాగే మూలవిరాట్‌ రాతి విగ్రహంలో, ఉత్సవ మూర్తి పంచలోహ విగ్రహరూపంలో విరాజిల్లుతుంటారు. కానీ పూరీలో ఈ రెండు రకాలుగా కాకుండా చెక్కతో చేసిన విగ్రహాలే మూల, ఉత్సవ విగ్రహాలుగా పూజలందు కుంటాయి.

రథోత్సవం అంటే సాక్షాత్తు భగవంతుడే భక్తుడి దగ్గరకు రావడం. జగన్నాధుడైన శ్రీకృష్ణుడు మరింత జన ప్రియుడు. ఆయన జీవితమంతా ప్రజలతోనే ముడిపడి ఉంది. అందుకనే జగన్నాధుడు జననాధుడయ్యాడు. జగన్నాధ రథయాత్రలో విశేషాలు ఎన్నో..

జగన్నాధుని రథాన్ని ‘నందిఘోష్‌’ అంటారు.

ఎరుపు, పసుపురంగు వస్త్రాలతో అలంకరించిన ఈ రథం 45 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి 16 చక్రాలు ఉంటాయి. శ్రీకృష్ణుని అన్న బలరాముని రథాన్ని ‘తాళధ్వజం’ అని పిలుస్తారు. 44 అడుగుల ఎత్తు, 14 చక్రాలతో ఉంటే ఈ తాళధ్వజ రథాన్ని ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు. శ్రీకృష్ణ, బలరాముల చెల్లెలు సుభద్ర అధిరోహించే రథాన్ని ‘దర్పదళన’ అంటారు. దీనికి 12 చక్రాలు ఉంటాయి. 
పూరీ ఆలయంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు, రథాల నిర్మాణానికి ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ప్రతి 12, 19 ఏళ్ళకు ఒకసారి ఏ ఏడాదిలో ఆషాఢమాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు ‘నబకలేవర’ పేరుతో ప్రత్యేక ఉత్సవం నిర్వహించి కొత్త చెక్కతో విగ్రహాలు చేస్తారు. రథయాత్ర కోసం ప్రతి ఏడూ రథాల నిర్మాణం అక్షయ తృతీయ రోజున ‘చందన యాత్ర’తో ప్రారంభమవుతుంది. 

తొమ్మిది రోజులపాటు జరిగే జగన్నాథ రథయాత్ర ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు సాగుతుంది. జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథాలను వేలాది మంది లాగుతారు. ప్రపంచంలోని ఏ ఆలయంలోనూ మూలవిరాట్‌ విగ్రహాలు ఇన్ని రోజులపాటు బయట పూజలందుకోవడం లేదు.
పురాతన ఆలయం 

పూరీ జగన్నాధ ఆలయాన్ని గంగ వంశానికి చెందిన అనంతవర్మ చోడ గంగదేవుడు నిర్మించాడని ఇటీవల బయటపడిన గంగదేవ వంశానికి చెందిన రాగి ఫలకాలు చెపుతున్నాయి. సామాన్యశకం 1078-1148 మధ్య కాలంలో దేవాలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. ఆ తరువాత సా.శ 1174లో అనంగ భీమదేవుడనే రాజు ఆలయాన్ని పునర్నిర్మించాడు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆలయం ఆనాటిదే. ఆలయ స్థలాన్ని శ్రీక్షేత్రం అంటారు.

చరిత్రను పరిశీలిస్తే చెక్కతో చేసిన విగ్రహాలను ఆరాధించడం శబర అనే ఆదివాసీ జాతివారి ఆచారమన తెలుస్తోంది. అలాగే ధైతపతులు అనే మరొక ఆదివాసీ తెగకు కూడా పూరీ జగన్నాథ ఆలయంతో సంబంధం ఉంది. ఇప్పటికీ ఈ తెగ వారు ఆలయ పూజాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ విధంగా జగన్నాధుడు ఆదివాసీ, గిరిజనుల దైవ మని స్పష్టమవుతోంది. ఆదివాసీ, గిరిజ నులు వైదిక సమాజంలో, సంస్కృతిలో భాగం కాదనే ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని ఈ విషయం స్పష్టం చేస్తోంది.
జగన్నాథ ఆలయం జైన సంప్రదాయంతో కూడా ముడిపడి ఉంది. దేవాలయంలోని మూడు విగ్రహాలు జైన సంప్రదాయం ప్రకారం సమ్యక్‌ దర్శన్‌, సమ్యక్‌ జ్ఞాన్‌, సమ్యక్‌ చరిత్రకు ప్రతీకలుగా చెపుతారు. వీటి అర్థం మోక్షం లేక అనంతమైన ఆనందం. దీనినిబట్టి జైన మతం కూడా వైదిక ధర్మంలో భాగమేనని, అది హిందుత్వానికి వ్యతిరేకం కాదని నిరూపితమవుతోంది. 

పూరీ జగన్నాథ ఆలయం చాలా విశాలమైనది. దీని వైశాల్యం నాలుగులక్షల చదరపు అడుగులకు పైనే ఉంటుంది. భవ్యమైన ఈ ఆలయంలో 120 ఉప ఆలయాలు, పూజా స్థలాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 20 లక్షల మందికి పంచగలిగే ప్రసాదం తయారు చేయవచ్చును. ఇంత పెద్ద ఎత్తున ప్రసాదాన్ని ఆలయపు వంటశాలలోనే తయారవు తుంది. ఈ ప్రసాదం ఏడాది కాలంపాటు పాడవకుండా ఉండడం విశేషం. వంటశాలలో కర్రల పొయ్యి మీద ఏడు పాత్రలను ఒకదానిపై ఒకటి ఉంచి వండుతారు. విచిత్ర మేమంటే పూర్తిగా పైన ఉన్న పాత్ర ముందు వేడెక్కుతుంది. చివరగా కింద ఉన్న పాత్ర వేడెక్కుతుంది. ప్రసాదం తయారీకీ కేవలం మట్టిపాత్రలను మాత్రమే ఉపయోగిస్తారు. చుక్క నూనె ఉపయోగించకుండా చేసే ఈ ప్రసాదం అత్యంత రుచికరంగా ఉంటుంది.

జాతీయ సమైక్యతకు ప్రతీక జగన్నాథ యాత్ర 

జగన్నాథ రథయాత్రలో ప్రతి ఏడూ లక్షలాది మంది పాల్గొంటారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకుంటారు. జాతి, కుల, భాషా, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా అందరూ పాలుపంచుకునే భవ్యమైన కార్యక్రమం ఇది. భారతీయ సాంస్కృతిక ఏకత్వానికి అద్భుతమైన నిదర్శనం ఈ యాత్ర. చార్‌ధామ్‌ యాత్ర, కుంభమేళా మొదలైనవి కూడా ఈ ఏకాత్మతా భావానికి ప్రతీక. భారతదేశాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకున్న దురాక్రమణ శక్తులకు ఈ ఏకత్వం పెద్ద అడ్డంకిగా నిలచింది. నిలుస్తోంది. అందుకనే దీనిని నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. ఈ దేశం ఒకటిగా ఎప్పుడూ లేదని, ఇక్కడ అనేక జాతులు, సంస్కృతులకు చెందినవారు ఉన్నారని ప్రచారం సాగించారు. ముఖ్యంగా బ్రిటిషువాళ్ళు పూరీ జగన్నాథ రథయాత్రను నిషేధించాలని ప్రయత్నించారు. అత్యంత వైభవంగా జరిగే రథయాత్రపై దుష్ప్రచారం చేశారు. జగన్నాథ రథం కింద పడి అనేకమంది ఆత్మహత్య చేసుకుంటారని, యాత్ర అత్యంత అపవిత్రమైన, అశ్లీలమైన వాతావరణంలో జరుగుతుందని ప్రచారం చేసి చివరికి యాత్రను నిషేధించాలన్నది వారి ఆలోచన. భాషా పండితులైతే ఆంగ్లంలో ఏకంగా రథయాత్ర గురించి ఒక మాటనే పుట్టించారు. ‘జగ్గర్‌నాట్‌’ (భయంకరమైన, పెద్ద బండి) అత్యంత క్రూరమైన రథం అని దూషించారు. ఈ మాట ఇప్పటికీ ఇంగ్లీషు నిఘంటువుల్లో కనిపిస్తుంది. ఇలా ఈ దేశపు నిజమైన ఏకత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేందుకు పాశ్చాత్యులు చేయని ప్రయత్నం లేదు. ఈనాటికీ ఈ ప్రయత్నం సాగుతూనే ఉంది (దీని గురించి తెలుసుకోవా లనుకునేవారు రాజీవ్‌ మల్హోత్రా రాసిన ‘బ్రేకింగ్‌ ఇండియా’ పుస్తకం చదవండి). కుంభమేళాలో అనేక ప్రత్యేకతలు, విశేషాలు ఉంటే పాశ్చాత్య మీడియా, వారిని అనుసరించే భారతీయ మీడియా మాత్రం నగ్నంగా తిరిగే నాగా సాధువుల గురించే ప్రస్తావించడం వెనుక ఉద్దేశ్యం ఇదే. భవ్యమైన ఈ ఉత్సవాలు పూర్తి అపవిత్రమైన, అశ్లీలమైన వాతావరణంలో జరుగుతాయని చూపడం ద్వారా వాటిపట్ల హిందువులలోనే ఏహ్యభావాన్ని కలిగించడం ఈ ప్రచారపు లక్ష్యం. విదేశాలలో జరిగే టమాటాలతో కొట్టుకోవడం, బురదలో పొర్లడం, బుల్‌ ఫైట్‌ (ఎద్దులతో పోరాటం) వంటి అర్థంలేని, క్రూరమైన ఆటల్ని మాత్రం వినోదంగా ప్రచారం చేయడం విచిత్రం. దేశసమైక్యతకు, సమగ్రతకు ఆధారంగా నిలచిన జగన్నాథ రథయాత్ర వంటి ఉత్సవాలను నిలబెట్టుకోవడం ప్రతి హిందువు పవిత్ర కర్తవ్యం.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here