Home News అంతర్జాతీయ న్యాయమూర్తిగా జస్టిస్‌ దల్వీర్‌ భండారీ ఎన్నిక భారత్‌ విజయం

అంతర్జాతీయ న్యాయమూర్తిగా జస్టిస్‌ దల్వీర్‌ భండారీ ఎన్నిక భారత్‌ విజయం

0
SHARE

అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్‌ దల్వీర్‌ భండారీ మరోపర్యాయం ఎన్నికకావడం భారతదేశం దౌత్యపరంగా సాధించిన అద్భుత విజయం. ఐసీజేలోని మొత్తం పదిహేనుమంది న్యాయమూర్తుల్లో మూడేళ్ళకోమారు ఐదుగురిని ఎన్నుకోవలసి ఉండగా, ఈ మారు ఐదుస్థానాలకు ఆరుగురు పోటీలో ఉన్నారు. నలుగురి ఎన్నిక సజావుగా ముగిసింది కానీ, ఐదోస్థానం కోసం బ్రిటన్‌ తరఫున బరిలో ఉన్న క్రిస్టఫర్‌ గ్రీన్‌వుడ్‌కు, భారత్‌ భండారీకీ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. న్యాయమూర్తి కావాలంటే అటు ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలోనూ, ఇటు భద్రతామండలిలోనూ జరిగే రహస్య ఓటింగ్‌లో సదరు అభ్యర్థి మెజారిటీ ఓట్లు సాధించాలి. జనరల్‌ అసెంబ్లీలో భండారీ, భద్రతామండలిలో గ్రీన్‌వుడ్‌ ఆధిక్యం సాధించడంతో ఈ సంక్లిష్టస్థితి ఏర్పడింది. అనేక రౌండ్లలో జరిగే ఈ ఓటింగ్‌ ప్రక్రియ తనకు అచ్చిరావడంలేదని ఆఖరుదశలో బ్రిటన్‌ ఏదో మెలికపెట్టబోయినా, అంతిమంగా ఈ స్థానాన్ని భారత్‌ దక్కించుకోవడం సంతోషించవలసిన పరిణామం.

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్‌ జైళ్ళలో మగ్గుతున్న కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసుమీద భండారీ ఎన్నిక ప్రభావం ప్రత్యక్షంగా ఏమీ ఉండబోదని గుర్తుపెట్టుకొని, ఈ విజయాన్ని ఆస్వాదించడం ఉత్తమం. ఈ సీటుకోసం హారాహోరీ పోరు జరగడం, పైగా అది బ్రిటన్‌తో కావడం ఈ విజయానికి మరింత పేరు తెచ్చాయి. బ్రిటన్‌ బరిలోనుంచి తప్పుకున్నాక భారత్‌ గెలిచినమాట వాస్తవమే కానీ, చివరిదశలోనైనా అది బరిలోనుంచి తప్పుకోవడానికి పలు కారణాలున్నాయి. అందులో ఒకటి ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య తనకు అనుకూలంగా లేదన్న వాస్తవాన్ని గ్రహించడం. భద్రతామండలిలో భారత్‌ నెగ్గుకు రాలేకపోవడానికి కారణం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. కానీ, జనరల్‌ అసెంబ్లీలో గ్రీన్‌వుడ్‌కు అనుకూలత లేకపోవడానికి ఇరాక్‌ యుద్ధకాలంలో బ్రిటన్‌ నిర్ణయానికి కీలకమైన న్యాయాభిప్రాయానికి ఆయన చోదకశక్తి కావడం. ‘ఆత్మరక్షణ’ విషయంలో భద్రతామండలి ఆమోదాలేమీ అక్కరలేదని ఆయన ప్రకటించిన సూత్రమే అత్యంత కీలకమైనదై, ఇరాక్ చొరబాటుకు అమెరికా బ్రిటన్లకు దారులు తెరిచింది. ఇస్లామిక్‌ దేశాలు ఆయనపట్ల సానుకూలంగా లేకపోవడానికి ఇదమిత్థంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా, కట్టకట్టుకొని ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి ఇంతకుమించిన కారణాలు కూడా లేవు. డెబ్భయ్యేళ్ళుగా ఉన్న కుర్చీని వదులుకోవడానికి బ్రిటన్‌కు మనసు రాకపోవడం సహజమే కానీ, ఓటింగ్‌ ప్రక్రియను వదిలేసి, కాన్ఫరెన్స్‌ విధానం ద్వారా నెగ్గేందుకు అది ప్రయత్నం చేయడమే విచిత్రం. సమితి నుంచి ముగ్గురు, భద్రతామండలినుంచి ముగ్గురిని సభ్యులను ఎంపిక చేసి, ఆ ప్యానెల్‌ ద్వారా న్యాయమూర్తిని నిర్థారించే ఈ ప్రక్రియను భారత్‌ తిరస్కరించింది. భద్రతామండలిలో శాశ్వతసభ్యత్వం ఉన్న బ్రిటన్‌ చేసిన ఈ ప్రయత్నానికి, అప్పటివరకూ దానికి అండగా నిలుస్తూ వచ్చిన శాశ్వతసభ్యత్వ దేశాలు కూడా చివరలో తీరుమార్చుకొని కాదనడంతో బ్రిటన్‌ కూడా మనసు మార్చుకోక తప్పలేదు. ముఖ్యంగా అమెరికా మాట బ్రిటన్‌పై పనిచేసిందని అంటున్నారు. ఎన్నడూ లేని సంప్రదాయాన్ని అవసరార్థం ముందుకు తెస్తే, ఈ రోజు గండం గట్టెక్కవచ్చును కానీ, భవిష్యత్తులో అదే తాచుపామై తమ మెడకు చుట్టుకోవచ్చు.

శాశ్వత సభ్యత్వం ఉన్న ఒక దేశానికి జనరల్‌ అసెంబ్లీలో అవసరమైన ఓట్లు రాకపోవడం, ఐసీజేలో ఈ దేశాలకు ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా దీనిని తమ శాశ్వత హక్కుగా ఈ దేశాలు భావించాయి. మోదీ, సుష్మాస్వరాజ్‌లకు భండారీ కృతజ్ఞతలు చెప్పుకోవడం సముచితమైనది. భారత ప్రభుత్వం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. వరుస ఫోన్లతో సుష్మాస్వరాజ్‌తో దేశాలను చుట్టేశారు. సమితిలో ఓ పదిదేశాలు మినహా అన్నీ మనపక్షాన నిలిచాయి. భద్రతామండలిలోనూ ఎంతోకొంత చక్రం తిప్పగలిగాం. అన్నింటికంటే ముఖ్యంగా ఆఫ్రికన్‌ దేశాలకో, ఇస్లామిక్‌ దేశాలకో ఉన్నట్టుగా బ్రిటిష్‌ వలసపాలిత దేశాలకంటూ ఓ గ్రూపు లేక సంఘటితంగా వ్యవహరించలేకున్నా భారత్‌ ఈ విజయం దక్కించుకున్నది. దశాబ్దాలుగా వర్థమానదేశాల విషయంలో భారత్‌ అనుసరిస్తూ వచ్చిన వైఖరి ఇటువంటి కీలక సమయాల్లో ఉపకరిస్తుందని ఈ పరిణామం తెలియచెబుతున్నది. సమితిలో మూడింట రెండువంతుల మెజారిటీని భారత్‌ సాధించడం మారుతున్న కాలానికి నిదర్శనం. శాశ్వతసభ్యత్వాన్నీ, వీటో అధికారాన్నీ అడ్డుపెట్టుకొని ఎన్నిక ప్రక్రియనే ఆపేయగలిగే దేశాలు చివరకు లొంగిరావడానికి కారణం సమితిలో భారత్‌ సాధించిన ఆధిక్యతే. దీనిని తిరగ్గొట్టి అప్రజాస్వామికంగా వ్యవహరించిన అపకీర్తిని మూటగట్టుకోవడానికీ, మిగతా దేశాల ఆగ్రహాన్ని చవిచూడడానికి అవి భయపడ్డాయి. అడ్డదారుల్లో ఈ కుర్చీని సాధించి భారత్‌ను దూరం చేసుకోగలిగే స్థితిలో బ్రిటన్‌ కూడా లేదు. బ్రెగ్జిట్‌ కష్టాల్లో ఉన్న ఈ దేశం తన భవిష్యత్తు విషయంలో భారత్‌పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ కారణంగానే, మరోమారు సహాయనిరాకరణ తప్పదన్న భారత్‌ హెచ్చరిక కూడా దానిపై బలంగా పనిచేసిందని అంటున్నారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here