Home News జ్యేష్ట ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కొత్తపల్లి ఘనశ్యామ్ ప్రసాద్ అస్తమయం

జ్యేష్ట ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కొత్తపల్లి ఘనశ్యామ్ ప్రసాద్ అస్తమయం

0
SHARE

రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ ఎస్ ఎస్) సీనియర్ నాయకుడు కొత్తపల్లి ఘనశ్యామ్ ప్రసాద్ (85) అస్వస్థతతో గురువారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం రాజమహేంద్రవరంలో శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. ఒక కుమారుడు అప్పాజీ రాజమహేంద్రవరంలో ఎల్‌ఐసి డివిజనల్ అధికారిగాను, రెండో కుమారుడు విశాఖలో పెప్సీ సంస్థలోనూ పనిచేస్తున్నారు.

కొత్తపల్లి ఘనశ్యామ్ ప్రసాద్ అమలాపురం ఎస్‌కెబి ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి పదవీవిరమణ పొందారు. ఆర్‌ఎస్‌ఎస్ సంఘంలో అనేక బాధ్యతలు నిర్వహించారు. మంచి రచయితగా పేరొందిన ఆయన ఎన్నో రచనలు చేశారు. తెలుగులో అనేక దేశభక్తి గీతాలు రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎపి సంఘంలో ఆలపించే దేశభక్తి గీతాలన్నీ ఆయన రాసినవే. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు చేయడంతో 19 మాసాల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో ప్రతీ రోజూ ఉదయం రేడియోలో ఆయన రాసిన దేశభక్తి గీతాలే ప్రసారమయ్యేవని ఆయన సన్నిహితులు చెప్పారు. దేవాలయాలు-శాస్ర్తియత అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించారు. సంస్కార భారతి అనే సంస్థకు అఖిలభారత అధ్యక్షులుగా పనిచేశారు. రాణీ రుద్రమదేవి, గణపతిదేవుడు ఆస్థానంలో సైనికాధికారులపై ముసునూరి నాయకులు అనే ఒక చారిత్రక పుస్తకాన్ని రచించారు. పోరాట యోధులుగా సామ్రాజ్యాన్ని ఎలా రక్షించాలో అనే విషయాలను ఈ పుస్తకంలో విశేషంగా వివరించడం జరిగింది.

కొత్తపల్లి ఘనశ్యామ్‌తో కాసేపు మాట్లాడితే ఎంతో దేశభక్తి ప్రేరణ కలుగుతుందని సన్నిహితులు చెబుతుంటారు. గురూజీ ఉపన్యాసాలను పాంచజన్యం పేరుతో తెలుగులో అనువదించారు. కొత్తపల్లి మృతికి పలువురు తీవ్ర సంతాపం తెలియజేశారు. తులసి సూర్య ప్రకాశ్, ఓలేటి సత్యనారాయణ, బొమ్ముల దత్తు తదితరులు నివాళులర్పించారు.

వారి గురుంచి హెబ్బార్ నాగేశ్వర రావు గారి మాటలు:

వందేమాతరం-అని అన్న బంకించంద్ర ఛటోపాధ్యాయ మాతృదేశ భక్తితత్త్వాన్ని మరోసారి చిగురింప చేశాడు! మాతృదేశ భక్తి మన జాతీయతా వికాసానికి సనాతన ప్రాతిపదిక! మాతాభూమీ పుత్రోహం పృథిత్వాః’ అని సృష్ట్యాదిలో వేదద్రష్టలు ఎలుగెత్తడంతో ఈ జాతీయతా వికసనం అంకురించింది. ‘భూమి తల్లి. నేను ఆమె పుత్రుడను’ అన్నది జాతీయతా వికాస క్రమానికి అమృతబీజం! బంకించంద్రుని వంటివారు ఈ హైందవ జాతీయతా వన వికాస ప్రేరక కృషీవలుడు.. అలాంటి మరో కృషీవలుడు కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు. ‘వందే భారతమాతరం సురవరాం వాత్సల్య పూరాం ధరామ్..’ అని క్రీ.శ. 1980వ దశకంలో నినదించిన అభినవ బంకిం చంద్రుడు ‘ఘనశ్యామల’.. తెలుగువాడైన ఘనశ్యామల ఫ్రసాదరావు సంస్కృత భాషలో రచించిన ఈ ‘భరతమాత స్తోత్రం’ దేశవ్యాప్తంగాను, విదేశాలలోను పాతికేళ్లకు పైగా లక్షలాది ‘వరాలబిడ్డలు’ నిరంతరం ఆలపిస్తున్నారు. ‘సుకవి జీవించు ప్రజల నాలుకల మీద’ అన్న మహాకవి జాషువా నిర్ధారణకు మరో ‘నిజం’ కొత్తపల్లివారి జీవన ప్రస్థానం. క్రీ.శ. 1937లో కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించిన ఘనశ్యామల ప్రసాదరావు పార్థివ శరీర పరిత్యాగం చేసి పరమపదం వైపు సాగిపోయాడు. ఆయన ‘సమకాల ప్రచార ప్రమాణాల ప్రాతిపదిక’గా ప్రసిద్ధుడు కాకపోవచ్చు. కాని భరతమాతృ ఆరాధనను ఆజీవన వ్రతంగా ఆచరించిన విశుద్ధుడు. ‘కాషాయాంబర చుంబితాంబర యశః కాదంబినీ కేతన’ అయిన మాతృభూమిని అజరామర అక్షర సుమాలతో అర్చించిన అద్భుత జీవనుడు, జాతీయత సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధుడు.

ఐదువేల ఏళ్లకు పూర్వం వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత ఇతిహాసం సుప్రసిద్ధం. దాదాపు ఎనిమిది వందల ఏళ్లకు పూర్వం అగస్త్య పండితుడు రచించిన బాలభారత సంస్కృత కావ్యం ప్రసిద్ధమైనది కాదు. కొంతమంది సంస్కృత పండితులకు మాత్రమే పరిచయమై ఉండవచ్చు. అలాంటి విశుద్ధ కావ్యానికీ, విలక్షణ కవికీ ఆధునిక కాలంలో ప్రసిద్ధిని కలిగించిన ఘనత ‘ఘనశ్యామల’ది. ‘అగస్త్య పండితాస్ బాలభారత-ఎ క్రిటికల్ స్టడి’-అన్న పేరుతో ఈ సంస్కృత కావ్యం గురించి ఘనశ్యామల రాసిన ఆంగ్ల విమర్శ గ్రంథం భారతీయతను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పగలిగింది. ఆర్భాటం లేని రీతిలో ఘనశ్యామల దాదాపు పదిహేను సంవత్సరాల పాటు దేవాలయ వ్యవస్థ గురించి అధ్యయనం చేశాడు, పరిశోధన చేశాడు. ప్రారంభించిన తరువాత పనిపూర్తయ్యే వరకు అదే ధ్యాసతో తపస్సు చేయగలిన కఠోర నియమశీల ఘనశ్యామల. ‘అవధాన కళానిధి’ కాబట్టి అనేక కార్యక్రమాలపై ఏకకాలంలో ధ్యానం నిలపగలిగిన ‘ఆర్ష విజ్ఞాన విశారదుడు’ ఘనశ్యామల. తన పరిశోధన అధ్యయనం ప్రాతిపదికగా మూడు పుస్తకాలను రచించాడు. ‘ధ్వంసమైన దేవాలయాల’ గురించి శోధించాడు. పరమపద సోపానాలు-దేవాలయాలపై బొమ్మలు అన్న సనాతన జీవన పద్ధతికి భాష్యం చెప్పాడు. దేవాలయ వ్యవస్థను కించపరచడానికి, బొమ్మలకు అశ్లీలత అద్దడానికి సంస్కృతి వ్యతిరేకులు సాగించిన కుట్రకు విరుగుడు ఘనశ్యామల రచించిన ఈ గ్రంథం. ‘జీవించే దేవాలయం’ అన్నది ఆయన కృషికి పరాకాష్ఠ. మొత్తం భరతభూమి సనాతన జీవన మందిరం, భరతమాత సనాతన దేవత అన్నది ఆయన జీవన ప్రస్థానంలో నిరంతరం భాసించిన స్ఫూర్తి. ఆయన మలుపు తిరిగాడు. కనుమరగయ్యాడు. ‘స్ఫూర్తి’ నిరంతరం కొనసాగుతుంది.

‘స్ఫూర్తి’ ఇలా కొనసాగడానికి ఆయన రచించిన వందలాది జాతీయ భావ గీతాలు లక్షలాది నోళ్లలో నిరంతరం ప్రతిధ్వనిస్తూండటం ప్రత్యక్ష ప్రమాణం. ఈ లక్షలాదిమంది ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యులు’.. స్వయం సేవకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వృక్ష ‘శాఖ’లలో ఆ జీవనం మాతృదేశ మమకార గీతాలను వినిపించిన సాహితీ పికం కొత్తపల్లి కలం.. తెలుగునాట సంఘ ‘శాఖ’లలో ప్రతిరోజు ఆలపించే ప్రబోధ గీతాలలో అనేకం ఘనశ్యామల రచించినవే. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం దశాబ్దుల పాటు ఆయన జీవన కేంద్రమైంది. అక్కడి ఎస్‌కెబిఆర్ కళాశాలలో ఆయన సంస్కృత ఆచార్యుడు. భారతీయ భాషా విభాగానికి అధిపతి. ఆంధ్ర విశ్వవిద్యాలయ సంస్కృత పాఠ్య ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు. సుపరిచిత జాతీయతా రచయిత భండారు సదాశివరావుతో కలసి తెలుగునాట జాతీయ సాహిత్య పరిషత్తును స్థాపించిన కొత్తపల్లి 1990వ దశకం వరకు ఆ సంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. ‘సంస్కార భారతి’ అన్న మరో జాతీయ సాంస్కృతిక సంస్థకు ఆయన అఖిల భారత ఉపాధ్యక్షుడు.

సుదీర్ఘ సాహితీ సాంస్కృతిక జాతీయతా జీవనయాత్ర సాగించిన ఘనశ్యామల తన నిజమైన జీవితం ‘దక్ష, ఆరమ’లతో ఆరంభమైందని స్వయంగా చెప్పేవాడు. ‘దక్ష’ అంటే ‘అటెన్షన్’, ‘ఆరమ’ అని అంటే ‘స్టాండ్ అట్ ఈజ్’. ‘దక్ష’, ‘ఆరమ’ సంస్కృత ఆజ్ఞలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శాఖా నిర్వహణకు సంబంధించినవి. కొత్తపల్లి వారి జీవన ప్రస్థాన భూమిక ‘సంఘ’ ప్రాంగణం. అందుకే సంఘ లక్ష్యాలను ఆయన వివిధ గీతాలలో వినిపించగలిగాడు. ‘యాచిదేహీ యాచిడోలీ’ ఈ దేహంతో, ఈ కన్నులతో మాతృదేశ పరమవైభవాన్ని సాధించడం, దర్శించడం ఈ లక్ష్యం. ఘనశ్యామల ప్రసాదరావు ‘కలం’ ద్వారా ఈ లక్ష్యాన్ని-

‘‘జనజాగృత

నవభారత మహోదయం

ఈ కన్నులతోనె కాంచుదాం

ఈ జీవితాన సాధించుదాం’’

-హెబ్బార్ నాగేశ్వర రావు

(ఆంధ్ర భూమి సౌజన్యం తో )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here