Home News అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే

0
SHARE

స‌మాజంలో మూఢ‌నమ్మకాలు, అంధ‌విశ్వాసాల‌తో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే కొత్త‌దారి చూపారు. చేయి ప‌ట్టి న‌డిపించారు. విద్య అనేది ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు అని చాటిచెప్పారు. భార‌త‌దేశంలో సామాజిక సంస్కరణ ఉద్య‌మానికి బీజం మొద‌టి మ‌హోన్న‌తుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అనే చెప్పాలి. ఆయన సతీమణి సావిత్రిబాయి ఫులే మన దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు. సంఘ సంస్కర్త, ఉద్యమకారుడు, సమాజ సేవకుడెైన జ్యోతీబా ఫులే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించారు. ఫూలేను తన ఉద్యమ గురువుల్లో ఒకరిగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ భావించారు.

స్త్రీలపై నాడున్న క‌ట్టుబాట్ల‌ను ఉల్లంఘిస్తూ మహిళల మ‌హోద్ద‌ర‌ణ‌కు కృషి చేశారు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని గ్రహించిన ఫూలే స్త్రీ విద్యాభివృద్ధితోనే స‌మాజాభివృద్ధి సాధ్య‌మ‌ని బ‌లంగా విశ్వసించారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రి బాయిని పాఠశాలకు పంపారు. అంతటితో ఆగక ఫులే బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను 1848 ఆగస్టులో పూనాలో ప్రారంభించారు. ఈ పాఠశాలలో నాడు అంటరానివారు సహా అన్ని కులాల వారికీ ప్రవేశం కల్పించడం, పాఠాలు చెప్పాల్సిరావడంతో ముందు ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిబా ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు.

నాటి స‌మాజంలో మూఢ ఆచారాలైన క‌న్యాశుల్కం, బాల్య వివాహాలకు వ్య‌తిరేకంగా ఫూలే పోరాటాలు చేశాడు. భావ సారూప్యత కలవారంద‌రిని ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి స‌మాజానికి ఒక కొత్త మార్గాన్ని చూపాడు. చిన్న వ‌య‌స్సులో వితంతువులైన వారికి స్వయంగా వివాహాలు జరిపించాడు. 1864లో “బాలహత్య ప్రధిబంధక్ గృహ” స్థాపించాడు. నాటి సమాజంలో వితంతువులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను గ్రహించి వారి కోసం ఆశ్రమాన్ని స్థాపించారు. వితంతు మహిళలలకు శిరోముండనం చేసే ఆనవాయితీకి స్వస్తి పలకాలన్నారు. శిశుహత్యలు‌, బాల్యవివాహాల నివారణ కోసం ప్రత్యేక చొరవ తీసుకొని అండగా నిలిచారు.

1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులు- అతి శూద్రులపై నాటి సమాజంలోని కొన్ని వర్గాలు ప్రదర్శించే క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. ఆయన ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. కార్మికులు, రైతులు, మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరు చేశారు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని పేర్కొన్న మహాత్మా ఫూలే చివరి శ్వాస వ‌ర‌కు స‌మాజాన్ని సంస్క‌రింంచారు. ఫూలే త‌న ర‌చ‌న‌ల ద్వారా కూడా స‌మాజాన్ని మేల్కొల్పారు. మరీ ముఖ్యంగా పత్రికల ద్వారా ప్రచారం చేసి వారిలో ప్రశ్నించే తత్వాన్ని పెంచారు. జ్యోతిరావు ఫూలే రచనలు ఆ కాలం నాటి వైవాహిక పద్ధతులను సవాలు చేశాయి. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించడం లక్ష్యంగా వారి సాధికారత కోసం తపించిన మహాత్మా ఫూలే 1890 నవంబరు 28న తుది శ్వాస విడిచారు.