Home Telugu Articles కశ్మీరం కుదుటపడేలా…

కశ్మీరం కుదుటపడేలా…

0
SHARE

భూతల స్వర్గం లాంటి కశ్మీరం ఉగ్రవాద భూత పిశాచ గణాల పదఘట్టనల్లో ప్రత్యక్ష నరకంగా మారి దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది. లోయలో వేర్పాటువాద శక్తులకు రాజకీయంగా వూతమిస్తూ, ఉగ్రవాద తండాలను సరిహద్దులు దాటించడం ద్వారా ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఎగదోస్తూ పాకిస్థాన్‌ పాలకులు విష కలుషితం చేసిన వాతావరణంలో కశ్మీరం శోకాకులమై కుమిలిపోతోంది. నిరుడు ఉగ్రవాది బుర్హాన్‌ వానీ హతమారిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా చెదురుమదురుగా చెలరేగుతున్న ఘర్షణల్లో 84మంది పౌరులు హతమారిపోగా, 12వేలమంది దాకా క్షతగాత్రులై అలమటిస్తున్నారు. ఇంతటి సంక్షుభిత వాతావరణంలో జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ఆసియాలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, కశ్మీరీ యువజనం పంథా మారాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఉగ్రవాదమా, పర్యాటకమా- ఏది కావాలో యువతరమే తేల్చుకోవాలన్న మోదీ పిలుపు, కీలక సరిహద్దు రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఉపశమించేలా కీలక పరివర్తనను అభిలషిస్తోంది. రాళ్ల దాడులతో సాగుతున్న దమనకాండను పరోక్షంగా ప్రస్తావిస్తూ దారి తప్పిన యువజనం రాళ్లు రువ్వుతుంటే, మరి కొంతమంది అవే రాళ్లతో అయిదున్నరేళ్లు పరిశ్రమించి చరిత్రాత్మక ప్రాజెక్టును పూర్తిచేశారన్న మోదీ విశ్లేషణ లోయలో వివేకోదయాన్ని ఆశిస్తోంది. రహదారుల్నే కాదు హృదయాల్నీ అనుసంధానిస్తామంటూ ఎన్‌డీఏ తొలి ప్రధానిగా వాజ్‌పేయీ చేసిన దిశానిర్దేశాన్ని మోదీ ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల విస్తృతి ద్వారా ప్రగతికి బాటలు పరుస్తున్నామంటూ ఇలాంటివే మరో తొమ్మిది ప్రాజెక్టుల్ని ప్రధాని మోదీ ప్రస్తావించగా, వచ్చే రెండేళ్లలో రూ.7,000కోట్ల ప్రాజెక్టులు మొదలవుతాయని కేంద్రమంత్రి గడ్కరీ భరోసా ఇస్తున్నారు. జమ్ము-కశ్మీరుకు ఇతోధిక అండదండలందిస్తున్న కేంద్రం అక్కడి యువజనంలో నిరాశానిస్పృహల్ని పారదోలే సమగ్ర కార్యాచరణ వ్యూహంపైనా దృష్టి సారించాలిప్పుడు!

ఇన్సానియత్‌ (మానవత్వం), జమ్‌హురియత్‌ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్‌ (హిందూ-ముస్లిం సామరస్యానికి పాదుచేస్తున్న కశ్మీరీ సంస్కృతి)- ఈ మూడు సూత్రాల ఆధారంగా ముందడుగేసి సమస్యను పరిష్కరించగలమని 2003లో ప్రధానిగా వాజ్‌పేయీ స్పష్టీకరించారు. ‘గతానికి మనం బానిసలం కారాదు… అలాగని దాన్ని విస్మరించనూ కూడదు’ అంటూ రాజనీతిజ్ఞుడిగా వాజ్‌పేయీ వేసిన అడుగులు కశ్మీరీల అభిమానం చూరగొన్నాయనడంలో సందేహం లేదు. పాకిస్థాన్‌ పాడుబుద్ధితో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోగా, 2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం రూ.24 వేలకోట్లు కాగల పునర్నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. పదకొండు సెక్టార్లలో 67 దాకా ప్రాజెక్టులు/స్కీముల్ని చేపట్టినా పుష్కరకాలం తరవాత వాటిలో పూర్తి అయినవి పట్టుమని పదే! రాష్ట్ర జనాభాలో 70 శాతం మంది ఉగ్రవాదం సెల వేశాక పుట్టినవారేనంటే- బందులు, బందూకుల విషధూమం వారి మనసుల్ని ఎంతగా బండబార్చిందీ కళ్లకు కడుతున్నదే! ఇప్పటిదాకా 14,750 మంది పౌరుల్ని, 6,284 మంది భద్రతాబలగాల్ని, 23,167 మంది ఉగ్రవాదుల్ని బలిగొన్న ప్రచ్ఛన్నయుద్ధం కశ్మీరీల జీవనాన్ని నెత్తుటి చారికలతో నింపేసింది. వేర్పాటువాద రొదలే గాని, విద్యావినోద సదుపాయాలేవీ లేనిచోట బుర్హాన్‌ వానీ లాంటి శక్తులు యువతకు ఆదర్శంగా ఎదిగాయి. వేర్పాటువాదులెవరో పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వేలమంది పిల్లలు పెద్దల మాటను, మృత్యుభీతిని ధిక్కరించి వీధుల్లోకి వస్తున్న వైపరీత్యం నేడక్కడ పొడగడుతోంది. మంచుకొండ సానువుల్లో అగ్నిపర్వతమై సెగలు పొగలు కక్కుతున్న యువజనం ఆగ్రహావేశాలను చల్లార్చి బతుకుతెరువుకు భరోసా ఇచ్చే మేలిమి వ్యూహరచన సత్వరం సాగాలి!

భారత రాజ్యాంగ పరిధికి ఆవల జమ్ము-కశ్మీరుకు సార్వభౌమాధికారమన్నది ఈషణ్మాత్రమైనా లేదని నిరుడు డిసెంబరులో సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఉగ్రవాద శక్తుల బీభత్స హేలతో కల్లోల భరితమైన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి, మౌలిక సదుపాయాల కల్పనతో చేదుకోవడానికి మోదీ ప్రభుత్వం రూ.80 వేలకోట్ల ప్యాకేజీని 2014లో ప్రకటించింది. తాజా సొరంగ మార్గ నిర్మాణంలో పాల్పంచుకొన్న శ్రమశక్తిలో 94 శాతం రాష్ట్ర యువజనమే అయినా- సంప్రదాయ ఉపాధి వనరులైన హస్తకళలు, ఉద్యానవనాలు, పర్యాటకాలు పడకేసినందువల్ల ఉప్పతిల్లుతున్న ఉపద్రవ తీవ్రతను గుర్తించాలి. 2006 ఏప్రిల్‌ నుంచి 2016 మార్చి దాకా, ప్రత్యేక హోదాతో జమ్ము-కశ్మీర్‌ అత్యధికంగా లక్షా ఆరువేల కోట్ల రూపాయల కేంద్రసాయం అందుకొంది. సంక్షుభిత ఆర్థిక వ్యవస్థలో అది ఎటుపోయిందో తెలియకపోగా, పర్యాటకమూ పడకేయడంతో జనజీవనం పూర్తిగా గతి తప్పింది. రోజుకు 15వేల మంది పర్యాటకుల్ని ఆకర్షించే కశ్మీరంలో ఆ సంఖ్య సగటున 250కి పడిపోయింది. 2000 సంవత్సరం లగాయతు దేశంలో విదేశీ మదుపరుల ప్రత్యక్ష పెట్టుబడుల వాటా లక్షన్నర కోట్ల రూపాయలుగా ఉంటే, జమ్ము-కశ్మీరులో అది కేవలం రూ.37 కోట్లుగా నమోదైంది. తత్ఫలితంగా ఉద్యోగిత దారుణంగా కుంగి నేడు యువజనం వెలిగక్కుతున్న ఆక్రోశంలో అది ప్రతిఫలిస్తోంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ ఉపాధి మార్గాల పునరుద్ధరణ చేపట్టడంతోపాటు, వాజ్‌పేయీ ప్రస్తావించిన త్రిసూత్రాలే ఆలంబనగా మనసుల్ని అనుసంధానం చేసే కార్యాచరణ వ్యూహాన్ని కేంద్రం సత్వరం పట్టాలకెక్కించాలి. జైళ్లలో పట్టుబడిన సెల్‌ఫోన్లు వేర్పాటు కుట్రల విస్తృతిని సూచిస్తున్నందున శత్రుదేశం తొత్తుల ఆటలు సాగనివ్వని సమర్థ వ్యూహాలనూ సిద్ధం చెయ్యాలి. కశ్మీరీ యువజనం మనసుల్ని గెలుచుకోవడమే ఎన్నో సవాళ్లకు సరైన పరిష్కారం అవుతుంది!

(ఈనాడు సౌజన్యం తో )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here