Home News వేదమత ఉద్ధారకులు… విజయనగర సామ్రాజ్య స్థాపకులు విద్యారణ్యులు

వేదమత ఉద్ధారకులు… విజయనగర సామ్రాజ్య స్థాపకులు విద్యారణ్యులు

0
SHARE

ఆదిశంకరుల తరువాత అంతటివారిగా పేరు పొందిరన మహనీయులు విద్యారణ్యస్వామి. మహాయోగి, మహామతి, కవి, తాత్వికుడు, ద్రష్ట, వేదత్రయ భాష్య కర్త, బ్రహ్మవిద్య పారంగతుడు, శ్రౌత స్మార్త క్రియాపరుడు, వేదాంత శాస్త్ర ఆది రచయిత, శతాధిక గ్రంథకర్త, విఖ్యాత పురుషుడు, ప్రత్యేకించి విజయనగర మహా హిందూ సామ్రాజ్య నిర్మాత, రాజ్య స్థాపకుడు, మహామంత్రి, హిందూ మతోద్ధారకుడు, విరూపాక్ష పీఠ స్థాపకుడు, శృంగేరీ పీఠాధిపతిగా పలు విధాలైన ప్రత్యేకతలతో విద్యారణ్యస్వామి జగత్‌ ప్రసిద్ధి పొందారు. 1267లో వైశాఖ శుక్ల సప్తమి నాడు జన్మించి, 1331లో సన్యాసం స్వీకరించి, శృంగేరి పీఠాధిపత్యం వహంచారు.

ఉత్తర హిందూ దేశమంతా ముస్లింల వశమై, అన్యమతస్తుల ఆధిపత్యం అధికమైన పరిస్థితులలో, విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్య నిర్మాత, సామ్రాజ్య రక్షకులు అయ్యారు. భరత జాతిని జాగృతపరిచేందుకు తీవ్రంగా శ్రమించి, విశేష కృషితో లక్ష్యాన్ని సాధించారు. దాడుల కారణంగా అన్యమతంలో చేరి… తిరిగి హిందూ మతంలోకి రావాలనుకునే వారికి విద్యారణ్యులు కల్పవృక్షమై నిలిచారారు. 1331లో ప్రజోత్పత్తి సంవత్సర కార్తిక శుద్ధ సప్తమి నాడు వీరు శృంగేరి పీఠాధిపత్యం వహించారు. తమకు పుర్వం ఉన్న శృంగేరి పీఠాధిపతులు, విద్యాతీర్థుల అనుమతితో శృంగేరి పీఠానికి అనుబంధంగా విరూపాక్ష, పుష్పగిరి, శివగంగ, ఆమని సంకేశ్వర్‌, కొల్లాపురంలలో స్థాపనలు గావించి, అన్య మతాల బాధితులకు ఆశ్రయం కల్పించారు. ”పరాశర మాధవీయం” అనే స్మృతి గ్రంథంలో తమ గూర్చి చెప్పుకున్నారు. కృష్ణ యజుర్వేది, బోధాయన సూత్రుడు, భారద్వాజ గోత్రుడు. మాధవ జన్మనామం కలిగి, సన్యాసి నుంచి ”విద్యారణ్య” నామధేయులైన స్వామివారి బాల్యమున విద్యాభ్యాసం నాటికి దక్షిణ భారతంలో ఆర్ష పరిస్థితి శోచనీయమైన పరిస్థితిలో ఉంది. వేదశాస్త్రాలు అడుగంటి, శ్రౌతస్మార్త విద్యలు భ్రష్టమై, ఉపనిషన్మతం పెడత్రోవలో పడి, మతం పలు శాఖలుగా చీలిన పరిస్థితులలో, విద్యారణ్యుడు అవతరించి వేదమతాన్ని ఉద్ధరించారు.

మత త్రయాచార్యులు వేదాంత శాస్త్రాలను మాత్రమే విస్తరింపజేయగా, వేదార్థ విశదీకరణ కానరాని స్థితిలో విద్యారణ్యులు గాయత్రీ మంత్రోపాసకులై భువనేశ్వరీ మాత ప్రత్యక్ష ప్రసన్నతో హరిహర బుక్కరాయలచే రాజ్యస్థాపన గావించి, కొంతకాలము మంత్రిగా ఉండి, 1400 గ్రంథాలు రచించి 1380లో శృంగేరి పీఠాధిపతులయ్యారు. లౌకిక, వైదికాంశములలో అసమాన ప్రతిభులై, మత, రాజ్యోద్ధరణ గావించినట్లు చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. సర్వజ్ఞ విష్ణు అనే గురువు వద్ద వీరు వేదాంత శాస్త్రాలు అభ్యసించినట్లు సర్వదర్శన సంగ్రహంలో ఉంది. బ్రహ్మచర్యాశ్రమం నుండి మాధవుడు సన్యసించినట్లు చెబుతారు. అన్యమతాల ఆగడాలు కలత పెట్టగా, మాధవుడు తుంగభద్ర తీరాన భువనేశ్వరి అమ్మవారి కోసం గాయత్రి మంత్రంతో తీవ్ర తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమైంది. అమ్మ వారు చెప్పిన ప్రకారం సన్యసించి శృంగేరి పీఠాధిపత్యాన్ని వహించగా, అప్పుడు, ఆ జగజ్జనని మూడు గడియల సేపు స్వర్ణ వృష్టి కురిపించిందట. భువనేశ్వరి మాత అనుగ్రహించిన అపార సంపత్తిని విరూపాక్ష పీఠం నెలకొల్పడానికి, విద్యానగరాన్ని పెంపొందించడానికి, విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి వినియోగించారు.

విజయనగర సామ్రాజ్య రాజధాని విజయనగరాన్ని నిర్మించి, శృంగేరి పీఠాన్ని అధిష్టించిన విద్యారణ్యులకు ధర్మపురి క్షేత్రంతో విడదీయలేని సంబంధం, అనుబంధం ఉన్నాయి. శాలివాహన శకం 1258 (క్రీస్తుశకం 1336) ధాత్రు నామ సంవత్సర వైశాఖ శుక్లపక్ష సప్తమి పుష్యమి నక్షత్ర సింహ లగ్నం సుముహూర్తాన, ”విజయనగర సామ్రాజ్య స్థాపన” సమయాన ధర్మపురికి చెందిన చతుర్వేద పండితులను, ఆహ్వానించినట్లు చెప్పబడుతున్నది. దక్షిణామ్నాయ శృంగేరి పీఠం 12వ అధిపతి అయిన విద్యారణ్యులు ధర్మపురిలో నివసించి, వేదాధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. నవనారసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైన ధర్మపురి నరసింహ ఆలయంలో శివకేశవ అభేద తత్వాన్ని చాటుతూ, స్మార్త ఆగమ పూజ రీతులతో, శైవ వైష్ణవ ఆగమ విధానాలతో పూజాదికాలు కొనసాగే సత్సంప్రదాయం విద్యారణ్యులపై తీవ్ర ప్రభావం చూపినట్లు, అది యావత్‌ భారతానికి సైతం ఆదర్శప్రాయమైనట్లు భావించడానికి పలు ఆధారాలు బలం చేకూర్చుతున్నాయి. మన జాతిని ఉత్తేజపరిచిన మహనీయులలో అగ్రశ్రేణికి చెందిన విద్యారణ్యులను ఏడాదికి ఒకనాడైనా స్మరించుకోవడం మన కర్తవ్యం. 1386లో శుద్ధ త్రయోదశి నాడు విద్యారణ్యులు సిద్ధిపొందారు. విద్యారణ్య స్థాపిత పుష్పగిరి తదితర స్థలాలలో జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు ఆరాధనోత్సవాలు సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు.