Home Telugu Articles కుటుంబం కన్నా దేశమే ముఖ్యం: శౌర్యచక్ర గ్రహీత కె.శ్రీనివాస్‌

కుటుంబం కన్నా దేశమే ముఖ్యం: శౌర్యచక్ర గ్రహీత కె.శ్రీనివాస్‌

కత్తి పోట్లకు గురైనా ఉగ్రవాదిని పట్టుకోవడమే లక్ష్యమనుకున్నా...

0
SHARE

‘‘ఎదురుగా ఉన్న అలబ్‌ జెబ్‌ అఫ్రిదీ… ఉగ్రవాది అని తెలుసు. అతనికి తెలిసిందల్లా విధ్వంసం సృష్టించడమే. అఫ్రదీని నిలువరిస్తే మరిన్ని చోట్ల బాంబు పేలుళ్లను ఆపగలం. అందుకే నేనేమైనా ఫర్వాలేదని ముందుకెళ్లాను. కానీ… ఇంత గొప్ప గౌరవం దక్కుతుందని అనుకోలేదు’’ అని శౌర్యచక్ర పురస్కార గ్రహీత, హైదరాబాద్‌లోని కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ సెల్‌ కానిస్టేబుల్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న క్షణాలు జీవితంలో మర్చిపోలేనివన్నారు. శుక్రవారం రాత్రి దిల్లీలో రాష్ట్రపతి ఆతిథ్యమిచ్చిన తేనీటి విందులో పాల్గొన్న అనంతరం ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.

‘‘మాది నల్గొండ జిల్లా. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం పోలీసుశాఖలో ఉద్యోగిగా చేరాను. కానీ, పోలీసు ఎలా ఉండాలన్నది అక్కడి శిక్షణలోనే తెలిసింది. గ్రేహౌండ్స్‌ విభాగంలో చేరిన తర్వాత నా దృక్పథమే మారిపోయింది. తెలంగాణ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌లో నేను కానిస్టేబుల్‌ని మాత్రమే. ఈ విభాగంలో చేరిన తర్వాత ఉన్నతాధికారుల ఆలోచనా విధానం నాపై ప్రభావం చూపింది. కుటుంబం కన్నా దేశమే ముఖ్యమన్న భావనతో వారు పనిచేస్తున్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో పాల్గొంటున్న నేను కూడా నా కుటుంబాన్ని మర్చిపోయా. మనచుట్టూ ఉన్నవాళ్లంతా నా కుటుంబమేనన్న భావన కలిగింది. గత ఏడాది జనవరి 23న బెంగళూరులో తలదాచుకున్న ఉగ్రవాది అలమ్‌ జెబ్‌ అఫ్రీదిని పట్టుకున్నప్పుడు నాలో కలిగిన ఆలోచన ఒక్కడే… వీడు తప్పించుకుని పారిపోతే దిల్‌సుఖ్‌నగర్‌, అజ్మీర్‌, బెంగళూరు తరహాలో పేలుళ్లు సంభవిస్తాయి. కానీ, దేశంలో ఎక్కడా ఇలాంటి తరహా ఘటనలు జరగకూడదు. ఒక్కరు కూడా గాయపడకూడదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే, అఫ్రిదీ కత్తితో నా కడుపులో పొడిచినా దాన్ని లెక్కచేయలేదు. ఉన్నతాధికారుల ప్రశంసలు, శౌర్యచక్ర పురస్కారం నా బాధ్యతను మరింత పెంచాయి’’ అని శ్రీనివాస్‌ అన్నారు.

(ఈనాడు సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here