Home Views సొంతిల్లు కూడా లేని ప్రధాని!

సొంతిల్లు కూడా లేని ప్రధాని!

0
SHARE

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

రూపంలో వామనమూర్తి. సంకల్పంలో త్రివిక్రముడు. పట్టుదల, స్వయంకృషి, దీక్ష, నిరాడంబరత, నిజాయతీ, నిస్వార్థం, మానవత లాంటివి విజయసోపానాలు. ‘ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే సూక్తికి నిలువెత్తు నిదర్శనం. ఆయనే లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి. స్వార్థానికి అతీతంగా శక్తి మేరకు పనిచేసి అవసరం కొద్దీ ప్రతిఫలం తీసుకోవాలన్నది ఆయన తత్వం. ప్రధానమంత్రిగా సేవలు అందించినా సొంత గూడు లేదు. బ్యాంకు నిల్వలు లేవు. కుమారుడికి సరైన ఉద్యోగం ఇప్పించుకోలేకపోయారు. తన జైలు జీవితంలో కూతురు, కుమారుడు అనారోగ్యంతో కన్నుమూశారు. అస్వస్థులైన పిల్లలను చూడడానికి జైలు అధికారులు విధించిన షరతులకు అంగీకరించకపోవడంతో చివరిచూపునకు నోచుకోలేదు. పిల్లల చికిత్సకు కటిక దారిద్య్రం అడ్డుగా నిలిచింది. అయినా చెక్కు చెదరలేదు. ఎన్నో పదవులను ఎందరో నిర్వహించవచ్చు. కానీ వాటికి వన్నెతెచ్చిన వారే చిరస్మరణీయులు. ఆ కోవకు చెందినవారే శాస్త్రి.

ఉత్తరప్రదేశ్‌లోని ముగల్‌సరాయిలో 1904వ సంవత్సరం అక్టోబర్‌ 2‌వ తేదీన జన్మించిన లాల్‌ ‌బహదూర్‌కు చదువుతో పాటు జాతీయ అగ్ర నాయకుల ప్రసంగాల పట్ల ఆసక్తి, దేశభక్తి పెరిగాయి. మహాత్మా గాంధీ•, బాల గంగాధర తిలక్‌ ఆశయాలకు, ఆదర్శాలకు లాల్‌ ‌బహదూర్‌ ‌ప్రభా వితులయ్యారు. వారి ఉపన్యాసాలు వినేందుకు ఎంతో ఆసక్తి కనబరిచేవారు. వారణాసికి పది మైళ్ల దూరంలో ఉన్న ఆయన లోకమాన్యుడి ఉపన్యాసం వినేందుకు అప్పు చేసి మరీ వెళ్లారట. తిలక్‌ ఉపన్యాసం యావజ్జీవితం చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని అనేవారు. ఆయన చదువు మొగల్‌సరాయి, వారణాసిలలో కొనసాగింది. 1926వ సంవత్సరంలో శాస్త్రి కాశీ విద్యాపీఠం నుండి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ పీఠం ప్రదానం చేసే పట్టాను ‘శాస్త్రి’ అనే వాచకంతో సంభోదించేవారు. అలా ఆయన విద్యార్హత పట్టా ఆయన పేరులో ఒక భాగమై పోయింది.

స్వాతంత్య్ర ఉద్యమంలో (1921)చురుకుగా పాల్గొని జైలుకు వెళ్లారు. కాని ఆప్పటికి ఆయన మైనర్‌ ‌కావడంతో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం విడుదల చేసింది. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇం‌డియా ఉద్యమం తదితర సందర్భాలలో అరెస్టు అయి మొత్తం తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో పుస్తక పఠనానికి ఎక్కువ కాలం వెచ్చించారు. విప్లవాత్మకతను, వేదాంతాన్ని, వివిధ సంస్కరణలను ఆకళింపు చేసుకున్నారు. అలహాబాద్‌ ‌చేరుకొని జవహర్‌లాల్‌ ‌నెహ్రుతో కలసి స్వరాజ్య ఉద్యమం సంబంధిత కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. స్వాతంత్రం సిద్ధించిన తరువాత ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్ర పార్లమెంటరీ సెక్రెటరీగా, ఆ వెంటనే గోవింద వల్లభపంత్‌ ‌ముఖ్యమంత్రిత్వంలో పోలీసు (హోం), రవాణాశాఖ మంత్రిగా నియమితులై ఆయా శాఖల్లో అనేక విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. రవాణా వ్యవస్థలో మొట్టమొదటిసారిగా మహిళా కండక్టర్లను నియమించారు. పోలీసు శాఖా మంత్రిగా (ఆ రోజుల్లో హోంశాఖను పోలీసుశాఖగా పిలిచేవారు) అల్లరి మూకలను చెదరగొట్టడానికి లాటీలకు బదులు నీటి గొట్టాలను (water jet) వినియోగించాలని ఆదేశించారు. ఆ సమయంలో చెలరేగిన మత కలహాలను, సామూహిక వలసలను, అత్యంత సమర్ధవంతంగా అరికట్టి, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించి శభాష్‌ అనిపించుకున్నారు. 1952లో ఉత్తరప్రదేశ్‌ ‌నుండి రాజ్యసభకు ఎన్నికై రైల్వే మంత్రిగా, 1957 సాధారణ ఎన్నికల్లో గెలిచి హోం, రవాణా, సమాచార, పరిశ్రమలు, వాణిజ్యశాఖా మంత్రిగా సేవలందించారు. జవహర్‌లాల్‌ ‌నెహ్రూ ఆకస్మిక మరణం (1964)తో లాల్‌ ‌బహదూర్‌ ‌ప్రధానమంత్రి (1964 జూన్‌) ‌బాధ్యతలు చేపట్టారు.

ధీమత్వం-చాతుర్యం

1965 ఆగస్ట్‌లో పాకిస్తాన్‌ ‌సేనలు జమ్ము కశ్మీరులోని కచ్‌ ‌ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. దురాక్రమణకు ప్రతిగా శాస్త్రి త్రివిధ దళాలను నియంత్రణ రేఖను దాటించి లాహోరును ఆక్రమించు కోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. సైన్యం కదిలింది. బెంబేలెత్తిన పాక్‌ ఐక్యరాజ్యసమితి (ఐరాస), అమెరికాను ఆశ్రయించడంతో వాటి మధ్యవర్తిత్వం మేరకు యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. 1964లో సిలోన్‌లోని భారతీయ తమిళుల హోదాకు సంబంధించి శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకేతో జరిగిన ఒప్పందంపై సంతకం చేసాడు. ‘సిరిమా-శాస్త్రి ఒడంబడిక’గా వ్యవహరించే ఒప్పందం ప్రకారం, 6 లక్షల మంది తమిళులను తిరిగి స్వదేశానికి పంపేందుకు, 3.75 లక్షల మంది శ్రీలంక పౌరసత్వాన్ని తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.

నైతికత

శాస్త్రి నైతికత, నిజాయతీల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అవి సర్వకాల ఏలికలకు ఆదర్శ నీయం. జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ మొదటి మంత్రి వర్గంలో రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రెండు రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అందుకు ప్రధాని నెహ్రూ ఇష్టపడకపోయినా శాస్త్రి రాజీ పడలేదు. అలా ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.

ప్రధాని కాకముందు అలహాబాద్‌ ‌మునిసిపల్‌ ఎన్నికలలో గెలిచిన ఆయన ‘అలహాబాద్‌ ఇం‌ప్రూవ్‌ ‌మెంట్‌ ‌ట్రస్టు’కు కూడా ట్రస్టీ అయ్యారు. ఆ సమయంలో అక్కడి ‘టాగూర్‌ ‌నగర్‌’ ‌పేరుతో కొంత భూమిని వేలానికి పెట్టగా ఆయన ఊళ్లో లేని సమయంలో ఆయన మిత్రుడొకరు కమిషనర్‌ను కలిసి శాస్త్రి గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులంతా తలా ఒక స్థలం దక్కించుకొనేలా ఒప్పించి, తనకు, శాస్త్రికి చెరో ఇంటి స్థలం సంపాదించ గలిగాడు. తిరిగి వచ్చిన తరవాత విషయం తెలసిన శాస్త్రిజీ కలతచెందారట. ‘నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచీ రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయతీగా నిలచి జవాబుదారీతనం వహించ వలసిన వాళ్లం. నేను నా స్థలం తిరిగి ఇచ్చేస్తున్నాను. మీరూ అదే చేయండి. లేదా రాజీనామా చేసి సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని స్థలాన్ని దక్కించుకోండి’ అని మిత్రుడికి చెప్పి తమ స్థలాన్ని ట్రస్టుకు తిరిగి ఇచ్చేశారు. జీవితకాలంలో సొంత• ఇల్లులేని ప్రధాని ఆయన.

లాల్‌ ‌బహదూర్‌ ‌ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కుమారులు సిటీ బస్సుల్లోనే ప్రయా ణించేవారు. స్నేహితుల సలహా, పిల్లల ఒత్తిడి మేరకు అక్కడక్కడ అప్పులుచేసి కారు కొనుగోలు చేశారు. ఆ రుణానికి సంబంధించి సుమారు రూ.4600 బకాయి ఉన్నప్పుడే కన్నుమూశారు. ఈ విషయం దినపత్రికల్లో రావడంతో దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు ఆయన భార్య లలితాశాస్త్రికి మనీ ఆర్డర్‌లు పంపారట. ఆమె ప్రతి దాతకు కృతజ్ఞతలు చెబుతూ ఆ డబ్బును తిప్పి పంపారట.

శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో అశోక్‌ ‌లేలాండ్‌ ‌సంస్థలో ఉద్యోగం చేస్తున్న పెద్ద కుమారుడు హరికృష్ణ శాస్త్రికి యాజమాన్యం పదోన్నతి (సీనియర్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌) ‌కల్పించింది. దానిపై ఒక నిమిషం ఆలోచించిన శాస్త్రి ‘ఆ సంస్థ ఆకస్మాత్తుగా నీకెందుకు పదోన్నతి ఇచ్చిందో ఊహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ యాజమాన్యం నన్ను ఏదో ఒక సహాయం కోరుతుంది. నేను అలా చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల నిజాయతీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కనుక వెంటనే ఆ సంస్థలో ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా ఉన్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’ అన్నారట.

హరిత, శ్వేత విప్లవకారుడు

పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో 22వ రోజున (1965 అక్టోబరు 19న) అలహాబాదులోని ఉర్వాలో రైతులు, సైనికుల అభినందన సభలో, దేశానికి కీలకమైన ఆ రెండు వర్గాలను ఉద్దేశించి ‘జై జవాన్‌ ‌జై కిసాన్‌’ అని శ్లాఘించారు. అది ఆ తరువాత జాతీయ నినాదమైనది. దేశంలో ఆహార ఉత్పత్తిని పెంచేందుకు దీర్ఘకాలిక పరిష్కారానికి హరిత విప్లవానికి బాటలు వేశారు. న్యూఢిల్లీలోని తన అధికార నివాసంలోని పచ్చిక మైదానాన్ని దున్నడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి దేశ ప్రజలకు ప్రేరణగా నిలిచారు. భోజనం ఉన్నవారు అవసరార్థులకు చేయూతనివ్వాలని ప్రతిపాదించడమే కాక ఆచరించి చూపారు. తాను నెలకు రెండున్నర రూపాయల ఆదాయంపై జీవించిన రోజలు ఉన్నాయని, దారిద్య్రం, ఆకలి బాధ బాగా ఎరిగిన వాడినని ప్రధాని హోదాలో ఒకచోట మాట్లాడుతూ అన్నారు. ఆహార కొరత ఉన్నవారిని ఆదుకోవాలని, వారి కోసం ప్రజలు ఒక భోజనం స్వచ్ఛందంగా ఇవ్వాలని, వారంలో ఒక భోజనాన్ని వదలివేయాలన్న విజ్ఞప్తికి విశేషమైన ప్రతిస్పందన వచ్చింది. రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు ప్రతి సోమవారం సాయంత్రం మూతపడేవి. దీనినే ‘శాస్త్రి వ్రత్‌’‌గా పిలిచేవారు. పాడి, పాలు ఉత్పత్తి, సరఫరా పెంచేందుకు గుజరాత్‌లోని ఆనంద్‌ ‌ప్రాంతంలోని అమూల్‌ ‌పాల సహకార సంస్థ, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ది సంస్థ ఏర్పాటుకు ఎనలేని కృషి చేశారు. దేశంలోని రైతుల సాంఘిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు అన్ని ప్రాంతాలలో ఇలాంటి సంస్థలను నెలకొల్పాలని అభిలషించారు.

చమత్కారి

తన పొట్టితనంపై ఛలోక్తులు విసురుకొని నవ్వులు పంచేవారు. ఒకసారి బాలల సమావేశంలో ప్రసంగించవలసి వచ్చినప్పుడు ‘నా కొలత (సైజ్‌)‌ను బట్టే నిర్వాహకులు ఆహ్వానించినట్లున్నారు’ అని నవ్వులు పూయించారు. ‘నేను పొట్టివాడిని, మెత్తగా మాట్లాడేవాడిని కనుక నాలో దృఢమనస్కత లేదని చాలా మంది భావిస్తారు. శారీరకంగా దుర్బలుడినైనా మానసికంగా అంత బలహీనుడిని కాదనుకుంటా’ అని రైల్వే మంత్రిగా రాజీనామా సందర్భంగా లోక్‌సభలో వ్యాఖ్యానించారు.

నెహ్రూ, కృష్ణమీనన్‌ ‌లాంటి వారినే ప్రశ్నించిన ధీశాలి. చైనా దురాక్రమణ సమయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కృష్ణమీనన్‌ ‌మంత్రి పదవికి రాజీనామా చేయాలని (ఆయన నెహ్రూకు అంత్యంత సన్నిహితులని తెలిసినా) గట్టిగా కోరారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేవారు ఎంతటి సన్నిహితులైనా సహించేవారు కాదనేందుకు ఇవి ఉదాహరణలు.

పాక్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన మరుసటి సంవత్సరం శాస్త్రి, పాక్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ ‌తాష్కెంట్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఐరాస మధ్యవర్తిత్వంతో ఇద్దరు నేతలు 1966 జనవరి 10న ‘తాష్కెంట్‌ ఒప్పందం’పై సంతకాలు చేశారు. ఆ మరుసటి రోజే అక్కడే మృతిచెందారు. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే శాస్త్రి ఆకస్మిక మరణం పలు అనుమానాలకు ఆస్కారాన్నిచ్చింది. దేశం కోసం పుట్టి దేశం కోసం జీవించిన అరుదైన వ్యక్తులలో అగ్రగణ్యుడు లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి.

– వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

జాగృతి సౌజ‌న్యంతో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here