Home Telugu Articles ముక్తకంఠంతో పలుకుదాం.. ‘జైహింద్‌’

ముక్తకంఠంతో పలుకుదాం.. ‘జైహింద్‌’

0
SHARE

“జైహింద్‌”.. ఏటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ఎర్రకోట నుంచి ప్రతి ప్రధాని నోటి నుంచి వినిపించే నినాదమది. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అర్థరాత్రి ఇచ్చిన ఉపన్యాసం మొదలుకొని నరేంద్ర మోదీ వరకు ఎర్రకోట మీద ప్రసంగం తరువాత ఆ నినాదం వినిపిస్తూనే ఉన్నారు. అంటే గడచిన డెబ్బయ్‌ సంవత్సరాలుగా ఈ నినాదం ఎర్రకోట నుంచి జాతికి చేరుతోంది. నేటికీ దేశంలోని బాలబాలికలు జెండా వందనం చేసి ఏదో ఒక క్షణంలో ఆ నినాదం నోరారా పలుకుతున్నారు. కానీ అంతకు ముందే ఈ నినాదానికి ఘన చరిత్ర ఉంది. భారత దేశానికి స్వాతంత్య్రాన్ని ఖరారు చేసిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వీరోచిత పోరాటంలో ఈ నినాదం జనించింది. ‘మీరు నెత్తురు ఇస్తే, నేను స్వాతంత్య్రం అందిస్తాను’ అంటూ రోమాంచిత ప్రకటన చేసిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఈ నినాదానికి స్ఫూర్తి. జైహింద్‌… ఇది ఒక మహోన్నత త్యాగం నుంచి జన్మించిన నినాదం. భారతీయులని ఇప్పటికీ కదిలిస్తున్న నినాదం. ఇది భారత జాతీయ కాంగ్రెస్‌ ఇచ్చిన నినాదం కాదు. కానీ స్వతంత్ర భారతంలో ఈ నినాదం ఇవ్వని పార్టీ దాదాపు లేదు. పలకని నాయకుడు కూడా దాదాపు కనిపించడు. ఏ ఉపన్యాసం ముగింపులో అయినా వినిపించే మాట- జైహింద్‌.

స్వాతంత్ర కాంక్ష రగిలిన తరువాత భారత దేశంలో అనేక నినాదాలు వినిపించాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఆ నినాదాలు ప్రజలను స్పందింపచేయగలిగాయి. అలాంటివాటిలో కొన్నింటిని గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవలసిన విపత్కర పరిస్థితులు కూడా నేడు అలుముకొని ఉన్నాయి. వందేమాతరం నినాదం బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి జీవనాడిగా పనిచేసింది. బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతర గేయం ఆ ఉద్యమానికి మంత్రంలా పనిచేసింది.

ఆ ఉద్యమంతోనే భారతీయులకు చేరువైన మహానాయకుడు బాలగంగాధర తిలక్‌ ఇచ్చిన నినాదం ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు. అది సాధించి తీరుతాను’. స్వేచ్ఛ కోసం ప్రపంచ మానవాళి చేపట్టిన అన్ని ఉద్యమాలకు కూడా తలమానికమైన నినాదమది.

భారతీయతే ఆత్మగా స్వరాజ్య ఉద్యమం జరగాలని ఆశించిన మదన్‌మోహన్‌ మాలవీయ నినాదం ‘సత్యమేవ జయతే’.ప్రపంచ చరిత్రలోనే చెప్పుకోదగ్గ నినాదం ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’. భగత్‌సింగ్‌ ఇచ్చిన రణనినాదం అజరామరమైనది. ఆ తరువాత యావత్‌ భారత జాతిని కదిపిన నినాదం జైహింద్‌. ఈ నినాదం ఇచ్చిన వారు అబిద్‌ హసన్‌ సేఫ్రానీ.

భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ పేరుతో ఈ మధ్య జాతీయ నినాదాలకి మంగళం పాడే కుట్ర సాగుతోంది. ఇదంతా మతోన్మాదం ఇచ్చిన ప్రేరణతో, వేర్పాటువాదం ఇచ్చిన తోడ్పాటుతో బలపడుతోంది. అలాంటి సమయంలో ఎయిర్‌ ఇండియా సంస్థ తన ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని కూడా ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఆదేశాలు జారీ చేశారు. ఇది వెంటనే అమలులోకి వచ్చింది. యాదృచ్చికమే అయినా, పుల్వామా దాడి (ఫిబ్రవరి 14, 2019) దరిమిలా జరిగిన పరిణామాలలో పాకిస్తాన్‌ చేతికి చిక్కిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ తిరిగి దేశానికి వచ్చిన రెండో రోజునే ఈ మేరకు ఆదేశాలు వెలువడడం విశేషం. అంటే జైహింద్‌ నినాదం గగనతలంలో ప్రతిధ్వనిస్తున్నది.

కానీ జాతీయ స్ఫూర్తిని రగిలించే, జాతీయ స్పృహను రగిలించే ఏ మాటనైనా, ఏ చర్యనైనా ఈ దేశంలోనే కొందరు వెంటనే వ్యతిరేకిస్తారు. ఇప్పుడూ అదే జరిగింది. ఈ నినాదం ఇస్తే ఎయిర్‌ ఇండియా నష్టాల నుంచి గట్టెక్కుతుందా అంటూ ఒక వార్తా సంస్థ ప్రశ్న ఒకటి సంధించింది.

జైహింద్‌ నినాదానికి జన్మనిచ్చినది ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌. ఈ పదాన్ని ఎంపిక చేసిన వారు అబిద్‌ హసన్‌ సేఫ్రానీ. అబిద్‌ హైదరాబాద్‌ నగరానికి చెందినవారు. అసలు పేరు జైనుల్‌ అబిదీన్‌ హసన్‌. క్లుప్తంగా తన పేరును అబిద్‌ హుసేన్‌ అని మార్చు కున్నారాయన. పేరు పక్కన సేఫ్రానీ అన్న మాట చేరడం వెనుక కూడా ఒక ఉదంతం ఉంది.

ఎవరీ హసన్‌? ఆయన నిజాం సంస్థానం రాజధాని హైదరాబాద్‌లోనే పుట్టారు. తల్లి ఫక్రుల్‌ హజియా బేగం. తండ్రి ఆమీర్‌ హసన్‌. ఆమీర్‌ నిజాం సంస్థానంలో కలెక్టర్‌ ఉద్యోగంలో ఉండేవారు. నిజాం సంస్థానంలో కాంగ్రెస్‌ నాయకులకు, జాతీయోద్య మానికి ప్రవేశం లేదు. నిజానికి ముస్లింలీగ్‌ నాయకుడు మహమ్మదలీ జిన్నాను కూడా ఒక దశలో నిజాం అనుమతించలేదు. అలాంటి రాజ్యంలో బ్రిటిష్‌ జాతికి వ్యతిరేకంగా జరుగుతున్న భారత స్వాతంత్య్ర సమరంలో హజియా పాల్గొన్నారు. ఆమె ప్రభావమే అబిద్‌ హసన్‌ మీద విస్తృతంగా ఉందని అనిపిస్తుంది. ఆ ప్రభావంతోనే ఆయన శాసనో ల్లంఘన ఉద్యమం కోసం చదువును మధ్యలో ఆపేశారు. 1931లో సబర్మతి వెళ్లి కొద్దికాలం గాంధీజీ బోధనలు కూడా విని వచ్చారు. కానీ ఆయన జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమ పంథాలో ఇమడలేక పోయారు. మళ్లీ హైదరాబాద్‌ వచ్చి ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆనాడు యువతరమంతా ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌ వెళ్లేవారు. అబిద్‌ మిత్రబృందం కూడా అదే చేసింది. ప్రధానంగా బారెట్లా చేసి వచ్చేవారు. కానీ తల్లి సలహాతో తన అభిప్రాయం కూడా కలవడంతో అబిద్‌ ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలాగే వెళ్లి ఇంజనీరింగ్‌ కోర్సులో చేరారు.

1941లో అబిద్‌ జీవితం జర్మనీలో మలుపు తిరిగింది. కారణం భారత్‌ నుంచి రహస్యంగా బయటపడిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జర్మనీ వచ్చారు. యువతరం పాలిట ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న బోస్‌ను అంతే భక్తితో అబిద్‌ అక్కడ కలుసుకున్నారు. ఉద్యమంలో చేరమని చెప్పారు బోస్‌. ఇంజనీరింగ్‌ పూర్తయిన తరువాత వస్తానని అబిద్‌ చెప్పారు. ఇందుకు, ఇలాంటి చిన్న చిన్న విషయాలను అధిగమించలేకపోతే, ఇక సమున్నత లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదని బోస్‌ చెప్పారు. దీనితో చదువు ఆపేసి బోస్‌ ఉద్యమంలో చేరారు అబిద్‌.

బోస్‌ జర్మనీ, జపాన్‌ వంటి బ్రిటిష్‌ వ్యతిరేక దేశాల మీద నమ్మకం పెట్టుకోవడంలో ఒక వ్యూహం ఉంది. ఇంగ్లండ్‌ వలస దేశంగా భారత్‌ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. అందులో చాలామంది సైనికులను ఉత్తర ఆఫ్రికాలో జర్మనీ బందీలుగా తీసుకొచ్చింది. వీరంతా కోనీస్‌బ్రాక్‌ యుద్ధఖైదీల శిబిరంలో ఉండేవారు. ఆ శిబిరాన్నే బోస్‌ సందర్శించారు. భారతీయ సిపాయీలు వివిధ రెజిమెంట్లుగా ఉండేవారు. సిక్కు రెజిమెంట్‌, రాజపుత్‌ రెజిమెంట్‌ ఇలా వర్గాలను బట్టి, ప్రాంతాలను బట్టి రెజిమెంట్లు ఏర్పాటు చేసేవారు. ఆయా ప్రాంతాలను బట్టి, వారి మత, సామాజిక నేపథ్యాలను బట్టి వారి మధ్య పలకరింపులు ఉండేవి. అలాగే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారితోనే స్నేహంగా ఉంటూ ఉండేవారు. కొందరు రామ్‌రామ్‌ అనేవారు. కొందరు నమస్తే అనేవారు. అలాగే నమస్కారం అనేవారు. రామ్‌రామ్‌జీ అని కొందరంటే, జయమాదుర్తే అని కొందరు పలకరించుకునేవారు. సిక్కులు సత్‌శ్రీఅకాల్‌ అని పలకరించుకునేవారు. ముస్లింలు సలామాలేకుం అని పలకరించుకునేవారు. మొత్తానికి వీరి పలకరింపులో మాతృభూమికి సంబంధించిన స్పర్శ లేదు. అలాంటి నినాదం కావాలని బోస్‌ ఆకాంక్షించారు. ఆ పని తన సహచరులకు అప్పగించారు. అందులో అబిద్‌ హసన్‌ కూడా ఉన్నారు. మొదట ఆయన ‘హలో’ అనే పదంతో పలకరించుకుందాం అన్నారు. ఈ సూచన బోస్‌ను నిరుత్సాహ పరచడమే కాదు, ఆగ్రహం కూడా తెప్పించింది. దీనితో హసన్‌ కూడా ఆ యుద్ధఖైదీల శిబిరానికి వెళ్లి పరిశీలించారు. ఆ పలకరింపులలో జై రామ్‌రామ్‌కీ అన్న మాట ఆయనను ఆకర్షించింది. దీనినే ‘జై హిందుస్తానీ’కి అని మారిస్తే సబబుగా ఉంటుందని అనుకున్నారు. చివరికి అదే జైహింద్‌ అనే నినాదంగా అవతరించింది.

అబిద్‌ హసన్‌ పేరు పక్కన ‘సేఫ్రానీ’ అన్న పదం ఎలా చేరింది?

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరిన భారతీయ యుద్ధఖైదీల నుంచి నాయకత్వానికి చాలా సమస్యలు ఎదురయ్యాయి. అందులో మొదటిది అందరికీ ఒకే భోజనశాల, వంటశాలను అంగీకరించకపోవడం. అలాగే దేశానికి ఒక పతాకం రూపొందించాలని అనుకున్నప్పుడు కూడా సమస్య వచ్చింది. హిందు వులు సహజంగానే కాషాయ ధ్వజం ఉండాలని కోరారు. ముస్లింలు ఆకుపచ్చ జెండా ఉండాలని అన్నారు. కానీ హిందువులు జెండా కాషాయమే ఉండాలన్న తమ కోరికను ఉపసంహరించుకున్నారు. దీనితో అబిద్‌ మనసు ఉప్పొంగిపోయింది. కాషాయం రంగును సూచిస్తూ తన పేరు పక్కన సేఫ్రానీ అన్నమాటను చేర్చుకున్నారు.

అబిద్‌ హసన్‌ బోస్‌ మరణించిన తరువాత హైదరాబాద్‌ వచ్చారు. ఎర్రకోటలో జరిగిన విచారణలో కొద్దికాలమే శిక్ష పడింది. అనంతరం స్వస్థలానికి వచ్చారు. అప్పటికి హైదరాబాద్‌ సంస్థానంలో పరిస్థితులలో మార్పేమీ లేదు. నిజాం నియంతృత్వమే కొనసాగుతోంది. కొద్దికాలం స్టేట్‌ కాంగ్రెస్‌లో పనిచేశారు. కానీ అందులో ఇమడలేక పోయారాయన. దీనితో బెంగాల్‌ ల్యాంప్స్‌ సంస్థలో చేరి, కరాచీ వెళ్లిపోయారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత మళ్లీ హైదరాబాద్‌ వచ్చేశారు. అప్పటికి నిజాంలో సామాజిక, మత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

నెహ్రూ పిలుపు మేరకు ఆయన విదేశ వ్యవహారాల విభాగంలో చేరారు. 1969 ప్రాంతంలో పదవీ విరమణ చేసి 1984లో హైదరాబాద్‌లోనే కన్నుమూశారు. అబిద్‌ పర్షియన్‌, ఉర్దూ కవిత్వంలో అభినివేశం ఉన్నవారు. జనగణమన గీతాన్ని ఉర్దూలోకి అనువదించారు.

ఈ చరిత్ర మొత్తం పరిశీలిస్తే వర్తమానంలో జీవిస్తున్న వారికి ఒక వాస్తవం బోధపడాలి. జైహింద్‌ నినాదం ఒక ముస్లిం రూపొందించాడు. ఇది నాటి జాతీయ స్ఫూర్తి. ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతివారు భారతదేశాన్ని మాతృభూమిగా గౌరవించడానికి సందేహించలేదు. ఆ పని ఇప్పుడు జరుగుతోంది. ఇక్కడ నుంచి సౌదీ అరేబియా, ఇతర అరబ్‌ దేశాలకు వెళ్లిన వారిని హిందుస్తానీలుగానే పిలుస్తారు. అంటే వీరు హిందువులు అని కాదు. హిందూదేశంలో పుట్టినవారనే అర్థం. ఇక్కడ హిందూ అన్న పదం మతానికి కాదు, ఒక భౌగోళిక ఖండాన్ని సూచిస్తోంది. ఆ ఖండాన్ని గౌరవించడానికి వచ్చిన అభ్యంతరం ఏమిటి? దీని గురించి ఆంతా ఆలోచించవలసిందే. టుకడా టుకడా గ్యాంగుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే. వారు భారతీయులుగా ఉన్న విధ్వంసకారులు. దారి తప్పిన హిందువులు, దారి తప్పిన సిక్కులు, దారి తప్పిన ముస్లింలు, ఇతర వర్గాలు ఇకపైన అయినా ఈ దేశాన్ని తమ మాతృ దేశం అన్న భావనతో ఉండాలి. ఎయిర్‌ ఇండియా ‘జైహింద్‌’ నిర్ణయం అలాంటిదే. దీనిని అంతా స్వాగతించాలి. మిగిలిన రంగాలలో కూడా గతంలో మాదిరిగా ఈ నినాదం మారుమోగాలి. భారతీయుల మధ్య ఈ నినాదం ఒక అదృశ్య బంధం. అది మరచిపోరాదు.

ఆ కలే నిజమై ఉంటే…

అజాద్‌ హింద్‌ ఫౌజ్‌… భారత విముక్తి సైన్యం… చాలామంది చరిత్రకారులు, ఆఖరికి క్లెమెంట్‌ అట్లీ వంటి బ్రిటిష్‌ రాజకీయవేత్తల అభిప్రాయం భారత్‌ నుంచి బ్రిటిష్‌ వైదొలగాలన్న నిర్ణయాన్ని వేగవంతం చేసిన అత్యవసర కారణాలలో ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ సృష్టించిన భయం ఒకటి. ఫౌజ్‌ పుట్టుకకు కారణం రెండో ప్రపంచ యుద్ధం.

రెండో ప్రపంచ యుద్ధంలో కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ నాయకత్వంలో 70,000 భారత సైన్యం మలయాలో మోహరించింది. భారత్‌ బ్రిటన్‌ వలస దేశం. ఆ హోదాలోనే మన సైనికులు వెళ్లారని మరచిపోరాదు. ఇందులో 45,000 మందిని 1941లో జపాన్‌ సేన బందీలుగా పట్టుకుంది. జపాన్‌, జర్మనీ, ఇటలీ ఆ యుద్ధంలో ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా పోరాడాయి. కెప్టెన్‌ సింగ్‌, జపాన్‌ జనరల్స్‌ మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చలలో వచ్చిన ఆలోచనే అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఏర్పాటు. ఈ ఫౌజ్‌తోనే భారతదేశంలో తిష్ట వేసి ఉన్న బ్రిటిష్‌ సామ్రాజ్యం మీద దండెత్తడం వారి ఉద్దేశం. తరువాత ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ (ఐఐఎల్‌) 1942లో ఏర్పాటు చేసిన ఒక గోష్టిలో ఆ సంస్థ నాయకుడు రాస్‌ బిహారీ బోస్‌తో కెప్టెన్‌ సింగ్‌కు పరిచయమైంది. తరువాత ఐఐఎల్‌ ఆధ్వర్యంలో ఫౌజ్‌ పనిచేయాలన్న నిర్ణయం జరిగింది. ఇంతలో ఆగ్నేయాసియాలో యుద్ధం విషయంలో కెప్టెన్‌ సింగ్‌కు, జపాన్‌ సైనికాధికారులకు మధ్య విభేదాలు వచ్చాయి. కెప్టెన్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. ఫౌజ్‌ మీద పూర్తి అధికారం రాస్‌బిహారీకి అప్పగించారు.

భారత్‌ నుంచి తప్పించుకు వచ్చిన సుభాశ్‌చంద్ర బోస్‌కు ఈ రెండు సంస్థలను అప్పగించాలన్న ఆలోచన వచ్చింది. అప్పటికి ఆయన గొప్ప ప్రజాకర్షణ కలిగిన స్వరాజ్య సమర సేనానిగా పేర్గాంచారు. సింగపూర్‌లో జూలై 4, 1943న కేథే భవనంలో ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో ఆయనను లీగ్‌, ఫౌజ్‌లకు నాయకునిగా ప్రకటించారు. బోస్‌ సామర్థ్యాన్ని బట్టి చాలామంది స్థానికులు కూడా లీగ్‌లో చేరారు. కార్ల్‌ వాండ్‌వెల్లె బెర్లె, పీటర్‌ ఫే అనే చరిత్రకారుల అంచనా ప్రకారం, హు టోయో అనే నాటి బ్రిటిష్‌ నిఘా వ్యవస్థ అధికారి చెప్పిన దానిని బట్టి లీగ్‌ బలం ఆనాడు 3.5 లక్షలు. బారిస్టర్లు, వ్యాపారులు, తోటల కార్మికులు, స్వర్ణకారులు కూడా వచ్చి చేరారు. అలాగే ఆగ్నేయాసియాలో ఉన్న భారతీయులు లక్ష వరకు ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరారు. ఫౌజ్‌ బర్మా, ఇంపాల్‌, కోహిమాలలో బ్రిటిష్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడింది.

బోస్‌ హఠాన్మరణంతో ఈ వీరోచిత యుద్ధం అర్థంతరంగా నిలిచిపోయింది. భారతదేశ చరిత్రలో కనిపించే అనేక విషాదాలలో ఇదొకటి.

Source: Jagriti Weekly

First Published On 23.01.2020