Home Telugu Articles మకర సంక్రమణం..

మకర సంక్రమణం..

0
SHARE

జనవరి 15 మకర సంక్రాంతి

మకర సంక్రమణాన్ని మనం చాలా ప్రాముఖ్యం గల ఉత్సవంగా భావిస్తాం. ఆ రోజు నుంచే వెలుగు, అంటే జ్ఞానంలోని వెచ్చదనంలో క్రమంగా మార్పు వస్తుంది. అంధకారం నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానంవైపు, నిర్జీవనం నుంచి జీవనంవైపు సృష్టి మరలడం మొదలవుతుంది. కారణంగానే జ్ఞాన స్వరూపమైన వెలుగును ఉపాసించే భారతీయుల జీవన విధానంలో ఈ రోజుకు ప్రాముఖ్యం వచ్చింది. మన సంఘ కార్యం కూడా ఆత్మవిస్తృతి అనే అంధకారాన్ని తొలగించి ఆత్మజాగరణ కలిగించడానికి ఉద్దేశించినది. వాడిపోయిన దేశ గౌరవం సంఘ కార్యం వల్లనే మళ్లీ చిగిర్చింది. జాతీయ జీవనం గురించిన ఎన్నో అపోహలు పటాపంచ లయ్యాయి. దౌర్భల్య ఫలితమైన  ఆత్మన్యూనతకు బదులుగా దేశానికి సామర్థ్యానుభూతి కలగసాగింది. సంఘ కార్యం భ్రమలను తొలగించి జ్ఞానాన్ని కలిగించి వాస్తవమైన రాష్ట్ర స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. చైతన్య హీనస్థితిలో తిరిగి చైతన్య ప్రసారాన్ని పునరుద్దీప్తం చేస్తుంది. దేశీయమైన జీవనగంగను యోగ్యదిశలో ప్రవహింపజేసేందుకే మహత్కార్యం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ రూపంలో ఆవిష్కృతమైంది.

సంక్రమణం ఏటా సహజంగానే సకాలంలో వస్తుంది. కానీ మానవ జీవితంలో అలా రాదు. మానవజీవితంలో సంక్రమణం వస్తే భవిష్యత్తు పట్ల సముచిత దృక్పథాన్ని ఏర్పరచుకోవడం తేలికవుతుంది. భారతజాతి జీవితంలో ఈనాడు జరిగిన సంక్రమణం మహత్వభరితమైనది, సౌభాగ్యవంతమైనది. మన హృదయభారం దిగిపోయింది. పరాయి పెత్తనం అనే విషం కొంచెంగానైనా తొలగిపోయింది. దేశమాత శరీరం విషవిముక్తమై సుఖసంపదలతో కూడిన భావి సామాజిక జీవితంవైపు దృష్టి సారిస్తోంది.

సంక్రమణ కాలపు అనుభవాలు పరిపరి విధాలుగా ఉన్నాయి. అంతా సుఖమయమై ఉండా లనుకోవడం పొరపాటు. జాతీయ జీవనంలో అనేక సమస్యలు, సంకట పరిస్థితులు ఎదురౌతున్నాయి. బహుశా కొంతకాలం వరకూ అన్ని దిశలలోనూ అంధకారమే ఆవరించుకొని ఉండవచ్చు. ప్రగతి కనిపించకపోవచ్చు. మంచికి మారుగా చెడే జరుగుతున్నట్లు తోచవచ్చు. ఒక సంకటం తప్పిపోతే మరొక సంకటం సిద్ధమౌతూ ఉండవచ్చు. దూరదృష్టి లేనివారు, దూరాన్ని చూడడం ఇష్టంలేనివారు ఇక చేయవలసిందేమీ లేదని, అంతా అయిపోయిందని భావిస్తున్నారు.

కానీ ఇది ధైర్యం, దూరాలోచనగల వారు తమ బుద్ధిని ఉపయోగించవలసిన సమయం. మానవ జీవితంలో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతాయి. వాటిలో కీర్తి ` అపకీర్తి, సుఖం ` దుఃఖం, గెలుపు ` ఓటమి ఎదురవుతూనే ఉంటాయి. తాత్కాలిక పరిస్థితులకు క్షోభ పడడం, స్వబంధుజనులకు కష్టం కలిగించడం తగని పనులు. ప్రయోగాలకు కొంత సమయం ఇవ్వవలసింది. ఒప్పు జరిగినా తప్పే జరిగినా మనసు పాడుచేసుకోకుండా, సమస్యల మూలాలను శోధిస్తూ, పరస్పర వైమనస్యాలకు చోటివ్వకుండా, శాంత చిత్తంతో వ్యవహరించాలి.

నిశ్చలంగా ఉండాలి

అంతరంగ ప్రవృత్తిని సరైన స్థితిలో ఉంచు కోవడం సంఘానికి సులభమే. ఎందుకంటే సంఘం మొదటి నుంచీ అదే దృష్టి కలిగి ఉంది. ఒక విశిష్ట ధ్యేయాన్ని ముందుంచుకొని సాగుతున్నందువల్ల ప్రతి స్వయంసేవకుడు శాంత సంయమనాలతో తన కార్యంపైన దృష్టిపెట్టి నడుచుకోవాలి. మనం నియమబద్ధ జీవితాన్ని స్వీకరించాం. బాధ్యత గల వ్యక్తులుగా మన ఆచార వ్యవహారాలను మల చుకుంటాం. అన్య దిశలలోకి దృష్టి మరల్చే అవకాశం మనకు లేనే లేదు. క్షోభ కలిగించే విషయాలన్నిటినీ దిగమింగి ముందుకు సాగిపోవాలి. మన హృదయమనే అమృత భాండంలో క్రోధమనే విషాన్ని కలవనివ్వకూడదు. అందరూ మనవారే, మన సమాజానికి చెందినవారే. వారి సిద్ధాంతాలు ఎటువంటివైనా కావచ్చు; వాళ్లు కూడా కొన్ని మంచి పనులు చేసి ఉన్నారు; త్యాగాలు చేసి ఉన్నారు. కనుక వారిపట్ల స్నేహాన్ని, ఔదార్యాన్ని, బంధుభావనను చూపడం అవసరం. ఈ సంక్షుభిత వాతావరణంలో మనం సంయమనంతో వ్యవహరించాలి. మనసు తోనో, వాక్కుతోనో, శరీరంతోనో ఏదో తప్పు చేయనివారు లోకంలో ఎవరుంటారు? మనసులో చెడు సంకల్పించినా అది పాపమే. భగవద్గీత ఇలా చెబుతోంది.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసాస్మరన్‌
ఇంద్రియార్థాన్‌ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే
                                              – (భగవద్గీత 3-6)

(కర్మేంద్రియాలను అదుపుచేసి, మనసులో మాత్రం ఆ విషయ సుఖాలనే స్మరించుకుంటూ ఉండే మూఢుడు, మిథ్యావాది అనిపించుకుంటాడు) ఏసుక్రీస్తు ‘ఒక స్త్రీని కామదృష్టితో చూసిన ప్రతివాడూ మనసు చేత పాపం చేసినట్లే’ అన్నాడు.

స్వయంసేవకులు తమ హృదయాలను అమృత మయంగా ఉంచుకొని, ప్రజలందరినీ తమ వారిగానే భావించుకొంటూ, లోకంలోని సంక్షోభ పరిస్థితులను చూస్తూ కూడా తమ ఆలోచనలను స్థిరంగా ఉంచుకుంటూ పవిత్ర జీవితాలను సాగించడానికి సంకల్పించాలి. ప్రపంచానికి ఒక దిశను చూపించడం కోసం కూడా ఈ సంకల్పాన్ని వదులుకోకుండా భారత ప్రజల జీవితాలను తిరిగి శక్తివైభవ సమన్వితంగా చేసే ధ్యేయాన్ని సాధించడానికి నిశ్చితమైన, ప్రణాళికాబద్ధమైన మార్గంలో ముందుకు సాగుతూనే ఉండాలి. ప్రతి స్వయంసేవకుడు తన దృష్టి,లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా జాగ్రత్త వహించాలి.

మన చుట్టూ ఉన్న అవ్యవస్థను, దురవస్థనూ చూస్తే ఆగ్రహం వచ్చి విద్వేషభావానికి లోనయ్యే అవకాశం ఉంది. ద్వేషానికి లొంగిపోవడంవల్ల ఏ పనీ జరగదు. మనసులో క్షమాగుణం ఉండాలి. మనవారి పట్ల ఆత్మీయత ఏ మాత్రం తగ్గకూడదు.

సంఘటనా శాస్త్రపు ఆదర్శం

మహాభారత కథలోని ధర్మరాజు సంఘటనా కార్యాన్ని చేపట్టిన కార్యకర్తలకు ఆదర్శమని సంఘ స్థాపకులు డాక్టర్‌జీ చెప్పారు. గర్వం, ద్వేషం, క్రోధం, విరోధభావం మొదలైన విపరీత భావనలను ధర్మరాజు తన హృదయంలో లేశమైనా చోటియ్యలేదు. తాను అనేక కష్టాలు అనుభవించడానికి, అడవుల పాలు కావడానికి కారణమైన దుర్యోధనుని పట్ల కూడా ఆయన ఎప్పుడూ క్రోధం వహించలేదు. వల్కలాలు ధరించి అరణ్యంలో నివసిస్తున్న పంచపాండవుల ముందు తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించడానికై దుర్యోధనుడు తన నూర్గురు సోదరులతోను కలిసి అట్టహాసంగా వచ్చాడు. అక్కడ అతడి విశృంఖల ప్రవర్తన వల్ల గంధర్వులతో కలహం వచ్చింది. ఆ గంధర్వులు అతడిని ఓడిరచి బంధించారు. ఇది విన్న ధర్మరాజు సోదరులు నలుగురూ మహా నందపడి, ‘‘కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారు. మన మార్గం నిష్కంటకమైంది’’ అన్నారు. కానీ యుధిష్ఠిరుడు మాత్రం ‘‘పరస్పరం పోట్లాడుకునేటప్పుడు మనం అయిదుగురం, వాళ్లు నూరుగురు ` పరాయివారితో జగడం వచ్చినపుడు మనం నూట అయిదుగురం` వయం పంచాధికం శతం’’ అన్నాడు. కౌరవులను బంధ విముక్తులను చేయించాడు. సంఘటనా శాస్త్రంలో ఆవశ్యకత లక్షణాలుగా చెప్పే మధురమైన వాక్కుకు, హృదయానికి ధర్మరాజే మన ఆదర్శం.

మకర సంక్రమణం

ఇప్పటి నికృష్ట పరిస్థితులలో మనం అటు, ఇటు చూడవలసిన పనిలేదు. భారతవర్షంలో విచ్ఛిన్న భావనలన్నిటినీ నిర్మూలించి అఖండమైన, సుసంఘటితమైన మహనీయ దేశంగా దీనిని పునర్నిర్మాణం చేసేందుకు ప్రతి స్వయంసేవకుడు తన సమస్త శక్తితో సంసిద్ధుడై ఉండాలని ఈ మకర సంక్రమణం ఆదేశిస్తోంది. ఎవరు ఏమన్నా, ఏమి చేసినా ఆగ్రహించకుండా, పాతకాలపు భేదభావాలను ‘వయం పంచాధిక శతం’ అన్న వైఖరితో పెకలించివేసి ఏకసూత్ర బద్ధమైన దేశాన్ని నిర్మాణం చేసేందుకు శక్తినంతా వినియోగిద్దాం.

గంగా ప్రవాహాన్ని భూమిపైకి తీసుకురావాలంటే భగీరథునితో సమానమైన తపస్సు, కృషి, మనఃప్రేరణ, ధ్యేయనిష్ఠ ఉండాలి. అటువంటి ఒక భగీరథుడు మనకు లభించారు. భారతమాతా సాక్షాత్కారమనే ప్రేరణను ఆయన మన ముందుంచారు. భారతీయాత్మను గుర్తించి మేల్కొలిపే మంత్రాన్ని మనకు ఉపదేశించారు. ఆ మంత్రానికి మనం యోగ్యులం కావాలంటే దానిని మన జీవితాలలో ఆచరణలోకి తెచ్చుకోవాలి. తన జీవితాన్ని అవగాహనా పూర్వకంగా పరివర్తన చేసుకుంటానని, వ్యక్తిగతమైన పెద్దరికాన్ని, సుఖాన్ని ఆశించనని, కుటుంబ పరమైన వ్యామోహాలలో చిక్కుకోనని, నా జీవితం నశించిపోయినా సరే, ఏకతా శక్తిభరితమైన సామాజిక జీవితాన్ని నెలకొల్పి, భారతదేశానికి అమరవైభవాన్ని సాధిస్తానని ప్రతి స్వయంసేవకుడూ సంకల్పించుకోవాలి.

సాధారణంగా ప్రతి వ్యక్తి, ప్రతి సమాజం తమకు ఔన్నత్యం కలగాలనే కోరుకుంటారు. తమ జీవితంలో ఔన్నత్యం దిశగా సంక్రమణం రావాలని ఆశిస్తారు. మనం వ్యక్తి దృష్టితో కాక సమాజ దృష్టితో దీనిని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తి ఎప్పుడూ విడిగా ఉండడు. వ్యక్తి స్వాతంత్య్రం గురించి మనకు ఎన్ని భ్రమలు ఉన్నా, వ్యక్తి సమాజంలో ఉంటాడు కనుక అతడి స్వాతంత్య్రానికి నియమాలు ఉంటాయి. ఆ నియమాలను అర్థం చేసుకొని వ్యవహరించడమే అతడి స్వాతంత్య్రానికి హద్దు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. విశృంఖలంగా ప్రవర్తిం చడం, దౌర్జన్యపూరితమైన రీతిలో జీవించడం, మనసుకు ఏ ఊపువస్తే, ఆ ఊపును అనుసరించి పరుగుతీయడం` ఇవే వ్యక్తి స్వాతంత్య్రపు లక్షణాలని భావించడం పొరపాటు. ఒక మనిషికి ఆత్మ సంయమనం ఎంత ఉంది; మనసును నియంత్రించు కొని దానికి, బుద్ధికి అనుగుణంగా దిశానిర్దేశనం చేసే సామర్థ్యత ఎంత ఉంది ` అనేదే వ్యక్తి స్వాతంత్య్రానికి గీటురాయి.

ఒక వ్యక్తి తన ఇష్టాలను, కోరికలను తీర్చుకోవ డానికి సమాజం అవసరమౌతుంది. ఆ సమాజం పట్ల అతడికి కర్తవ్యం కూడా అందువల్లనే ఉంటుంది. ఆ కర్తవ్యం విస్మరించదగనిది. సమాజం కారణంగానే వ్యక్తికి తన భద్రత గురించి, ఉన్నతి గురించి విశ్వాసం ఏర్పడుతుంది. ఈ విధంగా వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి పరస్పరాధారితమైన సంబంధం ఉంటుంది. కనుక ఈ సంక్రమణం విషయంలో వ్యక్తినిగాక సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయడం ఉచితం, ఉపయోగకరం.

ఏకాత్మ జీవన సాక్షాత్కారం

మన సమాజ జీవితాన్ని ఈ దృష్టితో చూస్తే అన్ని రకాల భావసారూప్యత కనిపిస్తుంది. లేకపోతే అందులో ఏకాత్మత, స్నేహబద్ధత మొదలైనవేవీ ఉన్నట్లు కనిపించదు. ఈ కన్పించకపోవడంవల్లనే సమాజ ఏకత గురించిన అవగాహన విస్మృతి పాలైపోయింది. తత్పరిణామంగా పరస్పర స్నేహానికి బదులుగా స్వార్థం, స్పర్థ, ఈర్ష్య, ద్వేషం రాజ్యం చేస్తున్నాయి. స్నేహభావమేలేని చోట సమన్వయం, అనుశాసనం ఎలా ఉంటాయి?

ఉన్నత సంస్కారాలు, ఒకే ధర్మం, ఒకే సంస్కృతి, ఆలోచనలలో ఆకాంక్షలతో సమానత్వం ఆధారంగా ఈ దేశపు జాతీయ జీవనం నిర్మాణమైంది. మకర సంక్రమణం వంటి పర్వదినాలు మన ఈ ప్రాచీన సంస్కారాలను, భావనలను సుదృఢం చేస్తాయి. అందువల్ల సంఘం ఈ ఉత్సవాన్ని చాలా ప్రాముఖ్యం కలదిగా, చరితార్థమైనదిగా భావిస్తుంది.

శ్రీ గురూజీ సమగ్ర గ్రంథావళి `దిశానిర్దేశనము’ నుంచి

జాగృతి సౌజ‌న్యంతో… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here