Home Interviews పురాణ ప్రవచన‌మే ఆ పుణ్యమూర్తి జీవితం

పురాణ ప్రవచన‌మే ఆ పుణ్యమూర్తి జీవితం

0
SHARE

పురాణ ప్రవచనం పురాతన కాలం నుండి వస్తున్న ఒక వృత్తి. పురాణ ప్రవచనానికి ఎంతో పాండిత్యం, ధార్మిక నిష్ట ఉండాలి. ఆ వృత్తిలో కూడా అనేక సమస్యలు, సంకటాలు ఉంటాయి. అటువంటి పురాణ ప్రవచనాన్ని జీవితాంతం కొనసాగించారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి. వారికి ఆ నిష్ట, పాండిత్యం తమ పూర్వజుల నుండి వచ్చాయి. తన పురాణ ప్రవచన అనుభవాలను వారు పాఠకులతో పంచుకున్నారు.

కంచి శ్రీమహాస్వామి శతాబ్ది ప్రచురణలవారు నిర్వహించిన కంచిమహాస్వామి 107వ జయంత్యుత్సవ సభలకు వచ్చిన శ్రీశాస్త్రి గారు `శతాబ్ది’ ప్రచురణ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ….

వేద శాస్త్రములు చదువుకొనిన తమరు పురాణ ప్రవచనం ఎందుకు ఎన్నుకొన్నారు?

దానికేమి! మా రోజుల్లో పురాణాలు మహాపండితులే చెప్పేవారు. వేదశాస్త్రములు, అష్టాదశ పురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసములు సమగ్రంగా చదువుకున్న వారు మాత్రమే పురాణం చెప్పగలరు. శాస్త్రములు ప్రయోజనం వేదముల అర్థాన్ని నిరూపించడమైతే, వేదాన్ని సరళీకరించడం(ఉపబృంహణం చేయడం) పురాణాల లక్ష్యం. వేదశాస్త్రాలను అవగతం చేసుకోలేని వారు పురాణాన్ని సజావుగా వ్యాఖ్యానం చేయలేరు. మరి జన బాహుళ్యాన్ని ధర్మోన్ముఖులను చేయడానికి పురాణ ప్రవచనమే సరైన సాధనము. మా తాతగారు మహా ప్రతిభాశాలి. ధర్మాన్ని తాము స్వయంగా ఆచరించి చూపుతూ ఒక ఉద్యమంగా బహుళ ప్రచారం చేశారు. వారి మనమడునైనందున నావంతు కర్తవ్యం నేను చేస్తున్నాను.

ప్రవచన వృత్తిలో తమ అనుభవా లేలాంటివి?

ఎవరైనా పిలిచారా సరి!! లేదా జేబులో ఒక వంద రూపాయలు పెట్టుకొని ఏదో ఒక పట్టణం వెళ్ళేవాడిని. ఊరి పెద్దలతో పురాణానికి వేదిక ఏర్పాటు చేయమని. పాంప్లెట్లు వేయించమని ప్రచారం చేయించేవాడిని. ఇక ఆదాయం ఎంత వస్తుందనే ఆలోచన లేదు. వారమో, రెండు వారాలో జేబులో డబ్బులున్నంతవరకు పురాణ ప్రవచనం. ఈలోపల ఊరివారికి ఉత్సాహం కలిగి బృహత్తరమైన ఏర్పాట్లు చేసేవారా సరి. లేదూ! నష్టమేముంది. ఆ వందా కూడా నేను ముందు ప్రవచనంలో సంపాదించిందేగా?

ఒకసారి గుంటూరులో ఈవిధంగానే భారతం చెబుదామనుకొన్నాను. అక్కడొక సంస్థ వారిని కేవలం వేదిక ఏర్పాటుకు, పాంప్లెట్లు వేసి ప్రచారం చేయడానికి కోరాను. “ప్రవచనం మొదలుపెడతాను. శ్రోతలు ఇచ్చినంత నే పుచ్చుకొన్నంత. మిమ్మల్ని ఎఱ్ఱని ఏగాని అడగను” అని చెప్పాను. వారిలో వారు తర్జన భర్జనలు చేసుకొని, వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే డబ్బు నేను పట్టుకొని పోతాను భయంతో ఒప్పుకోలేదు. ఈ రెండ్రోజులు నేను బెజవాడ నుండి వచ్చేవాడిని.

‘సంధానకర్త భేతంభట్ల శ్రీహరి అవధానులుగారు. వారి అన్నయ్య నరసింహంగారు. ఆ ఊరిలో లౌకిక వృత్తిలో ఉన్నాడు. ఆయన ఉండే ఇంటికి పెద్ద దొడ్డి ఉంది. ఆ ఇల్లు ఆ సంస్థ ఉన్న స్థలం కంటే మంచి సెంటరులో ఉంది. వాళ్ల తమ్ముణ్ణి అడిగాడు. “”ఏరా ఈ శాస్త్రిగారికి నిజంగా ప్రవచనం అవ్వడానికి స్థలమూ, ప్రచారము చాలా” అని, “అదే అయితే మన దొడ్లోనే ఏర్పాటు చేయవచ్చని కూడా అన్నాడు.

అలా వారి దొడ్లో మొదలు పెట్టిన భారతం మూడు సంవత్సరాలు సాగింది. రోజూ పదివేలమంది జనం కనకవర్షం కురిసింది. మొండి చేత చెయ్యి చూపిన సంస్థవారు ఈ సభను భంగపరచడానికి ప్రయత్నించారు. ప్రయత్నించిన కొద్దీ జనం పెరిగిపోయారు. భారతం- చెప్పేటప్పుడు అందులో ముఖ్యంగా అరణ్యపర్వం చెప్పేటప్పుడు శాంతి అవసరం. ప్రసాద వితరణ బాగా జరగాలి. ఆరణ్య పర్వం జరిగే ప్రతిరోజూ అవంతంగా ప్రసాద వితరణ జరిగింది. చివరికి శాంతి రోజున 18 బస్తాలు పండింది అన్నదానం జరిపించారు.

భగవంతునిపై నమ్మకం ఉండాలి. ప్రవచనం విన్నవాళ్ళు చెప్పించుకొన్నవాళ్లు ఐహికాముష్కికములు పొందుతుంటే ప్రవచనం చేసే నాడు ఆ ఫలితం రాదా? మనకు రావలసింది ఎవరూ ఆపలేరు. అంతకుమించి పైన ఎక్కువ ఎవరూ ఇప్పించలేరు.

బందరులో నాకు తెలిసి దేవాదాయ శాఖ ఉద్యోగి ఒకాయన ఆ ఊరి దేవాలయపు ట్రస్టీలతో చెప్పి ప్రవచనం ఏర్పాట్లు చేయించారు. శాస్త్రిగారికి రోజుకు 116/- రూ’ లు తక్కువ ఇస్తే బాగుండదని చెప్పాడు. ప్రవచనానికి వేల సంఖ్యలో జనాభా రావడం మొదలుపెట్టారు. ట్రస్టీలు ఇంతమందీ మనిషికి రెండ్రూపాయలు చొప్పున ఇచ్చినా ఎంతో అయిపోతుందనిపించింది. ఉండబట్టలేక సభలోనే చెప్పేశాడు. శాస్త్రిగారికి ఏదో కొంత ఇచ్చి మిగతా డబ్బుతో రెండు గుళ్లోకీ కళ్యాణ మంటపాలు కట్టిస్తానని. నేను నిర్లిప్తతగా ఊరుకొన్నాను. దత్తానుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆశ్చర్యం! నే బస చేసే సత్రం దగ్గర జనం బారులు కట్టి వారివ్వ దలచుకొంది నాకే నేరుగా ఈయనారంభించారు. ట్రస్టీ, వసూలయిన మొత్తం శాస్త్రి గారికే ఇస్తానని మళ్లీ ప్రకటించవలసి వచ్చింది.

ఇంకో ఊర్లో అక్కసు పట్టలేని వారు ప్రయోగం చేయించారు. రాయభారఘట్టం చెబుతూ విరుచుకుపడిపోయాను. మా నాయన గారు, మహాతపస్వి, పెద్ద కొడుకును బ్రతికించుకోవాలని పట్టుబట్టి .ఉగ్రతపస్సు చేసి బ్రతికించుకొన్నారు. ఏదో ప్రజల మన్నన అభిమానం, ఉత్సుకత, జిజ్ఞాస వీటితో పాటు ఈర్ష్య, అసూయ ఒక పక్క ఉంటూ ఉంటాయి.

58 ఏళ్లుగా అనేకసార్లు భారతం, రామాయణం, భాగవతం. ఆసాంతం చెప్పాను. క్యాసెట్లు ఇచ్చాను. పుస్తకాలు వ్రాసాను. ప్రజల ఆదరణ, అభిమానం అవార్డులుగా జీవించాను. ఏ రోజూ ఏమిటనే భయం నాకు లేదు. పురాణ ప్రచారమే ఉద్యమంగా బ్రతికాను. దెబ్బయి అయిదేళ్ళ వయస్సులో వెనుదిరిగి చూస్తే సంతృప్తిగా ఉంది. భగవంతుడు నాకు రావలసినదంతా, అదేం! కావలసినదంతా ప్రసాదించాడు. ఏదో నాకు తెలిసిన మంచిమాటలను నలుగురితో పంచుకున్నాననే, పంచుకుంటున్నాననే అమందానందం మిగిలింది.

తమ ప్రవచనాలు ఇంత రక్తి కట్టడానికి కారణం ఏమిటి?

భగవదనుగ్రహం. ఇంతకీ నేను పురాణ ప్రవచనం రక్తికట్టాలని చెప్పలేదు. నా ఎదురుగా కూర్చున్న వారికి అర్ధమవ్వాలని, నే చెప్పేది. వారి హృదయాలకు హత్తుకోవాలని చెప్పాను. మా తాతగారు పురాణ ప్రవచనంలో అంతరార్ధ ప్రసంగము అనౌచిత్యము జోరనీయరాదని ఆదేశించారు. అది నేను పాటించాను. వెళ్లిన ఊళ్లల్లో నా ప్రసంగముల మీద అనేక ప్రశ్నలు వేసేవారు. ఇంకా పురాణాల మీద అనేకమంది వ్రాసిన వ్యాఖ్యానాలు రచనలు చదివాను. వాటిని గురించి పురాణములయందు, శాస్త్రములయందు ప్రమాణబుద్ధితో సమాధానాలు వెతికాను. నాకు తోచిన సమాధానం ప్రవచనంలో చెప్పేవాడిని దానిమీద మళ్లీ విమర్శలు వచ్చి, వాదం స్థిరబడేంతవరకూ వ్రాత రూపంలో పెట్టలేదు. తరువాత ఉపన్యాసాలలో శ్రోతలు. ప్రశ్నించకుండానే ఆ విమర్శలకు సమాధానం చెప్పేవాడిని.

సామాన్యంగా సంస్కృతం చదువుకొన్న వారు తెలుగును చులకనగా చూస్తారు. మీ ప్రవచనాల్లో అనేక తెలుగు పద్యాలు ఉటంకిస్తారు. తెలుగుపై ఈ ప్రత్యేక అభిరుచికి కారణం ఏమిటి??

నేను తెలుగువాడిని అవడం, తెలుగు సుందరమైన భాష పోతనాది మహాకవుల పురాణాలు తెలిగించేటప్పుడు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, పలుకుబడులు, అలవాట్లు గుచ్చెత్తిపోశారు. అనన్యమైన భక్తిని జోడించారు. అందమైన ప్రతి పద్యం నా హృదయాన్ని కదిలిస్తుంది. అందువల్లనే వేల పద్యాలు నేను కావాలని వల్లే వేయనప్పటికీ నాకు గుర్తుండిపోయాయి. నేను సంస్కృతమూలాన్ని అనుసరించినప్పటికీ ముఖ్య ఘట్టాల్లో తెలుగును వదిలిపెట్టలేను.

అంతరార్ధ ప్రసంగము, అనౌచిత్యము ప్రవచనములో చొరబడనీయను.
దాని అర్థం వివరిస్తారా? –

కృష్ణుడు ఆత్మ, రాధ జీవాత్మ, వీని సంయోగము

జీవబ్రహ్మైక్యము అంటూ కధను ఎక్కడో సమన్వయం చేసి అర్ధం చెప్పడం అంతరార్ధ ప్రసంగము, ఎవరొచ్చారు అంటే “శ్యామ:” అని బదులు వస్తే “మేఘమా” అనటం అనౌచిత్యం. రాముని గురించో కృష్ణుని గురించో మహాపురుషుల గురించి భక్తిపారవశ్యంతో చెప్పుకొంటూ మధ్యలో ఇలాటి మాటలు చెప్పడం అనౌచిత్యం కదా!! పురాణముల ముఖ్యోద్దేశము ధర్మప్రబోధం, భక్తి ప్రబోధం. పురాణం చెప్పేవారు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కథాభాగాన్ని భక్తితో పోషించాలి. శ్రోతల మనో పరిపాకాన్ని బట్టి జ్ఞానాన్ని జోడించవచ్చు.

ప్రచారంలో ఉన్న విమర్శకు తాము చేసిన పరిష్కారం ఏదైనా ఒకటి చెప్పండి?

అనేకం ఉన్నాయి. తిక్కనగారు తెలుగు భారతంలో పాంచల రాజపుత్రియు అంచితముగ నిన్ను పొందు నార్వురవరసన్'” అని కృష్ణుని ఈ కర్ణునికి చెప్పిస్తాడు. అప్పటికి ద్రౌపది రాజమాత యవబృదస్నాతక డబ్భై ఏళ్ల వయస్సుతో కొడుకులు, కోడళ్ళు మనుమలతో అలరారుతున్న ద్రౌపదిని కర్ణునికి కూర్చడానికి భగవానుడు సంధాన కర్త?? ఇదెక్కడి ఘోరమయ్యా అంటే మోహపరచడానికని అలా చెప్పాడంటారు. ఎంత మోహపరచవానికైతే మాత్రం ఇంత అనౌచిత్యమా?

ఈ పద్యానికి సంస్కృత మూలం “రాజన్య రాజకన్యాశ్చ ఆప్యేన యంత్యాభిషేచనం షష్ఠెకాలే తదా త్వాంవై ద్రౌపద్యుప గమిష్యతి ” “రాజకన్యాశ్చ” పక్కనున్న'” అన్య” అనే పదాన్ని ద్రౌపది పక్కన పెట్టి అన్వయం చెబితే అర్థం సరిపోతుంది. అలా ‘అపి” అనే శబ్దాన్ని అవసరమైన చోటు’ చేర్చుకోవడం సంస్కృత సంప్రదాయం.

అయితే ‘షష్ఠే కాలే’ అంటే ఏమిటి?

షష్ఠికాలే అంటే దర్బారు తీరే ‘సమయం’ అని అర్థం. ఈ విషయం గుజరాతు నుండి తెప్పించిన వ్యాఖ్యానంలో ఉంది. చక్రవర్తి ఏకాలంలో ఏ పనులు చేస్తారనే దానికి ఒక నియమం ఉంది. ఈ కాల వివరణ నా పుస్తకంలో చేశాను. అసలు కాలానికి “వరుస” అనే అర్ధం ఎక్కడ నుంచి వచ్చింది. పై శ్లోకానికి రాజన్యులు, రాజకన్యలు అంతెందుకు ద్రౌపది కూడా నీవు సింహాసనాధిష్ఠితుడవై నీకు కానుకలు తీసుకొని రాగలరు. ద్రౌపది కూడా నీకు కానుకలు, యితర రాజస్త్రీలవలె తీసుకొని రాగలదని తాత్పర్యము. మరి దీనిలో అశ్లీలం ఎక్కడ ఉంది? పూర్వాపరాలు పరిశీలిస్తే కూడా పై అర్ధమే సబబుగా తోస్తుంది. కృష్ణుడు చూపిన ఆశలన్నిటిని కర్ణుడు ఒక్కటొక్కటిగా నిరాకరించాడు. ద్రౌపది సంగతే ఎత్తుకోలేదు.

ఈ నిర్ణయంపై తర్జన భర్జనలు జరగలేదా?

కావలసినన్ని జరిగాయి. తిక్కన, తిరుపతి వెంకటకవులంత వారు చెప్పిన అర్ధాన్ని కాదని అర్థం చెబుతాడా అని విరుచుకొని పడ్డారు. వ్యాసుడే ఈ అనౌచిత్యం చేశాడని వీరు చెప్పవచ్చునా? తిక్కనగారు మహానుభావుడే. ఆయన భారతాన్ని సమర్థవంతంగా తెలిగించాడనడంలో సందేహం లేదు. అయితే వారికి దొరికిన వ్యాఖ్యానంలో అలా ఉండి ఉండాలి. కొల్లూరులో ఉపన్యాసం చేస్తుంటే విన్న వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రులగారి శిష్యుడొకాయన నేరుగా వారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాడట. ఆయనే నాతో చెప్పాడు. నేను ఉత్సుకతతో `వారేమన్నారు’ అన్నాను. చాలా సబబుగా ఉందన్నారన్నాడు.

ఆరో భర్త సంగతలా ఉంచితే పంచ భర్త్రత్వాన్ని ఎలా సమర్థిండం?

ప్రతి పురాణేతిహాసాలోను ఆ సందర్భానికి కావలిసినంతే చెబుతారు. అన్ని పురాణాలూ చూసి సమన్వయం చేసుకోవాలి. మార్కండేయ పురాణంలో ఒకే ఇంద్రుడు అయిదు గురుగా పుట్టాడని ఉంది. వివరాలు మహాభారత సూక్ష్మదర్శిని లో వ్రాసాను.

తమరు వ్రాసిన మహాభారతము ధర్మ సూక్ష్మదర్శనమునకు ప్రేరణ ఏమిటి?

అనేక ప్రదేశాలలో జరిగిన సభల్లో శ్రోతలు సందేహాలు ఈ పుస్తక రచనకు ప్రేరణ. అదేకాక పిఠాపురంలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రులవారు భారతంపై ప్రవచనం చేస్తూంటే, పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి అనే ఆయన మహాభారత చరిత్ర విమర్శ గ్రంథం వ్రాసాడు. అదో సరుకు లేని విమర్శ. దానిని ఉటంకిస్తూ శాస్త్రిగారు మరో గ్రంథము వ్రాసేటప్పటికీ పెండ్యాల వారి గ్రంథానికి లేనిపోని ఖ్యాతి వచ్చింది.

మా తాతగారు అంతకు ముందే పెండ్యాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఉన్నారు. వానిని నేను వృద్ధిచేసి, ఇంకా క్రొత్తవెన్నో చేర్చి ఈ పుస్తకం వ్రాశాను. అలాగే రామాయణంపై వ్రాసిన పుస్తకము కూడా ముద్రణలో ఉన్నది.

ఒకే కథను వివిధ స్థరాణాల్లో వివిధంగా చెప్పడానికి కారణం ఏమిటి?

పురాణంలో ప్రతి కథ ఒక విశిష్ట ధర్మాన్ని ఉపదేశించడమనే ధ్యేయంతో చెప్పబడింది. ఆ పురాణంలో ఆ సందర్భంలో చెపుతున్న ధర్మాన్ని ప్రముఖంగా చిత్రించడం వల్ల కథలో వ్యత్యాసమున్నట్లు తోచవచ్చు. అదీకాక, అనంతమైన కాలం, అనేక కల్పములు. కల్పకల్పానికి కథలు పునరావృతమవుతూ ఉంటాయి.

మహాభారతం అరణ్య పర్వంలో లక్ష్మణుడు కుంభకర్ణుని చంపినట్లు చెప్పబడింది. చెప్పినవాడు కల్పాంతజీవి అయిన మార్కండేయుడు కాబట్టి వేరొక కల్పంలో జరిగిన కథ చెప్పాడని. సమన్వయం చేసుకోమన్నారు.

పురాణాలను చరిత్రగా పరిగణించవచ్చా?

పురాణాల ధ్యేయం వేరు. చరిత్ర చెప్పడం దాని ఉద్దేశ్యం కాదు. అయితే దానిలో ఉన్న రాజవంశాలను, తదితర చారిత్రాత్మక అంశాలను చరిత్రకు ప్రాతిపాదికగా తీసుకోవచ్చు. మొత్తంగా చరిత్రగా పరిగణించడానికి వీలు లేదు.

‘శతాబ్ధి’ పాఠకులకు మీ సందేశం ఏమిటి??

ఇంతకాలమూ ప్రవచనాల్లో చెబుతూ వస్తున్నదే దార్మికంగా బ్రతకండి.స్వధర్మానుష్ఠానం చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here