Home News   మళ్ళీ జనించగ జ్వలించు

  మళ్ళీ జనించగ జ్వలించు

0
SHARE

-మునిగంటి లక్ష్మణాచారి

తనువును భారంగా తలచి
తక్కెడలో తూకంగా చేసి
చిరుప్రాయపు చిగురాశలను
తుదిశ్వాసలను చిరుగాలికి వదిలేసి
త్యాగధనుల ధామంగా ఈ ధాత్రిని నిల్పిన
ఆ వీరుల త్యాగాలకు సమతూకంగ

మళ్ళీ జనించు జ్వలించు
మళ్ళీ జనించగ జ్వలించు

దాపురించిన దాస్యపు బతుకులు
దారిద్ర్యపు తీరుకు విముక్తి బాటల నెతుకునని
భారతి బానిస సంకెళ్ళు తెంపగ
తమకు తాముగా పురమాయించుకుని
పోరు సల్పన నియుక్తులైన
ఆ వీరుల పథాన నిరంతరం నడవగ

మళ్ళీ జనించు జ్వలించు
మళ్ళీ జనించగ జ్వలించు

మైనపు వెలుగుల వైనమలె
తెగువనె త్యాగపు తైలమని
తమ తొలకరి తలపుల ఉరుకులు ఉరుములు చేసి
కదన ఉదయపు కాంతుల వలె ప్రసరించిన
ఆ వీరుల పరిచయ బాటకు తహతహలాడగ

మళ్ళీ జనించు జ్వలించు
మళ్ళీ జనించగ జ్వలించు

దాస్యాన జననమన్నది
ప్రసవ ప్రయాసన
పోరాడగ పురుడోసుకున్న
మనుగడగై ప్రస్థానమని
తమ అస్థిత్వ సుస్థిరతకు
గోడు వెళ్లబోయక
శక్తినంత కూడగట్టుకుని
రణన మరణమే శరణ్యమైన
శిరముల వంచని
శరణులజొచ్చని
కారణజన్ముల రణనీతిని రీతినెంచగ

మళ్ళీ జనించు జ్వలించు
మళ్ళీ జనించగ జ్వలించు

ఐచ్చికమేది లేని పోరులో
స్వాతంత్ర్య కాంక్షయే పొర్లే నడకలో
తనదని మరిచిన ప్రయాణమే
తమదనె తలపుల ప్రమాణమై
అనన్యమైన అన్యోన్యభావనల
రేకెత్తించునని ఉటంకించగ

మళ్ళీ జనించు జ్వలించు
మళ్ళీ జనించగ జ్వలించు

నిన్ను నువ్వు వెతికే పనిలో
వీరుల త్యాగాల స్మరణలో
నీ వందేళ్ళు
తల్లికి వందనమర్పిస్తూ
నిన్ను నువ్వుగా దర్శిస్తూ
అసురులమాపగ
అసువులబాసిన
వీరుల త్యాగాల
భావనలో తరిస్తూ

మళ్ళీ జనించు జ్వలించు
మళ్ళీ జనించగ జ్వలించు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here