Home Telugu Articles ప్రజలను మభ్యపెట్టడం లో ‘గోబెల్స్’ను మించిన మావోలు!

ప్రజలను మభ్యపెట్టడం లో ‘గోబెల్స్’ను మించిన మావోలు!

0
SHARE

ఇటీవల మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ‘పాలకులు-విప్లవోద్యమం’పై ఓ వ్యాసం రాస్తూ- ‘సైనిక దాడులను ముమ్మరం చేస్తున్నారు.. భారత వాయుసేన, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ కమాండ్ బలగాలు కలిసి దాడి చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ‘హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తూ వివిధ రూపాలలో ఆకాశదాడులు చేస్తున్నారు. మానవ రహిత విమానాలను వాడుతూ దాడులకు దిగుతున్నారు.’ అంటూ ప్రజల సానుభూతి పొందేందుకు పొంతన లేని మాటలను ఆయన తన వ్యాసంలో పొందుపరిచారు.

తమ పార్టీ ప్రచారం కోసం వివిధ రకాల సమాచారాన్ని ప్రజలకు అందజేసేందుకు ఇన్ని అబద్ధాలను చెప్పడం విడ్డూరం. 75 ఏళ్ల క్రితం జర్మనీలో గోబెల్స్ చేసిన ప్రచారం మాదిరి 21వ శతాబ్దంలోనూ ఇక్కడ చేస్తామని భావించడం సబబు కాదు. అబద్ధాలతో ప్రజలను ఆకర్షించాలనుకునే మానసిక స్థితినుంచి మావోలు బయటపడి, పారదర్శకంగా వ్యవహరిస్తేనే వారికి ఎంతోకొంత గౌరవం ఉంటుంది. వాళ్లు చెప్పేవన్నీ బూటకమని తెలిసినప్పుడు ప్రజల్లో పలచనవుతారు. క్షీణదిశలో మావోయిస్టు ఉద్యమం ఉన్న వాస్తవాన్ని లొంగిపోయిన ప్రముఖ మావోయిస్టు నేతలెందరో గతంలో చెప్పారు. వారిలో జంపన్న ఒకరు. ఉత్తరాదిన మరెందరో ఉన్నారు. ఇవేవీ ప్రజల దృష్టికి రాలేదన్నట్టు, ప్రజలకు ఏవీ జ్ఞాపకం లేనట్టు, మావోయిస్టు నేతల మాటలనే గుర్తించుకుంటారన్నట్టు వ్యవహరిస్తే ఎలా? వాస్తవానికి మావోలపై సైనిక దాడులు ఎక్కడా జరగలేదు. అదే జరిగి ఉంటే మీడియా ప్రజలముందుకు తీసుకొచ్చేది. హెలికాప్టర్లతో ఆకాశదాడులు చేస్తున్నారని ప్రతాప్ పేర్కొనడం విచిత్రంగా ఉంది. గాయపడిన వారిని తీసుకెళ్ళేందుకు, భద్రతా బలగాలకు ఔషధాలు, ఆహార పదార్థాలు అందించేందుకు హెలికాప్టర్లను అధికారులు వినియోగిస్తున్నారు. దీన్ని కూడా తమపై దాడి అని మావోలు అంటే ఎలా?

కుతర్కం..

ఓ విచిత్రమైన కుతర్కాన్ని మావోలు ముందుకు తెస్తున్నారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకు వనరులను దోచిపెట్టేందుకు పాలకులు ఇలా సైనిక దాడులు చేస్తున్నారని వారి వాదన. ఈ వాదనలో ఎంత సత్యముందో వారికీ తెలుసు, ప్రజలకూ తెలుసు. అయినా గోబెల్స్ అడుగుజాడల్లో పయనించాలని తీర్మానించుకొని ఇలాంటి వాదనలు, కుతర్కాన్ని తెరముందుకు వారు తీసుకొస్తున్నారు. ఈ వాదన విని ఎవరైనా నవ్వుకుంటారన్న మాటను సైతం వారు లెక్కచేయడం లేదు.

కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని చైనాకు మన దేశం నుంచి ముడి ఇనుము, గ్రానైట్ తదితరాలు ఎగుమతి అయ్యాయి. ఎందరో వ్యాపారులు ఈ ఎగుమతులను చేస్తున్నారు. చైనా చేసే ఎగుమతులకు ఏ షరతులు, పద్ధతులు అమలయ్యాయో, మన ఎగుమతులకూ అవే వర్తిస్తాయి. మరి వనరులను దోచుకోవడమన్న ప్రశ్న ఎందుకు? ఈ దోపిడీ సవ్యంగా జరిగేందుకు సైనిక దాడులు చేయడం సాధ్యమా? మావోలు అటునుంచి నరుక్కురావడం అనే విద్యలో ఆరితేరారు. ప్రతాప్ ఆ విద్యను తన వ్యాసంలో ప్రదర్శించారు.

మావోయిస్టు గెరిల్లాలు దాడులు జరుపుతున్నా, జనతన సర్కారు పేర సమాంతర ప్రభుత్వం నడుపుతున్నా, ప్రజాకోర్టులను నిర్వహిస్తూ అమాయక ఆదివాసీలను ఇన్‌ఫార్మర్లపేర కాల్చి చంపుతున్నా, తుపాకులను గురిపెట్టి చందాలు గుంజుకుంటున్నా, అటవీ అధికారుల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి, పారిశ్రామికవేత్తల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు దండుకుంటున్నా, వివిధ అభివృద్ధి పనుల్లో కమీషన్లు కాజేస్తున్నా- ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలట. తగుచర్యలు చేపట్టితే సైనిక దాడులు చేస్తోంది, దోపిడీదారులకు అండగా నిలుస్తోంది… అని ప్రచారం చేయడం సమంజసమేనా?

ఎందరో ఉద్యమకారులు..

దేశంలో ఎందరో ఉద్యమకారులున్నారు, పర్యావరణ వేత్తలున్నారు, రాజకీయ పార్టీలున్నాయి, సామాజిక చైతన్యంతో పనిచేసే వ్యక్తులున్నారు, సంస్థలున్నాయి. వీరు వివిధ అన్యాయాలపై వివిధ కోర్టులకు తరచూ వెళుతున్నారు. పాలకులను నిలదీస్తున్నారు. కాని సహజ వనరులను బహుళజాతి సంస్థలకు గాని, సామ్రాజ్యవాద శక్తులకు గాని పాలకులు దోచిపెడుతున్నారని, అందుకోసం సైనికశక్తిని ఉపయోగిస్తున్నారన్న వ్యాజ్యం ఇంతవరకెప్పుడూ దాఖలుకాలేదు. అంటే మావోల తర్కంలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ డొల్లతనం ఆధారంగా ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? గోబెల్స్ ప్రచారం ఫలితమిస్తుందన్న అమాయకత్వంతో కాలం గడపడమంటే తమను తాము వంచించుకోవడమే!

అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని పెద్దలంటారు. పాపం.. మావోలకు ఆ నైపుణ్యం అబ్బలేదు. చెప్పినా అది బయటపడే అవకాశం మెండుగా ఉంది కాబట్టి సాధ్యమయ్యేదికాదు. అర్ధ శతాబ్దం క్రితం నక్సల్‌బరీ ఉద్యమ ప్రారంభ రోజుల్లో ఇలాంటి గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించే వారేమో! నేటి 21వ శతాబ్దంలో పారదర్శకత, జన చైతన్యం, మీడియా విస్తృతి ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏది చెప్పినా అది ప్రజలు విశ్వసిస్తారనుకోవడం అమాయకత్వం. అలా అబద్ధాలు ప్రచారం చేయడం వౌలికంగా నేరం. ఆ నేరాలకే పాల్పడేందుకు మావో సిద్ధమయినట్టు కనిపిస్తోంది!

మావోయిస్టు రహిత దేశం!

దండకారణ్యంలో పాలకులు మొబైల్ నెట్‌వర్క్‌ని పటిష్టం చేస్తున్నారని, ఇన్‌ఫార్మర్లను పెద్దఎత్తున ఏర్పాటుచేసుకుంటున్నారని, ‘సమాధాన్’ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు జరుపుతూ 2022 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించిందని ప్రతాప్ చెబుతూనే సహజ వనరుల దోపిడీకి సైనిక దాడులకు భద్రతా బలగాలు పాల్పడుతున్నాయనడంలో అర్థం ఉందా? ప్రజాసైన్యం పేర పెద్దఎత్తున అమాయకులకు ఆయుధ శిక్షణ ఇస్తూ, బెటాలియన్లు ఏర్పాటుచేస్తూ, కోట్ల రూపాయల బడ్జెట్‌తో తమ సైనిక శక్తిని మావోలు పెంచుకుంటున్నారు. అర్బన్ నక్సల్స్ నుంచి సహాయ సహకారాలు అందుకుంటూ, గోబెల్స్ ప్రచారంలో వారినీ పాల్గొనేలా చేస్తూ, ఆర్థిక వనరులు కల్పిస్తూ, విద్యాసంస్థల్లో అలజడి సృష్టిస్తున్నారు. భద్రతా బలగాలు చేస్తున్న ఆకాశ దాడుల్లో వందలాది మంది ప్రజలు అసువులు బాస్తున్నారని వాపోవడంలో అర్థముందా?

ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మీడియా ఎంతో చురుగ్గా పనిచేస్తోంది. ఎన్నో ప్రైవేట్ ఛానల్స్ తమ ప్రసారాల ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయి. ఈ స్థానిక ఛానల్స్‌కు, పత్రికలకు తెలియని విషయమంటూ ఏదీలేదు. అయినప్పటికీ ప్రతాప్ పాలకుల సైనిక దాడుల గూర్చి గొంతు చించుకోవడంలో ‘పస’ కనిపించడం లేదు.

పార్లమెంటరీ రాజకీయాలు చేసే వారైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం లేదని చెప్పుకునే వామపక్ష తీవ్రవాద పార్టీలైనా చేసే రాజకీయాల్లో కాలానుగుణమైన మార్పు కనిపించాలి. వర్తమాన సమాజంపై సంపూర్ణ అవగాహనతో రాజకీయం చేయాలి. ప్రజల ఆకాంక్షలు ఏమిటి? ప్రపంచ చలనగతులేమిటి? అన్న ప్రాథమిక అవగాహన ఉండాలి. వీటిని విస్మరించి శతాబ్దాల నాటి సిద్ధాంతాలే కీలకమని, గోబెల్స్ విధానాలే శ్రీరామరక్ష అని విశ్వసించినంత కాలం తిరోగమనంలో ఉన్నట్టే లెక్క. ప్రతాప్ మాటలు, మావోల ఆచరణ-అభిప్రాయాలు, కార్యక్రమాలు అన్నీ ఆ దిశగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు! ఇది ఏ రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం?

కొసమెరుపు..

ప్రధాని మోదీని హతమార్చేందుకు మావోలు కుట్ర పన్నారన్న సమాచారం వెలుగుచూడ్డంతో హోంశాఖ ప్రధాని భద్రతను సమీక్షించి కొన్ని మార్పులు ప్రకటించింది. మరింత మెలకువను ప్రదర్శించాలని ఎస్.పి.జి.ని ఆదేశించింది. దీంతో ఎవరితో ఎవరికి ‘ముప్పు’ ఉందో ఇట్టే అర్థమవుతోంది!

-వుప్పల నరసింహం 99857 81799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here